అగ్ని మహా పురాణము

Table of Contents

గాయత్రీ మంత్రార్థము - 1

అగ్నిదేవుడు చెప్పెను:

ఈ విధముగ సంధ్యావందనము ఆచరించి గాయత్రీ ధ్యాన జపములు చేయవలెను. తనను గానము చేయు సాధకుని శరీర ప్రాణములను రక్షించునది గాన ‘గాయత్రి’ అను పేరు వచ్చినది. అది సవిత (సూర్యుడు) నుండి ఆవిర్భవించినది గాన ‘సావిత్రి’ యైనది. వాక్స్వరూప మగుటచే ‘సరస్వతి’ అని ప్రసిద్ధి కూడ వచ్చినది. ‘తత్’ అనగా జ్యోతిః స్వరూపమగు పరబ్రహ్మ. ‘భర్గః’ అనగా తేజస్సు. దీప్తి అను అర్థముగల ‘భా’ ధాతువునుండి ‘భర్గః’ శబ్దము నిష్పన్నమైనది. ‘భాతీతిభర్గః అని దీని వ్యుత్పత్త్యర్థము. లేదా ‘భ్రస్జ-పాకే’ అనుపాకము చేయుట అను అర్థముకల భ్రస్జధాతువు నుండి కూడ ‘భర్గః’ శబ్దము నిష్పన్నమగును. ఏలనన సూర్యుడు ఓషధ్యాదులను పక్వము చేయునుగదా? ‘బ్రాజృ’ అను ధాతువునకు కూడ ప్రకాశించుట అని అర్థము. కావున ‘భ్రాజతే ఇతిభర్గః’ అను వ్యుత్పత్తిని అనుసరించి బ్రాజధాతువు నుండి గూడ ‘భర్గః’ శబ్దము నిష్పన్నమగును. ‘బహులం ఛన్దసి’ అను వ్యాకరణ సూత్రానుసారము ఈ పదము పైన చెప్పిన ఏ ధాతువు నుండియైనను నిష్పన్నము కావచ్చును. ‘వరేణ్య’ శబ్దమునకు ‘సంపూర్ణ తేజస్సుతో శ్రేష్ఠమైన పరమపద స్వరూపము’ అని అర్థము. లేదా స్వర్గ మోక్షములను కోరువారిచే సర్వధా వరింపబడుటచే ‘వరేణ్యము’. ‘వృఞ్’ ధాతువునకు వరించుట అని అర్థము. ‘ధీమహి’ అను పదమునకు-‘జాగ్రత్స్వప్న సుషుప్త్యా ద్యవస్థాతీము, నిత్యము, శుద్ధము, బుద్ధము, ఏకమాత్రము, సత్యము, జ్యోతిః స్వరూపము అగు పరబ్రహ్మను ముక్తికొరకై ధ్యానించుచున్నాము’ అని అర్థము. జగత్సృష్ట్యాది కారణభూతుడగు శ్రీమహావిష్ణువే అపరజ్యోతి. అపరజ్యోతి శివుడని కొందరు, శక్తి అని కొందరు, సూర్యుడని కొందరు, అగ్నియని వేదజ్ఞులైన అగ్నిహోత్రులు చెప్పుదురు. వాస్తవమున అగ్న్యాది రూపమున నున్న విష్ణువే వేద వేదాంగములందు బ్రహ్మయని చెప్పబడినాడు. అందుచే ‘దేవస్య సవితుః’ అనగా జగదుత్పాదకుడగు శ్రీమహావిష్ణువే. అతడే పరమపదము. స్వయంజ్యోతిః స్వరూపుడగు శ్రీమహావిష్ణువు మహత్తత్వాదికములను సృష్టించుచున్నాడు. పర్జన్య, వాయువు, ఆదిత్యుల ద్వారా, శీతగ్రీష్మాది ఋతువుల ద్వారా అన్నము పోషించుచున్నాడు. యథావిధిగ అగ్నిలో సమర్పింపబడిన ఆహుతి సూర్యునివలన వర్షము, వర్షము వలన అన్నము కలుగును. అన్నము వలన ప్రజలు ఉత్పన్నులగుదురు. ‘ధీమహి’ అను పదము ‘డు-ధాఞ్’ అను ధాతువునుండి కూడ నిష్పన్నమగును. అందుచే ‘మేము ఆ తేజస్సును మనస్సుతో ధారణ చేయుచున్నాము’ అని కూడ అర్థము చెప్పవచ్చును. యః=పరమాత్ముడైన యే విష్ణువు యొక్క తేజము, నః=మనల అందరి యొక్క ధియః = బుద్ధివృత్తులను, ప్రచోదయాత్ ప్రేరేపించునో, కర్మ ఫలములను అనుభవించు సకల ప్రాణుల ప్రత్యక్ష-అప్రత్యక్ష పరిణామ హేతువులగు సమస్త కర్మలందును విష్ణు, సూర్య, అగ్నిరూపమున ఉన్నాడు. ఈశ్వర ప్రేరణానుసారమే ప్రాణులు శుభాశుభ కర్మలనుచేసి స్వర్గ నరకములకు పోవుచున్నారు. మహత్తత్వాది రూపములతో శ్రీమహావిష్ణువుచే నిర్మితమగు ఈ జగత్తు అంతయు ఈశ్వరుని నివాసస్థానము. సర్వసమర్థుడు, హంస స్వరూపుడగు ఆ పరమ పురుషుడు స్వర్గాది లోకముల క్రీడించుచుండును గాన ‘దేవుడు’ అని చెప్పబడుచున్నాడు. భర్గమను పేరుతో ప్రసిద్ధమైన ఆదిత్యగతమగు దివ్యతేజమే ఆతని స్వరూపము. మోక్షము కోరువారు జన్మ మరణముల నుండియు, ఆధ్యాత్మిక-ఆధిదైవిక-ఆధిభౌతికములను త్రివిధ దుఃఖముల నుండియు విముక్తి పొందుటకై ధ్యానముచే, సూర్య మండలము నందున్న ఈ పరమ పురుషునే చూడవలెను. ‘తత్త్వమసి’ మొదలగు మహావాక్యములచే ప్రతిపాదింప బడిన సచ్చిత్సరూప పరబ్రహ్మము. అదియే సర్వలోక నిర్మాతయైన సచితృ దేవుని సర్వవరణీయమైన భర్గమే శ్రీమహావిష్ణుపదము. అదియే గాయత్రి యొక్క బ్రహ్మ రూపమగు చతుర్థపాదము. ‘జాత్రదవస్థకు సంబంధించిన దేహాది బ్రహ్మ పర్యంతము నేనే’ అని ధ్యానింతుము. ఆదిత్యునిలో ఉన్న పరమ పురుషుడు నేనే. అనంత రూపమగు ఓంకారము నేనే. ఈ ఆదిత్య పురుషుడే జ్ఞానములను శుభకర్మాదులను సర్వదా ప్రవర్తింప చేయుచున్నాడు. (216)