అగ్ని మహా పురాణము

Table of Contents

దేవయాత్రోత్సవ విధానము

హయగ్రీవుడు పలికెను: ఇప్పుడు ఉత్సవవిధిని చెప్పెదను. ఉత్సవములేని దేవతా ప్రతిష్ఠ నిష్ఫలము. అందుచే దేవతా స్థాపనము చేసిన సంవత్సరము నందే ఏక రాత్రి ఉత్సవము లేదా అష్ట రాత్రోత్సవము చేయవలెను. అయన సమయమునందు గాని, విషువ సంక్రాంతి సమయమునందుగాని శయనోపవనమునందు లేదా దేవతా గృహము నందు లేదా కర్తకు అనుకూలముగా ఉన్న విధమున దేవుని నగరయాత్ర చేయించవలెను. ఆ సమయమున మంగళ అంకురారోపణము, నృత్యగీతారులు, వాద్యములు ఏర్పాటు చేయవలెను. అంకురారోపణమునకు మూకుళ్ళు ఉత్తమమైనవి. యవ, శాలి, తిల, ముద్గ గోధూమ, శ్వేతసర్షప, కులత్థ, మాష, నిష్పావములు కడిగి చల్లవలెను. దీపములతో రాత్రి ఊరేగుచు ఇంద్రాది దిక్పాలులకు, కుముదాది దిగ్గజములకు, సకల ప్రాణులకు పూర్వాది దిక్కులందు బలి ప్రదానము చేయవలెను. దేవతా విగ్రహమును మోయుచు దేవయాత్రను అనుసరించువారికి అడుగడుగునకు అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును. ఆచార్యుడు తొలుచటి దివసమున దేవాలయమునకు వచ్చి దేవునితో-“దేవశ్రేష్ఠా! రేపు నీ తీర్థ యాత్ర జరుపవలసి యున్నది. అందుకు అనుజ్ఞ ఇచ్చుటకై నీవు సర్వదా సమర్థుడవు అనగా అనుమతిని ఈయవలసినది అని నివేదించి ఉత్సవ కార్యము ప్రారంభింపవలెను. నాలుగు స్తంభములు గలదియు, అంకురములు ఉన్న ఘటముతో కూడి నదియు, అలంకరింపబడి నదియు అగు వేదిక దగ్గరకు వెళ్ళి దాని మధ్యభాగమున స్వస్తికము ప్రతిమను ఉంచి, తన కోరికను వ్రాసి చిత్రములపై స్థాపించి అధివాసము చేయవలెను.

పిమ్మట విద్వాంసులైన వైష్ణవులతో కలిసి మూల మంత్రముతో ప్రతిమ అవయవములకు నెయ్యిపూసి, రాత్రి అంతయు నేతిధారతో అభిషేకము చేయవలెను. దేవతకు అద్దము చూపించి, ఆరతి, గీతము, వాద్యములు మొదలగు వాటితో మంగళకృత్యములు నెరపి, వ్యజనము విసిరి, పూజించవలెను. పిదప దీప, గంధ, పుష్పాదులతో పూజించవలెను. పసుపు, కర్పూరము, కేసరములు, శ్వేతచందన చూర్ణము దేవతా ప్రతిమపైనను, భక్తుల శిరస్సులపైనను చల్లినచో సమస్త తీర్థముల ఫలము లభించును. ఆచార్యుడు యాత్రకొరకై ఏర్పరచిన దేవతామూర్తిని రథముపై ఉంచి, పూజించి, ఛత్ర, చామర, శంఖనాదాదులతో రాష్ట్రమును పాలించు నదీతటమునకు తీసికొని వెళ్ళవలెను. నదిలో స్నానము చేయించుటకు ముందు అచట వేదికను నిర్మించి, ఆమూర్తిని వాహనము నుండి దింపి, దానిని ఆ వేదికపై ఉంచవలెను, అచట చరువు వండి దానిని హోమము చేసిన పిదప పాయస హోమము చేయవలెను. వరుణ దేవతా మంత్రముతో సమస్త తీర్థముల ఆవాహనముచేసి “ఆపోహిష్ఠామ” ఇత్యాది మంత్రములతో వాటికి అర్ఘ్య ప్రదానముచేసి పూజించవలెను. దేవతామూర్తిని తీసికొని వెళ్ళి ఉదకమునందు అఘమర్షణ చేసి, బ్రాహ్మణ-మహాజనులకు స్నానము చేయవలెను. స్నానానంతరము మూర్తిని తీసికొని వచ్చి వేదికపై ఉంచవలెను. ఆ దివసమునందు అచట దేవతా పూజచేసి, దేవాలయము నకు తీసికొని వెళ్ళవలెను, ఆచార్యుడు అగ్నిలో ఉన్న దేవతకు పూజలు చేయవలెను. ఈ ఉత్సవము భోగ-మోక్ష ప్రదము. (68)