అగ్ని మహా పురాణము

Table of Contents

పురుషలక్షణ వర్ణనము

అగ్ని దేవుడు పలికెను: వశిష్ఠా! శ్రీరాముడు చెప్పిన రాజనీతిని చెప్పితిని. ఇపుడు స్త్రీ పురుష లక్షణములను చెప్పెదను. దీనిని పూర్వము సముద్రుడు గర్గమునికి చెప్పెను. సముద్రుడు చెప్పెను: ఉత్తమవ్రతాచరణ శీలుడవగు గర్గా! స్త్రీ పురుష లక్షణములను, వాటి శుభాశుభ ఫలములను చెప్పెదను. ఏకాధికులు, ద్విశుక్లుడు, త్రిగంభీరుడు, త్రిత్రికుడు, త్రిప్రలంబుడు, త్రికవ్యాపి, త్రివళీ యుక్తుడు, త్రికాలజ్ఞుడు, త్రివిపులుడు, అగు పురుషుడు శుభలక్షణ సంపన్నుడు. ఇట్లే చతుర్లేఖుడు, చతుఃసముడు, చతుష్కిష్కుడు, చతుర్దంష్ట్రుడు, చతుః కృష్ణుడు, చతుర్గంధుడు, చతుర్హ్రస్వుడు, పంచసూక్ష్ముడు, పంచదీర్ఘుడు, షడున్నతుడు, అష్టవంశుడు, సప్తస్నేహుడు, నవామలుడు, దశపద్ముడు, దశవ్యూహుడు, న్యగ్రోధపరి మండలుడు, చతుర్థశ సమద్వంద్వుడు షోడశాక్షుడు అగు పురుషుడు ప్రశస్తుడు. ధర్మ, అర్థ, కామములతో కూడిన ధర్మము ‘ఏకాధికము’, నట్ట గ్రుడ్లు తప్ప మిగిలిన నేత్రములు, దంతములు తెల్లగా ఉన్నవాడు ‘ద్విశుక్లుడు’. స్వర, నాభి, సత్త్వములు, గంభీరములుగా ఉన్నవాడు త్రిగంభీరుడు. నిర్మాత్సర్యము, దయ, క్షమ, సదాచరణము, శౌచము, అస్పృహ, ఔదార్యము, అనాయాసము శూరత్వము అను (తొమ్మిది) గుణములుకలవాడు ‘త్రిత్రికుడు’. వ్రేలాడు వృషణములు, భుజద్వయము కలవాడు త్రి ప్రలంబుడు. తేజో-యశః-కాంతులచే దేశజాతి దశదిశలను వ్యాపించువాడు ‘త్రికవ్యాపి’. ఉదరమునందు మూడు ముడతలు ఉన్నవాడు ‘త్రివళిమంతుడు’ దేవతా, బ్రాహ్మణ, గురుజనుల విషయమున వినతుడు ‘త్రివినతుడు’, ధర్మ, అర్థ, కామముల సమయము నెరిగినవాడు త్రికాలజ్ఞుడు.వక్షః స్థల, లలాట, ముఖములు విపులముగా నున్నవాడు ‘త్రివిపులుడు’, హస్తద్వయ, పాదద్వయములు ధ్వజచ్ఛత్రాది లేఖా చిహ్నితములై ఉన్న వాడు ‘చతుర్లేఖుడు’. వ్రేళ్ళు, హృదయము, కటి, పృష్ఠము-ఈ నాలుగు సమములుగా ఉన్నవాడు చతుస్సముడు. తొంబదియారు అంగుళముల ఎత్తుగలవాడు ‘చతుష్కిష్కువు’ చంద్రునివలె ప్రకాశించు నాలుగు కోరలు గలవాడు చతుర్దంష్ట్రుడు. నేత్ర తారలు, కనుబొమ్మలు, మీసము, కేశములు నల్లగా ఉండువాడు ‘చతుష్కృష్ణుడు’.

నాసిక, ముఖము, రెండు చంకలు-వీటి యందు మంచి గంధమున్న వాడు చతుర్గంధుడు, లింగము, కంఠము, రెండు పిక్కలు హ్రస్వముగా నున్నవాడు చతుర్హ్రస్వుడు వ్రేళ్ళ కణుపులు, గోళ్ళు, కేశములు, దంతములు, చర్మము-ఇవి సూక్ష్మముగానున్నవాడు ‘పంచసూక్ష్ముడు’. చెక్కిలి, నేత్రములు లలాటము, నాసిక, వక్షఃస్థలము విశాలముగా నున్నవాడు “పంచదీర్ఘుడు”, వక్షఃస్థలము, చంకలు, గోళ్ళు, ముక్కు ముఖము, మెడ వెనుకభాగము ఉన్నతముగా ఉన్నవాడు ‘షడున్నతుడు’, చర్మము, కేశములు, దంతములు, రోమములు, చూపు, నఖములు, మాట-ఇవి స్నిగ్ధముగా నున్న వాడు ‘సప్తస్నేహుడు’. రెండు మోకాళ్ళు, రెండు తొడలు, పృష్ఠ భాగము, హస్తద్వయము, నాసిక అనునవి చక్కగానున్నవాడు ‘అష్టవంశుడు’. నేత్రద్వయము, నాసికాద్వయము, కర్ణ ద్వయము, శిశ్నము, గుదము, ముఖము ఈ తొమ్మిది నిర్మలముగా నున్నవాడు ‘నవామలుడు’. పద్మసమాన కాంతిగల జిహ్వ, ఓష్ఠ, తాలు, నేత్ర, హస్త, పాద, నఖ, శిశ్నాగ్ర, ముఖములు కలవాడు ‘దశపద్ముడు’ , హస్త, పాద, ముఖ, కంఠ, కర్ణ, హృదయ, శిరో, లలాట, ఉదర, పృష్ఠములు పెద్దవిగా ఉన్నవాడు ‘దశవ్యూహుడు’. ఇతడు లోకసంమానితు డగును. రెండుచేతులు చాపగా ఒకచేతి మధ్యమాంగుళి నుండి రెండవ చేతి మధ్య మాంగుళి వరకు ఎంత పొడవుండునో అంత ఎత్తు ఉన్నవాడు న్యగ్రోధపరి మండలుడు’. చరణములు, గుఱ్ఱములు, నితంబములు, పార్శ్వములు, వంక్ష్ణములు, వృషణములు, స్తనములు, కర్ణములు, ఓష్ఠములు, ఓష్ఠాంతములు, పిక్కలు, హస్తములు, బాహువులు, నేత్రములు అను యుగ్మాంగములు సమముగా నుండువాడు ‘చతుర్దశ సమద్వంద్వుడు’. రెండు నేత్రములతో పాటు పదునాలుగు విద్యలు కూడ ఉన్నవాడు ‘షోడశాక్షుడు’. ఇందుకు భిన్నమైన గుణములు కలది వికసించిన నేత్రములు కలదియగు శరీరము ప్రశస్తము. ఉత్తమ పురుషుని మాట మధురముగా నుండును. నడక మత్తగజగమన సమానమై యుండును. ఒక్కొక్క రోమ కూపమునుండి ఒక్కొక్క రోమమే వచ్చును. ఇట్టి పురుషుడు సర్వదా సకల భయములనుండి రక్ష పొందును. (243)