అగ్ని మహా పురాణము

Table of Contents

పవిత్రారోపణ శ్రీధర నిత్యపూజా విధానము

అగ్నిదేవుడు పలికెను: మునీ ఇప్పుడు నేను పవిత్రారోపణమును గూర్చి చెప్పెదను. సంవత్సరము నందు ఒకమారు పవిత్రారోపణము చేసినచో, సంవత్సరము అంతయు శ్రీహరి పూజచేసిన ఫలమును ఇచ్చును. ఆషాఢ శుక్ల ఏకాదశి మొదలు కార్తీక శుక్ల ఏకాదశివరకు ఉన్న కాలమున పవిత్రారోపణము  చేయవలెను. ప్రతిపత్తు విడువవలెను. ప్రతిపత్తు అనగా పాడ్యమి తిథి ద్వితీయాది తిథులు క్రమముగ లక్ష్మాది దేవతల తిథులు. ద్వితీయ లక్ష్మికి, తృతీయ గౌరికి, చతుర్థి గణేశునికి, పంచమి సరస్వతికి, షష్టి కుమార స్వామికి, సప్తమి సూర్యునకు, అష్టమి మాతృ దేవతలకు, నవమి దుర్గకు, దశమి నాగులకు, ఏకాదశి ఋషులకు, ద్వాదశి విష్ణువునకు, త్రయోదశి మన్మథునకు, చతుర్దశి శివునకు, పౌర్ణమి అమావాస్యలు బ్రహ్మకు సంబంధించినవి. ఏ ఉపాసకుడు ఏ దేవతలను ఉపాసించునో ఆతనికి ఆ దేవత యొక్క తిథి పవిత్రమైనది.

పవిత్రారోపణ విధి అందరు దేవతలకును సమానమే. మంత్రాదులు మాత్రమే ఆయా దేవతలకు వేరువేరుగా ఉండును. పవిత్రకమును నిర్మించుటకై బంగారము, వెండి, రాగి తీగలనుకానినూలు దారమునుగాని ఉపయోగింపవలెను.

బ్రాహ్మణ్య స్తీచేతితో వడికిన నూలు చాలశ్రేష్ఠమైనది. అది లభించనిచో ఏ దారము నైనను గ్రహించి, దానిని సంస్కరించి ఉపయోగింపవలెను. దారమును మూడు పేటలుచేసి, మరల దానిని మూడు పేటలుచేసి, దానితో పవిత్రకమును నిర్మింపవలెను. సూట ఎనిమిది మొదలు అధికములగు తంతువులతో నిర్మించిన పవిత్రకము ఉత్తమాది శ్రేణికి చెందినదిగ పరిగణింప బడుచున్నది. పవిత్రారోపణమునకు ముందు ఇష్టదేవతను గూర్చి ఈ విధముగ ప్రార్థింపవలెను. “ప్రభూ! క్రియా లోపమువలన కలిగిన దోషమును తొలగించుటకై నీవు ఏ సాధనమును చెప్పినావో దానినే నేను చేయుచున్నాను. ఎక్కడ ఏ పవిత్రకము ఆవశ్యకమో అక్కడ అట్టి పవిత్రకమునే అర్పించగలను. నీ కృపచే ఈ కార్యమునందు విఘ్న బాధలేవియు కలుగకుండుగాక. అవినాశియైన పరమేశ్వరా! నీకు జయమగుగాక.

ఈ విధముగ ప్రార్థించు పవిత్రకమును ఇష్టదేవతా మండలమునకు గాయత్రీ మంత్రముతో కట్టవలెను. “ఓం నమో నారాయణాయ విద్మహే, వాసుదేవాయ ధీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్” అనునది ఇష్టదేవతయగు నారాయణుని గాయత్రీ మంత్రము. ఈ గాయత్రీ ఇష్టదేవతా నామానుసారముగ ఉండును. దేవప్రతిమలపై అర్పించుటకు అనేక విధములగు పవిత్రకములు ఉండును. విగ్రహము యొక్క నాభివరకు వచ్చునది ఒకటి; తొడలవరకు వచ్చునది మరియొకటి; మోకాళ్ళ వరకు వచ్చునది మరియొకటి; పాదముల వరకు వ్రేలాడునది ఒకటి. చివరిదానికి వనమాల అనిపేరు. దానిని ఒక వెయ్యి ఎనిమిది దారములతో నిర్మింపవలెను. సాధారణ మాలను శక్త్యానుసారము నిర్మింపవలెను. లేదా అది పదునారు అంగుళములకంటె రెట్టింపు పెద్దదిగా ఉండవలెను. కర్ణికా, కేసర, దళారులుగల యంత్ర, చక్రాది మండలములపై వేయు పవిత్రకముపై నుండి క్రింది వరకును కప్పునదిగా ఉండవలెను. ఒక చక్రము, ఒక కమలము ఉన్న మండలము పై ఆ మండలము ఎన్ని అంగుళములు ఉన్నదో అన్ని అంగుళముల పవిత్రకము అర్పింప వలెను. వేదిపై అర్పించు పవిత్రకము తన చేతి అంగుళములతో ముప్పది ఏడు అంగుళముల పొడవు ఉండవలెను.

