అగ్ని మహా పురాణము

Table of Contents

మృత్యుంజయ కల్పము

ధన్వంతరి చెప్పెను:

ఆయుర్దాయప్రదములు రోగ వినాశకములగు మృత్యుంజయ కల్పములను చెప్పెదను. మధు, ఘృత, త్రిఫలా, అమృతములు మూడు వందల రోగములను తొలగించును. త్రిఫలను నాలుగు లేదా రెండు లేదా ఒక తులముగా సేవించవలెను. ఒక మాసము, బిల్వ తైలనశ్యము చేసికొన్నచో ఐదు వందల సంవత్సరములు జీవించును. కవియగును. తిల, భల్లాతకములు రోగమును, అపమృత్యువును వళులను తొలగించును. వాకుచీ పంచాంగ చూర్ణములను ఖదిరోదకముతో ఆరుమాసములు సేవించినచో కుష్ఠము నశించును. నీలకురంట చూర్ణమును క్షీరముతోగాని, మధువుతోగాని సేవించిన మంచిది. ఖండదుగ్ధమును పానముచేయువాడు నూరు సంవత్సరములు జీవించును. మధు ఆజ్య శుంఠులను, ప్రతి దినము ప్రాతఃకాలము, ఒక పలము సేవించువాడు మృత్యువును జయించును. మాండకీ చూర్ణముతో క్షీరము సేవించువానికి వళులు, ఫలితము ఉండదు. ఉచ్చటను, మధువుతో ఒక కర్షము తిని క్షీరపానము చేయువాడు, మృత్యువును జయించును, మధు ఘృతముతోగాని, క్షీరముతోగాని నుర్గండీరసమును సేవించువాడు రోగమును మృత్యువును జయించును. ఒక తులము పలాశ తైలమును మధువుతో ప్రతి దినము ఆరు మాసములు సేవించుచు, దుగ్ధము త్రాగువాడు ఐదు వందల సంవత్సరములు జీవించును. పాలతో కూడ జ్యోతిష్మతీ పత్ర రసమునుగాని త్రిఫలనుగాని త్రాగువాడు వెయ్యి సంవత్సరములు జీవించును. మధువుతో ఘృతము, నాలుగు తులముల శతావరి చూర్ణము సేవించువాడు సహస్ర వర్ష జీవియగును. నిర్గుండిని, మధు ఘృతములతో గాని, పాలతోగాని సేవించిన రోగ మృత్యువులను నశింపచేయును. పంచాంగ నింబరసమును బదిరక్వాథముతో భావనచేసి భృంగరాజ రసముతో ఒక తులముసేవించినచో రోగములను జయించి అమర్త్యుడగును. రుదంతికా చూర్ణమును ఘృతమధువులతో గాని, దుగ్ధముతోగాని సేవించువాడు, మృత్యువును జయించును. హరీతకీ చూర్ణమును భృంగరాజ రసముతో భావనచేసి ఘృతమధువులతో సేవించినచో రోగముక్తుడై మూడు వందల సంవత్సరములు జీవించును. వారాహికా భృంగరసలోహచూర్ణ శతావరీ, ఆజ్యములను ఒక తులము సేవించినచో అయిదు వందల సంవత్సరములు జీవించును. లోహ భస్మను శతావరిని భృంగరాజ రసముతో భావనచేసి మధు ఘృతములతో సేవించినవాడు మూడు వందల సంవత్సరములు జీవించును. తామ్రభస్మ, అమృతాత్రివృత్, గంధకములను సమముగ గ్రహించి కుమారికా రసముతో రెండు గురివిందెల గోలీలు తయారుచేసి ఘృతముతో సేవించుటచే ఐదువందల సంవత్సరములు జీవించును. అశ్వగంధ; త్రిఫలా శర్కర, తైల ఘృతములను సేవించువాడు నూరు వర్షములు జయించును.

అశోక వృక్షము బెరడు యొక్క చూర్ణమును మధు ఘృతములతో సేవించి దుగ్ధ పానము చేయుటచే రోగములు నశించును. పునర్నవా చూర్ణమును మధు ఆజ్య క్షీరములతో సేవించినవాడు రోగ విముక్తుడగును. మధు సహితమగు తిల తైలమును నశ్యముగ తీసుకొన్నచో శతవర్ష జీవియగును. కృష్ణ కేశములు (నల్లని వెంట్రుకలు) కలవాడు అగును. అక్ష చూర్ణమును ఒక తులము మధ్వాజ్య క్షీరములతో సేవించిన శతాయువగును. అభయా గుడములను మధురాది ఓషధులను ఘృతముతో తిని, పాలతో అన్నము భుజించువాని కేశములు సర్వదా కృష్ణవర్ణములై యుండును. అతడు రోగ రహితుడై అయిదు వందల సంవత్సరములు జీవించును. ఒక పలము కూష్మాండ చూర్ణమును ఘృత దుగ్ధములతో ఒక మాసము సేవించుచు దుగ్ధాన్న భోజనము చేయువాడు రోగ రహితుడై సహస్ర వర్ష జీవియగును. శాలుక చూర్ణమును భృంగాజ్యమును మదు ఘృతములతో సేవించినవాడు సూరు సంవత్సరములు జీవించును. ఒక తులము కటుతుంబీ తైలమును నశ్యముగా గ్రహించువాడు రెండు వందల సంవత్సరములు జీవించును. త్రిఫలా పిప్పలి శుంఠుల సేవనము మూడు వందలసంవత్సరము ఆయుర్దాయము నిచ్చును. వీటిని శతావరితో కలిపి సేవించినచో బలమును, సహస్రాయువును ఇచ్చును. చిత్ర శుంఠి విడంగముల సేవనము పూర్వోక్త ఫలమును ఇచ్చును. త్రిఫలా, పిప్పల, శుంఠులను లోహ భృంగరాజ, నింబ పంచక, ఖదిర, నిర్గుండీ, అంట కారి వాసక పునర్నవలతో గాని, వీటి రసముతో భావన చేసి కాని, వటి లేదా చూర్ణము తయారుచేసి ఘృత మధు గుడ జలాదులతో సేవించినచో పూర్వోక్త ఫలము లభించును. ‘ఓం హ్రూంసః’ అను మంత్రముచే అభిమంత్రితమగు యోగరాజము మృత్యు సంజీవని సమానమై రోగములను మృత్యువులను జయింపచేయును. ఈ కల్ప సాగరములను దేవతాసురమునులు సేవించిరి. పాలకాప్యుడు అంగరాజునకు గజాయుర్వేదము బోధించెను. (286)