అగ్ని మహా పురాణము
సమయదీక్షా విధానము
ఈశ్వరుడు పలికెను-ఇపుడు భోగ, మోక్షప్రదమగు దీక్షా విధానమును గూర్చి చెప్పెదను. ఇది సమస్త పాపములను నశింపచేయును. మల, మాయాదులను తొలగించును. శిష్యునకు జ్ఞానమును కలిగించుదానికి దీక్ష అని పేరు. అది భోగ మోక్షములను ఇచ్చును. విద్యచే అనుగ్రహింపదగిన శిష్యుడు, విజ్ఞానాకలుడు, ప్రళయాకలుడు, సకలుడు అని మూడు విధములు, కేవలము మలరూపమగు పాశముకలవాడు ‘విజ్ఞానకలుడు’, మలముల చేతను, పాశములచేతను బద్దుడైనవాడు ‘ప్రళయాకలుడు’. కళలు మొదలు భూమి వరకును గల సకలతత్త్వ సమూహములచే బద్ధుడైనవాడు ‘సకలుడు’. ఈ పాశములనుండి ముక్తి పొందవలెనన్నచో జీవుడు (పశువు) ఆచార్యుని నుండి మంత్రారాధన దీక్ష గ్రహింపవలెను. ఈ దీక్ష ‘నిరాధార’, ‘సాధార’ అని రెండు విధములు, విజ్ఞానాకల, ప్రళయాకలులకు నిరాధార దీక్ష విహితమైనది. ‘సకల జీవులకు సాధార దీక్ష విహితమైనది. ఆచార్యుని అపేక్ష లేకుండగనే శంభువుని నుండి తీవ్ర శక్తిపాతముచేసి ఇవ్వబడు దీక్షకు ‘నిరాధార’ దీక్షయని పేరు. శివుడు ఆచార్యుని శరీరములో నుండి మంద, తీవ్రాది భేదభిన్నమగు తన శక్తితో ఇచ్చు దీక్షకు ‘సాధారదీక్ష’ యనిపేరు. ఈ సాధార దీక్షలో నున్న ‘సబీజ, నిర్బీజ, సాధికార, అనధికారములను నాలుగు భేదములనుగూర్చి చెప్పెదను. సమర్థులకు ఇచ్చు సమయాచార యుక్త దీక్షకు ‘సబీజ దీక్ష’ యనియు, అసమర్థులకు ఇచ్చు సమాయాచార శూన్యదీక్షకు ‘నిర్బీజ దీక్ష’ అనియు పేర్లు. సాధకునకు, ఆచార్యునకును నిత్య, నైమిత్తిక, కామ్యకర్మలందు అధికారమును కలిగించు దీక్షకు ‘సాధికార దీక్ష’ యని పేరు. నిర్బీజ దీక్షా దీక్షితులకును, సమయా చార దీక్షను స్వీకరించు సాధారణ శిష్యులకును, పుత్రకులు అను పేరుగల శిష్యులకును నిత్య కర్మలందు మాత్రమే అధికారము. అందుచే వారికి ఇచ్చు దీక్ష నిరధికార దీక్ష సాధార, నిరాధార దీక్షలకు కూడ, ఒక్కొక్క దానికి, ‘క్రియావతి’ ‘జ్ఞానవతి’ అను రెండేసి భేదము లున్నవి. కర్మకాండ విధి ప్రకారము కుండము, మండలము స్థాపించి, పూజచేయు దీక్ష ‘క్రియా వతి’ బాహ్య సామగ్రి ఏదియు లేక మానసిక వ్యాపార మాత్రముచేతనే సాధ్యమైనది ‘జ్ఞానవతి’.
