అగ్ని మహా పురాణము

Table of Contents

ఉత్పాత శాంతి విధానము - 2

పుష్కరుడు పలికెను:

ఇపుడు ఉత్పాతములను తొలగించు దేవపూజాది కర్మనుగూర్చి చెప్పెదను. స్నానము చేసి ‘అపోహిష్ఠా’ మొదలగు (యజు 36-14 -, 16) మూడు మంత్రములతో మహావిష్ణువునకు అర్ఘ్యము సమర్పించి, ‘హిరణ్యవర్ణాః’ (ఋక్ 11-11-1, 3) మొదలగు మూడు మంత్రములతో పాద్యము ‘శంనో ఆపః’ అను మంత్రముతో ఆచమనము, ‘ఇదమాపః’ (యజు 6-17) అను మంత్రముతో అభిషేకమును సమర్పించవలెను. ‘రథే’, ‘ఆక్షేమ’, ‘చతస్రః’ అను మూడు మంత్రములతో గంధమును, ‘యువాసు వాసాః’ (ఋ 3-8-4) అను మంత్రముతో వస్త్రమును ‘పుష్పవతీ’ (అథర్వ 8-7-27) అను మంత్రముతో పుష్పమును, ‘ధూరసి’ (యజు 1-8) ఆది మంత్రముతో ధూపమును, “తేజోఽసి”, “శుక్రమసి” (యజు 1-36) అను మంత్రముతో దీపమును “దధిక్రావ్ణో” (యజు 23-23) అను మంత్రముచే మధుపర్కమును సమర్పించి ‘హిరణ్యగర్భ’ మొదలగు ఎనిమిది ఋక్కులను పఠించి అన్నమును సుగంధమగు పానీయమును సమర్పించవలెను. మిగిలిన చామర, వ్యజన, పాదుకా, ఛత్ర, యాన, ఆసనాదులను సావిత్ర మంత్రముతో సమర్పించవలెను. పురుష సూక్తముతో జపహోమములు చేయవలయును. భగవ ద్విగ్రహములేనిచో వేదికపై స్థాపించిన జలపూర్ణ కలశము నందుకాని, నదీ తటమునందు గాని, కమలము నందుగాని, విష్ణువును పూజించినచో ఉత్పాతములు శమించును.

