అగ్ని మహా పురాణము

Table of Contents

గయామాహాత్మ్యము

అగ్ని దేవుడు చెప్పెను-ఇపుడు నేను గయామాహాత్మ్యమును చెప్పెదను. గయ ఉత్తమ తీర్థములలో ఉత్తమమైనది. గయుడను అసురుడు గొప్ప తపస్సు ప్రారంభించెను. దానిచే దేవతలు పీడితులై క్షీరసాగరశాయియగు విష్ణువు వద్దకు వెళ్ళి ‘భగవంతుడా! నీవు గయాసురుని నుండి మమ్ము రక్షించుము’ అని ప్రార్థించిరి. అటులనే అని పలికి శ్రీమహావిష్ణువు గయాసురుని వద్దకు వెళ్ళి ‘వరము కోరుకొనుము’ అని పలికెను. ‘మహావిష్ణూ: నేను సకల తీర్థములకంటెను అతి పవిత్రుడను అగుదును గాక!’ అని గయుడు పలికెను. ‘అటులనే అగుగాక’ అని పలికి శ్రీమహావిష్ణువు వెడలిపోయెను. పిదప మానవులందరును ఆ దైత్యుని దర్శనముచేసి భగవంతుని చేరుచుండిరి. భూమి శూన్యమైపోయెను. అపుడు బ్రహ్మాదిదేవతలు మహావిష్ణువువద్దకు వెళ్ళి- ‘దేవా! స్వర్గము భూలోకము కూడ శూన్యమై పోయినవి. ఆ దైత్యుని దర్శనము చేసికొనినంత మాత్రముననే అందరును నీ లోకమును చేరుకొనుచున్నారు’ అని పలికిరి. ఆ మాటలు విని శ్రీహరి బ్రహ్మతో ‘నీవు దేవతాసమేతుడవై వెళ్ళి యజ్ఞభూమిగా చేయుటకై నీ శరీరమునిమ్ము అని గయాసురుని కోరుము” అని పలికెను. బ్రహ్మ దేవతాసమేతుడై గయుని దగ్గరకు వెళ్ళి ‘దైత్యశ్రేష్ఠా: నేను అతిథినై నీ ద్వారమువద్దకు వచ్చితిని. నీ పవిత్ర శరీరమును యజ్ఞము కొరకై ఇమ్ము’ అని కోరెను. ‘తథాస్తు’ అని పలికి గయాసురుడు భూమిపై పరుండెను. బ్రహ్మ అతని శిరముపై యజ్ఞము ప్రారంభించెను. పూర్ణాహుతి సమయము వచ్చుసరికి గయుని శరీరము కదలిపోయెను. అది చూచి బ్రహ్మదేవుడు విష్ణువుతో ‘దేవా! పూర్ణాహుతి సమయమున గయాసురుని శరీరము కదలి పోవుచున్నది’ అని చెప్పెను. అపుడు విష్ణువు ధర్మదేవతను పిలిచి ‘నీవు అసురుని శరీరముపై ధర్మమయ శిలను ఉంచుము. దేవతలు అందరును ఆ శిలపై కూర్చుండవలెను. దేవతలతోపాటు నా గదాధర మూర్తికూడ ఆ శిలపై ఉండగలదు’ అని పలికెను. ఆ మాటవిని ధర్మ దేవత విశాలమగు దేవమయ శిలను తీసికొనివచ్చి ఆ అసురుని దేహముపై ఉంచెను. (ఆ శిలకథ ఇది): ధర్మునకు తన భార్యయగు ధర్మవతి గర్భమున ధర్మవ్రతయను కుమార్తె జనించెను. ఆమె గొప్ప తపశ్శాలిని. బ్రహ్మ కుమారుడైన మరీచిమహర్షి ఆమెను పరిణయమాడెను. శ్రీమహా విష్ణువు లక్ష్మీదేవితోవలె, శివుడు పార్వతితోవలె, మరీచి ధర్మవ్రతతో సుఖముగా నుండెను.

