అగ్ని మహా పురాణము

Table of Contents

ద్రవ్యశుద్ధి

పుష్కరుడు చెప్పెను:  

ఇపుడు ద్రవ్యశుద్ధిని గూర్చి చెప్పెదను. మట్టి పాత్ర మరల కాల్చుటచే శుద్ధ మగును. మల మూత్రాది స్పర్శచే అశుద్ధమైన పాత్ర కాల్చినను శుద్ధము కాదు. సువర్ణ పాత్రము అపవిత్ర వస్తువుల స్పర్శ కలిగినచో కడిగివేసిన శుద్ధమగును. తామ్రపాత్ర పులుపు తగిల్చి నీటితో కడిగిన శుద్ధమగును. కాంస్య, లోహపాత్రలు పరాగముతో రాచిన శుద్ధములు అగును. కేవలము జలముచే కడిగినంత మాత్రమునే ముత్యములు మొదలగునవి శుద్ధమగును. జలమునుండి పుట్టిన శంఖాదులతో తయారు చేసిన పాత్రలు, ఱాతి పాత్రలు, శాకము, త్రాడు, ఫలములు, పుష్పములు, మూలములు, వెదురు మొదలైన వాటితో తయారు చేసిన వస్తువులు జలముచే కడిగిన శుద్ధములగును. యజ్ఞమునందు, యజ్ఞ పాత్రలు కుడిచేతితో కుశలతో మార్జనము చేసినచో శుద్ధమగును. ఘృతము, తైలముతగిలి జిడ్డుగానున్న పాత్రలు, వేడినీటితో శుద్ధములగును. చీపురుతో తుడిచి, అలుకుటచే ఇల్లు శుద్ధి అగును. శోధన ప్రోక్షణములచే వస్త్రశుద్ధి అగును. మృత్తి కోదకముతో శోధనము చేయవలెను. చాల వస్త్రముల సముదాయము నీరు చల్లుటచే శుద్ధమగును. దారు పాత్రములు చెక్కుటచే శుద్ధములగును, శయ్యాది వస్తువులు, అనేక వస్తువులు కలియగా ఏర్పడినవి జలప్రోక్షణముచే శుద్ధములగును, రెండు కుశ పత్రములచే ఉత్ల్పవనము చేయుటచే ఘృత తైలాదులకు శుద్ధి. శయ్య, ఆసనము, వాహనము, చేట, శకటము, పలాలేంధనములు జలసంప్రోక్షణముచే శుద్ధమగును. శృంగ దంతాదులతో తయారు చేసిన వస్తువులు పచ్చ ఆవాలు ముద్దచేసి పూసినచో శుద్ధమగును. నారికేళము, ఆనపకాయ మొదలగు వాటితో తయారు చేసిన పాత్రలు ఆవుతోక యందలి వెండ్రుకలతో రాయగా శుద్ధమగును. శంఖాధ్యస్థి నిర్మితపాత్రల శుద్ధి శృంగ నిర్మిత పాత్రలవలె ఆవాల ముద్ద పూయుటచే అగును. జిగురు బెల్లము, ఉప్పు, కుసుంభ పుష్పము, ఉన్ని, పత్తి ఎండలో ఎండబెట్టుటచే శుద్ధమగును. నదీజలము సర్వదా శుద్ధము. ఆపణములో అమ్మ జూపిన వస్తువులు శుద్ధములు. ముఖము తప్ప గోవు అవయవములు అన్నియు శుద్ధములు. గుఱ్ఱము, మేక-వీటి ముఖములు శుద్ధములు. స్త్రీల ముఖము సర్వదా శుద్ధము. పాలు పితుకునపుడు లేగదూడ ముఖము, చెట్టుపై పండ్లు కొట్టిన పక్షుల ముఖము, వేటాడు సమయమున కుక్కల ముఖము పవిత్రములు. భోజనము, ఉమ్మి వేయుట, నిద్రించుట, నీరు త్రాగుట, స్నానము, మార్గ గమనము, వస్త్ర ధారణము ఈ పనులు చేసిన పిమ్మట ఆచమనము చేయవలెను. పిల్లి ఇటు అటు తిరుగుటచే శుద్దము. రజస్వల నాల్గవ దినమున శుద్ధియగును. ఋతుస్నాతయైన స్త్రీ ఐదవ రోజున దేవ-పితృ కార్యములలో పాల్గొనవచ్చును. శౌచానంతరము ఐదు పర్యాయములు గుదము నందును, పది మార్లు ఎడమ చేతియందును, మరల ఏడుసార్లు రెండు చేతులందును, ఒకమారు లింగము నందును, మరల రెండు మూడుసార్లు చేతులందును మట్టి రాసుకొని కడుగుకొనవలెను. ఇది గృహస్థులకు చెప్పిన శౌచ విధానము. బ్రహ్మచారి, వానప్రస్థ, సన్యాసులకు ఇంతకు నాలుగు రెట్లు శౌచము విహితము. సిల్కు బట్టల శుద్ధి బిల్వ ఫలములోని గుంజుతోను, క్షామముల శుద్ధి తెల్ల ఆవాలతోను, మృగచర్మ, రోమాదులతో నిర్మితములగు వస్త్రముల శుద్ధి నీరుచల్లుట చేతను అగును. పుష్ప ఫలములుకూడ జల ప్రోక్షణముచే శుద్ధములగును. (156)