అగ్ని మహా పురాణము

Table of Contents

షట్త్రింశత్పదకమ్

పరమేశ్వరుడు చెప్పెను:

ఇపుడు ముప్పదియారు పదములలో నుంచబడిన ఓషధుల ఫలమును చెప్పెదను. ఈ ఓషధులను సేవించుటచే మనుష్యులు అమరులగుదురు. వీటిని బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు ఉపయోగించి యున్నారు. హరీతకీ, అక్షధాత్రీ, మరీచ, పిప్పలీ, శిఫా, వహ్ని, శుంఠీ, పిప్పలీ, గుడూచీ, వచానింబ, వాసక, శతమూలీ, సైంధవ, సింధువార, కంటకారి, గోక్షుర, బిల్వ, పునర్నవా, బలా, ఏరండ, ముండీ రుచక, భృంగ, క్షార, పర్పట, ధాన్యాక, జీరక, శతపుష్పి, యవానీ, విడంగ, ఖదిర, కృతమూల, హరిద్రా, వచా, సిద్ధార్ధమలను ఓషధులు ముప్పది యారు పదములందు స్థాపింపవలెను. ఒకటి, రెండు మొదలైన సంఖ్యలు గల ఈ మహౌషధులు సమస్త రోగములను దూరము చేయును. అమరత్వమును నిచ్చును. అన్ని కుష్ఠములలోని ఓషధులును శరీరముపై ముడతలు పడకుండచేయును. వెండ్రుకలు నెరవకుండునట్లు చేయును. వీటి చూర్ణములతో గాని, రసముచేతగాని భావన చేసిన వటులను, అవలేహములను, కషాయములను, లడ్డులను, గుడఖండాదులను నెయ్యితో గాని, తేనెతో గాని తిన్నచో లేదా వీటి రసముతో భావన చేసిన నెయ్యి గాని, తైలము గాని ఏ ప్రకారముగనైనను ఉపయోగించినచో, అది సర్వదా మృత సంజీవనముగా పనిచేయును. సగము కర్షము లేదా కర్షము లేదా సగము పలము, లేదా పలము. దీనిని ఉపయోగించువాడు ఆహారవిహారములందు యథేష్టముగనున్నను మూడు వందల సంవత్సరములు జీవించును. మృతసంజీవనీ కల్పమునందు దీనికి మించిన యోగములేదు. మొదటినవకము (తొమ్మిది ఔషధముల సముదాయము నవకము) నందలి ఓషధులు కలిపి చేసిన ఔషధము సేవించుటచే మానవుడు సర్వరోగ విముక్తుడగును. ద్వితీయ, తృతీయ, చతుర్థ నవకము లందలి ఓషధుల ప్రయోగముచేత గూడ రోగ విముక్తుడగును. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్ధ, పంచమ, షష్ఠ షట్కముల (ఆరు ఓషధుల సముదాయము షట్కము) సేవనముచే మనుష్యుడు రోగ విముక్తుడగును. ముప్పదియారు ఓషధులకు తొమ్మిది చతుష్కములు ఏర్పడును. (నాల్గింటి సముదాయము చతుష్కము). ఏచతుష్కములోని ఓషధులను సేవించినను రోగ విముక్తుడగును. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమ, అష్టమ కోష్ఠములందలి ఓషధులను సేవించుటచే వాత దోషము తొలగును. తృతీయ, ఏకాదశ, షడ్వింశ, సప్తవింశ ఓషధుల సేవనముచే పిత్త రోగము నశించును. 6, 7, 8, 15 ఓషధుల సేవనముచే కఫ దోషము నివర్తించును. 34, 35, 36 కోష్ఠములందలి ఓషధులను ధరించుటచే వశీకరణము సిద్ధించును. గ్రహబాధ, భూతబాధ మొదలు నిగ్రహము వరకును గల అన్ని బాధలు తొలగును. 1, 2, 3, 6, 7, 8, 9, 11వ ఓషధులను 22, 15, 12వ ఓషధులను ధరించినచో పై ఫలము లభించును. సందేహించ పనిలేదు. 36 కోష్టములలో చెప్పిన ఈ ఓషధుల విషయమును ప్రతివానికి చెప్పగూడదు. (141)