అగ్ని మహా పురాణము
నిర్వాణ కళా శోధనము
ఈశ్వరుడు చెప్పెను: గురువు ప్రాతఃకాలము నందు లేచి, స్నానాదులు పూర్తి చేసికొని, మీరేమి స్వప్నములు చూచితిరని శిష్యులను అడుగవలెను. పెరుగు, పచ్చి మాంసము, మద్యము మొదలగువాటిని భుజించినట్లుగాని, చూచినట్లుగాని స్వప్నము వచ్చినచో అది ఉత్తమము, శుభ సూచకము. అట్లే ఏనుగు, గుఱ్ఱము ఎక్కుట, శ్వేత వస్త్రాదులను చూచుట గూడ శుభప్రదము. తైలము పూసికొనినట్లు స్వప్నము చూచినచో అశుభము. దాని శాంతికొరకై అఘోర మంత్రముతో హోమము చేయవలెను. ప్రాతఃకాల మధ్యాహ్నకాల నిత్యకర్మలు పూర్తిచేసుకొని యజ్ఞమండపమున ప్రవేశించి, యధా శాస్త్రముగ ఆచమనము చేసి, నైమిత్తిక కర్మ కూడ నిత్యవిధి వలెనే చేయవలెను. అధ్వశుద్ధి చేసుకొని తనపై హస్తము ఉంచుకొనవలెను. కలశముపైనున్న శివుని పూజించి, క్రమముగ ఇంద్రాది దిక్పాలకుల పూజ చేయవలెను. మండలమునందును, వేదియందును శివుని పూజింప వలెను. పిమ్మట తర్పణములు, అగ్నిపూజ, పూర్ణాహుతి వరకును హోమములు, మంత్ర తర్పణములు చేయవలెను. దుఃస్వప్న దోష నివారణార్థమై ‘హూం’తో సంపుటితము చేసిన అస్త్ర మంత్రముతో (హూం ఫట్ హూం) నూటఎనిమిది హోమములుచేసి మంత్ర దీపనము చేయవలెను. వేదీ కలశములమధ్య అంతర్బలిచేసి, శిష్యుల ప్రవేశార్థమై ఇష్టదేవతా అనుజ్ఞ పొంది గురువు మండపము నుండి బైటకు వెళ్ళవలెను. అచట, సమయ దీక్షలోపలనే మండలారోపణాదికము చేసి సంపాత హోమము. సుషుమ్నా నాడీరూపమగు కుశమును శిష్యుని హస్తములో నుంచుట మొదలగు కార్యములను పూర్తిచేయవలెను. నివృత్తి కళాసాన్ని ధ్యము కొరకై మూల మంత్రముచే మూడు ఆహుతులు ఇచ్చి, కుంభముపై నున్న శివుని పూజించి కలాపాశమయమగు సూత్రమును సమర్పిం పవలెను. పిమ్మట పూజింపబడిన శిష్యుని ఊర్ధ్వదేహము కుడి భాగమున వాని శిఖకు ఆ సూత్రమును కట్టి కాలి బొటన వ్రేలివరకును వ్రేలాడునటుల ఉంచవలెను. ఆ విధముగ ఆ పాశమును ఉంచి, దానిలో నివృత్తి కళావ్యాప్తి జరిగినట్లు భావన చేయవలెను. దానియందు నూట ఎనిమిది భువనములు చూడవలెను.
