అగ్ని మహా పురాణము
శిలావిన్యాస విధి
హయగ్రీవుడు చెప్పెను: శిలాన్యాస రూపమగు పాద ప్రతిష్ఠను గూర్చి చెప్పెదను వినుము. మొదట మండపము నిర్మించి పిదప దానిపై నాలుగు కుండములు నిర్మింపవలెను. ఆ కుండములు క్రమముగ కుంభన్యాస, ఇష్టకాన్యాస, ద్వార, స్తంభములకు మంగళకరమైన ఆశ్రయములుగా ఉండును. కుండములోని నాలుగు వంతులలో మూడు వంతుల భాగము కంకర మొదలైన వాటితో నింపి, సమముచేసి, దానిపై వాస్తు దేవతా పూజచేయవలెను. పునాదిలో వేయు ఇటుకలు బాగుగా కాలినవై ఉండవలెను. వాటి పొడవు పండ్రెండు అంగుళములు, దళసరి పొడవులో మూడవ వంతు, అనగా నాలుగు అంగుళములు ఉండవలెను. ఱాళ్లతో దేవాలయమును నిర్మింపదలచిన పక్షమున ఇటుకలకు బదులు ఱాళ్లనీ పునాదిలో వేయవలెను. ఒక్కొక్క ఱాయి హస్తము పొడవు ఉండవలెను. తొమ్మిది రాగికలశములుగాని, మట్టికలశములుగాని స్థాపింపవలెను. ఆ కలశములను జలముతోను, సర్వౌషధులతోను, చందనము కలిపిన జలముతోను నింపవలెను. వాటిలో బంగారము, ధాన్యములు మొదలగునవి కూడవేసి, గంధాదులతో పూజించి, ఆ జలపూర్ణ కలశలతో “ఆపోహిష్ఠామ” ఇత్యాది ఋక్ త్రయమును, “శంనోదేవీ రభిష్టయ” ఇత్యాది మంత్రమును, “తరత్సమన్దీః” ఇత్యాది మంత్రమును, పాపమాన ఋక్కులను, ఉదుత్తమం వరుణ’, ‘కయానః”, ‘వరుణ స్యోత్తమ్భనమసి’ ఇత్యాది మంత్రములను పఠించుచు, ‘హంసః శుచిషత్” ఇత్యాది మంత్రమును, శ్రీ సూక్తమును కూడ పఠించుచు, అధిక సంఖ్యాకములగు శిలలను, ఇటుకలను తుడువవలెను. వాటిని పునాదిలో స్థాపించి, మండపములోపల, ఒక శయ్యపై, పూర్వమండలము నందు శ్రీ మహా విష్ణువును పూజింపవలెను. అరణిని మథించి పుట్టించిన అగ్నియందు ద్వాదశాక్షర మంత్రమును పఠించుచు, సమిధలను హోమము చేయవలెను.
ఆఘారము, ఆజ్యభాగమను ఆహుతులను ప్రణవముతో చేయవలెను. పిమ్మట అష్టాక్షర మంత్రముతో ఎనిమిది ఆహుతులిచ్చి “ఓం భూః స్వాహా” “ఓం భువః స్వాహా” “ఓం సువః స్వాహా” అని మూడు వ్యాహృతులతో క్రమముగా లోకేశ్వరుడైన అగ్నికిని, సోమగ్రహమునకును, శ్రీమహావిష్ణువునకును ఆహుతులు అర్పింపవలెను. పిమ్మట ప్రాయశ్చిత్త హోమముచేసి, ప్రణవయుక్తమగు ద్వాదశాక్షరమంత్రముతో మినుములు, ఘృతము, తిలలు కలిపి పూర్ణాహుతి చేయవలెను. పిమ్మట ఆచార్యుడు పూర్వాభిముఖుడై, ఎనిమిది దిక్కులందు స్థాపించిన కలశములపై వేరువేరుగ పద్మాది దేవతలను స్థాపించి పూజింపవలెను. మధ్యయందు కూడ భూమి అలికి, ఒక శిలను కలశమును స్థాపింపవలెను. ఈ తొమ్మిది కలశములపై ఈ క్రింద చెప్పిన దేవతలను స్థాపింపవలెను. పద్మ, మహాపద్మ, మకర, కచ్ఛప, కుముద, ఆనంద, పద్మ శంఖములను ఎనిమిది కలశములపై స్థాపించి, పద్మినిని మధ్యనున్న కలశముపై స్థాపించవలెను.
ఈ కలశములను కదపగూడదు. వాటి సమీపమున తూర్పు నుండి ప్రారంభించి ఈశాన్యదిక్కు వరకును ఒక్కొక్క ఇటుక ఉంచవలెను. వాటిపై వాటి దేవతలైన విమల మొదలగు శక్తులను స్థాపింపవలెను. మధ్య అనుగ్రహ అను దేవతను స్థాపింపవలెను. పిమ్మట- “ముని శ్రేష్ఠుడైన అంగిరసుని పుత్రియైన ఓ ఇష్టకాదేవీ! నీ ఏ అవయవము కూడ విరుగలేదు, వికృతము కాలేదు. నీవు నీ సర్వాంగములతో పూర్ణమై యున్నావు. ఇప్పుడు నిన్ను నేను ప్రతిష్ఠించుచున్నాను అని” ప్రార్థింపవలెను. ఉత్తముడైన ఆచార్యుడు ఈ మంత్రముతో ఇష్టకా స్థాపనముచేసి, ఏకాగ్రచిత్తుడై మధ్యప్రదేశమునందు గర్భాదానము చేయవలెను. దాని విధి-ఒక కలశముపై శ్రీ మహావిష్ణువును, శ్రీ మహాలక్ష్మిని స్థాపించి వారి సమీపమున మట్టి, పుష్పములు, ధాతువులు, రత్నములు ఉంచవలెను. పిమ్మట పండ్రెండు అంగుళముల వైశాల్యము, నాలుగు అంగుళముల ఎత్తుగల, లోహాది నిర్మితమగు గర్భపాత్రలో అస్త్రపూజ చేయవలెను. పిమ్మట కమలాకారమగు తామ్రపాత్రలో పృథివిని పూజించి ఈ విధముగ ప్రార్థింపవలెను.
