అగ్ని మహా పురాణము

Table of Contents

దేవాలయాది మాహాత్మ్యవర్ణనము

పరమేశ్వరుడు చెప్పెను:

ప్రతేశ్వరులను సత్యాది దేవతలను పూజించి వారికి వ్రతము సమర్పించవలెను. అరిష్ట శాంతికి అరిష్టమూలమాల ఉత్తమము. కల్యాణ ప్రాప్తికి సువర్ణ రత్నమాలా, మారణ కర్మకు మహాశంఖమాలా, శాంతికర్మకు శంఖమాలా, పుత్ర ప్రాప్తికి మౌక్తికమాలను ఉపయోగించి జపము చేయవలెను. స్ఫటికమాల ఐశ్వర్య ప్రదము, రుద్రాక్షమాల ముక్తి ప్రదము. ఉసిరికాయ ప్రమాణము గల రుద్రాక్షము ఉత్తమము, మేరు సహితములు, లేదా, మేరు రహితమగు మాలను జపమునందు ఉపయోగించవచ్చును. మానసిక జపము చేయుచున్నపుడు మాలయందలి పూసలను అనామిక అంగుష్ఠములతో జరపవలెను. ఉపాంశు జపమునందు తర్జన్య అంగుష్ఠములను కలిపి గణన చేయవలెను. జప సమయమున ఎన్నడును మేరువును దాటరాదు. ప్రమాదవశమున మాల జారిపడినచో రెండు వందల పర్యాయము జపము చేయవలెను. ఘంట సర్వ వాద్యమయము, ఘంటావాదనము సకల ప్రయోజన ప్రదము, గృహమునందును, మందిరమునందును, శివలింగమును గోమయ గోమూత్ర వల్మీక మృత్తికా భస్మ జలములతో శుద్ధి చేయవలెను.

స్కందా! ‘ఓం నమశ్శివాయ’ అను మంత్రము సకలాభీష్ట ప్రదము. ఇది వేదమునందు పంచాక్షరమనియు లోకమున షడక్షరమనియు చెప్పబడినది. వట బీజములో వటవృక్షమున్నట్లు ఓంకారము నందు శివుడు సమ్మితుడై ఉండును. ‘ఓం నమః శివాయ, ఈశానః సర్వ విద్యానాం’ మొదలగు మంత్రములు సమస్త విద్యా సముదాయము. ఈ షడక్షర మంత్రమునకు భాష్యము ‘ఓం నమః శివాయ’ అను మంత్రమే పరమపదము. ధర్మార్థ కామ మోక్షములను ఇచ్చు శివుడు లోకానుగ్రహార్థమై లింగములో ఉన్నాడు. అందుచే ఈ మంత్రముచే శివలింగమును పూజించవలెను. శివలింగమును పూజించనివాడు ధర్మదూరుడగును. లింగపూజనము భుక్తి ముక్తి ప్రదముగాన, ఆ జీవితాంతము శివలింగమును పూజించవలెను. ప్రాణములు పోయినను శివలింగ పూజ చేయకుండగ భోజనము చేయకూడదు. రుద్రపూజచే రుద్ర సారూప్యము, విష్ణు పూజచే విష్ణు సారూప్యము, సూర్య పూజచే సూర్య సారూప్యము, శక్తి పూజచే శక్తి సారూప్యము లభించును. సంపూర్ణ యజ్ఞ తపోదాన ఫలములు లభించును. లింగస్థాపన చేసిన వానికి కోటిరెట్లు ఫలము లభించును. ప్రతిదినము త్రికాలములందును, పార్థివ లింగము నిర్మించి దానిని బిల్వ పత్రములతో పూజించువానియొక్క నూట పదకొండు తరములవారు స్వర్గమును పొందుదురు, విత్తానుసారముగా భక్తి పూర్వకముగా దేవతా మందిరములు కట్టించవలెను. దేవాలయ నిర్మాణమున యథాశక్తిగా అల్పము ఖర్చు పెట్టిన దరిద్రునకును, అధికముగా ఖర్చు పెట్టిన ధనికునకు సమాన ఫలము లభించును. సంపాదించిన ధనము నందలి రెండు భాగములను ధర్మ కార్యము నందు వ్యయించి జీవన నిర్వాహమునకు రెండు భాగములు ఉంచుకొనవలెను. జీవనము అనిత్యము కదా! దేవతా మందిరమును నిర్మించువాడు ఇరువది యొక్క తరములవారిని ఉద్ధరించి అభీష్టములను పొందును. మట్టి కర్ర ఇటుక శిల వీటితో మందిర నిర్మాణము వరసగా కోటి గుణ ఫలము కలది. ఎనిమిది ఇటుకలతో నైనను మందిరము నిర్మించువాడు స్వర్గ లోకమును పొందును. ఆడుకొనుచు ధూళితో మందిరము కట్టు వానికి కూడ అభీష్ట మనోరథసిద్ధి కలుగును. (327)