అగ్ని మహా పురాణము
దాయవిభాగము
అగ్నిదేవుడు పలికెను: తండ్రి దాయ విభాగము చేసినచో జ్యేష్ఠపుత్రునకు అధిక భాగము ఇవ్వవచ్చును లేదా అందరికిని సమముగా ఇవ్వవచ్చును. సమముగా ఇచ్చిన పక్షమున భర్తద్వారా కాని, మామగారి ద్వారా కాని, స్త్రీ ధనము లభించని స్త్రీలకు కూడా సమభాగములు ఇవ్వవలెను. తాను స్వయముగా ధనమును సంపాదింప సమర్థుడు పితృ ధనము కోరని కుమారునకు కూడ ఏమైనను కొంచెము ఇచ్చి వేరుచేయవలెను. తండ్రి చేసిన దాయవిభాగమునందు న్యూనాధికములున్నను అది తండ్రి చేసినదగుటచే ధర్మ సమ్మతమే. తల్లి దండ్రులు అనంతరము కుమారులు ధనమును ఋణమును కూడ సమముగా పంచుకొనవలెను. తల్లి చేసిన ఋణమేదైనా ఉన్నచో దానిని తీర్చి కుమార్తెలు మిగిలిన ధనమును సమముగా పంచుకొనవలెను. కుమార్తెలు లేనిచో కుమారులు పంచుకొనవలెను. పితృధనమునకు నష్టము కల్గింపక స్వయముగా సంపాదించినది కాని, మిత్రుల ద్వారా కాని, వివాహము ద్వారా వచ్చినది గానియైన ధనముపై దాయాదులకు అధికారము లేదు. అన్నదమ్ములు అందరును కలిసి సంపాదించిన ధనమును, వారందరును సమముగా పంచుకొనవలెను. చాలమంది తండ్రులుగల పౌత్రులు పితామహ ధనమును తమ తండ్రులను బట్టి పంచుకొనవలెను. పితామహుడు సంపాదించిన భూమి నిబంధము ద్రవ్యము వీటిపై తండ్రికిని పుత్రులకును అధికారము సమానము. విభాగము చేసికొనిన పిమ్మట సవర్ణ స్త్రీ యందు పుట్టిన కుమారునకు కూడ వాటా ఇవ్వవలెను. లేదా ఆయవ్యయములు సరిచూచుకొనిన తరువాత దృశ్య ధనము నుండి ఆతనికి బాగమీయవలెను. కుల క్రమాగతమైన ధనమును ఎవరైన అపహరించినపుడు దానిని మరల ఎవడు సంపాదించునో అది ఆతనికే చెందును. దాయాదులకు ఇవ్వవలసిన పనిలేదు. విద్యద్వార లభించిన ధనమును కూడ దాయాదులకు ఇవ్వపనిలేదు. తల్లిదండ్రులు ఒక వస్తువును ఎవరికిత్తురో అది అతనికి మాత్రమే చెందును. తండ్రి తరువాత కుమారులు పంచుకొనునపుడు తల్లికూడ సమాంశమును పొందవలెను. వివాహాదులు జరగని సోదరులకు వివాహాదులు జరిగిన సోదరులు ఆ సంస్కారములు చేయించవలెను. తోబుట్టువులకు కూడ తమధనములో నాల్గవవంతు ఇచ్చి వివాహము చేయవలెను. బ్రాహ్మణునకు బ్రాహ్మణాది స్త్రీల యందు పుట్టిన పుత్రులకు వరుసగా నాలుగు మూడు రెండు ఒకటి భాగములు ఇవ్వవలెను. క్షత్రియులకు పుట్టిన కుమారులకు (తల్లి వర్ణమును బట్టి) వరుసగా రెండు మూడు ఒకటి భాగములను, వైశ్యుని పుత్రులకు (వర్ణ క్రమమునుబట్టి) వరుసగా రెండు ఒకటి భాగములను ఇవ్వవలెను. ధన విభాగము అయిన తరువాత ఏదైన ద్రవ్యమును అన్నదమ్ములలో ఎవరైన అపహరించినట్లు కనబడినచో ఆ ద్రవ్యమును వారందరును మరల సమముగా పంచుకొనవలెనని నియమము. పుత్రులు లేనివానిచే పరభార్య యందు నియోగముచే పుట్టింపబడిన కుమారుడు వారి ఇరువురి రిక్షమునకు (ఆస్తికి) అధికారి, ఇద్దరికిని పిండదాత.
ధర్మపత్ని యందు పుట్టిన పుత్రుడు ఔరసుడు. పుత్రికా పుత్రుడు ఔరస సమానుడు. తన భార్య యందు సగోత్రుడగు వాని ద్వారాకాని, సగోత్రుని ద్వారా కాని, ఇతరులచేత గాని పుట్టింపబడినవాడు క్షేత్రజుడు. గృహము నందు రహస్యముగా పుట్టినవాడు గూఢజుడు. అవివాహిత కన్యకు పుట్టినవాడు కానీనుడు. వాడు మాతామహునికి పుత్రునిగా అంగీకరింపబడును. క్షతయోని గాని, అక్షతయోనిగానియైన విధవకు పుట్టినవాడు పౌనర్బవుడు. తండ్రి చేత కాని, తల్లిచేతకాని ఇవ్వబడినవాడు దత్తకుడు. తల్లిదండ్రులు అమ్మగా కొనబడినవాడు విక్రీతుడు. స్వయముగా పెంచుకొనబడినవాడు కృత్రిముడు. తనను తానే ఇతరులకు ఇచ్చిన కుమారుడు దత్తాత్మ. గర్భవతిని వివాహమాడగా పుట్టిన వాడు సహోఢజుడు. తల్లిదండ్రులు పరిత్యజించగా గ్రహింపబడినవాడు అపవిద్ధుడు. ఈ పదుకొందు విధముల కుమారులలో పూర్వ పూర్వపుత్రులు లేనిచో పరపర పుత్రుడు పిండమును ఇవ్వవలెను. ఆస్తి తీసుకొనవలెను. ఇంతవరకు చెప్పిన విధానము సమాన జాతీయుల విషయముననే.
