అగ్ని మహా పురాణము

Table of Contents

విదియా వ్రతములు

అగ్ని దేవుడు చెప్పెను:

నేను ఇపుడు భుక్తి ముక్తి ప్రదములగు ద్వితీయా వ్రతములను గూర్చి చెప్పెదను. ప్రతి మాసము నందును ద్వితీయ(విదియ)యందు పుష్పములు మాత్రము భుజించవలెను. అశ్వినీ దేవతలను పూజించవలెను. ఒక సంవత్సరము ఈ వ్రతమును అనుష్టించుటచేత సౌందర్యము, సౌభాగ్యము లభించును. అంతమున స్వర్గము లభించును. కార్తిక శుక్ల ద్వితీయయందు యముని పూజించవలెను. పిదప ఒక సంవత్సరము ప్రతి శుక్ల ద్వితీయ యందును ఉపవాస పూర్వకముగ వ్రతము ఆచరించవలెను. ఇట్లు చేయుటచే మానవుడు స్వర్గమునకు వెళ్ళును. నరకమునకు వెళ్ళడు. ఇప్పుడు అశూన్యశయన వ్రతమును చెప్పెదను. ఇది స్త్రీలకు అవైధవ్యమును, పురుషులకు సర్వదా భార్యా సుఖమును ఇచ్చును. శ్రావణ కృష్ణ పక్ష ద్వితీయయందు ఈ వ్రతమును అనుష్ఠించవలెను. ‘వక్షః స్థలమునందు శ్రీవత్సమును ధరించిన ఓ శ్రీకాన్తా! నీవు లక్ష్మీ నివాస భూతుడవు. లక్ష్మీపతివి. వినాశన రహితుడవగు సనాతన పరమేశ్వరుడవు. ధర్మార్థకామములకు నిలయమగు నా గార్హస్థ్యము నీ కృపచే సుస్థిరముగా నుండుగాక. నా గృహమునందలి అగ్ని ఎన్నటికిని చల్లారకుండు గాక! గృహ దేవత ఎన్నడును అదృశ్యురాలు కాకుండుగాక. నా పితరులకు నాశము కలుగకుండుగాక! నా దాంపత్యము విహతము కాకుండుగాక! నీకు ఏ విధముగ ఎన్నడును లక్ష్మీ వియోగము కలుగదో అట్లే నాకును పత్నీవియోగ మెన్నడును కలుగ కుండుగాక. వరదాతవైన ఓ ప్రభూ! నీ శయనము ఏ విధముగ లక్ష్మీ విహీనము కాదో అదే విధముగ నాశయ్య కూడ పత్నీ విహీనము కాకుండు గాక’- అని ఈ విధముగ శ్రీమహావిష్ణువును ప్రార్థించి, వ్రతము ప్రారంభించి, ఒక్క సంవత్సరము వరకును ప్రతిమాసమునందును, ద్వితీయయందు లక్ష్మీ విష్ణువులను యథావిధిగా పూజించవలెను. శయ్యాదానము, ఫలదానము చేయవలెను. ప్రతి మాసమునందును అదే తిథియందు చంద్రునకు మంత్రోచ్చారణ పూర్వకముగా అర్ఘ్య ప్రదానము చేయవలెను. ‘భగవంతుడవైన చంద్రా! నీవు గగన ప్రాంగణమును దీపింపచేయువాడవు. క్షీరసాగరమును మథించుటచే నీవు ఆవిర్భవించితివి. నీవు నీ కాంతిచే సకల దిఙ్మండలమును ప్రకాశింప చేయుచున్నావు. ఓ లక్ష్మీదేవి తమ్ముడా! నీకు నమస్కారము’ అని ఆ మంత్రమునకు అర్థము. ‘ఓం శ్రీం శ్రీధరాయ నమః’ అను మంత్రముతో సోమరూపుడగు శ్రీహరిని పూజించవలెను. ‘ఘం టం హం సం శ్రియై నమః’ అను మంత్రముతో లక్ష్మీదేవిని, ‘దశ రూప మహాత్మనే నమః’ అను మంత్రముతో శ్రీ మహావిష్ణువును పూజించవలెను. రాత్రి ఆజ్యహోమముచేసి బ్రాహ్మణునకు శయ్యాదానము చేయవలెను. దానితో దీపము, అన్నముతో నింపిన పాత్ర, ఛత్రము, పాదుకలు, ఆసనము, జలపూర్ణ కలశము శ్రీహరి ప్రతిమ, పాత్రకూడ బ్రాహ్మణునకు దానము చేయవలెను. ఈ విధముగా వ్రతపాలనము చేసినవాడు భోగ మోక్షములకు అర్హుడగును. ఇపుడు కాంతి వ్రతమును వర్ణించెదను. కార్తిక శుక్ల ద్వితీయయందు దీనిని ప్రారంభించవలెను. పగలు ఉపవాసముచేసి, రాత్రి భోజనము చేయవలెను. ఈ వ్రతమునందు శ్రీకృష్ణ బలరాములను పూజించవలెను. ఈ విధముగ ఒక సంవత్సరము వ్రతము చేసినవాడు కాంతి, ఆయుర్దాయము, ఆరోగ్యము మొదలగువాటిని పొందును.

ఇపుడు మనోవాంఛితములను ఇచ్చు విష్ణు వ్రతమును వర్ణించెదను. పుష్య శుక్ల ద్వితీయనాడు ప్రారంభించి వ్రతము నాలుగు దినములు చేయబడును. మొదటి దినమున ఆవాలు కలిపిన జలముతో స్నానము చేయవలెను. రెండవ దినమున తిలలు కలిపిన జలముతోను, మూడవ దినమున వచ అను ఓషధి కలిపిన జలముతోను, నాల్గవ దివసమున సర్వౌషధి మిశ్ర జలముతోను స్నానము చేయవలెను. సురామాంసి, వచ, కుష్టము, శైలేయము, రెండురకముల పసుపు, శటి, చంపకము, ముస్తము, అను ఓషధుల సముదాయమునకు సర్వౌషదులని పేరు. మొదటి దివసమున ‘శ్రీకృష్ణాయ నమః’, రెండవ దివసమున ‘అచ్యుతాయ నమః’ మూడవ దివసమున ‘అనన్తాయ నమః’ నాల్గవ దివసమున ‘హృషీకేశాయ నమః’ అను నామ మంత్రములతో వరుసగా భగవంతుని చరణ, నాభి, నేత్ర, శిరస్సులందు పుష్పములు సమర్పించుచు పూజచేయవలెను. ప్రతిదినము ప్రదోష సమయమునందు చంద్రునకు అర్ఘ ప్రదానము చేయవలెను. నాలుగు దినములందును వరుసగా శశినే నమః’, ‘చంద్రాయ నమః’, ‘శశాఙ్కాయ నమః’, ‘ఇన్దవే నమః’ అను మంత్రములతో అర్ఘ్య ప్రదానము చేయవలెను. రాత్రి చంద్రుడు కనబడునంత కాలము లోపల భోజనము చేయవలెను. ఈ విధముగ ఆరు మాసములు లేదా ఒక సంవత్సరము ఈ వ్రత మాచరించినవాడు సంపూర్ణ వాంఛితములను పొందును. పూర్వ కాలమున రాజులు, స్త్రీలు, దేవతలు కూడ ఈ వ్రతమాచరించిరి. (177)