అగ్ని మహా పురాణము

Table of Contents

నవవ్యూహార్చనము

అగ్ని దేవుడు పలికెను:

వసిష్ఠ మహామునీ! శ్రీ మహావిష్ణువు నారదునకు చెప్పిన విధమున నవవ్యూహార్చన విధానము చెప్పెదను. పద్మమయమగు మండలము మధ్య ‘అం’ బీజముతో కూడిన వాసుదేవుని పూజించవలెను. (ఉదా: అం వాసుదేవాయ నమః) ఆగ్నేయము నందు ‘అం’ బీజయుక్త ప్రద్యుమ్నుని, నైరృతియందు ‘అః’ బీజయుక్తుడగు అనిరుద్ధుని, పశ్చిమమున ప్రణవయుక్త నారాయణుని, వాయువ్యమునందు తత్సద్ బ్రహ్మను, ఉత్తరమునందు ‘హుం’ బీజయుక్త విష్ణువును, ‘క్ష్రౌం’ బీజయుక్త నృసింహుని, ఈశాన్యమున పృథ్విని, పశ్చిమ ద్వారమున వరాహమూర్తిని పూజించవలెను. కం, టం, శం, సం బీజయుక్త గరుడుని పూర్వాభిముఖునిగా దక్షిణమున పూజించవలెను. ఖం, భం, బం, హుం, ఫట్ అను బీజములతోను; ఖం, ఠం, ఫం, శం అను బీజములతోను; గదను చంద్రమండలము నందు పూజించవలెను. బం, ణం, మం, క్షం బీజములతోను; శం, ధం, దం, భం, హం బీజముల తోను శ్రీదేవిని కోణభాగమునందు పూజించవలెను. దక్షిణ ఉత్తరములందు గం, డం, బం, శం బీజములతో పుష్టిదేవిని పూజించవలెను. పీఠపశ్చిమ భాగమునందు ధం, వం బీజములతో వనమాలను పూజించవలెను. పశ్చిమ దిశయందు సం, హం, లం బీజములతో శ్రీవత్సమును, జలమునందు భం, తం, యం, బీజములతో కౌస్తుభమును పూజించవలెను. పిదప దశమాంగ క్రమమున విష్ణువును, అతని క్రింది భాగమున అనంతుని, వారి పేర్లకు నమః జోడించి పూజించవలెను. పూర్వాది దిశలందు దశాంగాదులను, మహేంద్రాది దశ దిక్పాలులను, పూర్వాది దిశలందు నాలుగు కలశలను పూజించవలెను. తోరణ, వితాన, అగ్ని, వాయు, చంద్రుల బీజములతో కూడిన మండలములను క్రమముగా ధ్యానించి, తన శరీరమును వందన పూర్వకముగ అమృత ప్లావితము చేయవలెను. ఆకాశము నందున్న ఆత్మయొక్క సూక్ష్మ రూపమును ధ్యానించి, ఆ ఆత్మ చంద్రమండలము నుండి ప్రవహించుచున్న శ్వేతామృత ధారలో నిగ్నమైనట్లు భావన చేయవలెను. ప్లవన సంస్కృతమైన అమృతమే ఆత్మ బీజము. ఆ అమృతము నుండి పుట్టిన పురుషుడే తానని భావన చేయవలెను. “నేనే విష్ణు స్వరూపమున ప్రకటమైతిని’ అని భావన చేయవలెను. పిదప ద్వాదశ బీజన్యాసము చేయవలెను. క్రమముగ వక్షఃస్థల, మస్తక, శిఖా, పృష్ఠభాగ, నేత్ర హస్తద్వయము లందును, హృదయ, శిరః, శిఖా, కవచ, నేత్రత్రయ, అస్తములందును అంగన్యాసము చేయవలెను. రెండు హస్తములందును అస్త్రన్యాసము చేసిన పిదప సాధకుని శరీరమునందు దివ్యత్వమువచ్చును. తన శరీరమునందు చేసినట్లే దేవతావిగ్రహ శరీరమునందును శిష్య శరీరము నందును గూడ న్యాసము చేయవలెను. హృదయములో చేయు శ్రీమహావిష్ణు పూజనము నిర్మాల్యరహిత పూజనము, మండలాదులపై చేయునది నిర్మాల్యసహితము. దీక్షాకాలమున శిష్యుని నేత్రములు బంధింపబడి యుండును. ఆ సమయమున ఆతడు ఇష్టదేవతా విగ్రహముపై విసరిన పుష్పమును బట్టి వానికి ఆపేరు పెట్టవలెను. శిష్యులను ఎడమ ప్రక్కకూర్చుండ బెట్టుకొని అగ్నియందు తిలలు, బియ్యము, ఘృతము, హోమము చేయవలెను. నూట ఎనిమిది ఆహుతులు ఇచ్చిన పిదప కాయశుద్ధి కొరకై వెయ్యి హోమములు చేయవలెను. పిదప పూర్ణాహుతి ఇచ్చి గురువు శిష్యులకు దీక్ష ఇవ్వవలెను. శిష్యులు ధనముచే గురువును పూజించవలెను. (201)