అగ్ని మహా పురాణము

Table of Contents

శావాశౌచాదికము

పుష్కరుడు చెప్పెను: ఇపుడు ప్రేతశుద్ధి, సూతికాశుద్ధులను గూర్చి చెప్పెదను. సపిండులలో (మూల పురుషుడు మొదలు ఏడవ తరమువరకు ఉన్న వారిలో) మరణ అశౌచము పది దినములు. జనన అశౌచము కూడ అంతే. పరశురామా! ఇది బ్రాహ్మణుల విషయమున చెప్పిన అశౌచము. క్షత్రియులకు 11 రోజులు, వైశ్యులకు 15 రోజులు, శూద్రులకు ఒక మాసము అశౌచము. శూద్రులకు చెప్పిన ఈ అశౌచము అనులోమజునకు స్వామి ఎన్ని దినముల అశౌచము పాటించునో సేవకులకు గూడ అన్ని దినములే. జనన అశౌచము క్షత్రియ, వైశ్య, శూద్రులకుగూడ పది దినములే. పరశురామా! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు ఈ విధముగనే శుద్ధియగును. కొందరి మతమున వైశ్య, శూద్రులకు జననాశౌచము పదునైదు దినములు. బాలకుడు దంత ఉత్పత్తికి పూర్వమే మరణించినచో జనన అశౌచము నకు సద్యః శుద్ధి కలుగును. దంతములు వచ్చిన తరువాత చూడాకరణమునకు పూర్వము మరణించినచో ఏకరాత్రా శౌచము; యజ్ఞోపవీత ధారణమునకు పూర్వమైనచో త్రిరాత్రా శౌచము; అనంతరము దశరాత్రా శౌచము. మూడు సంవత్సరములలోపు బాలుడు మరణించినచో శూద్రునకు ఐదు దినముల తరువాత అశౌచనివృత్తి. మూడు సంవత్సరముల పిమ్మట నైనచో పదునొక దినముల తరువాతను, ఆరు వర్షములు దాటిన తరువాత నైనచో ఒక మాసము తరువాతను నివృత్తమగును. చూడాకర్మ జరుగని కన్య మరణించి నపుడు ఒక రాత్రి మరణాశౌచమగును. చూడాకర్మ జరిగిన పిమ్మట నైనచో బంధువులకు మూడు దినముల పిమ్మట శుద్ధియగును. వివాహిత స్త్రీల మరణా శౌచము పితృ కులము వారికి ఉండదు. తండ్రి ఇంటిలో పుత్రిక బిడ్డను కన్నచో ఆ జాతాశౌచము ఒక్క రాత్రి మాత్రమే ఉండును. ఆ స్త్రీ మాత్రము పది రోజుల తరువాత శుద్ధురాలగును. వివాహితకన్య పితృ గృహమున మరణించినచో పితృ కులము వారికి అశౌచము మూడు రాత్రులు ఉండును. సమాన అశౌచమునకు ముందు శుద్ధి చేసికొనవలెను, అసమాన అశౌచమునకు అనంతరము చేసికొనవలెను అని ధర్మరాజు చెప్పెను.

దేశాంతరములో ఉన్నవాడు జాతమరణ అశౌచములను విన్నచో పది రోజులలో మిగిలిన రోజులకు మాత్రమే అశౌచము పట్టవలెను. పదిరోజుల తరువాత విన్నచో మూడు రోజులు పట్టవలెను. సంవత్సరము దాటిన తరువాత విన్నచో స్నానమాత్రముచే శుద్ధుడగును. మాతామహుడు గాని, ఆచార్యుడు గాని మరణించినచో మూడు రాత్రులు అశౌచము. పరశురామా! గర్భస్రావము ఎన్నవ మాసమున జరిగినదో అన్ని రాత్రులు గడచినపిమ్మట స్త్రీకి శుద్ధి అగును. సపిండ బ్రాహ్మణ కులమునందు మరణాశౌచము వచ్చినచో అందరికిని పదిరోజులలో శుద్ధి. క్షత్రియులకు పదునొకండు రోజులలోను, వైశ్యునకు పదునైదు రోజులలోను, శూద్రునకు ఒక మాసమునకును శుద్ధి. (శ్రాద్ధము నందు) ఉచ్ఛిష్ట సమీపమున వేదిని ఏర్పరచి, దాని సంస్కారము చేసి, దానిపై కుశలు పరచి, కుశముల పైననే పిండప్రదానము చేయవలెను. ఆ సమయమున ఏకాగ్రచిత్తుడై పితరుల నామగోత్రములు చెప్పుచు పిండప్రదానము చేయవలెను. బ్రాహ్మణులు భుజించిన తరువాత వారికి ధనమిచ్చి సత్కరించి, పూజించి, నామగోత్రోచ్చారణ పూర్వకముగ అక్షత సహిత జలము విడువవలెను. నాలుగు అంగుళముల వెడల్పు, అంతే లోతుగల జానెడు గొయ్యి త్రవ్వి అచట మూడువికర్షువులు తయారుచేసి, వాటి దగ్గర మూడు అగ్నులను ప్రజ్వలింప చేయవలెను. వాటి అన్నింటి యందును మూడేసి లేదా నాలుగేసి హోమములు చేయవలెను. పిదప అచట వెనుకటి వలెనే వేరు వేరుగా పిండములను ఈయవలెను. పిండములను అన్నము, పెరుగు, తేనె, మినుములు వీటితో చేయవలెను. సంవత్సరము మధ్య అధిక మాసము వచ్చినచో దానికొక పిండము అధికముగా చేయవలెను. లేదా పండ్రెండు మాసముల మాసిక శ్రాద్ధములన్నియు పండ్రెండవ రోజుననే పూర్తిచేయవలెను. ఆ సంవత్సరమునందు అధికమాసము రానున్నచో ద్వాదశాహశ్రాద్ధ దినమునందే ఆ మాసము కొరకై ఒక పిండము అధికముగా ఇవ్వవలెను. సంవత్సరము పూర్తియైన పిమ్మట శ్రాద్ధమును సామాన్య శ్రాద్ధమువలెనే చేయవలెను. సపిండీకరణ శ్రాద్ధమునందు ప్రేతకు పిండము వేరుగా ఇచ్చి, పిదప మూడుతరముల పితరులకు మూడు పిండములు వేరు వేరుగా ఇవ్వవలెను. ఈ విధముగా నాలుగు పిండములను ఏకాగ్రతతో ఇవ్వవలెను. పరశురామా! పిండముల పూజచేసి, దానము చేసి, ‘పృథివీతే పాత్రమ్’-’యే సమానాః’ ఇత్యాది మంత్రమును పఠించుచు యథోచిత కర్మచేసి, ప్రేత పిండమును మూడు భాగములు చేసి, వాటిని వరుసగా పితృ, పితామహ, ప్రపితా మహాపిండములందు కలపవలెను. అంతకుముందు ప్రేతార్ఘ్య పాత్రలను పిత్రాద్యర్ఘ్య పాత్రలతో కలిపివేయవలెను. ఈ రెండు పనులు వేరువేరుగ చేయుటమంచిది. శూద్రునకు ఈ శ్రాద్ధ కర్మ మంత్ర రహితముగ శ్రాద్ధము చేయవలెను. స్త్రీల సపిండీకరణమును ఆ సమయమునందు ఈ విధముగనే చేయవలెను. పితృదేవతలకు ప్రతి సంవత్సరము శ్రాద్ధము చేయవలెను. ప్రేతకు మాత్రము సాన్నోదక కుంభ దానము ఒక సంవత్సరముపాటు చేయవలెను. వర్షాకాలము నందు గంగానదిలోని ఇసుక లెక్క పెట్టవచ్చునేమో కాని అతీతులగు పితరులను లెక్కపెట్ట శక్యముకాదు. కాలము నిరంతర గమన శీలము, స్థిరత్వమనునది కాలమునందు ఎన్నడును ఉండదు. అందుచే కర్మలను తప్పక చేయవలెను.

