అగ్ని మహా పురాణము

Table of Contents

చతుర్వింశతి మూర్తి స్తోత్రము

హయగ్రీవుడు చెప్పెను: బ్రహ్మదేవా! ఓంకార రూపుడగు కేశవుడు తన హస్తములో (క్రింది కుడిచెయ్యి, పై కుడిచెయ్యి, పై ఎడమచెయ్యి, క్రింద ఎడమచెయ్యి అనుక్రమమున అని ఒక మతము. పై కుడి చెయ్యి మొదలు క్రింద కుడి చెయ్యి వరకును అని మరొక మతము) పద్మ, శంఖ, చక్ర, గదలను ధరించి యుండును. నారాయణుడు అదే వరుసలో శంఖ, పద్మ, గదా, చక్రములను ధరించును. ప్రదక్షిణ పూర్వకముగా ఆ భగవంతుని పాదములకు నమస్కరించుచున్నాను. మాధవుడు గదా, చక్ర, శంఖ, పద్మములను ధరించును. నేను ఆతనికి నమస్కరించుచున్నాను. గోవిందుడు చక్ర, గదా, పద్మ, శంఖములను ధరించును. బలశాలియై ఉండును. శ్రీ విష్ణువు గదా, పద్మ, శంఖ, చక్రములను ధరించును. ఆతడు మోక్షప్రదాత. మధుసూదనుడు శంఖ, చక్ర, పద్మ, గదలను ధరించును. నేను అతని ఎదుట భక్తితో వంగి నమస్కరించుచున్నాను. త్రివిక్రముడు పద్మ, గదా, చక్ర, శంఖములను ధరించును. వామనుడు శంఖ, చక్ర, గదా, పద్మములతో ప్రకాశించుచుండును. ఆతడు సర్వదా నన్ను రక్షించుగాక.

శ్రీధరుడు కమల, శంఖ, చక్ర, శార్ఙ్గ ధనస్సులను ధరించి యుండును. ఆతడు అందరికిని సద్గతి ఇచ్చువాడు. హృషీకేశుడు గదా, చక్ర, పద్మ, శంఖములను ధరించును. ఆతడు మనల నందరిని రక్షించుగాక. వరదాతయగు పద్మనాభుడు శంఖ, పద్మ, చక్ర, గదలను ధరించును. దామోదరుడు పద్మ, శంఖ, గదా, చక్రములు ధరించి విరాజిల్లుచు ఉండును. ఆతనికి నమస్కరించుచున్నాను. గదా, శంఖ, చక్ర, పద్మధారియైన వాసుదేవుడు సంపూర్ణ జగమును సృజించెను. గదా, శంఖ, పద్మ, చక్రములను ధరించిన సంకర్షణుడు మిమ్ములను అందరిని రక్షించుగాక. 

యుద్ధ కుశలుడైన ప్రద్యుమ్నుడు చక్ర, శంఖ, గదా, పద్మములను ధరించును. అనిరుద్ధుడు చక్ర, గదా, శంఖ, పద్మములను ధరించిన అతడు మనలను రక్షించుగాక. సురేశ్వరుడైన పురుషోత్తముడు చక్ర, కమల, శంఖ, గదలను ధరించును. అధోక్షజుడు పద్మ, గదా, శంఖ, చక్రములను ధరించును. ఆతడు మమ్ములను రక్షించుగాక. నృసింహుడు చక్ర, పద్మ, గదా, శంఖములను ధరించును. నేను ఆతనికి నమస్కరించుచున్నాను. గదా, పద్మ, చక్ర, శంఖములను ధరించు అచ్యుతుడు మమ్ములను రక్షించుగాక. శంఖ, గదా, చక్ర, పద్మములను ధరించు, బాలవటుడైన వామనుడు; పద్మ, చక్ర, శంఖ, గదలను ధరించు జనార్దనుడు; శంఖ, పద్మ, చక్ర, గదలను ధరించు, యజ్ఞస్వరూపుడైన శ్రీహరి; శంఖ, గదా, పద్మ, చక్రములను ధరించు కృష్ణుడు నాకు భోగములను, మోక్షమును ప్రసాదించుగాక.

వాసుదేవుడు ఆదిమూర్తి. వాసుదేవుని నుండి సంకర్షణుడు ఆవిర్భవించెను. సంకర్షణుని నుండి ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్నుని నుండి అనిరుద్ధుడు ఆవిర్భవించెను. వీరిలో ఒక్కొక్కరు క్రమముగ కేశవాది మూర్తి భేదమున మూడేసి రూపములలో ఆవిర్భవించిరి. (అనగా వాసుదేవుని నుండి కేశవ, నారాయణ, మాధవమూర్తులు; సంకర్షణుని నుండి గోవింద, విష్ణు, మధుసూదన మూర్తులు; ప్రద్యుమ్నుని నుండి త్రివిక్రమ, వామన, శ్రీధరమూర్తులు; అనిరుద్ధుని నుండి హృషీకేశ, పద్మనాభ, దామోదర మూర్తులు ఆవిర్భవించినవి). ఇరువది నాలుగు మూర్తుల స్తోత్రముతో కూడిన ఈ ద్వాదశాక్షర స్తోత్రమును చదువువారును, వినువారును నిర్మలులై, సంపూర్ణ మనోరథములను పొందుదురు.

విశేషాంశము: ఈ స్తోత్రములో ఇరువది నాలుగు మూర్తుల స్వరూపమును వర్ణించు మొదటి పండ్రెండు శ్లోకములలోని మొదటి అక్షరములను కలిపి చదివినచో “ఓం నమో భగవతే వాసుదేవాయ” అను ద్వాదశాక్షరి ఏర్పడును. అందుచే దానికి “ద్వాదశాక్షరీ స్తోత్రము అనియు, “చతుర్వింశతిమూర్తి స్తోత్రము” అనియు పేర్లు. (48)