అగ్ని మహా పురాణము

Table of Contents

నక్షత్ర వ్రతములు

అగ్ని దేవుడు పలికెను:

ఇపుడు నక్షత్ర వ్రతములను గూర్చి చెప్పెదను. నక్షత్ర విశేషములందు పూజ చేయుటచే శ్రీమహావిష్ణువు సకల అభీష్టములను తీర్చును. ప్రప్రథమముగా నక్షత్ర పురుషుడైన శ్రీమహావిష్ణువును చైత్రమాసమునందు పూజించవలెను. మూల నక్షత్రమునందు శ్రీమహావిష్ణువు చరణ కమలములను, రోహిణీ నక్షత్రమున మోకాళ్ళను, పూర్వాషాఢ ఉత్తరాషాఢలందు ఊరుద్వయమును, పూర్వ ఫల్గుణ ఉత్తర ఫల్గునులయందు మేఢ్రమును, కృత్తికయందు కటి ప్రదేశమును, పూర్వాభాద్ర ఉత్తరాభాద్రల యందు పార్శ్వములను, రేవతి యందు కుక్షిని, అనూరాధయందు స్తనద్వయమును, ధనిష్టయందు పృష్ఠ భాగమును, విశాఖయందు భుజద్వయమును, పునర్వసువునందు వ్రేళ్ళను పూజించవలెను. ఆశ్లేష యందు నఖములను, జ్యేష్ఠయందు కంఠమును, శ్రవణమునందు కర్ణములను, పుష్యమి యందు వదన మండలమును, స్వాతియందు దంతాగ్రములను శతభిషమునందు ముఖమును, మఘయందు నాసికను, మృగశిరయందు నేత్రములను, చిత్తయందు లలాటములు, ఆర్ద్ర యందు కేశసమూహమును పూజించవలెను. సంవత్సరాంతమున బెల్లము నింపిన కలశపై శ్రీమహావిష్ణువు స్వర్ణమూర్తిని పూజించి బ్రాహ్మణునకు దక్షిణ సహితముగ శయ్య, గోవు, ధనము మొదలగునవి దానము చేయవలెను. సర్వ పూజనీయుడగు నక్షత్రపురుషుడైన శ్రీమహావిష్ణువునకును, శివునకును భేదములేదు. అందు శాంభవనీయ వ్రతము ఆచరించువాడు కృత్తికా సంబద్ధమగు కార్తికమాసము నందును, మృగశీర్ష నక్షత్ర సంబద్ధమగు మార్గశీర్ష మాసమునందును కేశవాది నామములతోడను, అచ్యుతాయ నమః ఇత్యాది నామములతోడను శ్రీమహావిష్ణువును పూజించవలెను. ‘నేను కార్తిక మాసము యొక్క కృత్తికా సంబద్ధ పూర్ణిమనాడు మాసమునందును, నక్షత్రము నందును ఉన్న శ్రీహరిని పూజింతును. భుక్తి ముక్తి ప్రదమగు శాంభవనీయ వ్రతము ఆచరింతును’ అని సంకల్పించవలెను. ‘కేశవాదిమూర్తులతో ఉన్నవాడును, ఆయురారోగ్య వృద్ధి కలిగించువాడును అగు అచ్యుతుని ఆవాహనము చేయుచున్నాను’ అని ఆవాహనము చేయవలెను. కార్తికమునుండి మాఘమువరకు నాల్గుమాసములు అన్నదానము చేయవలెను. ఫాల్గుణము నుండి ఆషాఢమువరకు ముద్గాన్నము, ఆషాఢమునుండి ఆశ్వయుజము వరకు పాయసము దానము చేయవలెను. రాత్రియందు శ్రీమహా విష్ణువునకును బ్రాహ్మణునకును నైవేద్యము సమర్పించవలెను. పంచగవ్య జలముతో స్నానముచేసి, దానిని త్రాగుటచే పవిత్రుడగును. ఉద్వాసన చెప్పుటకు పూర్వము దేవునకు సమర్పించిన దంతయు నైవేద్యము; ఉద్వాసన చెప్పగానే అది అంతయు నిర్మాల్యమగును. ‘అచ్యుతా! నీకు నమస్కారము. నా పాపములు నశించి పుణ్యము వృద్ధి పొందుగాక! నా ఐశ్వర్యాదులు సదా అక్షయములగు గాక. నా సంతాన పరంపర విచ్ఛిన్నము కాకుండుగాక. పరాత్పరా! పరమేశ్వరా! నీవు పరాత్పరుడవై బ్రహ్మవై నీ మర్యాదనుండి ఎన్నడును ఏ విధముగ అచ్యుతుడవు కావో అట్లే నా మనోవాంఛిత కార్యమును సఫలము చేయుము. ఓ పాపవినాశకా! నేను చేసిన పాపములు తొలగింపుము. అచ్యుతా! అనంతా! గోవిందా! అప్రమేయ స్వరూపా! పురుషోత్తమా! నన్ను అనుగ్రహించి నాకు అభీష్టములైన పదార్థములను అక్షయములుగ చేయుము’ అని ప్రార్థించవలెను. ఈ విధముగ ఏడు సంవత్సరములు శ్రీహరిని పూజించినవాడు భోగమోక్షములను పొందును. ఈ నక్షత్ర వ్రత సందర్భమున సకలాభీష్ట ప్రదమగు అనంతవ్రతమును గూర్చి చెప్పెదను. మార్గశీర్ష మాసమునందు మృగశీర్ష నక్షత్రము వచ్చినపుడు గోమూత్ర ప్రాశనము చేసి శ్రీహరిని పూజించవలెను. ఆ అనంతుడు సకల కామప్రదాత; అనంత ఫలములను ఇచ్చువాడు ఈవ్రతము చేయువానికి రాబోవు జన్మలో కూడ అనంత పుణ్యఫలమును ఇచ్చును. ఈ మహా వ్రతమువలన అనంత మహాపుణ్యము లభించును. ఇది అభిలషిత వస్తువులనుఇచ్చు వాటిని అక్షయములుగ చేయును. అనంతుని చరణ కమలాది పూజచేసి రాత్రి తైలరహితమగు భోజనము చేయవలెను. అనంతుని ఉద్దేశించి మార్గశీర్షమునుండి ఫాల్గుణమువరకు ఘృతమును, చైత్రమునుండి ఆషాఢము వరకు బియ్యము, శ్రావణమునుండి కార్తికము వరకు క్షీరమును హోమము చేయవలెను. ఈ అనంతవ్రతము ఆచరించుట చేతనే యవనాశ్వునకు మాంధాత అను పుత్రుడు జనించెను. (అనంతవ్రతకథ ఇంకను ఎక్కువ సమాచారము భవిష్యోత్తర పురాణములో ఉన్నది) (196)