అగ్ని మహా పురాణము
యతిధర్మ నిరూపణము
పుష్కరుడు పలికెను:
జ్ఞాన మోక్షాది ప్రదర్శకమగు యతి ధర్మమును చెప్పెదను. ఆయుర్దాయములోని నాల్గవ భాగములోనికి రాగానే సన్యసించవలెను. ధీరుడు ఏ రోజున వైరాగ్యము కలుగునో ఆ రోజునే సన్యసించవలెను. సర్వవేద సదక్షిణమగు ప్రాజాపత్యేష్టి నిర్వర్తించి, అగ్నులను తనలోనే ఆరోపించుకొని బ్రాహ్మణుడు గృహమునుండి నిష్క్రమించవలెను. ఒంటరిగానే సంచరించవలెను. అన్నముకొరకు మాత్రము గ్రామములోనికి ప్రవేశించవలెను. సన్యాసి ఏదివచ్చినను ఉపేక్షా బుద్ధితో చూచుచు, ధనాదికమును కూడబెట్టక, జ్ఞానసమన్వితుడై ఉండవలెను. చేత కపాలము, వృక్షమూల నివాసము, మాసిన వస్త్రము, ఏకాకిత్వము, సర్వసమ దృష్టి-ఇవి ముక్తుని లక్షణములు. మరణమును అభినం దించగూడదు; జీవనమునుగూడ అభినందించగూడదు. భృత్యుడు ప్రభ్వాజ్ఞకై ఎదురు చూచుచున్నట్లు కాలమునకై ఎదురు చూచుచుండవలెను. క్రింద చూచుకొని అడుగుపెట్టవలెను. వస్త్రముతో వడబోసిన నీరు త్రాగవలెను. సత్యముచే పవిత్రమైన మాటలే పలకవలెను. మనస్సుచేత పవిత్రమైన దానిని ఆచరించవలెను. ఆనపకాయ బుర్ర, దారుపాత్ర, మట్టి పాత్ర, వెదురుపాత్ర-ఇవి సన్యాసికి విధింపబడినవి. యతీశ్వరుడు ఎల్లపుడును గ్రామములోని ఇండ్లలో ధూమము శాంతించిన పిమ్మటను, రోకళ్ళు ఆగిపోయినప్పుడును, నిప్పులు ఆర్పివేయబడిన పిమ్మటను, జనులందరును భోజనము చేసిన పిమ్మటను, పాత్రలు కడిగివేసిన పిమ్మటను భిక్షకు బైలుదేరవలెను. మాధుకరము (అనేక గృహములనుండి కొంచెము కొంచెము సంగ్రహింప బడినది), అసంక్లప్తము (ముందుగా అనుకొని తయారుచేయబడనిది), ప్రాక్ప్రణీతము (ముందుగా తయారుచేయబడినది) అయాచితము, (అడగకనే లభించునది) తాత్కాలికోప పన్నము (అప్పటికప్పుడు లభించినది) అని భైక్షము ఐదు విధములు. హస్తములే పాత్రగా ఉపయోగించవలెను. లేదా మరియొక పాత్ర నుండి హస్త పాత్రలోనికి తీసికొనవలెను. కర్మ దోషముల వలన ప్రాణులు ఏ ఏ విధముల బాధపడుచున్నారో గమనించవలెను. ఏ ఆశ్రమములో ఉన్నను మానవుడు పరిశుద్ధ చిత్తముతో ధర్మాచరణము చేయవలెను; అన్ని భూతములందును సమదృష్టి చూపవలెను. అంతియేకాని ఆశ్రమ లింగములను ధరించినంత మాత్రమున ప్రయోజనము లేదు. కతక వృక్షఫలము (ఇందుపకాయ) నీటిలోని బురదను తొలగించి దానిని నిర్మలము చేయునను మాట నిజమే; కాని దాని పేరు చెప్పినంత మాత్రమున నీరు ప్రసన్నము కాదు కదా? అజ్ఞాన వశముచే సంసారములో చిక్కుకొనిన ద్విజుడు కుంటివాడైనను, గ్రుడ్డివాడైనను, చెవిటివాడైనను, కుటిలత్వములేని సన్యాసి యైనచో-సత్కర్మల నుండియు, అసత్కర్మల నుండియు విముక్తుడగును. సన్యాసి పగటియందును, రాత్రియందును తనచే చంపబడిన ప్రాణుల విశుద్ధికై స్నానము చేసి ఆరు ప్రాణాయామములు చేయవలెను. ఎముకలనెడు స్తంభములుగలదియు, నాడులతో కూడినదియు, మాంస, శోణితములచే పూయ బడినదియు, చర్మముచే కప్ప బడినదియు, మూత్రపురీష దుర్గంధముతో నిండినదియు, జరాశోకములతో కూడి నదియు, అనిత్యమును, జీవునికి నివాసమగు ఈ శరీరమును త్యజించవలెను.