ఈ విధముగ దీక్ష అధికారముగల ఆచార్యునిచేత ఇవ్వబడును. స్కందా! గురువు నిత్యకర్మలను యథా శాస్త్రముగ నిర్వర్తించుకొని శిష్యునకు దీక్ష ఇవ్వవలెను. గురువు ప్రణజపము చేయుచు తన కరకమలములతో అర్ఘ్యము గ్రహించి ద్వారపాలపూజ చేయవలెను. విఘ్న నివారణముచేసిన పిమ్మట ద్వారము గుమ్మము మీద అస్త్రన్యాసము చేసి, తన ఆసనముపై కూర్చుండి శాస్త్రోక్త విధానమున భూత శుద్ధిని, అంతర్యాగమును చేయవలెను. తిలలు, బియ్యము, ఆవాలు, కుశలు, దూర్వాంకురములు (గరిక చిగుళ్ళు), యవలు, పాలు, ఉదకము-వీటిని అన్నింటిని ఒక చోట ఉంచి విశేషార్ఘ్యము ఏర్పరచుకొనవలెను. ఆ జలముతో సమస్త ద్రవ్యముల శుద్ధి చేయవలెను. తిలకము ధరించి, వెనుకటి వలెనే పూజా, మంత్ర శోధన, పంచగవ్య ప్రాశనాదికము చేసి, పేలాలు, చందనము, ఆవాలు, భస్మము, దూర్వలు, అక్షతలు, కుశలు, చివర మరల శుద్ధమైన పేలాలు అను వికిర ద్రవ్యములు (చల్లుటకు ఉపయోగించు ద్రవ్యములు) గ్రహించి, అస్త్రమంత్రముచే ఏడు పర్యాయములు అభిమంత్రించి, అస్త్ర మంత్రాభి మంత్రిత జలముతో ప్రోక్షించి, కవచ మంత్రముచే (హుమ్) ఆచ్ఛాదించి-‘ఇది విఘ్న సమూహములను తొలగించు నానావిధాస్త్ర శస్త్రములు’ అని భావన చేయవలెను. పిమ్మట ప్రాదేశ మాత్రము పొడవైన ముప్పది ఆరు కుశదళములతో లేణీ రూపమును, బోధమయమును అగు ఉత్తమ ఖడ్గము నిర్మించి, దానిని శివ మంత్రము ఏడు పర్యాయములు జపించి, అభిమంత్రించవలెను. అది శివ స్వరూపముగ భావించి తన హృదయమున ఉంచుకొనవలెను. తనకు అభీష్టమైన శివుని రూపమును ధ్యానించుచు, నిష్కల పరమాత్మయగు ఆ శివుని తనలో న్యాసము చేసికొన వలెను. పిదప ‘నేనే శివుడను’ అని భావన చేయవలెను. శిరస్సుపై తెల్లని శిరస్త్రాణము ధరించి తన శరీరమును అలంకరించుకొనవలెను. పిమ్మట గురువు తన కుడిచేతిపై సుగంధ ద్రవ్యములతో గాని, కుంకుమతో గాని మండలమును నిర్మించవలెను. దానిపై శివుని పూజించవలెను. ఇట్లు చేయుటచే అది శివహస్తమగును. తేజస్వియైన ఆ శివ హస్తమును తన శిరస్సుపై ఉంచుకొని, ‘నేను శివుడను సకల జగత్సృష్టయగు పరమాత్ముడనైన శివుడను నేనే’ అని దృఢమగు భావన చేయవలెను. ఈ విధముగ భావన చేసిన గురువు యజ్ఞ మండపమునందు కర్మ సాక్షిగాను, కలశముపై యజ్ఞరక్షకుడుగాను, అగ్నిలో హోమాధిష్ఠాత గాను, శిష్యుని అజ్ఞానమయ పాశచ్ఛేత్తగాను, అంతరాత్మయందు అనుగ్రహ కర్తగాను, ఐదు విధముల అభివ్యక్తుడైన ఈశ్వర రూపుడగును. ఆ ‘పరమేశ్వరుడను నేనే’ అను దృఢతరమగు భావన గురువునకు ఉండవలెను.