కపాల, అజ, అహిర్బుధ్న్య, వజ్రదేహ, ప్రమర్దన, విభూతి, అవ్యయ, శాస్త్రృ, పినాకి, త్రిదశాధి పులను పదిమంది రుద్రులు తూర్పు దిక్కున ఉందురు. అగ్ని రుద్ర, హుతాశ, పింగల, ఖాదక, హర, జ్వలన, దహన, బభ్రు, భస్మాంతక, క్షపాంతకులు అను పది మంది రుద్రులు ఆగ్నేయమున నుందురు. దమ్య, మృత్యుహర, ధాతృ, విధాతృ, కర్మ, కాల, ధర్మ, అధర్మ, సంయోక్తృ, నియోజ కులను పదిమంది రుద్రులు దక్షిణముననుందురు. నైరృత్య, మారుత, హన్తృ, క్రూర, దృష్టి, భయానక, ఊర్ధ్వకేశ, విరూపాక్ష, ధూమ్ర, లోహిత, దంష్ట్రులను పదిమంది రుద్రులు నైరృతి దిక్కునందు ఉందురు. బల, అతిబల, పాశహస్త, మహాబల, శ్వేత, జయభద్ర, దీర్ఘబాహు, జలాంతక, వడవాస్య, భీములను పదిమంది రుద్రులు పశ్చిమమున ఉందురు. శీఘ్ర, లఘు, వాయువేగ, సూక్ష్మ, తీక్ష్ణ, క్షమాంతక, పంచాంతక, పంచశిఖ, కపర్ది, మేఘ వాహనులను పదిమంది రుద్రులు వాయవ్యమునందు ఉందురు. జటాముకుటధారి, నానారత్నధర, నిధీశ, రూపవత్, ధన్య, సౌమ్యదేహ, ప్రసాదకృత్, ప్రకామ, లక్ష్మీవత్, కామరూపులను పదిమంది రుద్రులు ఉత్తరమునందు ఉందురు. విద్యాధర, జ్ఞానధర, సర్వజ్ఞ, వేదపారగ మాతృవృత్త, పింగాక్ష, భూతపాల, బలిప్రియ, సర్వవిద్యా విధాతృ, సుఖదుఃఖకరులను పది మంది రుద్రులు ఈశాన్యమునందు ఉందురు. అనంత, పాలక, ధీర, పాతాళాధిపతి, వృష, వృషధర, వీర, గ్రసన, సర్వతోముఖ, లోహితులను పదిమంది రుద్రులు క్రింది దిక్కునందు పాతాల లోకమునందు ఉందురు. శంభు-విభు-గణాధ్యక్ష-త్ర్యక్ష-త్రిదశ వందిత-సంవాహ-వివాహ-నభ-విప్సు-విచక్షణులను పదిమంది రుద్రులు ఊర్ధ్వ దిక్కునందు ఉందురు. హుహుక కాలాగ్ని రుద్ర, హాటక, కూష్మాండ, సత్య, బ్రహ్మ, విష్ణు, రుద్రులను ఎనమండుగురు రుద్రులు బ్రహ్మాండ కటాహము మధ్య నుందురు. ఈ రుద్రుల పేర్లను బట్టియే నూట ఎనిమిది భువనముల పేర్లు ఏర్పడినవి అను విషయమును గుర్తుంచుకొనవలెను.
సద్భావేశ్వర, మహాతేజః, యోగాధిపతే, ముంచ ముంచ, ప్రమథ ప్రమథ, శర్వ శర్వ, భవ భవ, భవోద్భవ, సర్వభూత సుఖప్రద, సర్వసాన్నిధ్యకర, బ్రహ్మ విష్ణు రుద్ర పర, అనర్చితానర్చిత, అసంస్తుతాసంస్తుత, పూర్వస్థిత, సాక్షిన్, సాక్షిన్, తురు తురు, పతఙ్గ పతఙ్గ, పిజ్గ పిజ్గ, జ్ఞాన జ్ఞాన, శబ్ద శబ్ద, సూక్ష్మ సూక్ష్మ, శివ-సర్వ, సర్వద, ఓం నమోనమః, ఓం నమః శివాయ నమో నమః ఇవి ఇరువది యెనిమిది పదములు. స్కందా! వ్యాపకమైన ఆకాశము మనస్సు. ‘ఓం నమో వౌషట్’-ఇది అభీష్ట మంత్ర వర్ణము, ‘అ’కార ‘ల’కారములు (అం లం) బీజములు. ఇడా పింగళులు రెండు నాడులు, ప్రాణ అపానము అనునవి రెండు వాయువులు, ఘ్రాణము, ఉపస్థ అనునవి రెండు ఇంద్రియములు. గంధము విషయము. దీనియందు గంధాదులగు నాలుగు గుణములున్నవి. ఇది పృథ్వీ తత్త్వముతో సంబంధించినది. పీతవర్ణము, దీని మండలాకారము చతురస్రము. నాలుగు వైపులా వజ్రముచే చిహ్నితమైనది. ఈ పార్థివ మండల విస్తారము నూరుకోట్ల యోజనములు, పదునాలుగు యోనులు కూడ దీనియందే అంతర్గతములని గ్రహించవలెను. మొదటి ఆరును మృగాది యోనులు, తరువాతి ఎనిమిది దేవయోనులు, మొదటిది మృగయోని, రెండవది పక్షియోని, మూడవది పశుయోని, నాల్గవది సర్పాదియోని, ఐదవది స్థావరయోని, ఆరవది మనుష్యయోని, ఎనిమిది దేవయోనులు వరుసగ పిశాచ, రాక్షస, యక్ష, గంధర్వ, ఇంద్ర, సోమ, ప్రజాపతి, బ్రహ్మలకు సంబంధించినవి. ఈ ఎనిమిది యోనులకును పార్థివతత్త్వముపై అధికారమని చెప్పబడినది.
