అగ్ని మహా పురాణము
మహాపాతకాది ప్రాయశ్చిత్తము – 1
పుష్కరుడు చెప్పెను:
ప్రాయశ్చిత్తము చేసికొననివారిని రాజు దండించవలెను. తప్పు తెలిసి చేసినను, తెలియక చేసినను ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. మత్తులు, క్రుద్ధులు, రోగగ్రస్తులు-వీరి అన్నము ఎన్నడును తినగూడదు. రజస్వల స్పృశించిన అన్నమును, సామూహికాన్నమును, వేశ్యా స్త్రీ అన్నమును తినరాదు. మహాపాతకములు చేసినవాడు, వడ్డీ వ్యాపారము చేయువాడు, దాయకుడు, అభిశప్తుడు, నపుంసకుడు, ఉపపతితో నివసించు స్త్రీ, రజకుడు, క్రూరుడు, వంది, జూదగాడు, కపటి, తపస్వి, చోరుడు, దండధారియైన భటుడు, స్త్రీకి భర్త ఉండగా జారుని వలన పుట్టినవాడు, స్త్రీకి భర్త చనిపోయిన పిమ్మట జారుని వలన పుట్టినవాడు, స్త్రీకి లొంగిపోయినవాడు, వేదమును అమ్ముకున్నవాడు, నటుడు, సాలివాడు, కృతఘ్నుడు, కమ్మరి, నిషాదుడు, బట్టలకు రంగులు వేయువాడు, కపట సన్యాసి, జారిణి, తిల ఘాతకుడు, ఆరూఢపతితుడు, శత్రువు-వీరి అన్నము తినగూడదు. బ్రాహ్మణునిచే నిమంత్రితుడు కానిచో బ్రాహ్మణాన్నము తినగూడదు. నిమంత్రి తుడైనను శూద్రాన్నము తినగూడదు. పైన చెప్పిన వారి అన్నమును తెలియకతిన్నచో మూడు దినములు ఉపవాసము చేయవలెను. తెలిసి తిన్నచో కృచ్ఛవ్రత మాచరించవలెను. వీర్యము, మలము, మూత్రము, చాండాలాన్నము, శ్వపచాన్నము తిన్నచో చాంద్రాయణ వ్రతము చేయవలెను. పది రోజులు దాటని ప్రేతకు ఇచ్చిన అన్నమును, ఆవు వాసన చూసిన అన్నమును, శూద్రోచ్చిష్టమును, శునకోచ్ఛిష్టమును, పతితుని అన్నమును తిన్నచో తప్తకృచ్ఛ వ్రతము చేయవలెను. అశౌచములో ఉన్నవారి అన్నము తిన్నవాడు అశుద్ధుడగును. అట్టి అన్నము తిన్నపుడు గూడ తప్తకృచ్ఛ వ్రతము చేయవలెను.
ఏదైన ఐదు గోళ్ల జంతువు మరణించిన కూపము నుండి, అపవిత్ర వస్తుసంబంధ మేర్పడిన కూపము నుండియు జలము త్రాగినచో ద్విజోత్తముడు మూడు దినములు ఉపవాసము చేయవలెను. పై పాపములు అన్నియు శూద్రుని విషయమున ఒక్క పాదమే అంటును. (ప్రాయశ్చిత్తములు గూడ అంతే), వైశ్య, క్షత్రియులకు రెండు పాదములు అంటును. గ్రామ్యవరాహము (ఊరపంది), గాడిద, ఒంటె, నక్క, కోతి, కాకి-వీటి మూత్ర పురీషములు తిన్న ద్విజుడు చాంద్రాయణము చేయవలెను. శుష్కమాంసమును, ప్రేతాన్న మును, కరకములను, మాంసము తిను అరణ్య మృగములు, సూకరములు, ఉష్ణము, నక్క, కోతి, కాకి, గోవు, నరుడు, అశ్వము, గాడిద-వీటి మాంసమును, ఛత్రాకమును, గ్రామ్య కుక్కుటమును, ఏనుగు మాంసమును తిన్నవాడు తప్త కృచ్ఛ మాచరించి విశుద్దు డగును. బ్రహ్మచారి ఆమశ్రాద్ధమున భుజించినను, మద్యము సేవించినను, తప్త కృచ్ఛము చేయవలెను. వెల్లుల్లి, గృంజనము అనగా విషముతిన్న పశువు యొక్క మాంసము తిన్నవాడు ప్రాజాపత్యాదులచే శుద్దుడగును. తన కొరకై మాంసము వండించుకొని తిన్నవాడు చాంద్రాయణ వ్రతము చేయవలెను. పీలుగవ్యము, జున్ను, శ్లేష్మాతకము, మట్టి, నిమిత్తము లేకుండ వండిన పులగము, సంయావము, పాయసము, అప్పములు, చేగోడీలు మొదలైన వాటిని, అసంస్కృతములు అగు మాంసములను, దేవాన్నములను, హవిస్సులను తిన్నవాడు పై విధముగ ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. ఆవులు, గేదెలు, మేకలు తప్ప ఇతర పశువుల పాలు వర్జ్యములు. పై పశువుల పాలు కూడ ఈనిన పది రోజుల లోపున నిషిద్ధము. చెవులపిల్లి, సల్లకి, ఉడుము, ఖడ్గ మృగము, కూర్మము అను ఐదు గోళ్లు గల జంతువులు భక్ష్యములు. ఇతర జంతువులు భక్ష్యములు కావు. పాఠీనములను (వేయి కోరికలచేప-కొఱ్ఱమీను), రోహిత (ఎఱ్ఱని) మత్స్యములను, సింహ తుండములను, భక్షించవచ్చును. అగ్ని హోత్రమునందు ప్రజ్వలింపచేయబడిన, అగ్నిగల బ్రాహ్మణుడు స్వేచ్ఛగా యవ గోధూమలతో చేసిన పదార్థములను, పాలతో చేసిన భక్ష్యములను, వాగషాంగవ చక్రాదులను, నూనె వస్తువులను, నిలువ ఉన్న దానిని తిన్నచో ఒక మాసము చాంద్రాయణము చేయవలెను. అది వీరవధతో సమానమైనది.