పిమ్మట గురువు జ్ఞానరూపమగు ఖడ్గము చేతధరించి యజ్ఞమండపము నైరృతి దిక్కున ఉత్తరాభిముఖుడై నిలచి జల-పంచగవ్యములతో మండపమును ప్రోక్షించి, ఈక్షణాది చతుష్పఢాంత సంస్కారములతో దానిని సంస్కరింపవలెను. యజ్ఞ మండపమున చల్లవలసిన వస్తువులనుచల్లి వాటిని కుశకూర్చతో ప్రోగుచేసి, ఈశాన కోణమునందు స్థాపితమగు వర్ధనికి ఆసనముగ చేయ వలెను. నైరృతి దిక్కునందు వాస్తు దేవతలను, పశ్చిమ ద్వారమున లక్ష్మిని పూజించవలెను. ‘ఈ మండప రూపిణియగు లక్ష్మిరత్నములతో యజ్ఞమండపమును నింపుచున్నది’ అని భావన చేయవలెను. ఈ విధముగ ధ్యానించి ఆవాహనముచేసి, హృదయ మంత్రముతో (నమః) పూజించవలెను. ఈశాన్యమున సప్తధాన్యములపై స్థాపితమైన, వస్త్ర వేష్టితము, పంచరత్న యుక్తము అగు పశ్చిమాభిముఖమైన జలపూర్ణ కలశముపై శంకరుని పూజించవలెను. ఆ కలశమునకు దక్షిణమున సింహముపై కూర్చున్న శక్తిని, పశ్చిమమున ఖడ్గ రూపిణియగు వర్ధనిని పూజించవలెను. పిమ్మట పూర్వాది దిక్కులందు ఇంద్రాది దిక్పాలకులను పూజించి, అంతమున విష్ణువును పూజించ వలెను. ఆ దేవతలందరును ప్రణవరూపమగు ఆసనమున కూర్చుండి, తమతమ వాహనములతోను, ఆయుధములతోను కూడియున్నట్లు భావన చేయుచు, వారి నామధేయములకు ‘నమః’ చేర్చి పూజచేయవలెను. మొదట వర్ధనిని హస్తమున గ్రహించి, కలశము ఎదుటకు తీసికొనివెళ్ళి ప్రదక్షిణ క్రమమున దాని నాల్గు వైపుల త్రిప్పి, దానినుండి అవిచ్ఛిన్నముగ జలధారపడునట్లు చేయవలెను. మూలమంత్రము ఉచ్చరించుచు ‘లోకపాలులారా! మీరందరును యథాశక్తిగ ఈ యజ్ఞమును రక్షింపుడు’ అని శివాజ్ఞను వారికి వినిపించి, క్రింద ఒక కలశమునుంచి, దానిపై వర్ధనిని స్థాపింప వలెను. పిమ్మట సుస్థిరమైన ఆసనముపై ఉంచిన కలశముపై శివుని సాంగపూజ చేయవలెను. పిమ్మట కలాది షడధ్వన్యాసము చేసి, శోధనముచేసి, వర్థనిపై అస్త్రమును పూజించవలెను.
‘ఓం హః అస్త్రాసనాయ హూంఫట్’ మొదలు ‘ఓం ఫట్ అస్త్రాయ హూం ఫట్ నమః’ వరకును పైన చెప్పినవి అస్త్రపూజా మంత్రములు.
పిమ్మట పాశుపతాస్త్ర స్వరూపమును ఈ విధముగ చింతన చేయవలెను. దానికి కోరలతో కూడిన నాలుగు ముఖములుండును. హస్తములలో శక్తి, ముద్గర, ఖడ్గ, త్రిశూల ములు ఉండును. వాటి కాంతి కోటి సూర్యకాంతి సమానముగ ఉండును. పిమ్మట లింగముద్రను చూపి, భగలింగ సమాయోగము చూపవలెను. హృదయ మంత్రమును (నమః) ఉచ్చరించుచు అంగుష్ఠముతో కలశమును, ముష్టితో ఖడ్గరూపమగు వర్ధనిని స్పృశించవలెను. ముష్టితో ముందుగా వర్ధనిని స్పృశించినచో భోగ మోక్షముల అభివృద్ధి కలుగును. కలశముఖ రక్షణము నిమిత్తము దానిపై వెనుక చెప్పిన జ్ఞాన ఖడ్గమును ఉంచవలెను. మూలమంత్రము నూట ఎనిమిది పర్యాయములు జపించి ఆ జపమును కూడ కలశము నకు సమర్పించవలెను. పదవవంతు జపముచేసి దానిని వర్ధనికి సమర్పించవలెను. పిమ్మట-‘సకలయజ్ఞధారకుడవైన భగవంతుడవైన జగన్నాథా! ఈ యజ్ఞ మందిరమును చాల ప్రయత్నముతో రక్షించుము’ అని భగవంతుని ప్రార్థించవలెను.
