అగ్ని మహా పురాణము
కామ్య - మేరుదాన వర్ణనము
వశిష్ఠా! ఇప్పుడు సమస్త మనోరథములను తీర్చు కామ్య దానములను గూర్చి చెప్పెదను.ప్రతి మాసమునందును పూజచేయుచు ఒక దినమున విశేష పూజ చేయుదురు. దీనికి ‘కామ్య పూజనము’ అని పేరు. సంవత్సరము పూర్తి యైన పిమ్మట గురు పూజనము, మహాపూజనము చేసి వ్రతసమాప్తి చేయవలెను. మార్గశీర్షమాసమునందు శివపూజచేసి పిష్ట నిర్మితమగు అశ్వమును కమలమును దానము చేయువాడు చిరకాలము సూర్యలోకములో నివసించును. పౌష మాసమున పిష్ట గజదానము చేసినవాడు ఇరువది యొక్క తరముల వారిని ఉద్ధరించును. మాఘమున పిష్టమయ రథాశ్వదానము చేసినవాడు నరకము చూడడు. ఫాల్గుణమున పిష్టమయ వృషభ దానము చేసినవాడు స్వర్గము చేరి రెండవ జన్మమున రాజ్యము పొందును. చైత్ర మాసమునందు, దాసీదాసయుక్తము, గుడముతో నిండినదియగు గృహము దానము చేసినవాడు చిరకాలము స్వర్గమున నివసించి పిదప రాజగును. వైశాఖమున సప్తధాన్యదానము చేసినవాడు శివసాయుజ్యము పొందును. జ్యేష్ట-ఆషాఢములందు అన్నబలి ఇచ్చువాడు శివ స్వరూపుడగును. శ్రావణమునందు పుష్పరథ దానము చేసినవాడు స్వర్గమునందు సుఖములు అనుభవించి, రెండవ జన్మమున రాజ్యమును పొందును. రెండువందల పలములు దానముచేయువాడు సంపూర్ణ కులమును ఉద్ధరించి రాజ్య పదమును పొందును. భాద్రపదమున ధూపదానము చేయువాడు స్వర్గము చేరి రెండవ జన్మమున రాజ్యము పొందును. ఆశ్వయుజ మాసమున దుగ్ధ-ఘృత పూర్ణ పాత్ర దానము చేసినవాడు స్వర్గమును పొందును. కార్తికమున గుడము, పంచదార, ఘృతము దానము చేసినవాడు స్వర్గమున నివసించి జన్మాంతరమునందు రాజగును.
ఇపుడు భుక్తి ముక్తి ప్రదములగు పండ్రెండు విధములైన మేరుదానములను గూర్చి చెప్పెదను. కార్తికపూర్ణిమనాడు మేరు వ్రతముచేసి బ్రాహ్మణునకు ‘రత్న మేరువు’ దానము చేయవలెను. ఇప్పుడు అన్ని మేరువుల ప్రమాణము వినుము. వజ్రములు, మాణిక్యములు, నీలమణులు, వైడూర్యములు, స్ఫటికములు, పుష్పరాగములు, మరకతములు, ముత్యములు-వీటిని ఒక్కొక్క ప్రస్థము చొప్పున ఇచ్చినచో ఉత్తమము. ఇందులో సగమైనచో మధ్యమము, మధ్యమములో సగము అధమము. రత్నమేరుదానము చేయువాడు పిసినారి తనము వీడవలెను. ద్వాదశదళ కమలము నిర్మించి దాని కర్ణికపై మేరువును స్థాపించవలెను. దీనికి దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. మేరువునకు తూర్పున మూడు దళములు ఉండును. వాటిపై వరుసగ మాల్యవత్, భద్రాశ్వ, ఋక్ష, పర్వతములను పూజించవలెను. మేరువునకు దక్షిణమునందున్న దళములపై నిషధ హేమకూట-హిమవ త్పర్వతములను పూజించవలెను. మేరువునకు ఉత్తరము నందున్న దళములపై వరుసగా నీల, శ్వేత, శృంగులను పూజించవలెను. పశ్చిమ దళములపై గంధమాదన-వైకంక-కేతుమాలములను పూజించవలెను. ఈ విధముగ పండ్రెండు పర్వతములతో కూడిన మేరుపర్వతమును పూజించవలెను. ఉపవాసముండి స్నానముచేసి, విష్ణువును, శివుని పూజించవలెను. భగవంతుని ఎదుట మేరువును పూజించి మంత్రోచ్చారణ పూర్వకముగ ఆ బ్రాహ్మణునకు దానము చేయ వలెను. దానసంకల్పము చేయునపుడు దేశకాలములను ఉచ్చరించి ఈ ద్రవ్యముతో నిర్మించినదియు శ్రీమహావిష్ణువు దేవతగా కలదియు అగు ఈ మేరువును ఈ గోత్రముగల బ్రాహ్మణునకు దానము చేయుచున్నాను. ఈ దానముచే నా అంతఃకరణము శుద్ధమగుగాక. నాకు ఉత్తమములగు భోగములును, మోక్షము సంప్రాప్తించు గాక’ యని చెప్పవలెను. ఈ విధముగ దానము చేసినవాడు తన సమస్త కులమును ఉద్ధరించి, దేవతలచే సమ్మానితుడై, విమానముపై కూర్చుండి ఇంద్రలోక, బ్రహ్మలోక, శివలోక శ్రీవైకుంఠములందు విహరించును. సంక్రాంత్యాది పుణ్య కాలములందు మేరు దానము చేయవలెను; చేయించవలెను.
