అగ్ని మహా పురాణము

Table of Contents

వర్ణాశ్రమ ధర్మములు, ఇతర ధర్మములు

అగ్ని పలికెను:

ఏ ధర్మములను ఆచరించి మన్వాదులు భుక్తిముక్తులు పొందిరో వాటిని పుష్కరుడు, పరశురామునకు, వరుణోక్త ప్రకారమున చెప్పెను. పుష్కరుడు ఇట్లు చెప్పెను: వాసు దేవాదులకు సంతోషమును కలిగించునవియు, మన్వాదులు చెప్పినవియు అగు వర్ణ, ఆశ్రమ, సర్వసాధారణ ధర్మములను నీకు చెప్పెదను. పరశురామా! అహింస, సత్యము, భూతదయ, అనుగ్రహబుద్ధి, తీర్థయాత్ర, దానము, బ్రహ్మచర్యము, మాత్సర్యము లేక పోవుట, దేవ బ్రాహ్మణ పూజనము, గురు శుశ్రూష, సర్వధర్మ శ్రవణము, పితృపూజనము, రాజభక్తి, సర్వదా ఉత్తమశాస్త్రముల సాహాయ్యముననే విషయములను తెలిసికొనుట, క్రౌర్యము లేకుండుట, ఓర్పు, ఆస్తిక్యబుద్ధి-ఇవి అన్ని వర్ణములకును, ఆశ్రమములకును సాధారణములగు ధర్మములు. యజనము, యజ్ఞముచేయించుట, దానము, వేదాధ్య ధ్యాపనము, ప్రతిగ్రహము, అధ్యయనము-ఇవి బ్రాహ్మణుల కర్మలు. దానము, అధ్యయనము, యజనము-ఇవి క్షత్రియ వైశ్యుల ధర్మములు. పాలనము, దుష్ట నిగ్రహము, ఇవి క్షత్రియుని విశేష ధర్మములు. అట్లే వైశ్యునకు వ్యవసాయము, గోసంరక్షణ, వాణిజ్యము, విశేష ధర్మములు.

శూద్రునకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల శుశ్రూష లేదా వివిధ శిల్పములు ధర్మము. బ్రాహ్మణాదులకు ఉపనయనమైనది మొదలు రెండవ జన్మ. అనులోమ్యమున (తండ్రి పై వర్ణమువాడై, తల్లి క్రింది వర్ణమునకు చెందినపుడు) పుట్టినవారి జాతి తల్లి జాతితో సమమగును. ప్రాతిలోమ్యమున (పై కులము స్త్రీ, పురుషుడు క్రింది కులము అయినపుడు) శూద్రునివలన బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడు చండాలుడు, క్షత్రియునివలన బ్రాహ్మణియందు పుట్టినవాడు సూతుడు, వైశ్యుని వలన పుట్టినవాడు దేవలుడు. క్షత్రియ స్త్రీయందు శూద్రుని వలన పుట్టినవాడు మాగధుడు. వైశ్యస్త్రీయందు శూద్రునివలన పుట్టిన వాడు ఆయోగవుడు. ప్రతిలోమ స్త్రీలకు ప్రతిలోమ పురుషులవలన (పుట్టినవారు వేలకొలది భేదములలో నుందురు) వారికి వివాహము తమతో సమానమైన జాతికలవారితోనే జరుగవలెను. అధములతో గాని, ఉత్తములతోగాని ఈ వివాహము జరుగరాదు. వధ్యులను చంపుట చండాలుల కర్మ. స్త్రీలకు ఉపయోగించు వస్తువులను తయారుచేయుట, స్త్రీలను రక్షించుట వైదేహకుని కర్మ. సారథ్యము సూతుని కర్మ. వేటచే జీవనము పుక్కసుని కర్మ. స్తుతి చేయుట మాగధుని కర్మ. రంగమునందు దిగుట, శిల్పజీవనము ఆయోగవుని కర్మ. చండాలుడు గ్రామముబైట నుండి శవ వస్త్రములను ధరించవలెను. ఇతర వర్ణములవారిని స్పృశించగూడదు. గో బ్రాహ్మణుల నిమిత్తము, స్త్రీ బాలాదుల రక్షణ నిమిత్తము ప్రాణ త్యాగము చేయుటచే చండాలాదులకు ఆధ్యాత్మికోన్నతి లభించును. సంకరజాతుల వారి జాతిని వారి తల్లి దండ్రులను బట్టియు, జాతిసిద్ధములగు కర్మలను బట్టియు నిర్ణయించవలెను. (151)