ఆచార్యుని కొరకును, తల్లిదండ్రుల కొరకును, పుస్తకముపై ఉంచుట కొరకును నిర్మింపబడు పవిత్రకము నాభి ప్రదేశము వరకును వ్రేలాడవలెను. దీనికి పండ్రెండు ముడులు ఉండవలెను. దానిపై నుంచి గంధము పూయవలెను. వనమాలయందు రెండేసి అంగుళముల దూరమున క్రమముగా నూట ఎనిమిది ముడులు వేయవలెను. లేదా కనిష్ఠ, మధ్యమ, ఉత్తమ పత్రకములపై క్రమముగా పండ్రెండు, ఇరువదినాలుగు, ముప్పది ఆరు ముడులు వేయవలెను. మంద, మధ్యమ, ఉత్తమ మాలార్థులగు పురుషులు అనామికా, మధ్యమా, అంగుష్ఠముల చేతనే పవిత్రకములను గ్రహింపవలెను. లేదా కనిష్ఠకాది నామధేయములుగల పవిత్రకములందు అన్నింటియందును పండ్రెండేసి ముడులే ఉండవలెను. (తంతువుల సంఖ్యను బట్టియు, పొడవునుబట్టియు ఈ కనిష్టికాది నామధేయములు ఏర్పడినవి). సూర్యునకు, కలశమునకు, అగ్నిమొదలగు వాటికినిగూడ యథా సంభవముగ భగవంతుడగు విష్ణువునకువలెనే పవిత్రకములను అర్పించుట ఉత్తమమని చెప్పబడినది. పీఠము కొరకు దాని పొడవును బట్టియు, కుండమునకు దాని మేఖల పర్యంతమును పొడవుగల పవిత్రకము ఉండవలెను. విష్ణు పార్షదులకు యథాశక్తిగ సూత్ర గ్రంథులను సమర్పింపవలెను. లేదా గ్రంథులు లేకుండ పదునేడు సూత్రములు సమర్పింపవలెను. భద్రుడను పార్షదునకు త్రిసూత్రము సమర్పింపవలెను.

పవిత్రకమును గోరోచనముతోను, అగురు కర్పూరములు కలిపిన పసుపుతోను, కుంకుమ రంగుతోను పూయవలెను. భక్తుడు ఏకాదశీ దివసమున స్నాన సంధ్యాదులు చేసి, పూజాగృహము ప్రవేశించి, భగవంతుడగు శ్రీహరిని పూజింపవలెను. విష్ణువు యొక్క సమస్త పరివారమునకును బలి సమర్పించి విష్ణువును పూజించవలెను. ద్వారముయొక్క అంతమునందు “క్షం క్షేత్ర పాలాయ నమః” అని చెప్పి క్షేత్రపాల పూజచేయవలెను. ద్వారము పైభాగమున “శ్రియై నమః” అని చెప్పుచు శ్రీదేవిని పూజించవలెను. ద్వారదక్షిణ (కుడి) దేశమున “ధాత్రే నమః “గంగాయై నమః” అను మంత్రములు ఉచ్చరించుచు, ధాతను, గంగను పూజింపవలెను. ఎడమ వైపున “విధాత్రే నమః” “యమునాయై నమః” అని చెప్పుచు విధాతను, యమునను పూజింపవలెను. ఇదేవిధముగ ద్వారము యొక్క కుడి, ఎడమ ప్రదేశములందు క్రమముగ “శఙ్ఖ నిధయే నమః” “పద్మనిధయే నమః” అని చెప్పుచు శంఖపద్మ నిధులను పూజింపవలెను. (పిదప మండపము లోపల కుడి పాదము మణవను మూడు మార్లు కొట్టి విఘ్నములను పారద్రోలవలెను). పిమ్మట “సారఙ్గాయ నమః” అని అనుచు విఘ్న కారకములగు భూతములను పారద్రోలవలెను. (పిమ్మట “ఓం హాం వాస్త్వధిపతయే బ్రహ్మణే నమః” అను మంత్రమును ఉచ్చరించుచు బ్రహ్మయొక్క స్థానమున పుష్పము లుంచవలెను). పిదప ఆసనముపై కూర్చుండి భూతశుద్ది చేయవలెను.