ఒక వెయ్యి పలముల బంగారముతో మహామేరువును నిర్మించవలెను. దానికి మూడు శిఖరములు ఉండును. వాటి పై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను స్థాపించవలెను. మేరు పర్వతము ప్రక్కల నుండు పర్వతములు నూరేసి పలముల సువర్ణముతో నిర్మించవలెను. మేరు పర్వతముతో పదమూడు పర్వతములుండును. ఉత్తరాయణ సంక్రాంతినాడుగాని, సూర్య చంద్ర గ్రహణములందు గాని మేరువును విష్ణు ప్రతిమకు ఎదురుగా స్థాపించ వలెను. శ్రీమహావిష్ణువును ఆ మేరువును పూజించి బ్రాహ్మణునకు దానము చేయవలెను. ఇట్లు చేసినవాడు చిరకాలము విష్ణు లోకములో నుండును. పండ్రెండు పర్వతములతో కూడిన రజతమేరువును సంకల్ప పూర్వకముగ దానము చేయువాడు భూమిమీద ఎన్ని పరమాణువులున్నవో అన్ని సంవత్సరములు రాజ్యమును అనుభవించును. పైన చెప్పిన ఫలమును కూడ అనుభవించును. శ్రీమహావిష్ణువును, బ్రాహ్మణుని పూజించి భూమి మేరువును దానము చేయవలెను. ఒక నగరమునందలి లేదా జనపదము నందలి లేదా గ్రామము నందలి ఎనిమిదవ అంశముచే భూమి మేరువును కల్పించి మిగిలిన అంశముచే పండ్రెండు అంశములను కల్పించవలెను. భూమి మేరు దానమువలన గూడ పూర్వోక్త ఫలము లభించును. ఏనుగులతో పండ్రెండు పర్వతములతో గూడిన మేరువును నిర్మించి ముగ్గురు పురుషులతో కూడ ఆ హస్తి మేరువును దానము చేయవలెను. అట్లు చేసిన వానికి అక్షయ ఫలము లభించును. పదునైదు అశ్వములతో అశ్వమేరువు ఏర్పడును, పండ్రెండు పర్వతముల స్థానములందు పండ్రెండు అశ్వములు ఉంచవలెను. శ్రీమహా విష్ణ్వాది దేవతల పూజ చేసిన పిమ్మట ఈ అశ్వమేరు దానము చేసినవాడు ఈ జన్మమున వివిధ భోగములను అనుభవించి మరుజన్మమున రాజగును. అశ్వమేరువు విషయమున చెప్పిన విధముననే గోమేరు దానము కూడ చేయవలెను. ఒక పుట్టి బరువుగల పట్టు వస్త్రములతో ‘వస్త్ర మేరువు’ అగును. దానిని మధ్యయందు ఉంచి పండ్రెండు వస్త్రములను ఉంచవలెను. దీనిని దానము చేసినవానికి అక్షయఫలము లభించును. ఐదువేల పలముల ఘృతముతో ఘృతపర్వతమగును. దీని ప్రక్కనున్న పర్వతములు ఒక్కొక్కటి ఐదు వందల పలముల ఘృతముతో నిర్మింపబడును. ఈ ఘృత పర్వతముపై శ్రీమహావిష్ణువును పూజించి తత్సమ్ముఖమున బ్రాహ్మణునకు దానము చేసినవాడు ఈ లోకమునందు సుఖము పొంది విష్ణు లోకము చేరును. ఇట్లే ఖండ (పటిక బెల్లము) మేరువు నిర్మించి దానము చేసినవానికి పూర్వోక్త ఫలము లభించును.
ఐదుపుట్ల ధాన్యముతో ధాన్యమేరువును, ఒక్కొక్క పుట్టెడు ధాన్యముతో మిగిలిన పండ్రెండు పర్వతములను నిర్మించి, వాటి అన్నింటిపైన మూడేసి స్వర్ణమయ శిఖరములు ఏర్పరచి, అన్నింటిపైనను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజించవలెను. శ్రీమహావిష్ణువునకు విశేష పూజ చేయవలెను. దీని వలన అక్షయ ఫలము లభించును. ఈ ప్రమాణము చేతనే తిలమేరువును, దశాంశ ప్రమాణము చేతనే అన్య పర్వతములను నిర్మించి, వాటికి వెనుక చెప్పినవిధముగ శిఖరములు నిర్మించి, దానము చేసినవాడు బంధుసహితుడై విష్ణు లోకమునకు వెళ్లును. ‘విష్ణు స్వరూపమగు తిలమేరువునకు నమస్కారము. బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు దేని శిఖరములో, ఏది పృథ్వీనాభి యందున్నదో, ఏది ప్రక్కనున్న పండ్రెండు పర్వతములకు ప్రభువో అట్టి సమస్త పాపహరము, శాంతిమయము, విష్ణు భక్తియుక్తము అగు తిలమేరువునకు నమస్కారము. అది నన్ను రక్షించుగాక. నేను పాపరహితుడనై పితరులతో గూడ శ్రీమహావిష్ణు సన్నిధి చేరగలను. ‘ఓం నమః’. నీవు విష్ణు స్వరూపమైన దానవు. విష్ణు సమ్ముఖమునందు, విష్ణు స్వరూపుడగు బ్రాహ్మణునకు, భక్తి పూర్వకముగ, భోగ మోక్ష ప్రాప్తికై నిన్ను దానము చేయుచున్నాను’ అని చెప్పుచు ఆ తిల మేరువును దానము చేయవలెను (212).
