అగ్ని మహా పురాణము

Table of Contents

గజశాంతి కథనము

శాలిహోత్రుడు చెప్పెను: గజ రోగములను తొలగించు గజ శాంతిని చెప్పెదను. పంచమి తిథి యందు విష్ణు, లక్ష్మీ, ఐరావతములను, బ్రహ్మ, శంకర, ఇంద్ర, కుబేర, యములను, చంద్ర సూర్యులను, వరుణుని, వాయు, అగ్ని, పృథివీ, ఆకాశములను, ఆదిశేషుని, శైలములను, దేవయోనులగు విరూపాక్ష, మహాపద్మ, భద్ర, సుమనస్, కుముద, ఐరావత పద్మ, పుష్పదంత, వామన, అంజనములను గజములను అష్టదిగ్గజములను పూజించి హోమములు చేసి దక్షిణలు ఇవ్వవలెను. శాంతి కలశ జలముతో గజాభిషేకము చేయించినచో అవి వృద్ధి పొందును. ఇపుడు నైమిత్తిక శాంతిని వినుము. మకరాది సంక్రాంతులయందు నగర బహిర్భాగమున ఈశాన్యమున ఏనుగులను పూజించవలెను. స్థండిలమున పద్మ మధ్యమున విష్ణువును లక్ష్మిని, పిదప అష్ట దళములందు క్రమముగా బ్రహ్మ, సూర్య, పృథివీ, స్కంద, అనంత, ఆకాశ, శివ, చంద్రులను పూజించవలెను. పూర్వాది క్రమమున ఇంద్రాది దిక్పాలకులను పూజించవలెను. వారి ఆయుధములగు వజ్రశక్తి, దండతోమర, పాశ, గదా, శూల, పద్మాదులను పూజించవలయును. దళముల బాహ్యభాగమున చక్రమునందు సూర్యుని, అశ్వినీ దేవతలను పూజించవలయును. దక్షిణమున అష్టవసువులను సాధ్యదేవతలను నైఋతమున భార్గవాంగిరస దేవతలను వాయువ్యమున మరుద్గణములను, దక్షిణమున విశ్వేదేవతలను, ఈశాన్యమున రుద్రులను పూజించ వలయును. వృత్త రేఖా నిర్మితమగు అష్టదళ కమలమునకు బహిర్భాగమున సూత్రకారులగు ఋషులను, సరస్వతిని, పూర్వభాగమున నదీ పర్వతములను ఈశాన్యాదుల యందు పంచమహా భూతములను పూజించవలయును. పిమ్మట పద్మ చక్ర గదా శంఖములతో ప్రకాశించు చతుష్కోణము చతుర్ద్వారమగు మండలము నిర్మించి, ఆగ్నేయాదులందు కలశస్థాపనకూడ చేసి నాలుగు ప్రక్కలందును పతాకా తోరణములను ఏర్పరచవలయును. అన్యద్వారములందు ఐరావతాది నాగరాజులను పూజించవలెను. పూర్వాది దిక్కులందు దేవతలకు వేరు వేరుగా ఓషధీ యుక్తములగు పాత్ర నుంచవలెను. గజములను పూజించి ప్రదక్షిణము చేయవలయును. దేవతలు అందరికిని నూరు చొప్పున హోమములు చేయవలయును. పిమ్మట గజరాజ అగ్ని దేవతలతో బయలుదేరి వాద్యములను మ్రోగించుచు ఇంటికి తిరిగి వెళ్ళవలయును. బ్రాహ్మణులకును గజ చికిత్సకాదులకును దక్షిణలు ఇవ్వవలెను. పిదప కాలజ్ఞుడగు పురుషుడు గజరాజు నధిరోహించి దాని చెవిలో ‘ఓ గజరాజమా! మహారాజు నిన్ను శ్రీగజ పదమునందు నియమించినాడు. నీవు గజశ్రేష్ఠుడవు. ఈ రాజులు నేటినుండి గంధమాల్య ఉత్తమ అక్షతాదులతో నిన్ను పూజింతురు. అతని ఆజ్ఞచే ప్రజలుకూడ సర్వదా నిన్ను పూజింతురు. నీవు యుద్ధభూమి యందును, మార్గమునందును గృహమునందును సర్వదా మహారాజును రక్షించవలయును. ఓ నాగరాజ! తిర్యగ్భావమును విడిచి నీ దివ్యత్వమును స్మరించుము. పూర్వము దేవాసుర సంగ్రామమునందు ఐరావత పుత్రుడగు అరిష్ట నాగమునకు శ్రీగజము అను పదమును దేవతలు ఇచ్చిరి. ఆ శ్రీగజము తేజస్సు అంతయు నీ శరీరమున ప్రతిష్టితమైయున్నది. ఓ గజేంద్రమా! నీకు కళ్యాణమగుగాక! నీ లోపల నున్న దివ్య భావ సంపన్నమగు తేజస్సు ఉద్బుద్దమగుగాక! నీవు రణాంగణమున రాజును రక్షించు చుండుము. ఆ గజరాజము మరల మరణించినచో శాంతిచేసి మరొక గజ కర్ణములో పై మంత్రమును జపించ వలయును. అభిషిక్తమగు గజరాజుపై శుభ ముహూర్తమున రాజు అధిరోహించవలయును. శస్త్ర ధారులగు వీర శ్రేష్ఠులు ఆతనిని అనుసరించవలెను. రాజు హస్తిశాలయందు నేలపై చిత్రించిన కమలము బయట దిక్పాలకులను పూజించ వలయును. కేసరముల స్థానమున మహాబలియగు నాగరాజమును భూదేవి సరస్వతులను, మధ్య భాగమున గంధ పుష్ప చందనములతో డిండిమమును పూజించి, హోమముచేసి రసపూర్ణమగు కలశను బ్రాహ్మణునకు దానముచేయవలయును. గజాధ్యక్షుని, గజ రక్షకుని, జ్యోతిష్కుని కూడ సత్కరించి ఆ డిండిమమును గజాధ్యక్షునికి ఇవ్వవలెను. ఆతడు దానిని మ్రోగించవలెను. అతడు దాని జఘనముపై కూర్చుండి, శుభగంభీర స్వరమున డిండిమ వాదనము చేయవలయును. (291)