స్థైర్యము, ఓర్పు, మనోనిగ్రహము, పరధనాపహారము చేయకుండుట, ఇంద్రియ నిగ్రహము సిగ్గు, జ్ఞానము, సత్యము, అక్రోధము ఈ పదియు ధర్మ లక్షణములు, కుటీచకుడు, బహూదకుడు, హంస, పరమహంస అని సన్న్యాసులు నాలుగు విధములు. వీరిలో ఉత్తరోత్తరుడు ఉత్తముడు. ఏకదండియైనను, త్రిదండియైనను యోగి బంధనముల నుండి విముక్తుడగును. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఈ ఐదును యమములు. శౌచము, సంతోషము, అగర్భము అని ప్రాణాయామము రెండు విధములు. జపధ్యానాదులు కలిసినది సగర్భము. మరల ఆ రెండును ఒక్కొక్కటి పూరకము, కుంభకము, రేచకము అని మూడేసి విధములు. వాయువు నింపుట పూరకము; బంధించినచో కుంభకము. విడచుట రేచకము. ప్రాణాయామము ద్వాదశ మాత్రకము, చతుర్వింశన్మాత్రకము అని మరల మూడేసి విధములు. తాళము, లేదా లఘు అక్షరము ఒకమాత్ర, ప్రాణాయామ సమయమున ఓం కారాదులను మెల్లగా జపించవలెను. ఇంద్రియ సంయమము ప్రత్యాహారము. జపము చేయు సాధకులు ఈశ్వరుని స్మరించుట ధ్యానము. మనస్సును స్థిరముగా నిలుపుట ధారణ. బ్రహ్మయందు స్థితి సమాధి. ఈ ఆత్మయే పరమాత్మ, ఆత్మ సత్యము జ్ఞానరూపము, అనంతము, విజ్ఞానము, ఆనంద రూపము. ఇదియే బ్రహ్మ. నీవు ఆ బ్రహ్మయే. నేను ఆ బ్రహ్మనే. పరబ్రహ్మ జ్యోతిరూపము. అదియే ఆత్మ. వామ(సు) దేవుడు, నిత్య యుక్తము ఓంకార రూపము. దేహేంద్రియ మనోబుద్ధి ప్రాణ అహంకార శూన్యమైనది. ఈ బ్రహ్మజాగ్రత్, స్వప్న, సుషుప్త్యాది ముక్తమైనది. అందుచే తురీయము, నిత్యము, శుద్ధము, జ్ఞానరూపము, ముక్తము, సత్యము, ఆనందము, అద్వితీయము, పరజ్యోతియు, అక్షరము, సర్వ వ్యాప్తము, హరియగు బ్రహ్మయే నేను. ఆదిత్యునిలో ఉన్న అఖండ పురుషుడు నేను. మనుష్యుడు సర్వ కర్మలను పరిత్యజించి సుఖ దుఃఖములందు సముడై ఓర్పు కలవాడై, భావమునందు పరిశుద్దుడై, బ్రహ్మాండమును భేదించుకొని బ్రహ్మయగును. ఆషాఢ పౌర్ణమాసియందు చాతుర్మాస్యవ్రతము ప్రారంభించి చేయవలెను. కార్తిక శుక్ల నవమి మొదలు సంచారము చేయవలెను. ఋతుసంధి దివసములందు ముండనము చేయించుకొనవలెను. సన్యాసులకు ధ్యాన-ప్రాణాయామములే ప్రాయశ్చిత్తము. (161)
