అగ్ని మహా పురాణము
అయుత లక్ష కోటి హోమ విధానము
అగ్ని పలికెను:
ఐశ్వర్యము, శాంతి, విజయము మొదలగునవి లభించుటకై గ్రహయజ్ఞమును గూర్చి మరల చెప్పెదను. పదివేల హోమములు, లక్ష హోమములు, కోటి హోమములు అని గ్రహయజ్ఞము మూడు విధములు. అగ్ని కుండవేదికి ఈశాన్యమునందు మండలమున గ్రహములను ఆవాహన చేయవలెను. ఉత్తరమున గురువును, ఈశాన్యమునందు బుధుని, పూర్వ దళమునందు శుక్రుని, ఆగ్నేయమున చంద్రుని, దక్షిణమున కుజుని, మధ్యభాగమున సూర్యుని, పశ్చిమము నందు శనిని, నైరృతియందు రాహువును, వాయవ్యమునందు కేతువును ఆవాహన చేయవలెను. శివ, పార్వతీ, కార్తికేయ, విష్ణు, బ్రహ్మ, ఇంద్ర, యమ, కాల, చిత్ర గుప్తులు అధిదేవతలు. అగ్ని, వరుణ, భూమి, విష్ణు, ఇంద్ర, శచీ, ప్రజాపతి, సర్ప, బ్రహ్మలు ప్రత్యధి దేవతలు. గణేశ, దుర్గా, వాయు, ఆకాశ, అశ్వనీ కుమారులు కర్మ సాధుణ్య దేవతలు. ఈ దేవతలను అందరిని వైదిక బీజాక్షరములతో పూజించవలెను. అర్క పలాశ, ఖదిర, అపామార్గ, పిప్పల, ఉదుంబర, శమీ, దూర్వా, కుశలు, వరుసగ సూర్యుడు మొదలగు వారికి సమిధలు. వీటిని మధువు, ఆజ్యము, పెరుగు-వీటితో సూరు చొప్పున ఎనిమిది పర్యాయములు హోమములు చేయవలెను. నూట ఎనిమిది మరియు నాలుగు పూర్ణ కుంభములు ఉంచి, పూర్ణాహుతి, వసుధార ఇవ్వవలెను. పిదప బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వవలెను. నాలుగు కలశలలోని జలముతో యజమానునకు అభిషేకము చేయవలెను, ‘బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాది దేవతలు నీకు అభిషేకము చేయుదురు గాక వాసుదేవుడు, జగన్నాథుడైన సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు నీకు విజయము నిచ్చుగాక. దేవరాజైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, ధనాధ్యక్షుడైన కుబేరుడు, శివుడు, బ్రహ్మ, ఆదిశేషుడు, సకల దిక్పాలకులు, సర్వదా నిన్ను రక్షింతురుగాక. కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ, పుష్టి, శ్రద్ధ, క్రియ, మతి, బుద్ధి, లజ్జ, వపుష్, శాంతి, తుష్టి, కాంతి, లోక జననులైన ఈ ధర్మపత్నులు నీకు అభిషేకము చేయుదురు గాక. ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులు పరితృప్తులై నీకు అభిషేకము చేయుదురు గాక! దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, సర్పములు, ఋషులు, మునులు, గోవులు, దేవమాతలు, దేవాంగనలు, వృక్షములు, నాగులు, దైత్యులు, అప్సర సమూహములు, అస్త్ర శస్త్రములు, రాజులు, వాహనములు, ఓషధులు, రత్నములు, కాలవిభాగములు, నదీ నగరములు, సముద్రములు, పర్వతములు, తీర్థములు, మేఘములు నీ సకలాభీష్ట సిద్ధికై నీకు అభిషేకము చేయు దురుగాక’.