లయము ప్రకృతి యందును, భోగము బుద్ధియందును అగును. బ్రహ్మ కారణము పిమ్మట జాగ్రదవస్థవరకును సమస్త భువనాది గర్భితయగు నివృత్తికళను ధ్యానముచేసి, తదీయ మంత్రముచే వినియోగము చేయవలెను. ‘ఓం హాం హ్రాం హాం నివృత్తికలాపా శాయ హుం ఫట్ స్వాహా’ అను నది దాని మంత్రము. పిదప ‘ఓం హాం హ్లోం హోం నివృత్తి కలాపాశాయ హూం ఫట్ స్వాహా’ అను మంత్రముచే అంకుశ ముద్రా ప్రదర్శన పూర్వముగ, పూరక ప్రాణాయామముతో ఆ కళను ఆకర్షించవలెను. పిదప ఓం హూం హ్లాం హూం నివృత్తి కలాపాశాయ హూం ఫట్ స్వాహా అను మంత్రముచే సంహార ముద్రాకుంభక ప్రాణాయామములతో దానిని నాభి క్రింది భాగమునకు తీసికొనిపోయి ‘ఓం హం నివృత్తి కలాపాశాయ నమః’ అను మంత్రముచే, ఉద్భవముద్రా రేచక ప్రాణాయామములతో దానిని కుండమునందు ఏదైన ఒక ఆధారముపై నుంచవలెను. పిమ్మట ‘ఓం హాం నివృత్తి కలాపాశాయ నమః అను మంత్రముచే అర్ఘ్య ప్రధాన పూర్వకముగ పూజించి దాని చివర ‘స్వాహా’ చేర్చి తర్పణముచేసి, సంవిధానము కొరకై వేరువేరుగా మూడు హోమములు చేయవలెను. పిమ్మట ‘ఓం హాం బ్రహ్మణే నమః’ అను మంత్రముచే బ్రహ్మను ఆవాహనచేసి, పూజించి, దాని చివర ‘స్వాహా’ చేర్చి మూడు హోమములచే బ్రహ్మను సంతృప్తుని చేయవలెను. అనంతరము ‘ఓ బ్రహ్మదేవా! ఈ ముముక్షువునకు, నీ అధికారమున దీక్ష ఇచ్చుచున్నాను. నీవు సర్వదా వీనికి అనుకూలుడవుగ నుండుము’ అని ప్రార్థించవలెను. పిదప, రక్తవర్ణయగు వాగీశ్వరిని, హృదయ మంత్రముతో, తన మనస్సులోనే ఆవాహనచేయవలెను. ఆ దేవి ఇచ్ఛా, జ్ఞాన, క్రియారూపిణి. ఆరు ఆధ్వలకును ఏకైక కారణము. వెనుక చెప్పిన విధానమున వాగీశ్వరికి పూజా తర్పణములు చేయవలెను. సమస్తయోనులను విక్షుబ్ధము చేయువాడును, హృదయములో నుండు వాడును అగు వాగీశ్వర దేవుని కూడ పూజించి తర్పణము చేయవలెను. ఆదియందు బీజముతోడను, అంతమునందు అస్త్ర మంత్రముతోడను కూడిన అస్త్ర మంత్రముతో శిష్యుని హృదయ తాడనముచేసి, అతనిలో ప్రవేశించినట్లు భావన చేయవలెను. హృదమునందు, నివృత్తి కళలోపల నున్న, అగ్ని కణ సదృశమగు పాశబద్ధమైన శిష్య జీవచైతన్యమును జ్యేష్ఠతో విభక్తము చేయవలెను. ‘ఓం హాం హూం హః హూం ఫట్’ అనునది విధానమంత్రము. ‘ఓం హాం స్వాహా’ అను మంత్రముచే, పూరక ప్రాణాయామ అంకుశ ముద్రలతో, ఆ జీవ చైతన్యమును హృదయమునందు ఆకర్షించి, ఆత్మ మంత్రముచే పట్టుకొని, దానిని తన ఆత్మలో చేర్చవలెను. ‘ఓం హాం హాం మాం ఆత్మనే నమః’ అనునది ఆత్మ మంత్రము.