మరణించినవాడు దేవత్వమును పొందియున్నను, నరకములో శ్రాద్ధమును అచటనే తప్పక పొందును. మరణించిన వానినిగూర్చి ఏడ్చువాడు తనకు కాని, మరణించిన వానికిగాని ఉపకారము చేసినవాడు కాజాలడు. పర్వతము నుండి దుమికి, అగ్నిలోపడి, ఉరివేసికొని, నీటిలో పడి, ఆత్మహత్య చేసికొన్నవారి మరణాశౌచము బంధువులకు తగలదు. పిడుగుపడి గాని, యుద్ధములో శస్త్రఘాతము వలనగాని మరణించినవారి వలన గూడ మరణ అశౌచము ఉండదు. యతులకును, యజ్ఞ దీక్షి తులకును, రాజాజ్ఞ పాలకులకును అశౌచము ఉండదు. వీరు శవయాత్రలో వెళ్ళినచో స్నానముచే శుద్ధులు అగుదురు. మైథునము తరువాతను, జ్వలించుచున్న శవము యొక్క ధూమము తగిలినను వెంటనే స్నానము చేయవలెను. మరణించిన బ్రాహ్మణుని, శూద్రుని చేత మోయించగూడదు. అట్లే శూద్రుని బ్రాహ్మణునిచేత మోయించగూడదు. అట్లు చేయుటచే ఇద్దరికిని దోషము. అనాథ బ్రాహ్మణ శవమును మోసి అంత్యేష్టికి తీసికొని వెళ్లినవాడు స్వర్గమును పొందును. అనాథ ప్రేత సంస్కారార్థమై కాష్ఠమిచ్చువాడు యుద్ధమునందు విజయము పొందును. శవమును చితిపై ఉంచి, దహించి, బంధువులు చితికి అపసవ్యముగా పరిక్రమణముచేసి, సచేల స్నానముచేసి, ప్రేత నిమిత్తము మూడేసి పర్యాయములు జలాంజలి ఇవ్వవలెను. గృహద్వారము నందు మొదట ఱాతిపై పాదములు ఉంచి అగ్నిలో అక్షతలు వేసి, వేపాకులు నమలి, ఇంటిలో ప్రవేశించవలెను. అందరికి దూరముగా చాప వేసికొని నిద్రించవలెను. ఆ కుటుంబములోని వారు ఆ రోజున కొన్న ఆహారమును స్వల్పముగా భుజించవలెను. పది రోజుల వరకును రోజుకు ఒక్కొక్కటి చొప్పున పిండము నీయవలెను. పదవ రోజున ఒక పిండమునిచ్చిన తరువాత క్షౌరము చేయించుకొనుటచే పరిశుద్దుడగును. పదవ రోజున ఆవాలను, తిలలను శరీరమునకు పూసుకొని, నీటిలో మునిగి స్నానముచేసి నూతన వస్త్రములు ధరించవలెను. దంతోత్పత్తికి పూర్వమే మరణించిన బాలునకును, గర్భస్రావముచే పోయిన శిశువునకును దహన సంస్కార జలాంజలులు ఉండవు. శవదహననంతరము నాల్గవ రోజున అస్థి సంచయము చేయవలెను. అస్థి సంచయము తరువాత అంగస్పర్శ విహితము. (157)