పిదప ప్రణవమయమైన ఆసనముపై కూర్చొనియున్న చతుర్భుజుడగు గణేశుని వాయవ్యదిక్కు నందు పూజించవలెను. అనంతరము వేదిపై శివుని పూజించి, అర్ఘ్యమునుచేత గ్రహించి యజ్ఞ కుండము వద్దకువెళ్ళి, అచట కూర్చుండి మంత్రదేవతా తృప్తి కొరకు వామ భాగమునందు అర్ఘ్యగంధ-ఘృతాదులను, కుడివైపున సమిధలు, కుశలు, తిలలు మొదలగు వాటిని ఉంచి, వెనుకటి వలెనే కుండ, అగ్ని, ఘృత, సృక్ ఆదులను సంస్కరించి, హృదయమున ఊర్ధ్వముఖాన్ని ప్రాధాన్యమును భావించుచు అగ్నియందు శివుని పూజించవలెను. పిమ్మట గురువు తన శరీరమునందును, శివకలశమునందును, మండలము నందును, అగ్నియందును, శిష్యుని దేహమునందును సృష్టి న్యాసక్రమమును న్యాస కర్మను చేసి, యథా శాస్త్రముగ అధ్వశోధనముచేసి, అగ్నికుండము పొడవు వెడల్పు లను పట్టి అగ్నిదేవుని ముఖము పొడవు వెడల్పులను భావన చేయుచు, అగ్నిజిహ్వా నామ మంత్రముల చివర ‘నమః’ చేర్చి పలుకుచు అభీష్ట వస్తువుల హోమముచేసి అగ్నిని తృప్తుని చేయవలెను. అగ్ని జిహ్వలు ఏడింటికిని ఏడు బీజములున్నవి. హోమము చేయుటకై అవి యేవియో చెప్పబడుచున్నది.
రేఫ తప్ప మిగిలిన చివరి రెండు వర్ణముల అన్ని అక్షరములకును, అనగా య మొదలు ‘హ’ వరకు ఉన్న ఏడక్షరములకును రేఫ-ఊకారములను చేర్చి, దానిమీద అర్ధ బిందువును చేర్చగా అవి య్రూట, ల్రూట, వ్రూట, శ్రూట, ఘ్రాట, స్రూట, హ్రూట అనునవి) ఏడు అగ్నిజిహ్వల బీజ మంత్రములు. హిరణ్య, కనక, రక్త, కృష్ణ, సుప్రభ, అతిరిక్త, బహురూప, అని అగ్ని జిహ్వా నామములు. వీటి ముఖములు వరుసగ ఈశాన్య, పూర్వ, ఆగ్నేయ, నైరృతి, పశ్చిమ, వాయవ్య, మధ్య దిక్కులందు ఉండును. శాంతిక, పౌష్టిక కర్మలలో క్షీరాది మధుర పదార్థములను, అభిచార కర్మలలో ఆవాల తెలకపిండి, సక్తువులు, యవల గంజి ఉప్పు, రాజికలు, కటు తైలములు, ముళ్లు, వంకర టింకరగా ఉన్న సమిధలు, వీటితో క్రోధ పూర్వకముగా, భాష్య మంత్రముతో హోమము చేయవలెను.
కదంబపు మొగ్గలు హోమము చేసినచో తప్పక యక్షిణి సిద్ధించును. వశీకరణ -ఆకర్ణణములకై బంధూక-కింశుక పుష్పాదులను హోమము చేయవలెను. రాజ్య లాభము కొరకై బిల్వ ఫలములను, లక్ష్మీ ప్రాప్తి కొరకు పాటల చంపక పుష్పములను, చక్రవర్తిత్వము కొరకై పద్మములను, సంపద కొరకు భక్ష్య-భోజ్య పదార్థములను, వ్యాధి వినాశము కొరకు దూర్వలను, సర్వ ప్రాణులను వశము చేసికొనుటకు ప్రియంగు-పాటలీపుష్పాలను హోమము చేయవలెను. మామిడి ఆకుల హోమము జ్వరమును నశింపచేయును. మృత్యుంజయ దేవత-మంత్రముల ఉపాసన చేయువాడు మృత్యువును జయించును. తిలల హోమముచే అభ్యుదయ సిద్ధి కలుగును. రుద్రశాంతి సమస్త దోషములను శాంతింపచేయును. ఇప్పుడు ప్రస్తుత విషయము చెప్పబడును.
