అగ్ని మహా పురాణము

Table of Contents

అగస్త్యపూజ

అగ్ని దేవుడు చెప్పెను:

వశిష్ఠా! అగస్త్య మహర్షి సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. అతని పూజ చేసినవాడు శ్రీమహావిష్ణు సన్నిధి చేరును. సూర్యుడు కన్యారాశి చేరక ముందు, దానికి దగ్గరగా ఉన్నపుడు 3 1/3 రోజులు ఉపవాసముండి, అగస్త్య పూజచేసి, అర్ఘ్యము ఇవ్వవలెను. మొదటి దినమున నాలుగు గంటలు పగటి భాగము మిగిలి ఉండగా వ్రత ప్రారంభము చేసి, ప్రదోష కాలమున కాశ పుష్పమయమగు అగస్త్యుని మూర్తి కలశముపై స్థాపించి, మూర్తి పూజ చేయవలెను. అర్ఘ్యమును ఇచ్చువాడు రాత్రి జాగరణము చేయవలెను; ‘ముని శ్రేష్ఠుడవైన అగస్త్యా! నీవు తేజోరాశివి, మహా బుద్ధిమంతుడవు. నీ భార్యయగు లోపాముద్రతో కలిసి వచ్చి నేను ఇచ్చు పూజను గ్రహింపుము’ అని అగస్త్యుని ఆవా హనము చేసి, గంధ, పుష్ప, ఫల, జలాదులతో అర్ఘ్యము సమర్పించవలెను. పిదపముని శ్రేష్ఠుడైన అగస్త్యుని వైపు తిరిగి చందనాద్యుపచారములతో పూజించవలెను. రెండవ రోజున ప్రాతఃకాలమున కలశస్థిత-అగస్త్య మూర్తిని ఏదైన జలాశయము వద్దకు తీసికొనిపోయి, ఈ విధముగ చెప్పుచు అర్ఘ్యము సమర్పించవలెను. ‘కాశ పుష్పమువలె ప్రకాశించు వాడా! అగ్ని వాయు సంభూతుడా! మిత్రావరుణ పుత్రా! కుంభసంభవా! అగస్త్యా! నీకు నమస్కరించుచున్నాను.

ఆతాపి, వాతాపులను రాక్షసులను భక్షించినవాడవును, సముద్రమును ఎండింపచేసిన వాడవును అగు అగస్త్యా! నా ఎదుట సాక్షాత్కరించుము. నేను మనోవాక్కాయములతో అగస్త్యుని ప్రార్థించుచున్నాను. ఉత్తమ లోకప్రాప్తి ఆశచే అగస్త్యుని ప్రార్థించుచున్నాను. జంబూ ద్వీపమునకు బైట పుట్టినదియు, దేవతలకు ప్రియమును, సకల వృక్ష శ్రేష్ఠము అగు చందనమును స్వీకరింపుము. అగస్త్యా! ధర్మార్థ కామమోక్షములను ఇచ్చునదియు, సౌభాగ్య ఆరోగ్యలక్ష్మీ వర్ధకమును పాప వినాశకమును అగు ఈ పుష్పమాలను స్వీకరింపుము. ఈ ధూపమును గ్రహించి నాకు స్థిరభక్తిని ప్రసాదింపుము. ఈ లోకమున మనో వాంఛిత ఫలములను, పరలోకమున శుభగతిని ఇమ్ము. దేవాసుర పూజితుడవగు మునీంద్రా! నీవు సకల కామఫల ప్రదాతవు. వస్త్ర, వ్రీహి, ఫల, సువర్ణములతో కూడిన అర్ఘ్యమును ఇచ్చుచున్నాను. మహామునీ! నా మనస్సులో ఉన్న విషయమును అగస్త్యునకు (నీకు) తెలిపెదను. నీకు ఫలార్ఘ్యమును సమర్పించుచున్నాను. గ్రహింపుము. పిదప ‘అగస్త్య ఏవం...... జగామ’ అను వైదిక మంత్రముతో అర్ఘ్యము నీయవలెను. మహావ్రత పరిపాలకురాలివి రాజపుత్రివి ముని పత్నివి దేవేశ్వరివి అయిన లోపాముద్రా! నీకు నమస్కారము. ఓ యశస్వినీ! ఈ అర్ఘ్యము గ్రహింపుము. పంచరత్న, సువర్ణ, రజత, సప్తధాన్య పూర్ణమగు పాత్రను, దధి, చందన సమన్వితమగు అర్ఘ్యమును అగస్త్యునకు సమర్పించవలెను. స్త్రీ, శూద్రాదులు ‘కాశపుష్ప ప్రతీకాశ’ ఇత్యాది పౌరాణిక మంత్రముతో అర్ఘ్య ప్రదానము చేయవలెను. ‘మునిశ్రేష్ఠుడవైన అగస్త్యా! తేజః పుంజముతో ప్రకాశించు నీవు నరకమును ప్రసాదించువాడవు. నేను చేసిన పూజ గ్రహించి శాంతి పూర్వకముగా వెళ్ళుము. ఈ విధముగా పూజానంతరము అగస్త్యుని విసర్జించి అతనిని ఉద్దేశించి ఏదైన ఒక ధాన్యమును ఫలమును, రసమును పరిత్యజించవలెను. పిదప బ్రాహ్మణులకు ఘృతమిశ్రిత క్షీరాన్నము, లడ్డులు మొదలైన వాటితో సంతర్పణముచేసి గోవు, వస్త్రము, బంగారము మొదలైన వాటిని దానము చేయవలెను. పిదప, ఆ కుంభము ముఖమును ఘృత మిశ్ర క్షీరయుక్త పాత్రచే మూసి, దానియందు సువర్ణముంచి బ్రాహ్మణునకు దానము చేయవలెను. ఈ విధముగా ఏడు రోజులు అగస్త్యార్ఘ్యమును ఇచ్చు వారెల్లరును సర్వ వాంఛితములను పొందగలరు. దీనివలన స్త్రీ సౌభాగ్యమును పుత్రులను పొందును. కన్య పతిని పొందును. రాజు రాజ్యము పొందును. (206)