బ్రహ్మహత్య, సురాపానము, (సువర్ణ) చౌర్యము, గురుస్త్రీ సంగమము, ఇవి మహాపాతకములు. ఈ మహాపాతకములు చేసిన వారితో సంబంధము కూడ మహాపాతకము, అసత్యమును పెంపొం దించుట, రాజు విషయమున చాడీలు చెప్పుట, పూజ్యుని అనావశ్యకముగ నిర్బంధించుట-ఇవి బ్రహ్మహత్యతో సమానము. వేదమును పరిత్యజించుట, వేద నింద, కపట సాక్ష్యము, మిత్రుని చంపుట, నింద్యమైన అన్నమును ఆజ్యమును తినుట ఈ ఆరును సురాపాన సమానములు. దాచి ఉంచిన వస్తువును, నరులను, అశ్వములను, రజతములు అపహరించుట, భూమిని, వజ్రమును, మణిని హరించుట సువర్ణ స్తేయముతో సమానము. తోడబుట్టువులు, బాలికలు, అంత్యజాతుల స్త్రీలు, మిత్రుని స్త్రీలు, పుత్రుని స్త్రీలు, వీరియందు రేతః సేకము గురుపత్నీ గమనతుల్యము. గోవధ, యాగము చేయు అర్హతలేని వారిచే యాగము చేయించుట, పరస్త్రీ సంబంధము, తనను ఇతరులకు అమ్మి వేయుట, గురువును, తల్లిని, తండ్రిని విడచివేయుట, స్వాధ్యాయమును, అగ్నిని, పుత్రుని పరిత్యజించుట, పరివిత్తిత్వము (తమ్ముడు వివాహము చేసికొనగా తాను అవివాహితుడుగా ఉండుట). తమ్ముడు పరివేదనము చేయుట (అన్నకంటే ముందుగా వివాహము చేసికొనుట), అట్టివారికి కన్యను ఇచ్చుట, వారికి యాజకుడుగా నుండుట, కన్యను చెరచుట, వడ్డీతో జీవించుట, వ్రతమునకు విఘాతము కలిగించుట, తటాకమును, ఆరామమును, భార్యను సంతానమును విక్రయించుట, స్వధర్మపరిత్యాగము, బాంధవ త్యాగము, జీతమునకు వేదాధ్యయనము చేయించుట, జీతము తీసికొనువాని నుండి అధ్యయనము చేయుట, అమ్మకూడనివాటిని అమ్ముట, గనులపై అధికారము, పెద్ద యంత్రములను నడపుట, ఓషధులను హింసించుట, పై ఆధారపడి జీవించుట, కర్తవ్యమును దాటవేయుట, కట్టెల కొరకై సజీవములైన వృక్షములను ఛేదించుట, స్త్రీలను నిర్బం ధించుట, స్త్రీలను నిందించువారితో స్నేహము, స్వలాభము కొరకై పనులు ప్రారంభించుట, నిందితుల అన్నము తినుట, అగ్న్యాధానము చేయకుండుట, చౌర్యము, ఋణములు తీర్చకపోవుట, అసచ్ఛాస్త్రముల అభ్యాసము, దుష్టశీలము, ధాన్యమును, వెండి మొదలగు వాటిని పశువు లను అపహరించుట, మద్యమును త్రాగుస్త్రీని సేవించుట, స్త్రీని, శూద్రుని, వైశ్యుని, క్షత్రియుని చంపుట, నాస్తికత్వము ఇవి ఉపపాతకములు. బ్రాహ్మణునకు పీడ కల్గించుట, వాసన చూడదగని వాటిని, మద్యమును వాసన చూచుట, వక్రత్వము, పురుషునితో మైథునము-ఇవన్నియు జాతి భ్రష్టత్వమును కలిగించును. కుక్క, గాడిద, ఒంటె, సింహము, మేక, గొఱ్ఱె-వీటిని చంపుట, మీన, సర్ప, నకులములను చంపుట ఇది సంకీర్ణకరణమని చెప్పబడును. నిందింతుల నుండి ధనము స్వీకరించుట, వాణిజ్యము, శూద్రసేవ, అసత్య భాషణము ఇవి ‘అపాత్రీకరణము’. క్రిమి, కీట, పక్షులను చంపుట, మద్యము కలిసిన భోజనము, ఫలములను, పుష్పములను అపహరించుట, అధైర్యము-ఇవి పాపహేతువులు. (168)
