అగ్ని మహా పురాణము

Table of Contents

సకలాది మంత్రోద్ధారణము

శివుడు చెప్పెను:

స్కందా! సకల, నిష్కల, శూన్య, కాలాఢ్య, సమలంకృత, క్షపణ, క్షయ, అంతస్థ కంఠోష్ఠ, శివ అనునవి ప్రాసాద పరాసంజ్ఞకమగు మంత్రముయొక్క ఎనిమిదింటి స్వరూపము. ఇవి శబ్ద మయములగు సదాశివ రూపములు. సకల సిద్ధులను ఇచ్చునవి. అమృత అంశుమత్, ఇంద్ర ఈశ్వర ఉగ్ర ఊహక్ ఏక పాద ఐల, ఓజ, ఔషధ, అంశుమత్, వశి అనునవి వరుసగ అకారాది ద్వాదశ స్వరములకు వాచకములు. చెప్పబోవునవి కకారా ద్యక్షర సూచకములు. వరుసగా కామ దేవ శిఖండి గణేశ, కాల శంకర, ఏక నేత్ర, ద్వినేత్ర, త్రిశిఖ, దీర్ఘ బాహుక, ఏకపాద, అర్ధ చంద్ర, వలయ, యోగినీ ప్రియ, శక్తీశ్వర, పద్మ, శాకినీ ప్రియ, ముఖబిలబ, భీషణ, కృతాంత, ప్రాణ, తేజస్వి, శక్ర, ఉదధి, శ్రీకంఠ, సింహ, శశాంక, విశ్వరూప, నారసింహములు. విశ్వరూపమును పండ్రెండు మాత్రలతో కలిపి వ్రాయవలెను. విశ్వరూపమును (హ) అంశముతో (౦) తోను ఓజస్(ఓ) తోను కలిపి శశి బీజమును(స) కలుపుకొన్నచో (ఓం) అను ప్రథమ బీజము ఉద్ధృతమగును. ఇది ఈశాన సంబద్ధము. పైన చెప్పిన పండ్రెండు బీజములలో ఐదు హ్రస్వయుక్త బీజములు, ఆరు దీర్ఘ బీజములు. మొదటి మాత్రయందును పదకొండవ మాత్రయందును ఒకే ‘హం’ అను బీజము ఏర్పడును. తృతీయ బీజము తత్పురుష బీజము ఐదవది. అఘోర బీజము ఏడవది. వామదేవము. దాని తరువాతది సద్యోజాతము. ఇది రసయుక్తమగు నవమ బీజము. ఈ విధముగ ఐదు బీజములతో కూడిన ఈశానాదులకు బ్రహ్మ పంచకము అని పేరు వీటి ప్రారంభమున ప్రణవము చివర ‘నమః’ చేర్చవలెను. ఈశానాది నామములను చతుర్థ్యంతముగ మార్చినచో పూజోపయుక్త మంత్రములగును. ద్వితీయ చతుర్థాది మాత్రలు దీర్ఘములు. వాటిని హృదయాద్యంగ న్యాసమునందు ఉపయోగించవలెను. చతుర్ధము శిరోమంత్రము. ఇది ఈశ్వర నామకము. ‘హ’ కారమునకు ‘ఊ’ కార అనుస్వారము చేర్చగా ఏర్పడినది శిఖా మంత్రము. ఎనిమిదవది విశ్వరూప సమన్వితము. దశమము నేత్ర మంత్రము. అస్త్ర మంత్రము విసర్గ యుక్తము. శివ సంజ్ఞకమని చెప్పబడినది. హృదయాద్యంగముల ఆరు జాతులను క్రమముగా నమః స్వాహా వషట్ హుం, వౌషట్ ఫట్ అని ఉండును. ఇప్పుడు ప్రాసాద మంత్రమును చెప్పెదను, ‘హీం, హౌం, హూం. ఇవి ప్రాసాద మంత్రబీజములు. వీటికి కుటిలములని పేరు. ఇవి సర్వకార్య సంపాదకము. హృదయ శిఖాది బీజములను వెనుక చెప్పిన విధమున ఉద్ధారము చేసి ఫట్కారము వరకును సకలాంగ న్యాసము చేయవలయును. ఆసనము అర్ధచంద్రాకారము. శివుడు కామ పూరకుడు. సర్పాలంకృతుడు. మహాపాశుపత అస్త్రము సర్వ దుష్ట వినాశకరము. ఈ విధముగ సకల ప్రాసాదము చెప్పబడినది. ఇపుడు నిష్కల ప్రాసాదమును చెప్పెదను.