“ఓం హ్రూం హః ఫట్ హ్రూం గన్దతన్మాత్రం సంహరామి నమః

ఓం హ్రూం హః ఫట్ హ్రూం రసతన్మాత్రం సంహరామి నమః

ఓం హ్రూం హః ఫట్ హ్రూం రూపతన్మాత్రం సంహరామి నమః

ఓం హ్రూం హః ఫట్ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః

ఓం హ్రూం హః ఫట్ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః”

అను ఐదు ఉద్ఘాత వాక్యములను ఉచ్చరించుచు గంధ తన్మాత్ర స్వరూపమగు భూమండలమును, వజ్రచిహ్నితము, సువర్ణమయము, చతురస్రము (నలుపలకలు గలది) పీఠమును, ఇంద్రాది దేవతలను తన పాదములు మధ్య నున్నట్లు చూచుచు వాటి భావన చేయవలెను. ఈ విధముగ శుద్ధమగు గంధతన్మాత్రను రసతన్మాత్రయందు లీనము చేసి ఉపాసకుడు అదే క్రమమున రసతన్మాత్రను రూపతన్మాత్ర యందు లీనము చేయవలెను.

ఓం హ్రీం హః ఫట్ హ్రూం రస తన్మాత్రం సంహరామి నమః

ఓం హ్రీం హః ఫట్ హ్రూం రూప తన్మాత్రం సంహరామి నమః

ఓం హ్రీం హః ఫట్ హూం స్పర్శ తన్మాత్రం సంహరామి నమః

ఓం హ్రీం హః ఫట్ హ్రూం శబ్ద తన్మాత్రం సంహరామి నమః

అను నాలుగు ఉద్ఘాత వాక్యములను ఉచ్చరించుచు మోకాళ్లు మొదలు నాభి వరకును ఉన్న శరీరభాగమును శ్వేతకములచే చిహ్నితమైన దానిగాను, శుక్లవర్ణమైన దానినిగాను, అర్ధచంద్రాకారము కలదానిగాను చూడవలెను. ఈ జపీయ భాగమునకు వరుణుడు దేవత అని భావన చేయవలెను. పై నాలుగు ఉద్ఘాత వాక్యములను ఉచ్చరించుటచే రస తన్మాత్రము శుద్ధమగును. ఈ రసతన్మాత్రను రూపతన్మాత్రయందు లీనము చేయవలెను.

“ఓం హ్రూం హః ఫట్ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః

ఓం హ్రూం హః ఫట్ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః

ఓం హ్రూం హః ఫట్ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః

అను మూడు ఉద్ఘాత వాక్యములను ఉచ్చరించుచు నాభిమొదలు కంఠము వరకును ఉన్న భాగమునందు త్రికోణాకారాగ్ని మండలమును భావింపవలెను. దాని రంగు ఎరుపు. అదీ స్వస్తిక ఆకారముచే చిహ్నితమైనది. దాని అధి దేవత అగ్ని. ఈ విధముగా శుద్ధము చేయబడిన రూప తన్మాత్రను స్పర్శ తన్మాత్ర యందు లీనము చేయవలెను.

ఓం హ్రీం హః ఫట్ హ్రూం స్పర్శతన్మాత్రం సంహరామి నమః

ఓం హ్రీం హః ఫట్ హ్రూం శబ్ద తన్మాత్రం సంహరామి నమః

పిమ్మట ఓం హ్రీం హః ఫట్ హ్రూం స్పర్శ తన్మాత్రం సంహరామి నమః

ఓం హ్రీం హః ఫట్ హ్రూం శబ్ద తన్మాత్రం సంహరామి నమః

అను రెండు ఉద్ఘాత వాక్యములను ఉచ్చరించుచు కంఠము మొదలు నాసికా మధ్య వరకును ఉన్న భాగమునందు గోళాకార వాయుమండలమును భావన చేయవలెను. దాని రంగు ధూమమువలె నుండును. అది నిష్కలంక చంద్రునిచే చిహ్నితమైనది. స్పర్శ తన్మాత్రమును ధ్యానముచే శబ్దతన్మాత్ర యందు లీనము చేయవలెను. పిమ్మట “ఓం హ్రీం హః ఫట్ హ్రూం శబ్దతన్మాత్రం సంహరామి నమః” అను ఒక ఉద్ఘాత వాక్యమును ఉచ్చరించుచు శుద్ధ స్పటికముతో సమానమైన ఆకాశమును, నాసిక నుండి శిఖవరకును ఉన్న శరీర భాగముపై భావనచేయవలెను. ఆ శుద్ధాకాశమును (అహంకారమునందు) ఉపసంహరింపవలెను.

