అగ్ని మహా పురాణము

Table of Contents

సామాది ఉపాయ వర్ణనము

పుష్కరుడు పలికెను:

పరశురామా! మనుష్యుడు పూర్వము తాను ఇతర శరీరముతో చేసిన కర్మకే దైవమని పేరు. అందుచే బుద్ధిమంతుడు పురుషకారమే శ్రేష్ఠమైనదని తెలిసికొనవలెను. దైవము ప్రతికూలముగా నున్నచో పురుషకారముచే దానిని అనుకూలము చేసికొనవచ్చును. పూర్వముచేసిన సాత్త్విక కర్మల ఫలితముగా ఈనాడు, పురుషకారము ఏమియు లేకున్నను సిద్ధి లభించును. భృగునందనా! పురుషకారమే దైవసాహాయ్యముతో తగు సమయమునందు ఫలమిచ్చుచుండును. దైవ పురుషకారములు రెండును మానవునకు ఫలము నిచ్చును. పురుషకారముచే వ్యవసాయము చేయగా, వర్షయోగము వచ్చినపుడు సమయానుసారము ఫలము లభించును. అందుచే కర్మానుష్ఠానము చేయుచు పురుషకారమునందు కూడ ప్రవర్తించవలెను, కాని కేవలము దైవమునే నమ్ముకొని కూర్చుండ కూడదు. సామాద్యు పాయములతో ప్రారంభించిన సర్వకార్యములును సిద్ధించును. సామము, దానము, భేదము, దండము, మాయ, ఉపేక్ష, ఇంద్రజాలము అని ఏడు ఉపాయములు. వాటి స్వరూపమును గూర్చి వినుము. తథ్యము, అతథ్యము అని సామము రెండు విధములు. అతథ్య సామము పురుషులకు అపకీర్తికరము; ఉత్తమవంశ సంజాతులు, సరల స్వభావులు, ధర్మ పరాయణులు, జితేంద్రియులు అయిన పురుషులు సామమునకు లొంగుదురు. అతథ్య సామముచే రాక్షసులను కూడ లొంగదీసికొనవచ్చును. వారు చేసిన ఉపకారములను వర్ణించుటయే వారిని వశముచేసికొనుటకు మంచి ఉపాయము. పరస్పర ద్వేషవంతులై, కుపితులై, భయభీతులై, అవమానితులై ఉన్న వారి విషయమున భేదమును ప్రయోగించవలెను. వారికి ఇంకను భయము కలుగునట్లు చేయవలెను. తమవైపునుండి వారికి ఆశ చూపించి, ఏ దోషముచే వారు ఇతరుల నుండి భయపడుదురో దానిని ప్రకటించి వారిలో భేదము పుట్టించవలెను. శత్రు కుటుంబము నందు భేదమును పుట్టించు వారిని రక్షించవలెను. సామంతుల కోపము మంత్రి పుత్రాదుల కోపము అంతర కోపము. అందుచే ముందుగా అంతరకోపమును శమింపచేసి, పిదప బాహ్య కోపమును తొలగింప ప్రయత్నించవలెను.

అన్ని ఉపాయములలో దానము శ్రేష్ఠమైనది. దానముచే ఇహపరములు రెండింటి యందును ఫలము లభించును. దానమునకు లొంగని వారు ఎవరును లేరు. దానము చేయు వాడు పరస్పరము కలిసియున్న వారిలో కూడ భేదమును కలిగించును. సామదాన భేదము లచే సిద్ధించని కార్యములను దండముచే సిద్ధింపచేసికొనవలెను. దండమునందే సర్వమును ఉన్నది. కాని దండమును అనుచిత రీతిలో ప్రయోగించినచో అది ఆత్మవినాశ హేతువు అగును. దండింపతగని వానిని దండించు వాడును, దండింపతగిన వానిని దండించని వాడును అయిన రాజు వినాశము పొందును. రాజు దండము ద్వారా అందరిని రక్షించకున్నచో దేవలు, దైత్యులు, నాగులు, మనుష్యులు, సిద్ధులు, భూతములు, పక్షులు -అందరును తమతమ మర్యాదలను ఉల్లంఘింతురు. క్రూరులను అణచివేసి, దండనీయులను శిక్షించును గాన దీనికి దండమని పేరు. రాజు ఇతరులు చూడజాలని విధమున తేజస్సుతో ప్రకాశించునపుడు అతడు సూర్యుని వంటివాడు. దర్శన మాత్రముచే ఆనందమును కలిగించునప్పుడు అతడు చంద్రుని వంటివాడు. గూఢచారుల ద్వారా ప్రపంచకము నందు అంతటను వ్యాపించి ఉండుటచే అతడు వాయుతుల్యుడు. దోషములను చూచి దండించుటచే ఇతడు యమ ధర్మరాజ సమానుడు. కుటిల బుద్ధిగల దుష్టులను చూచి దండించునుగాన అతడు సాక్షాత్తు అగ్ని దేవుడు. బ్రాహ్మణులకు దానములు ఇచ్చునపుడు ధనాధిపతియైన కుబేరుడు. దేవతాదులను ఉద్దేశించి హవిస్సు, ఘృతము మొదలగువాటిని ధారగా విడచును కాన వరుణుడు. ఓర్పుతో ఈ జగత్తునంతను ధరించునుగాన పృథ్వీ రూపుడు. ప్రభు మంత్రోత్సాహ శక్తులతో అందరిని పాలించునుగాన సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపుడు. (226)