అగ్ని మహా పురాణము

Table of Contents

కిష్కింధ కాండ

రాముడు పంపా సరస్సుచేరి దుఃఖించెను. పిమ్మట శబరి వద్దకు వెళ్లెను. పిమ్మట హనుమంతుడు సుగ్రీవుని వద్దకు తీసికొని పోగా ఆతనిని తన మిత్రునిగ చేసికొనెను అని నారదుడు పలికెను.

సుగ్రీవుడు చూచుచుండగా ఒక బాణముచేత ఏడు తాళ వృక్షములను ఛేదించి, దుందుభి శరీరమును పది యోజనముల దూరమున పడునట్లు విసరెను.

సుగ్రీవునికి సోదరుడును, వైరము చేయుటచే శత్రువును అగు వాలిని చంపి ఋశ్య మూకముపై ఉన్న ఆతనికి కిష్కింధను, వానర రాజ్యమును, రుమను, తారను ఇచ్చెను. తదనంతరము సుగ్రీవుడు “రామా! నీకు సీత లభించునట్లు చేసెదను” అని పలికెను.

రాముడు ఆ మాటలు విని మాల్యవత్పర్వతముపై వర్షాకాలము నాలుగు మాసములును గడపెను. కిష్కింధలో ఉన్న సుగ్రీవుడు మరల కనబడక పోగా, లక్ష్మణుడు సుగ్రీవుని వద్దకు పోయి “నీవు రాముని దగ్గరకు వెళ్లుము. వాలి రామునిచే నిహతుడై వెళ్లిన మార్గము ఇంకను మూసివేయబడలేదు. సుగ్రీవా! మాటమీద నిలబడుము. వాలి మార్గమును అనుసరించకుము.” అని రాముడు చెప్పిన విధమున ఆతనితో చెప్పెను.

వానరాధిపతి అయిన సుగ్రీవుడు “కార్యాసక్తుడనైన నేను గడచిన కాలమును గుర్తించజాలక పోతిని” అని పలికి రాముని వద్దకు వెళ్లి నమస్కరించి “వానరుల నందరిని పిలిపించితిని. నీ అభిలాష ప్రకారము వారిని సీతాన్వేషణము నిమిత్తమై పంపగలను. వారు తూర్పు మొదలైన దిక్కులందు సీతను మాసము లోపున అన్వేషించవలెను, మాసము దాటినచో వారిని చంపెదను” అని చెప్పెను. ఈ విధముగా ఆజ్ఞాపింపబడిన వానరులు తూర్పు-పశ్చిమము, ఉత్తరము వైపు వెళ్లి అచట సీతను గానక రామ సుగ్రీవుల వద్దకు తిరిగి వచ్చిరి.

హనుమంతుడు రాముని అంగుళీయకమును తీసికొని, వానర సమేతుడై దక్షిణ దిక్కునందు సుప్రభ గుహ సమీపమున అన్వేషించెను.

మాసము దాటిన తరువాత కూడ వింధ్య పర్వతమునందు ఉండి సీతను చూడజాలక “మన మందరము వ్యర్థముగా మరణించబోవుచున్నాము. యుద్ధమునందు రావణునిచే చంపబడి, సీత నిమిత్తమై ప్రాణములు విడచిన ఆ జటాయువు ధన్యుడు కదా!” అని ఆ వానరులు అనుకొనిరి.

ఆ మాటలు విని సంపాతి వానరులను భక్షించుట మాని ఇట్లు పలికెను. ఆ జటాయువు నా సోదరుడు. నాతో కలిసి సూర్య మండలము వైపు ఎగిరెను. ఆతనిని నేను సూర్యుని వేడిమి నుండి రక్షించగా భూమిపై పడెను. ఆకాశముపై నున్న నా రెక్కలు కాలిపోయినవి. రాముని కథ వినుటచే నా రెక్కలు మరల మొలచినవి. ఓ వానరులారా! శత యోజన విస్తీర్ణమైన లవణ సముద్రమున, త్రికూట పర్వతముపై ఉన్న లంకా పట్టణమునందు అశోక వనములో ఉన్న జానకి నాకు కనబడుచున్నది. ఈ విషయము తెలిసికొని రామసుగ్రీవులకు తెలుపుడు. (8)