నూట ఎనిమిది ఆహుతులచే మూలమును అందు దశాంశముచే అంగములను తర్పింప చేయవలెను. ఈ హోమమును మూలమంత్రముతో చేయవలెను. పిమ్మట వెనుకటి వలె పూర్ణాహుతి ఇవ్వవలెను. శిష్యులకు దీక్షాప్రవేశము నిచ్చుటకై ఒక్కొక్క శిష్యుని ఉద్దేశించి వందసార్లు జపము చేయవలెను. దుర్నిమిత్త నివారణముకొరకు, శుభనిమిత్తముల సిద్ధి కొరకును వెనుకటి వలెనే మూలమంత్రముతో రెండు వందల ఆహుతులు ఈయవలెను. మొదట చెప్పిన ఎనిమిది అస్త్ర మంత్రముల ఆదియందు మూల మంత్రమును, అంతమునందు ‘స్వాహా’ను చేర్చి ఉచ్చరించుచు ఒక్కొక్కసారి తర్పణము చేయవలెను. మూలమంత్రమునందలి బీజములను శిఖా మంత్రము (వషట్)తో సంపుటితము చేసి, చివర ‘హూంఫట్’ చేర్చి జపము చేసినచో మంత్ర దీపనము అగును. ‘ఓం హూం శివాయ స్వాహా’ ఇత్యాది మంత్రాభిమంత్రితమగు ఉదకముతో కడిగి కవచ మంత్రముచే ఆచ్ఛాదించి, దానికి చందనాదులు పూయవలెను. దాని కంఠమునకు ‘హూం ఫట్’ మంత్రముచే అభిమంత్రితమైన ఉత్తమ కుశ-సూత్రములు కట్టవలెను. దీనితో చరుసిద్ధి యగును.
ధర్మము మొదలైన నాలుగు పాదములుగల ఆసనము నందు ఏర్పరుపబడిన అర్ధ చంద్రాకార మండలము నందు పాత్రమునుంచి, అదియే ఆరాధ్య దేవతామూర్తి అని భావించి, దానిపై భావాత్మక పుష్పములతో శివుని పూజ చేయవలెను. లేదా ఆ పాత్రమునకు వస్త్రముకట్టి, దానిపై బాహ్య పుష్పములతో శివుని పూజించవలెను. పశ్చిమాభి ముఖముగా ఉంచిన శుద్ధమైన పొయ్యిపై అహం కార బీజమును స్యసించవలెను. పిమ్మట దానిని కుండమునకు కుడి వైపున ఉంచి ‘ఈ పొయ్యి శరీరము ధర్మాధర్మ మయమైనది’ అని భావనచేయవలెను. దాని శుద్ధికై అస్తమంత్రము జపించుచు స్పృశించవలెను. పిమ్మట అస్త్రమంత్రము (ఫట్)చే అభిమంత్రింపబడిన గోఘృతముచే మార్జితమైన ఆ పాత్రను పొయ్యిపై ఉంచవలెను. అస్త్రముచే శుద్ధము చేసిన గోక్షీరమును ప్రాసాద మంత్రము (హౌం)చే నూరుసార్లు అభిమంత్రించి ఆ పాత్రలో పోసి, ఆ పాలలో శ్యామాకాది తండులమును ఉంచవలెను. ఒక శిష్యుని దీక్షావిధికై ఐదు చేరలు బియ్యము పోయవలెను. ఇద్దరు ముగ్గురు లేదా ఎక్కువ మంది శిష్యులున్నచో వారి సంఖ్యను బట్టి ఐదేసి చేరలు పెంచుతూ పోయవలెను. అస్త్రమంత్ర ముతో నిప్పుముట్టించి, కవచ మంత్రముతో పాత్రను మూతపెట్టవలెను. పూర్వాభిముఖుడై శివాగ్నిలో, మూల మంత్రోచ్చారణ పూర్వకముగ చరువును వండవలెను.