ఔషధ (ఔ) విశ్వరూప-(హ) ఏకదశమాత్ర సూర్యమండల (౦) ములతో కూడిన అర్ధ చంద్రము (అనునాసిక) నాదము వీటితో కూడినది ‘హౌం’ అను మంత్రం. ఇది నిష్కల ప్రాసాదమంత్రము, దీనికి విసంజ్ఞ కుటిలము అని పేరు. ఇది భుక్తి ముక్తి ప్రదము. ప్రాసాద మంత్రము ఈశానాది బ్రహ్మమూర్తి పంచక యుక్తము. అందుచేత దీనిని పంచాంగము, సాంగము అని చెప్పుదురు. అంశముతో (౦) విశ్వరూప (హ) అమృత (అ) ముల కలయికచే వ్యక్తమగు హం బీజమునకు శూన్యమని పేరు. ఈశానాది బ్రహ్మాత్మ కాంకములతో రహితమగుటచే దీనికి శూన్య అని పేరు. ఈశానాది మూర్తులు ఈ బీజముల అమృత తరువులు. వీటి పూజనము సమస్త విఘ్నములను తొలగించును. అంశుమాన్ (౦) చేర్చిన విశ్వరూపము (హ) ఊహకము (ఊ) పైన అధిష్టితమైనచో ఏర్పడిన హూం బీజమునకు కలాఢ్యమని పేరు. ఇది సకలాంతర్గతము పూజాంగాది కములు సకల మునకే వుండును. నరసింహుడు యమరాజుపై కూర్చుండును. అనగా ‘క్ష’ కారము, ‘మ’ కారముపై ఉండును. తేజస్వి (ర) ప్రాణ(య)ములు కూడ కలియును. పైన అంశుమత్ (౦) క్రింద ఊహకము (ఊ) ఉన్నచో (క్ష్మ్యూ) అను బీజము ఏర్పడును, ఇది పైనను క్రిందను మాత్రలచే అలంకరింపబడినదిన సమలంకృతమని చెప్పబడును. చంద్రార్ధా కారబిందు నాదములతో గూడిన బ్రహ్మ విష్ణునామ విభూషితములగు ఉదధి (వ) నరసింహ(క్ష)లను పండ్రెండుమాత్రలతో భేదితములు చేయవలయును. హ్రస్వస్వరములతో కూడిన బీజములు ఈశానాది బ్రహ్మాత్మకాది అంగములగును. దీర్ఘ స్వరయుక్త బీజములు వున్న మంత్రములు హృదయాధ్యంగ విన్యాసమునకు ఉపయోగించును.

ఇపుడు దశరూప బీజ ప్రణవములను చెప్పెదను. బీజమును అనుస్వారయుక్తము చేసి ‘ఓం’ అను ప్రథమ వర్ణోద్ధారము చేయవలెను అంశుమత్ అంశువుల యోగముచే ‘ఆం’ అను నాయక స్వరూప ద్వితీయ వర్ణము ‘అంశుమత్’ ఈశ్వరులచే ఈం అను ముక్తి ప్రదమగు తృతీయ వర్ణము ఏర్పడును. అంశు అక్రాంతమగు ఊహకము (ఊం) చతుర్థ వర్ణము సానుస్వార వరుణ (వ్) పాణ (వ్య) తేజస్ (ర) (వ్యు) ఇది పంచమ బీజాక్షరము. స్వానుస్వార కృతాంతము (మం) షష్ఠ బీజము. స్వానుస్వార ఉదక ప్రాణములు (వ్యం) సప్తమ బీజమిందు యుక్త పద్మము (పం) అష్టమ బీజము ఏకపాద యుక్త నందీశుడు (నం) నవమ బీజము. అంతమున ప్రథమ బీజమును చేర్చవలెను. ఇట్లేర్పడిన దశ బీజాత్మక మంత్రమునకు క్షపణము అని పేరు దీని ప్రథమ, తృతీయ, పంచమ, సప్తమ, నవమ బీజములు క్రమముగ ఈశాన తత్పురుష అఘోర వామదేవ సద్యోజాత స్వరూపములు ద్వితీయాది బీజములు హృదయాద్యంగ న్యాసోప యుక్తములు ఈ పది ప్రణవాత్మక బీజములును ఒక్కసారి ఉచ్చరించుచు ‘అస్త్రాయ ఫట్’ అని అస్త్ర న్యాసము చేయవలెను. ఈశానాది మూర్తుల అంతమున నమః అనునది చేర్చియే చెప్పవలెను. ద్వితీయ బీజము మొదలు నవమ బీజము వరకు ఉన్నవి విద్యేశ్వర రూపములు. ‘అనంతేశ’ సూక్ష్మ ‘శివోత్తమ’, ఏకమూర్తి, ఏకరూప, త్రిమూర్తి శ్రీకంఠ, శిఖండి అని వీటిపేర్లు శిఖండి, మొదలు అనంతేశుని విలోమ క్రమముచే బీజ మంత్రములను చేర్చవలెను. (317)