అగ్ని మహా పురాణము

Table of Contents

తైలోక్యమోహన మంత్ర కథనము

అగ్నిదేవుడు పలికెను:

చతుర్వర్గ సిద్ధికై త్రైలోక్య మోహనము అను మంత్రమును చెప్పెదను. “ఓం శ్రీం హ్రీం” మొదలు “ఆగచ్ఛ ఆగచ్ఛ నమః” వరకును మూలోక్తమగు మూలమంత్ర యుక్త వ్యాపక న్యాసము చెప్పబడినది. పూజచేసి ఏబది వేల జపముచేసి అభిషేకముచేసి వైదిక విధిచే స్థాపించిన కుండాగ్నిలో నూరు హోమములు చేయవలయును. దధి ఘృత క్షీర ఘృతయుక్త చరు శృత వయస్సులను వేర్వేరుగా మూలమంత్రముతో పండ్రెండు పర్యాయములు హోమముచేసి అక్షత తిలయవలతో వెయ్యి హోమములుచేసి త్రిమధు పుష్ప ఫల దధి సమిధలతో నూరేసి హోమములు చేయవలయును. పిదప పూర్ణాహుతి చేసి మిగిలిన ఘృత సహిత చరువును భక్షించవలెను. బ్రాహ్మణులకు భోజనము పెట్టి ఆచార్యుని దక్షిణాదుతో సంతోషింప చేయవలయును. మంత్రము సిద్ధించును. స్నానా చమనములు చేసి మౌనముతో యాగ మందిరమున ప్రవేశించి పద్మాసనమున కూర్చుండి తాంత్రిక విధానముతో శరీర శోషణము చేయవలయును. ముందుగా రాక్షసులను విఘ్న కారక భూతములను అణచుటకై అన్ని దిక్కులందును సుదర్శన న్యాసము చేయవలయును. ఈ సుదర్శనము పంచకేశములకు బీజము, ధూమ్ర వర్ణము ప్రచండ అనిలరూపము. నాభి ప్రదేశమునందున్న నా సకల పాపములను శరీరము నందుండి తొలగించుచున్నది అని భావన చేయవలయును. పిదప హృదయాబ్జము నందున్నరం బీజమును స్మరించి మీదను క్రిందను పార్శ్వములందును వ్యాపించి యున్న అగ్ని జ్వాలలచే ఆ పాప పుంజమును జ్వలింపచేసి భస్మము చేయవలయును. పిదప శిరస్సునందు అమృత భావన చేసి సుషుమ్నా నాడీ మార్గమున వచ్చుచున్న ఆ అమృతధారలచే తన శరీరమును బయటను లోపలను కూడ ఆప్లావితము చేయవలయును. ఈ విధముగా శుద్ధ శరీరుడై మూల మంత్రముతో మూడు ప్రాణాయామములుచేసి శిరో ముఖ గుహ్య గ్రీవ సకలదిక్కు హృదయ కుక్షి సమస్త శరీరములందు హస్త ముంచి వాటిపై శక్తి న్యాసము చేయవలయును. సూర్య మండలము నుండి పరమాత్మను ఆవాహనముచేసి బ్రహ్మరంధ్ర మార్గము నుండి హృదయ కమలమునకు తీసుకొని వచ్చి ప్రణవోచ్చారణ చేయుచు సర్వ లక్షలక్షణ సంపన్నుడగు ఆ పరమాత్మను స్మరించవలెను. ‘త్రైలోక్య మోహనాయ విద్మహే’ స్మరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ యనునది త్రైలోక్య మోహన గాయత్రి. ఆత్మార్చన అనంతరము యజ్ఞ ద్రవ్యములను శుద్ధములగు పాత్రములను ప్రోక్షించి ఆత్మ పూజచేసి వేదికపై అర్చించవలెను.