యజమానుడు పిదప అలంకృతుడై ఈ క్రింది మంత్రములు చదువుచు సువర్ణ, గో, భూదానాదులు చేయవలెను. ‘ఓ కపిలధేనువా! రోహిణీ! నీవు సర్వదేవతలచే పూజింపదగిన దానవు. నీవు సకలతీర్థ-దేవతా స్వరూపిణివి. అందుచే నాకు శాంతిని ఇమ్ము’. ‘ధర్మమా! నీవు వృషభ రూపమున జగదానందకారకుడవు. శివునకు వాహనమైన దానవు. అందువలన నాకు శాంతిని ఇమ్ము’, ‘హిరణ్యగర్భుని గర్భమునందున్న సూర్యుని హేమ బీజము అనంతపుణ్య ఫలములనుఇచ్చును. అందువలన నాకు శాంతిని ఇమ్ము’. ‘పీతవస్త ద్వయము విష్ణువునకు చాలా ఇష్టమైనది. దానిని సమర్పించుటచే విష్ణువు సంతసించును. అందుచే నాకు శాంతిని ఇమ్ము’. ‘విష్ణువైన నీవు మత్స్యరూపముతో అమృతమునకు కారణభూతుడవు. చంద్రార్క వాహనుడవు. అందుచే నాకు శాంతి నొసగుము’. ‘పృథివియైన నీవు ధేనువుగా నుండి కేశవునితో సమానురాలవు. సర్వ పాపములను నశింపచేయుదానవు. అందువలన నాకు శాంతిని ఇమ్ము’. ‘ఓ, అయో వికార మైనదానా! ఎల్లపుడును అన్ని పనులు నీ అధీనములో నుండును. లాంగలాదులు ఆయుధాదులు కూడ నీ అధీనము. అందుచే నాకు శాంతి నొసగుము’. ‘నీవు సర్వయజ్ఞములకును అంగముగా ఉన్నావు. అగ్నికి కారణమైనదానవు. అందుచే నాకు శాంతిని ఇమ్ము’. ‘గోవుల అవయవములందు చతుర్దశ భువనములును ఉన్నవి. అందువలన నాకు ఇహపర లోకములందు మంగళమగుగాక’. ‘కేశవుని శయ్యయు, శివుని శయ్యయు ఎన్నడును శూన్యములుకావు. నేనిచ్చు శయ్యకూడ అన్ని జన్మలందును శూన్యము కాకుండ ఉండుగాక. సర్వదేవతలును సర్వరత్నములందు ప్రతిష్ఠితులై ఉన్నారు. అందుచేత ఈ రత్నదానముచే దేవతలు నాకు శాంతినిత్తురుగాక. ఇతర దానము లేవియు భూదానము పదునారవ అంశమునకు సాటిరావు. అందుచే ఈ భూదానము వలన నాకు శాంతి కలుగుగాక. అయుత హోమములతో సదక్షిణముగా చేసిన గ్రహయజ్ఞము యుద్ధమునందు విజయమును ఇచ్చును. వివాహములు, ఉత్సవములు, యజ్ఞములు, ప్రతిష్ఠలు మొదలగు కర్మలలో ఈ గ్రహయజ్ఞము చేయవలెను. లక్ష హోమ, కోటి హోమములను సకల కామావాప్తి కొరకు చేయవలెను. గృహమునందు మండపము ఏర్పరచి, అయత హోమముల నిమిత్తము ఒక హస్తము ప్రమాణముగల కుండమును ఏర్పరుపవలెను. దానికి మేఖలలు, యోని ఉండవలెను. నలుగురు ఋత్విక్కులు లేదా తానొక్కడే చేయవచ్చును. లక్ష హోమములందు అన్నియు పది రెట్లు ఉండును. కుండము నాలుగు లేదా రెండు హస్తముల ప్రమాణమున ఉండవలెను. ఇందు అధికముగ తార్జ్యుని కూడ పూజించవలెను. ‘ఓ తార్క్ష్యా! నీ శరీరము సామధ్వని రూపము. నీవు పరమాత్ముని వాహనము. విషమును నశింపచేయుదువు. అందుచే నాకు నిత్యము శాంతిని ఇమ్ము’. ‘వసోర్ధా రాం’ అని చెప్పిన పిమ్మట శయ్యా భూషణాదికములను దానము చేయవలెను. లక్షహోమమునందు పదిమంది లేదా ఎనమండుగురు ఋత్విక్కులుందురు. దానివలన పుత్రులను, అన్నమును, రాజ్యమును, విజయమును, భుక్తి ముక్త్యాదులను పొందును. కోటిహోమ యజ్ఞము సదక్షిణాకముగా చేసినచో వెనుక చెప్పిన స్థలములేకాక శత్రు వినాశనమును గూడ చేయును. నాలుగు లేదా ఎనిమిది హస్తముల కుండము, పన్నెండు ఋత్విక్కులు, పటము నందు ఇరువదియైదు లేదా పండ్రెండు కలశలను ద్వారమునందు నాలుగు కలశలను ఉంచవలెను. కోటి హోమములు చేసినవాడు సర్వకామములను పొంది విష్ణులోకము చేరును. గ్రహమంత్రములతోగాని, గాయత్రితోగాని, వైష్ణవ మంత్రములతోగాని, జాతవేదో ముఖ మంత్రములతో గాని, శైవ మంత్రములతో గాని, ప్రసిద్ధములైన వైదిక మంత్రములతోగాని, తిల, యవ, ధాన్య, ఘృతములతో హోమములు చేయవలెను. ఇట్లు చేసినవాడు అశ్వమేధాది యాగఫలమును పొందును. ద్వేషముతో అభిచార హోమములు చేయు సపుడు కుండము త్రికోణాకారములో ఉండును. డేగ ఎముకలతో అగ్నితో కూడిన సమిధలను ఎడమచేతితో హోమము చేయవలెను. హోమము చేయువారు శత్రువునకు అమంగళమును కోరుచు, ఎఱ్ఱని అలంకరణములు ధరించి, జుట్టు విరబోసికొని ‘దుర్మిత్రాస్తస్మైసన్తు యో ద్వేష్టి హుం ఫట్’ అను మంత్రము చదువుచు హోమము చేయవలెను. క్షురముతో ప్రతిమను ఛేదించవలెను. పిష్టముతో చేసిన శత్రువును చంపవలెను. దానిని అగ్నియందు హోమము చేయవలెను. ఈ విధముగా చేసినవాడు స్వర్గము పొందును. (167)