ఒకనాడు అడవినుంచి కుశ సమిధాదులు తెచ్చిన ఋషి చాల అలసిపోయెను. అతడు భోజనానంతరము ధర్మవ్రతను తన పాదములు ఒత్తుమని ఆజ్ఞాపింపగా ఆమె సరేనని అలసియున్న ఆ మహర్షి పాదములను ఒత్తసాగెను. ముని నిద్రించెను. ఇంతలో బ్రహ్మవచ్చెను. ‘నేను బ్రహ్మదేవునికి సత్కారములు చేయవలెనా, లేదా? మహాముని పాదములు ఒత్తవలెనా?” బ్రహ్మ గురువునకు గూడ గురువు. నా భర్తకు కూడ పూజ్యుడు. అందుచే ఈయనను పూజించవలెను’ అని ఆలోచించి ధర్మవ్రత బ్రహ్మను పూజించు చుండెను. మేల్కొన్నముని ధర్మవ్రత అచట లేకుండుట జూచి, ఆజ్ఞను ఉల్లంఘించి నందులకు ‘నీవు శిలవు కమ్ము’ అని ఆమెను శపించెను, అది విన్న ధర్మవ్రత కుపితురాలై ‘మునీ! నీ చరణ సేవ విడచి నేను నీకు కూడ పూజ్యుడైన నీ తండ్రికి పూజచేసితిని. అందుచే నేను సర్వదా నిర్దోషురాలను. ఇట్టి పరిస్థితులలో నన్ను శపించితిరి. అందుచే నీకు గూడ శివునివలన శాపము లభించగలదు’ అని పలికి శాపమును దూరముగా నుంచి, అగ్నిలో ప్రవేశించి వేలకొలది సంవత్సరములు తీవ్ర తపస్సు చేసెను. ఆ తపస్సుకు సంతసించిన విష్ణ్వాది దేవతలు వరము కోరు కొనుమని పలికిరి. ‘మీరు నా శాపమును తొలగింపుడు’ అని ధర్మవ్రత ప్రార్థించెను. దేవతలు పలికిరి-పూజ్యురాలా! మరీచిమహర్షి ఇచ్చిన శాపము అన్యధా కాజాలదు. నీవు దేవతాచరణ చిహ్నములచే అంకితమైన శరీరముగల పరమ పవిత్రమైన శిలగా అవగలవు. గయాసురుని శరీరమును స్థిరముగా ఉంచుటకై నీవు శిలారూపమును ధరించవలసియున్నది. అపుడు నీకు ‘దేవవ్రతా, దేవశిలా, సర్వదేవ స్వరూపా, సర్వతీర్థమయీ, పుణ్యశిలా’ అను పేర్లు లభింపగలవు. దేవవ్రత పలికెను: దేవతలారా! మీరు నాపై అనుగ్రహించినచో బ్రహ్మ విష్ణు రుద్రాది దేవతలును, గౌరీ లక్ష్యాది దేవులును నాపై సర్వదా ప్రకాశింతురుగాక.’ అగ్నిదేవుడు పలికెను: దేవవ్రత మాటలు విని ఆ దేవతలందరును ‘అట్లే అగుగాక’ అని పలికి స్వర్గమునకు వెళ్ళిపోయిరి.

ఆ దేవమయీ శిలనే ధర్మదేవత గయాసురుని శరీరముపై నుంచెను. కాని గయుడు శిలతోసహ కదలనారంభించెను. అది చూచి రుద్రాదిదేవతలు కూడ ఆ శిలపై కూర్చుండిరి. ఆ దేవతలతోసహ అతడు కదల మొదలిడెను. అపుడు దేవతలు క్షీరసాగరము పై శయనించియున్న విష్ణువును ప్రసన్నుని చేసికొనగా శ్రీమహావిష్ణువు తన గదాధర మూర్తిని వారికిచ్చి-‘దేవతలారా మీరు వెళ్ళుడు. దేవగమ్యమైన ఈమూర్తి ద్వారా నేను ఈ విధముగ గయుని శరీరము స్థిరముగా నుండునట్లు చేయుటకై సాక్షాత్ వ్యక్తావ్యక్తో భయ స్వరూపుడగు గదాధారియగు విష్ణువు అచట ఉండెను. ఆది గదాధరుడను పేరుతో శ్రీమహావిష్ణువు అచట ఉన్నాడు. పూర్వము గదుడను ఒక భయంకరుడగు రాక్షసుని శ్రీమహావిష్ణువు సంహరించగా, వాని ఎముకలతో విశ్వకర్మ గదను నిర్మించెను. అది ‘ఆదిగద’. ఆ ఆది గదతో గదాధరుడు హేతి మొదలగు రాక్షసులను సంహరించెను. అందుచే అతడు ‘ఆది గదాధరుడు’ అయ్యెను. దేవమయీ శిలపై గదాధరుడు కూర్చుండగనే గయాసురుడు కదల కుండ ఉండెను. అపుడు బ్రహ్మ పూర్ణాహుతి ఇచ్చెను. గయాసురుడు దేవతలతో- ‘మీరు నన్నిట్లు ఏల వంచించితిరి? శ్రీ విష్ణువు చెప్పినచో నేను స్థిరముగా ఉండకుందునా! దేవతలారా మీరు నన్ను శిలాదులచే అణచి ఉంచినారు గాన నాకు వరమీయవలెను’ అని పలికెను.

