అగ్ని మహా పురాణము

Table of Contents

స్తోత్ర ప్రాయశ్చిత్తము

పుష్కరుడు చెప్పెను:

మానవుల మనస్సు పరభార్యా పరధన జీవహింసాదులయందు ప్రవర్తించునపుడు విష్ణుస్తుతియే ప్రాయశ్చిత్తము. సర్వదా విష్ణువునకు నమస్కారము. చిత్తమునందున్న వాడును, అహంకారమునకు గతియైనవాడును, హరియు, ఈశుడును, అవ్యక్తుడును, అపరాజితుడును అగు విష్ణువుకు నమస్కరించుచున్నాను. ఏ కారణమువలన విష్ణువు నా మనస్సులో ఉన్నాడో, నా బుద్ధిలో ఉన్నాడో, నా అహంకారములో ఉన్నాడో, నాలో ఉన్నాడో, స్థావర జంగమాత్మ ప్రపంచము యొక్క కర్మ ఆకర్మగా ఉండి చేయుచున్నాడో, ఆ కారణమువలన ఆ విష్ణువునే చింతించుటచే పాపము నశించుగాక! ఏ కారణమువలన ధ్యానము చేయగానే పాపమును హరించునో, భావనా బలము వలన స్వప్నము నందు కనబడునో అట్టి ఉపేంద్రుడును ప్రణతార్తి హరుడును అగు విష్ణువును నమస్కరించుచున్నపుడు హస్తావ లంబనమును ఇచ్చు పరాత్పరుడైన విష్ణువునకు నమస్కరించు చున్నాను. ఓ సర్వేశ్వరేశ్వరా! విభూ పరమాత్మా! అధోక్షజా! నీకు నమస్కారము. నృసింహా! అనంతా! భూతభావనా! భూతేశా ! హృషీకేశా! నీకు నమస్కారము. నృసింహా! అనంతా! భూతభావనా! భూతేశా! కేశవా! నేను దుష్టవాక్కు పలుకుటచేతను, చెడు కార్యములు చేయుటచేతను, చెడు ఆలోచనలు చేయుటచేతను కలిగిన పాపమును శాంతింప చేయుము. నీకు నమస్కార మగుగాక. కేశవా! నా చిత్తమునకు లొంగిపోయిన నేనుచేసిన దురాలోచనలను ఉగ్రమైన దుష్కార్యమును నశింపచేయుము. బ్రహ్మణ్య దేవా! గోవిందా! పరమార్థపరాయణా! జగన్నాధా జగత్పోషకా! అచ్యుతా! నా పాపమును శాంతింప చేయుము. హృషీకేశా! పుండరీ కాక్షా! మాధవా! తెలిసికాని, తెలియక కాని నేను అపరాహ్ణము నందును, సాయాహ్నము నందును, మధ్యాహ్నము నందును, రాత్రియందును మనోవాక్కాయములచే చేసిన పాపము నీ నామ మాత్రోచ్చారణముచే నా స్వప్నమునందే నశించిపోవుగాక. హృషీకేశా! పుండరీ కాక్షా! మాధవా! శరీరమునకు సంబంధించినది గాని, వాక్కుచేత చేసినది గాని అయిన నా పాపమును శమింపచేయుము. భుజించుచుగాని, నిద్రించుచుగాని, నిలచిగాని, మెలకువగా ఉండిగాని, నేనీ రోజున మనోవాక్కాయములచే చేసిన పాపమును నశింపచేయుము. పాప జన్మలు నరకము ఇచ్చు స్వల్పమైనను అధికమైనను నా పాపము వాసుదేవ నామ కీర్తనము వలన శమించు గాక పరబ్రహ్మ స్వరూపుడును పరమ స్థానమును, పరమ పవిత్రుడును అగు విష్ణువు కీర్తింపబడగనే సమస్త పాపము నశించుగాక! గంధ స్పర్శాది వర్ణితమగు ఏ విష్ణు పదమును పొందిన పండితులు మరల వెనుకకురారో అట్టి విష్ణుపదము సకల పాపములను నశింపచేయు గాక! ఈ పాప ప్రణాశన స్తోత్రమును చదివినవాడును, విన్నవాడును, మనోవాక్కాయ జన్యములగు పాపములనుండి విముక్తు డగును. సర్వపాప గ్రహాదులనుండిగూడ విముక్తుడై శ్రీ మహావిష్ణువు యొక్క ఉత్తమ స్థానమును చేరును. అందువలన పాపము చేసినపుడు సర్వ పాపనాశకమగు ఈ స్తోత్రమును జపించవలెను. వ్రతము నిమిత్తమై కూడ ఇది శ్రేష్ఠము. పాపము ప్రాయశ్చిత్తముల చేతను, స్తోత్ర జపముల చేతను, వ్రతముల చేతను నశించును. అటు పిమ్మట సిద్ధి నిమిత్తమై చేసిన కర్మలు భుక్తి, ముక్తి ప్రదములగును. (172)