అగ్ని మహా పురాణము

Table of Contents

చతుర్థీ వ్రతములు (చవితినాడు జరుపు వ్రతములు)

అగ్నిదేవుడు చెప్పెను:

ఇప్పుడు భుక్తి ముక్తి ప్రదములగు చుతుర్థీ వ్రతములను గూర్చి చెప్పెదను. మాఘ శుక్ల చతుర్థీదివసమున ఉపవాసముచేసి గణేశ పూజచేయవలెను. పంచమినాడు తిలలు భుజించవలెను. ఇట్లు చేసినవాడు అనేక సంవత్సరములపాటు, విఘ్నరహితుడై సుఖముగా ఉండును. ‘గం స్వాహా అనునది మూలమంత్రము, ‘గాం నమః’ ఇత్యాదులతో హృదయాది న్యాసము చేయవలెను. ‘ఆగచ్ఛోల్కాయ’ అని గణపతిని ఆవాహనము చేయవలెను. విసర్జన చేయునప్పుడు ‘గచ్ఛోల్కాయ’ అని చెప్పవలెను.

ఈ విధముగ ఆదియందు ‘గ’ కార యుక్తము, అంతమున ‘ఉల్కా’ శబ్దయుక్తము అగు మంత్రముతో గణపత్యావాహ నాదికము చేయవలెను. గంధాద్యుపచారములు, మోదకాదులు సమర్పించి గణపతి పూజ చేయవలెను. పిదప ‘ఓం మహోల్కాయ విద్మహే వక్రతుణ్డాయ ధీమహి తన్నోదన్తీ ప్రచోదయాత్’ అను మంత్రము జపించవలెను. భాద్రపద శుక్ల చతుర్థీ దివసమున వ్రతము చేసినవాడు శివ లోకమును పొందును. మంగళవారము కలిసిన చతుర్థినాడు గణపతి పూజచేసినవాడు సకలాభీష్ట వస్తువులు పొందును. ఫాల్గుణ చతుర్థినాడు రాత్రి మాత్రమే భోజనము చేయ వలెను. దీనికి ‘అవిఘ్నా చతుర్థి’ అని పేరు. చైత్ర చతుర్థినాడు దమనక పుష్పములతో గణపతి పూజ చేసినవాడు సుఖ భోగములను పొందును. (179)