తండులములు బాగుగా ఉడికిన పిమ్మట స్రువము నిండ ఆజ్యముపోసి, స్వాహాన్త సంహితా మంత్రములతో, పొయ్యిలో తప్తాభిషరము అను హోమము చేయవలెను. ఆ చరుపాత్రను మండల ముపై ఉంచి, అస్తమంత్రముతో దానిపై కుశలను ఉంచవలెను. ప్రణవముతో పొయ్యిపై గీసి, హృదయ మంత్రముతో అలికి వెనుకటి వలెనే శీతాభఘారమను హోమము చేయవలెను. అప్పుడు పొయ్యి చల్లబడును. శీతాభిఘారము చేయు విధానము ఏమనగా-సంహితా మంత్రముల చివర ‘వౌషట్’ చేర్చి, దానితో కుండ మండపమునకు పశ్చిమమున దర్భాధ్యాసనముపై ఒక్కొక్క శిష్యుని నిమిత్తము ఒక్కొక్క హోమము చేయవలెను. స్రుక్కుతో సంపాతహోమముచేసి సంహితా మంత్రముతో శుద్ధి చేయవలెను. ‘వషట్’ చేర్చిన, సంహితా మంత్రముతో ఒక పర్యాయము చరువు గ్రహించి ధేనుముద్రతో అమృతీకరణము చేయవలెను. పిమ్మట వేదికపై, దానితో శాంతిహోమము చేయవలెను. పిమ్మట గురువు, శిష్యుల కొరకును, అగ్నిదేవత కొరకును, లోకపాలుల కొరకును ఘృత సహితములగు భాగములు ఏర్పరచవలెను. అన్ని భాగములందును ఆజ్యము సమముగా ఉండ వలెను. వారి నామమంత్రముల చివర ‘నమః’ చేర్చి, వారివారి భాగములను అర్పించి, ఆ మంత్రము తోడనే వారికి ఆచమనీయము సమర్పించవలెను.
పిమ్మట మూల మంత్రముతో నూట ఎనిమిది హోమములుచేసి, యథాశాస్త్రముగ పూర్ణాహుతి ఇవ్వవలెను. మండలములోపల, కుండమునకు తూర్పునగాని, శివ-కుండముల మధ్యయందు గాని హృదయ మంత్రముతో, రుద్ర-మాతృకాగణాదులకు అంతర్బలి సమర్పించవలెను. శివుని ఆశ్రయించి, ఆతని ఆజ్ఞ పొంది, ఏకత్వభావన చేయుచు ఈ విధముగ భావన చేయవలెను, ‘సర్వజ్ఞత్వాది గుణములతో కూడినవాడును, సమస్తాధ్వలకును పైన ప్రకాశించుచున్న వాడును అగు శివుడను నేనే. ఈ యజ్ఞస్థానము నా అంశము. నేనే యజ్ఞాధిష్ఠాతను’. ఈ విధముగ అహంకార పూర్వకముగ-అనగా శివాభేద దృష్టితో-గురువు యజ్ఞమండపము నుండి బైటకు రావలెను. అస్త్రమంత్రముచే (ఫట్) నిర్మించిన మండలముపై తూర్పునకు అగ్రములు ఉండునట్లు ఉత్తమమైన కుశలు కప్పి, దానిపై ప్రణవమయమగు ఆసనము భావన చేయుచు, స్నానము చేసిన శిష్యుని దానిపై కూర్చుండ బెట్టవలెను. శిష్యుడు ఆ సమయమున శ్వేతవస్త్ర ఉత్తరీయములు ధరించి ఉండవలెను. అతడు ముక్తి కాముడైనచో ఉత్తరాభిముఖుడుగను, భుక్తి కాముడైనచో పూర్వాబిముఖుడుగను కూర్చుండవలెను. శిష్యుని చీలమండల పై భాగము ఆసనముపై ఉండవలెను. క్రింది భాగము ఉండగూడదు. గురువు శిష్యుని దగ్గర పూర్వాభిముఖుడై కూర్చుండవలెను. మోక్షమును అభిలషించినచో, శిష్యుని అంగములపై పాదముల నుండి శిఖ వరకును, భోగములను అభిలషించిన పక్షమున శీఖనుండి పాదముల వరకును, ప్రసన్నము, శైవతేజస్సును ప్రసరింప చేయునదియు అగు దృష్టితో చూడవలెను.