మాతా పితరుల సంయోగమును భావన చేయుచు, రేచక ప్రాణాయామముతో బ్రహ్మాది కారణములను క్రమముగ త్యజించుచు జీవచైతన్యమును శివ రూపాధిష్ఠానము నందు చేర్చి, గర్భాధానము కొరకై దానిని గ్రహించి ఒకే సమయమున అన్ని యోనులందును, వామా, ఉద్భవముద్రలతో వాగీశ్వర యోనియందును ఉంచవలెను. పిమ్మట ‘ఓం హాం మాం హామ్ ఆత్మనే నమః’ అను మంత్రముతో పూజను, ఐదు పర్యాయములు తర్పణమును చేయవలెను. అన్ని యోనులయందును, ఈ జీవచైతన్యమునకు, హృదయ మంత్రముచే దేహసాధనము చేయవలెను. స్త్రీ శరీరాదులు పుట్టుటకు కూడ అవకాశమున్నది గాన పుంసవన సంస్కారము చేయ అవసరము లేదు. దైవవశముచేత అంధాది శరీరోత్పత్తి కూడ సంభావ్యముగాన సీమంతోన్నయనము కూడ అనావశ్యకము. శిరో మంత్రము (స్వాహా)చే ఒకే సమయమున సకల జీవులు జనించినట్లు భావన చేయవలెను. శివమంత్రముతో కూడ ఈ విధముగనే భావన చేయవలెను. కవచ మంత్రముతో భోగమును, అస్త్రమంత్రముతో విషయమునందును ఆత్మయందు మోహరూపమగు లయమను అభేదమును భావన చేయవలెను. పిదప శివ మంత్రముతో స్రోత శుద్ధిని, హృదయ మంత్రముతో తత్త్వ శోధనమును చేసి గర్భాదానాది సంస్కారముల నిమిత్తమై వరుసగ ఐదేసి హోమములు చేయవలెను. మాయజనిత, మలజనిత, కర్మజనితాది పాశబంధములు తొలగుటకై హృదయ మంత్రముచే శుద్ధిచేసి, అగ్నిలో నూరు హోమములు చేయవలెను. మలశక్తిని లయింప చేయుటకును, పాశములు తొలగించు కొనుటకును స్వాహాంతమగు అస్త్రమంత్రముతో ఐదేసి హోమములు చేయవలెను. “ఓం హాం హాం హాం నివృత్తి కలాపాశాయ హః హూం ఫట్” అను మంత్రమును ఉచ్చరించుచు, అస్త్ర మంత్ర జపాభి మంత్రితమగు ఖడ్గమైన కళాశస్త్రముతో అంతః కరణములో నున్న మలాది పాశములను ఏడు పర్యాయములు భేదించవలెను.
పాశము బంధించకుండ ఉండుటకు దానిని అస్త్రమంత్రముతో, రెండు చేతులతో నలిపి, గోలాకారముచేసి, నేతితో నింపిన స్రువములో పడవేయవలెను. కలామయమగు అస్త్రముచేత గాని, దేవతాస్త్ర మంత్రముచే గాని దానిని కాల్చివేసి భస్మము చేయవలెను. పిమ్మట పాశాంకురము తొలగిపోవుటకు నాలుగు హోమములు చేయవలెను. ‘ఓం హః అస్త్రాయ హూం ఫట్ స్వాహా’ అనునది హోమ మంత్రము. పిదప అస్త్రమంత్రముతో ఎనిమిది హోమములుచేసి ప్రాయశ్చిత్తము చేయవలెను. పిమ్మట విధాతను ఆవాహన చేసి పూజాతర్పణములు చేయవలెను. ‘ఓం హాం శబ్దస్పర్శౌ శుల్గ్కం బ్రహ్మన్ గృహాణ స్వాహా’ అను మంత్రముతో మూడు హోమములుచేసి శిష్యునకు అధికారము సమర్పింపవలెను. శివుని ఆజ్ఞను ఈ విధముగ బ్రహ్మకు తెలుపవలెను ‘ఓ బ్రహ్మా! ఈ పిల్లవాని పాశములు అన్నియు దగ్ధములైనవి. ఈతని మరల బంధనములలో పడవేయుటకై నీవు ఇచట ఉండరాదు’. ఇట్లు చెప్పి, బ్రహ్మను పంపివేసి, సంహార ముద్రా కుంభక ప్రాణాయామములతో, రాహువు యుక్త చంద్రైక దేశమువలె నున్న ఆత్మను, ఆత్మమంత్రము ఉచ్చరించుచు కుడినాడి ద్వారా మెల్ల మెల్లగా తీసికొని, రేచక ప్రాణాయామ ఉద్భవ ముద్రలతో వెనుకటి సూత్రము నందు చేర్చవలెను. మరల దానిని పూజించి గురువు అర్ఘ్యపాత్రలో నున్న అమృతోపమ జలబిందువులను గ్రహించి, శిష్యుని పుష్టి-తృప్తులకొరకై అతని శిరముపై నుంచవలెను, పిమ్మట మాతాపితరుల విసర్జనముచేసి వౌషడంతమగు అస్త్రమంత్రముతో, విధి దూర్తి కొరకై పూర్ణాహుతి ఇవ్వవలెను. ఇట్లు చేయుటచే నివృత్తికళ శుద్ధమగును. ‘ఓం హూం హాం అమకస్య ఆత్మనో నివృత్తి కళాశుద్ధిరస్తు స్వాహా ఫట్ వౌషట్’ అనునది పూర్ణాహుతి మంత్రము. (84)