శూద్రునకు దాసియందు పుట్టినవాడుకూడ తండ్రికి ఇష్టమైనచో అంశహరుడు అగును (ఆస్తి పంచుకొనువాడగును). తండ్రి మరణించిన పిమ్మట సోదరులు ఆతనికి అర్థ భాగములు ఇవ్వవలెను. అతనికి సోదరులు లేనిచో, దౌహిత్రుడుకూడ లేనిచో దాసీ పుత్రుడే అంతయు తీసుకొనవచ్చును. పైన చెప్పిన పదకొండు విధముల పుత్రులులేనివాని ధనముపై క్రమముగా భార్యకు, కుమార్తెలకు, తల్లిదండ్రులకు, సోదరులకు, సోదరపుత్రులకు, గోత్రమువారికి, బంధువులకు, శిష్యునకు సహాధ్యాయికి అధికారముండును. ఈ నియమము అన్ని వర్ణముల వారికిని చెల్లును. వానప్రస్థ, సన్యాసి, బ్రహ్మచారుల రుక్థముపై క్రమముగ ఆచార్యునకు ఉత్తమశిష్యునకు ధర్మభ్రాతకు ఏక తీర్థికి అధికారముండును. సోదరుడు జన్మించినను, సోదరుడు మరణించినను వారిద్దరు కలసివున్నపుడు ఆతనికి భాగమును ఇవ్వవలెను. అతని భాగమును తీసుకొనవలెను. కలసివున్న మరియొక సోదరుడు మరియొక సోదరుని ధనమును గ్రహించకూడదు. సవతి సోదరుడు కూడ కలిసి లేకపోయినను, మరణించినవాని ధనమును తీసుకొనవచ్చును.
నపుంసకుడు పతితుడు ఆతని కుమారుడు, కుంటివాడు, ఉన్మత్తుడు, జడుడు, గ్రుడ్డివాడు చికిత్సచేయ శక్యముగాని రోగములతో బాధపడువాడు వీరికి అంశము ఉండదు. వీరిని కేవలము పోషించవలెను. ఔరసులు, క్షేత్రజులు అయిన పుత్రులు ఈ దోషములు లేకున్నచో భాగమును తీసుకొనవచ్చును. వీరి కుమార్తెలను కూడ వివాహమగు నంత వరకు పోషించవలెను. వీరి భార్యలు పుత్రులు లేనివారైనచో సచ్చరిత్రులైన పక్షమున వారిని కూడ పోషించవలెను. వ్యభిచారిణులు ప్రతికూలలు అయినచో వారిని ఇంటినుండి వెడలగొట్టవలెను. స్త్రీలకు తల్లిదండ్రులు భర్త సోదరులు ఇచ్చినది, అగ్ని సమీపమునందు ఉపాయముగా లభించినది, అధివేదన సమయమున లభించినది స్త్రీ ధనమని చెప్పబడును. బంధువులు ఇచ్చినది, శుల్కముగా లభించినది, వివాహానంతరము పారితోషికముగా లభించినది కూడ స్త్రీ ధనము. స్త్రీ సంతాన రహితురాలై మరణించినప్పుడు ఆ ధనము బంధువులకు చెందును. బ్రాహ్మము మొదలైన నాలుగు వివాహ పద్ధతులచే పెండ్లాడిన భార్య, సంతానము లేకుండ మరణించినచో ఆమె ధనము భర్తకు చెందును. ఆమె సంతానవతి యైనచో ఆ ధనము పుత్రికలకు చెందును. మిగిలిన వివాహ పద్ధతులచే వివాహము చేసికొన్న స్త్రీ ధనము ఆమె తండ్రికి చెందును. కన్యను ఇచ్చి మరల ఆమెను హరించిన వానిని దండించవలెను. ఆతని నుండి వ్యయమైన ధనము నంతను ఉదయముతో (వడ్డీతో) తీసుకొనవలెను. ఆ కన్య మరణించినచో ఇద్దరి వ్యయమును పరిశీలించి భర్త ఇచ్చినదానిని ఆ కన్య తండ్రి నుండి తీసుకొనవలెను. భర్త దుర్భిక్ష సమయమునందును, ధర్మకార్యమునందును, వ్యాధియందును దేశోపప్లవమునందును, భార్యనుండి తీసుకొనిన స్త్రీ ధనమును తిరిగి ఆమెకు ఇవ్వవలసిన పనిలేదు. స్త్రీ ధనము లేని భార్య ఉండగా, మరొక వివాహము చేసుకొనువాడు ఆ వివాహమునకు, ఎంత వ్యయమగునో అంత ధనమును మొదటి భార్యకు ఇవ్వవలెను. ఆమెకు స్త్రీ ధనమున్నచో సగము ఇవ్వవలెను. విభాగ విషయమున సందేహము వచ్చినపుడు జ్ఞాతులు, బంధువులు, సాక్షులు, అబిలేఖితములు (వ్రాసిన పత్రములు) గృహములు, క్షేత్రములు కట్నము వీటిని బట్టి విభాగ నిర్ణయము చేయవలెను. (256)