పిమ్మట అస్త్ర మంత్రముచే అభిమంత్రించిన జలముతో శిష్యుని ప్రోక్షించి మంత్రోదక స్నానము పూర్తి చేయవలెను. పిమ్మట విఘ్నశాంతి కొరకును, పాప వినాశము కొరకును భస్మస్నానము చేయించవలెను. అస్త్ర మంత్రముచే భస్మమును అభిమంత్రించి, దానితో శిష్యుని సృష్టి సంహార యోగముచే తాడనము చేయవలెను. అనగా పై నుంచి క్రిందికిని, క్రిందినుండి పైకిని వాని శరీర ముపై భస్మము చల్లవలెను. అదియే భస్మస్నానము. పిదప సకలీకరణము నిమిత్తమై, వెనుకటివలెనే అస్త్ర జలముతో శిష్యుని ప్రోక్షించి, అస్త్ర మంత్రోచ్ఛారణ పూర్వకముగ కుశాగ్రముతో నాభి నుండి పై భాగమునందు మార్జనము చేయవలెను. హృదయ మంత్రము జపించుచు కుశమూలములతో నాభి నుండి క్రింది భాగమును, పాపవినాశార్థమై, స్పృశించవలెను. సమస్త పాశములను భేదించుటకై అస్త్ర మంత్రముతో మరల ఆ కుశలతోడనే పూర్వము చెప్పిన విధము మార్జన స్పర్శనములు చేయవలెను. పిమ్మట ఆతని శరీరముపై ఆసనసహితుడైన సాంగ శివుని న్యాసము చేసి, శివ భావనతో, పుష్పాదులచే ఆతనిని పూజించవలెను. పిమ్మట నేత్ర మంత్రము (వౌషట్ గాని, హృదయ మంత్రము (నమః) గాని ఉచ్చరించుచు తెల్లనిదియు, దశకలదియు అగు వస్త్రముతో ఆతని నేత్రములు కట్టవలెను. ప్రదక్షిణ క్రమమున ఆతని శివుని వద్దకు తీసికొని వెళ్లి, అచట శివునకు కుడివైపున కూర్చుండబెట్టవలెను. సంహారముద్రచే తనను శివాభిన్నునిగ చేసి, ఆతని హృదయ పద్మమున నిరోధించి, న్యాసముచేసి, ఆతనిని పూజించవలెను.
తూర్పునకు తిరిగి కూర్చొని ఉన్న శిష్యుని శిరముపై మూల మంత్రముచే శివ హస్తము ఉంచవలెను. అది రుద్రేశ పదమును ఇచ్చును. పిమ్మట శిష్యుని హస్తమునందు, శివ మంత్ర పురస్సరముగా శివసేవా ప్రాప్తికి ఉపాయముగా ఒక పుష్పమును ఉంచవలెను. దానిని శివునిపై ఉంచవలెను. పిమ్మట ఆతని నేత్రములకు కట్టిన వస్త్రము తొలగించి, ఆతని కొరకై శివదేవగణాం కితమైన స్థాన మంత్ర-నామాదికమును ఊహించవలెను. లేదా, బ్రాహ్మణాది వర్ణములకు, వరుసగ, తన ఇష్టము వచ్చిన పేరు ఉంచవలెను. శివ కలశమునకును, వర్ధనికిని నమస్కరింపచేసి అగ్ని సమీపమున, తనకు కుడి ప్రక్కన ఉన్న ఆసనముపై, శిష్యుని వెనుకటివలెనే ఉత్తరాభిముఖముగ కూర్చుండబెట్టి-“ఆతని శరీరమునుండి సుషుమ్నా నాడి బైటకువచ్చి నా శరీరములో విలీనమైనది’ అని భావన చేసి, మూలమంత్రముచే అభిమంత్రించిన దర్భను గ్రహించి, దాని అగ్రమును శిష్యుని హస్తము నందును, మూల భాగమును తన కాలిపైనను లేదా, అగ్రభాగమును తన కాలిపైనను, మూల భాగమును శిష్యుని హస్తమునందును ఉంచవలెను. శివ మంత్రముతో రేచక ప్రాణాయామము చేసి, శిష్యుని హృదయములో ప్రవేశించుచున్నట్లు భావన చేయుచు, మరల అదే మంత్రముతో పూరక ప్రాణాయామముచే తిరిగి తన హృదయాకాశమును చేరినట్లు భావన చేయవలెను. శివాగ్నిచే ఈ విధమగు నాడీ సంధానముచేసి, తత్సన్నిధానము నిమిత్తము హృదయ మంత్రముతో మూడు హోమములను చేయవలెను. శివహస్త స్థైర్యము కొరకై, మూల మంత్రముతో నూరుహోమములు చేయవలెను. ఈ విధముగ చేయుటచే శిష్యుడు సమయ దీక్షా సంస్కార యోగ్యుడగును. (81)