భూమిపై నున్న వేదికపై మార్జన ప్రోక్షణములు చేసి దాని నలువైపుల కుశలు పరచి అగ్ని ప్రదీప్తము చేసి దానిలో హోమము చేయవలెను. పరశురామా! మనస్సును, ఇంద్రియములను నిగ్రహించుకొని అన్ని అన్నముల నుండియు మొదటి భాగమును గ్రహించి వాసుదేవాదులకు హోమము చేయవలెను. వాసుదేవ, దేవ, ప్రభు, అద్యయ, అగ్ని, సోమ, మిత్ర, వరుణ, ఇంద్ర, మహాభాగ, ఇంద్రాగ్ని, విశ్వదేవ, ప్రజాపతి, అనుమతి, ధన్వంతరి, వాస్తోష్పతి, దేవి, స్విష్టకృదగ్ని అను దేవతా నామములను చతుర్థ్యంతము చేసి, వీటికి హోమము చేసి, క్రింద చెప్పు విధముగ బలి సమర్పించవలెను. ఓ ధర్మజ్ఞ! ముందు ఆగ్నేయ దిక్కునందు ప్రారంభించి, తక్షా, ఉపతక్షా, అశ్వా, ఊర్జ, నిరుంధీ, ధూమ్రిణీకా, అస్వపంతీ, మేధపత్నీ అనువారికి బలి అర్పింపవలెను. ఓ భృగునందన! ఇవి బలిని స్వీకరించు దేవతల పేర్లు. పిదప నందిన్యాది శక్తులకు బలి అర్పింపవలెను. నందినీ, సుభాగ్యా, సుమంగళీ, భద్రకాళీయను నలుగురు శక్తులకు పూర్వాది దిక్కులు నాల్గింటి యందును బలి ఇచ్చి ఒక శంఖువుపైగాని స్తంభముపైగాని, ‘శ్రీహిరణ్యకేశీ’ వనస్పతులకు బలి ఇవ్వవలెను. ద్వారము రెండుప్రక్కల ధర్మమయ, అధర్మమయులకు గృహ మధ్యమమున ధృవునకు ఇంటి వెలుపల మృత్యువునకు జలాశయమున వరుణునకు బలి సమర్పించి ఇంటివెలుపల భూతబలిని ఇవ్వవలెను. ఇంటిలోపల కుబేరునకు తూర్పున ఇంద్రునకు ఇంద్రపురుషులకు, దక్షిణమున, యమునకు, యమపురుషులకు, పశ్చిమమున, వరుణునకు వరుణ పురుషులకు ఉత్తరమున, సోమమునకు సోమపురుషునకు గృహమధ్యమున బ్రహ్మకు బ్రహ్మ పురుషులకు ఆకాశమున విశ్వేదేవతలకు పృథివిపై స్థండిల దేవతలకు బలియిచ్చి పిదప పగలు దివాచరములకు రాత్రి రాత్రి చరములకు బలియివ్వవలెను. ప్రతిదినము సాయంకాలమందును ప్రాతః కాలము నందును ఇంటి వెలుపల బలి యివ్వవలెను. ఒక దినమున శ్రాద్ధమునకు సంబంధించిన పిండ ప్రదానము జరిగినచో ఆనాడు సాయంకాలమున బలి ఇవ్వకూడదు.

పితృశ్రాద్ధమునందు దక్షిణాగ్ర కుశములపై మొదట తండ్రికి, పిదప పితామహునకు పిండదానము చేయవలెను. ఇదేవిధముగా మొదట తల్లికి, పిదప పితామహికి పిదప ప్రపితామహికి పిండ దానము చేయవలెను. ఈ విధముగ పితృ యాగము చేయవలయును. వండిన వంట నుండి బలివైశ్వ దేవములు చేసిన పిమ్మట ఐదు బలులు ఇవ్వవలెను. ఇంద్ర, వరుణ, వాయు, యమ, నిఋతి దేవతల దిక్కులందు నివసించు కాకులు నేను ఇచ్చిన ఈ పిండమును గ్రహించుగాక! అను అర్థముగల మంత్రముతో కాక బలి ఇవ్వవలెను. శ్యామ, శబల, వర్ణములు గల రెండు శునకములు వివస్వంతుని కులమున జన్మించినవి. నేను ఆ రెండింటి పిండ ప్రదానము చేయుచున్నాను, అవి నన్ను మార్గమునందు సర్వదా రక్షించుగాక! అను అర్థముగల మూలోక్త మంత్రము చదువుతూ కుక్కలకు బలి ఇవ్వవలెను.

త్రిలోక జననులు, కామధేను పుత్రికలు అయిన గోవులు అందరికిని హితకరములు పవిత్రములు, పాపవినాశకములు అవి నేనిచ్చు ఈ గ్రాసమును గ్రహించుగాక! అను అర్ధము గల మూలోక మంత్రముతో గోవునకు గ్రాసమును ఇచ్చి స్వస్త్యయనము చేయ వలయును. పిదప యాచకులకు భిక్షయిచ్చి దీనులగు ప్రాణులకును అతిథులకును అన్నము పెట్టి గృహస్థుడు తాను తినవలెను. ‘ఓంభూః స్వాహా’ మొదలు ‘ఓం ప్రజాపతయే స్వాహా’ వరకునుగల మూలోక మంత్రములు చదువుతు, అన్నాహుతులు ఇవ్వవలెను. ఈ విధముగా విష్ణుపూజా వైశ్వదేవ బలులను గూర్చి నీకు చెప్పితిని. (264)