పిమ్మట శోషణాదుల ద్వారా దేహశుద్ధి చేసుకొనవలెను. పాదమునుంచి శిఖ వరకును దేహము ‘యం’ అను వాయు బీజముచే ఎండిపోయినట్లు భావన చేయవలెను. పిమ్మట ‘రం’ అను బీజము ద్వారా అగ్నిని ప్రకటించి సమస్త శరీరము అగ్ని జ్వాలలచే దగ్ధమై భస్మమైనట్లు భావన చేయవలెను. పిమ్మట ‘వం’ బిందువును ఉచ్చరించుచు బ్రహ్మ రంధ్రము నుండి అమృత బిందువు ఆవిర్భవించినట్లు భావన చేయవలెను. దాని నుండి ప్రవహించిన అమృత ధారచే శరీరమునంతను ముంచెత్తి వేయవలెను. పిమ్మట ‘లం’ అను బీజమును ఉచ్చరించుచు ఆ భస్మము నుండి దివ్యదేహము ఆవిర్భవించినట్లు భావన చేయవలెను. ఈ విధముగ దివ్యదేహ భావనచేసి అంగన్యాస కరన్యాసములు చేయవలెను. పిమ్మట మానసయాగాను ష్ఠానము చేయవలెను. హృదయ కమలముపై అంగ దేవతా సహితుడగు మహావిష్ణువును నిలిపి, మానసిక పుష్పాద్యుపచారములు చేయుచు, మూలమంత్రములు ఉచ్చరించుచు పూజింపవలెను. ఆ భగవంతుడు భోగమోక్షముల నిచ్చువాడు. మానసిక పూజలను స్వీకరింపుమని భగవంతుని ఈ విధముగ ప్రార్థింపవలెను. “దేవా! దేవాధిదేవా! కేశవా! నీకు స్వాగతము. నా సమీపమున సన్నిహితుడవై నేను అర్పించు మానసికపూజను గైకొనుము.” పీఠము మధ్యభాగమునందు, యోగపీఠమును ధరించు ఆధారశక్తియైన కూర్మమును, అనంతుని, పృథివిని పూజింపవలెను. ఆగ్నేయ కోణము మొదలగు నాలుగు కోణములందును క్రమముగ ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యములను పూజింపవలెను. తూర్పు మొదలగు ప్రధానదిక్కులందు అధర్మ, అజ్ఞాన, అవైరాగ్య, అనైశ్వర్యములను పూజింపవలెను. పీఠమధ్యము నందు సత్త్వాది గుణత్రయమును, కమలమును, మాయను, అవిద్యను, కాలతత్త్వమును, సూర్యాది మండలములను, పక్షిరాజైన గరుత్మంతుని పూజింప వలెను. పీఠము వాయవ్య కోణము నుండి ఈశాన్య కోణము వరకు గురుపంక్తిని పూజింపవలెను.

గణములు, సరస్వతి, నారదుడు, నలకూబరుడు, గురువు, గురుపాదుక, పరమ గురువు, అతని పాదుక వీటి పూజయే గురు పంక్తి పూజ, పూర్వ సిద్ధ, పరసిద్ధ శక్తులను కేసరములపై పూజింపవలెను. లక్ష్మి, సరస్వతి, ప్రీతి, కీర్తి, శాంతి, కాంతి, పుష్ట; తుష్టి, వీరు పూర్వ సిద్ధశక్తులు, పూర్వాది దిక్కులలో క్రమముగ ఈ శక్తుల పూజ చేయవలెను. ఇంద్రాది దిక్పాలకులనుగూడ వారి వారి దిక్కులందు పూజింపవలెను. వీరందరి మధ్యయందు శ్రీహరి విరాజిల్లుచుండును. ధృతి, శ్రీ, రతి, కాంత్యాదులు పరసిద్ధశక్తులు, మూల మంత్రముచే అచ్యుతుని స్థాపింపవలెను. పూజా ప్రారంభమున “ఓం అభిముఖో భవ” పూర్వ దిక్కున నా సమీపమున ఉండుము అని భగవంతుని ప్రార్థింపవలెను. ఈ విధముగ ప్రార్థించి స్థాపించిన పిమ్మట అర్ఘ్యపాద్యాదులను సమర్పించి, గంధాద్యుప చారముల ద్వారా మూల మంత్రముతో అచ్యుతుని పూజింపవలెను. “భీషయ భీషయ హృదయాయ నమః” “ఓం త్రాసయ త్రాసయ శిరసే నమః” “ఓం మహీయ మర్దయ శిఖాయై నమః” ‘ఓం రక్ష రక్ష నేత్ర త్రయాయ నమః’ ‘ఓం ప్రధ్వంసయ ప్రధ్వంసయ కవచాయ నమః” “ఓం హూం ఫట్ అస్త్రాయ నమః” ఈ విధముగ ఆగ్నేయాది విదిశల యందు క్రమముగా, మూల బీజములతో అంగముల పూజచేయవలెను. తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము ఈ దిక్కులందు మూర్త్యాత్మక ఆవరణముల పూజ చేయవలెను.

వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని నాలుగు మూర్తులు. ఆగ్నేయాది విదిశలయందు క్రమముగ శ్రీ, రతి, ధృతి, కాంతులను పూజింపవలెను. వీరు కూడ శ్రీహరి మూర్తులే. అగ్న్యాది కోణములందు క్రమముగ శంఖ, చక్ర, గదా, పద్మములను పూజింపవలెను. తూర్పు మొదలైన దిక్కులందు శార్ఙ్గ, ముసల, ఖడ్గ, వనమాలలను పూజించవలెను. వాటి వెలుపల తూర్పు మొదలగు దిక్కులందు క్రమముగ ఇంద్ర, అగ్ని, యమ, నిరృతి, వరుణ, వాయు, కుబేర, ఈశానులను పూజించి నైరృతి పశ్చిమ దిక్కుల మధ్య అనంతుని, తూర్పు-ఈశాన్య దిక్కుల మధ్య బ్రహ్మను పూజించవలెను. వీటి బైట వజ్రము మొదలగు అస్త్రమయ ఆవరణములను పూజించవలెను. వీటి బైట దిక్పాలకుల వాహన రూపములగు ఆవరణములను పూజింపవలెను. తూర్పు మొదలగు దిక్కులందు క్రమముగ ఐరావతమును, మేకను, దున్నపోతును, వానరుని, మత్స్యమును, మృగమును, చెవులపిల్లిని, వృషభమును, కూర్మమును, హంసను పూజింపవలెను. వీటి బయట పృశ్నిగర్భుడు, కుముదుడు మొదలగు ద్వారపాలును పూజింపవలెను. తూర్పు మొదలు ఉత్తరము వరకు, అన్ని దిక్కులందును ఇద్దరిద్దరు ద్వారపాలకులను పూజింపవలెను. పిమ్మట శ్రీహరికి నమస్కారము చేసి వెలుపల బలి అర్పింపవలెను. “ఓం విష్ణు పార్షదేభ్యో నమః” అను మంత్రమును ఉచ్చరించుచు విష్ణుపీఠముపై వారలకు బలి అర్పింపవలెను. ఈశానదిక్కునందు “ఓం విశ్వాయ విష్వక్సేనాయ నమః” అను మంత్రముచే విష్వక్సేన పూజ చేయవలెను. పిమ్మట దేవుని కుడిచేతికి రక్షా సూత్రము కట్టవలెను. ఆ సమయమున ఆ భగవంతునితో ఇట్లు చెప్పవలెను-“దేవా! ఒక సంవత్సరము పాటు నిరంతరము జరుగు మీ పూజయొక్క సంపూర్ణఫలము లభించుటకై జరుపనున్న పవిత్రా రోపణ కర్మకొరకై ఈ కౌతుక సూత్రమును ధరింపుము. ఓం నమః”. పిమ్మట భగవంతుని సమీపమున ఉపవాసాది నియమములను అవలంబించి ఇట్లు చెప్పవలెను. “నేను నియమ పూర్వకముగ ఉపవాసాదులు చేసి ఇష్ట దేవతకు సంతోషము కలిగింపగలను. దేవేశ్వరా! నేను మొదలు వైశేషిక ఉత్సవ దివసము వరకును కామక్రోధాది దోషములేవియు నావద్దకు రాకుండుగాక”. వ్రతమును స్వీకరించిన యజమానుడు ఉపవాసముచేయు సామర్థ్యము లేని పక్షమున నక్తవ్రతము (రాత్రి మాత్రమే భోజనము చేయుట) ఆచరించవలెను. హవనము చేసి భగవంతుని స్తోత్రము చేసిన పిమ్మట భగవంతుని ఉద్వాసన చెప్పవలెను. భగవంతుని నిత్య పూజ చేసినచో లక్ష్మి ప్రాప్తించును. భగవంతుని పూజించుటకై “ఓం హ్రీం శ్రీం శ్రీధరాయ త్రైలోక్య మోహనాయనమః” అనునది మంత్రము. (33)