“సకల భూతముల అధీశ్వరివైన ఓ భూదేవీ! పర్వతాసనముపై విరాజిల్లుచు, సముద్రములచే చుట్టబడియున్న నీవు ఏకాంతమునందు గర్భధారణము చేయుము. వసిష్ఠ కన్యవైన ఓ నందా! వసువులతోడను, ప్రజలతోడను కూడియున్న నీవు నన్ను ఆనందింప చేయుము. భార్గవ పుత్రివైన ఓ జయా! నీవు ప్రజలకు విజయము నిచ్చుదానవు. నాకు కూడ విజయము నిమ్ము. అంగిరసుని పుత్రివైన ఓ పూర్ణా! నీవు నా కోరికలను తీర్పుము. కశ్యపమహర్షి పుత్రికవైన ఓ భద్రా! నీవు నాకు కల్యాణమైన బుద్ధినిమ్ము. సకల బీజములతోనిండి, సమస్త రత్నౌషధులతో సంపన్నమైన, సుందరియైన ఓ జయా దేవీ! వసిష్ఠ పుత్రికయైన ఓ నందాదేవీ! ఇచట ఆనందపూర్వకముగ రమింపుము. కశ్యపుని కన్యయైన ఓ భద్రా! నీవు ప్రజాపతికి పుత్రివి. నాలుగు దిక్కులందును వ్యాపించినదానవు, చాల గొప్పదానవు. సుందరివి, మనోహరమైన దానవు ఈ గృహమునందు రమింపుము. ఓ భార్గవీ దేవీ! నీవు చాల ఆశ్చర్యమయురాలవు. గంధమాల్యాదులతో పూజింపబడి ప్రకాశించుచున్నావు. జనులకు ఐశ్వర్య మునిచ్చు ఓ దేవీ! నీవీ గృహమునందు విహరింపుము. ఈదేశాధిపతికిని, నగరాధిపతికిని, గృహాధిపతికిని, దీనియందు నివసించు బాలాదులకును, మనుష్యాది ప్రాణులకును ఆనందము కలిగించుటకై పశ్వాదులను వృద్ధి పొందింపుము.” ఈ విధముగా ప్రార్థించి వాస్తు కుండమును గోమూత్రముతో తడుపవలెను.
ఈ విధి అంతయు పూర్తిచేసి కుండమునందు గర్భమును స్థాపింపవలెను. ఆ సమయమున ఆచార్యునకు గోవస్త్రాది దానమును, ఇతరులకు అన్నదానమును చేయవలెను. ఈ విధముగ గర్భపాత్రనుంచి, ఇటుకలను కూడ ఉంచి ఆ కుండమును నింపవలెను. పిమ్మట దేవాలయము ఎత్తును అనుసరించి ప్రధాన దేవతకు పీఠమును నిర్మింపవలెను. ఆలయము వైశాల్యములో సగము ఎంతయో అంత ఎత్తుగల పీఠము ఉత్తమ పీఠము. దానికంటె నాల్గవ వంతు ఎత్తు తగ్గినది మధ్యమ పీఠము. ఉత్తమ పీఠము ఎత్తులో సగముఎత్తు ఉన్నది కనిష్ఠ పీఠము. పీఠ బంధము చేసినపిమ్మట మరల వాస్తు పూజ చేయవలెను. కేవల పాదప్రతిష్ఠ చేయువాడుకూడ సకల పాపవిముక్తుడై దేవ లోకములో ఆనందమును అనుభవించును.
‘‘నేను దేవాలయ నిర్మాణము చేసెదను” అని సంకల్పించిన వాని శారీరక పాపములు అన్నియు ఆ దివసముననే నశించిపోవును. యథాశాస్త్రముగా దేవాలయ నిర్మాణము చేయువాని మాట చెప్పవలెనా! ఎనిమిది ఇటుకలతో దేవాలయము నిర్మించిన వానికి కలుగు ఫలముకూడ వర్ణింప శక్యము కానిది. దీనిని బట్టి విశాలమైన దేవాలయములను నిర్మించిన వానికి కలుగు ఫలమును ఊహించు కొనవచ్చును.
గ్రామ మధ్యము నందుగాని, గ్రామమునకు తూర్పుగాగాని దేవాలయమును నిర్మించినచో దాని ద్వారము పశ్చిమమునకు ఉండవలెను. విదిక్కులందు నిర్మించినచో దాని ద్వారము గ్రామాభి ముఖముగ ఉండవలెను. గ్రామమునకు దక్షిణ, ఉత్తర, పశ్చిమ దిక్కులందు నిర్మించిన దేవాలయము ద్వారము తూర్పువైపు ఉండవలెను. (41)