కూర్మాది రూపమున కల్పితమగు పీఠముపై గరుత్మంతునిపై పద్మాసనము నందున్న శ్రీమహావిష్ణువు సర్వాంగసుందరుడు. వయస్సు తగిన లావణ్య యౌవనములు కలవాడు. అతని ఎర్రని నేత్రములు మదముచే తిరుగుచుండును. ఉదారుడు. స్మరవిహ్వలుడు. దివ్య మాల్యాంబర ఆలేపములచే అలంకృతుడు. మందహాసము కలవాడు. అనేక విధములగు పరివార పరికరములు కలవాడు, లోకానుగ్రహ కారకుడు. సౌమ్యుడు. సహస్ర సూర్య తేజశ్శాలి. ఐదు బాణములు ధరించినవాడు. ఆతని అన్ని ఇంద్రియములును ప్రాప్తకామములు. ఎనిమిది భుజములు గలవాడు. దేవతాస్త్రీలు ఆతనిని చుట్టుముట్టి ఉందురు. ఆతని దృష్టి లక్ష్మీముఖపై లగ్నమైయుండును. ఈ విధముగ భగవంతుని ధ్యానించవలెను. అతని ఎనిమిది హస్తములలో వరుసగా చక్ర, శంఖ, ధనుః, ఖడ్గ, గదా, ముసల, అంకుశ, పాశములుండును. ఆతనిని ఆవాహనాదుల ద్వారా పూజించి అంతమును విసర్జించవలెను. శ్రీమహావిష్ణువు తన వామోరు జంఘలపై చేతితో తనను ఆలింగనము చేసుకొని వున్న లక్ష్మిని కూర్చుండబెట్టుకొని ఉండును. ఆమె ఎడమ చేతిలో పద్మము వుండును. ఆమె బలిసి శ్రీవత్స కౌస్తుభములతో ప్రకాశించుచుండును. మాలాధారియు, పీతవస్త్రుడు, చక్రాదిధారియు అగు హరిని పూజించవలెను. “ఓం సుదర్శన మొదలు హుంఫట్’ వరకును మూలములలో ఉన్నది. సుదర్శన మంత్రముతో సుదర్శనమును పూజించవలెను. ‘ఓం జల చరాయ స్వాహా’ ఖడ్గ తీక్ష్ణ ఛింద, ఖడ్గాయ నమః శార్ఙ్గాయ, సశరాయ హుంఫట్’. ఇవి పాంచజన్యాది పూజా మంత్రములు. ‘భూత గ్రామాయ విద్మహే చతుర్విధాయ ధీమహి’ తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. ఇది భూత గ్రామ గాయత్రి. సంవర్తక శ్వసన పోధయ పోథయ హుంఫట్ స్వాహా’ పాశబంధ బంధ, ఆకర్షయ, ఆకర్షయ హుంఫట్. అంకుశ కట్ట కట్ట హుంఫట్’. వీటిలో ముసలాదులను వాటి వాటి మంత్రములతో పూజించవలెను. ‘ఓం పక్షిరాజాయ హుంఫట్’ అని గరుత్మంతుని పూజించవలెను. కర్ణికయందు యథావిధిగా అంగదేవతలను పూజించి పూర్వాది దళములందు లక్ష్మ్యాది శక్తులను చాతురధారి ఆర్క్ష్యాదులను పూజించవలెను. శక్తి పూజ అంతము నందు చేయవలయును. ముందుగ దండి సహితులగు ఇంద్రాదులను పూజించవలెను. లక్ష్మీ సరస్వతులు పీతవర్ణము కలవారు. రతి ప్రీతి జయలు శ్వేత వర్ణము కలవారు. కీర్తి కాంతులుకూడ శ్వేత వర్ణులు తుష్టి పుష్టులు. శ్యామవర్ణము కలవారు. వీరిలో స్మర భావ ముండును. లోకేశుని వరకు దేవతలను పూజించి అభీష్ట సిద్ధికై విష్ణువును పూజించవలెను. ఈ క్రింది మంత్రమును జపించి హోమాభిషేకములు చేయవలయును. ‘ఓం శ్రీం క్లీం హ్రీం హ్రూం త్రైలోక్య మోహనాయ విష్ణవే నమః’ అని మంత్రము. ఈ విధముగా పూజాదులు చేయుటచే సర్వకామములను పొందును. జలముతో సంమోహనీ వృక్ష పుష్పముతోను పై మంత్రము చెప్పుచు నిత్య తర్పణము చేయవలయును. బ్రహ్మ ఇంద్ర శ్రీదేవి, దండి, బీజమంత్ర త్రైలోక్య మోహన విష్ణువులను పూజించి పై మంత్రమును మూడు లక్షలు జపించి కమల పుష్ప బిల్వ పత్ర ఘృతములతోను, తండులఫల సుగంధ చందనాది ద్రవ్యములతోను దూర్వలతోను ఒక లక్ష హోమము చేయవలయును. దీర్ఘాయుర్దాయము పొందును. జపాభిషేక హోమాదులచే సంతుష్టుడై మహావిష్ణువు అభీష్ట ఫలములను ఇచ్చును. ‘ఓం నమో భగవతే వరాహాయ” భూర్భువస్స్వః పతయే భూపతిత్వం మే దేహి హృదయాయ స్వాహా’ ఇది వరాహ మంత్రము. దీనికి ఐదంగములు ఉండును. ప్రతి దినము పదివేల చొప్పున జపముచేసిన వాడు ఆయుర్దాయమును, రాజ్యమును పొందును. (307)