దేవతలు పలికిరి: ‘తీర్థమును నిర్మించుటకై నీ శరీరము స్థిరముగా నుండునట్లు చేయబడినది గాన నీ క్షేత్రము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాస స్థానము కాగలదు. ఈ తీర్థము అన్ని తీర్థములకంటెను ఎక్కువ ప్రసిద్ధి పొందగలదు. పితృదేవతలకు ఇది బ్రహ్మ లోకమును ఇచ్చును’ ఇట్లు పలికి దేవతలు అందరును అచటనే నివసించిరి. దేవీ తీర్థాదులు కూడ అచటనే నివాస మేర్పరచుకొనిరి. బ్రహ్మయజ్ఞము పూర్తిచేసి ఋత్విక్కులకు దక్షిణగా ఐదుక్రోసులదూరము గయాక్షేత్రమును ఏబదియైదు గ్రామములను సమర్పించెను. అనేకమైన బంగారు పర్వతములను నిర్మించెను. పాలు తేనె ప్రవహించు నదుల నిచ్చెను. దధి-మధువులతో నిండిన సరోవరములను ఇచ్చెను. అనేకమైన అన్నాది పర్వతములను, కామధేనువును, కల్పవృక్షమును, వెండి బంగారముల గృహములను కూడ ఇచ్చెను. వీటిని అన్నింటిని ఇచ్చుచు బ్రహ్మదేవుడు ఆ బ్రాహ్మణులతో ఇట్లు పలికెను- ‘విప్రవరులారా!! ఇక మీరు నాకంటె తక్కువవానివద్దకు వెళ్లి ఎన్నడును యాచన చేయరాదు’ ఇట్లుపలికి అతడు ఆ వస్తువులను అన్నింటిని వారికి సమర్పించెను. తరువాత ధర్ముడు యజ్ఞము చేయగా లోభముచే ఆబ్రాహ్మణులు అతని నుండి ధనాదిదానములు స్వీకరించి గయలో ఉంటూండగా బ్రహ్మ వారిని శపించెను. ‘మీరు విద్యా విహీనులును లుబ్ధులును అగుదురు గాక! ఈ నదులలో ఇకపై క్షీరాదులు ఉండవు, ఈ సువర్ణ శైలములు కూడ శిలలైపోవును’ అపుడు బ్రాహ్మణులు బ్రహ్మతో ఇట్లు పలికిరి- దేవా! మీ శాపముచే మా సర్వస్వము నష్టమై పోయినది. మా జీవికకు ఏదైన మార్గము చూపుము’. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను. ‘ఇటుపై మీ జీవిక ఈ తీర్థముద్వారా జరుగును. సూర్యచంద్రులు ఉన్నంత వరకును మీరు ఈ వృత్తితోడనే జీవించగలరు. గయకు వచ్చువారందరును మిమ్ములను పూజింతురు. హవ్య, కవ్య, ధన, శ్రాద్ధాదులతో మిమ్మును సత్కరించు వారి వంశములోని వారు నూరు తరములవరకును స్వర్గమునకు వెళ్ళుదురు. స్వర్గములోనే ఉన్నవారు ముక్తి పొందుదురు’. గయమహారాజు కూడా ఈ క్షేత్రమునందు బహ్వన్న దక్షిణలుగల యజ్ఞము చేసెను. అతని పేరుచేతనే గయా నగరమునకు ఆ పేరు వచ్చినది. పాండవులు కూడ గయ వెళ్ళి అచట శ్రీమహావిష్ణువును పూజించిరి. (114)