అగ్ని మహా పురాణము

Table of Contents

కామశాస్త్రము

పుష్కరుడు చెప్పెను:

ఇపుడు అంతఃపురమును గూర్చి చెప్పదను. ధర్మార్థకామములను మూడు పురుషార్థములకు ‘త్రివర్గ’ మని పేరు. వీటిలో ఒక దానిని మరొక దానితో రక్షించుచు రాజు స్త్రీలతో ఈ త్రివర్గమును సేవించవలెను. త్రివర్గము ఒక మహా వృక్షము వంటిది. ధర్మము దాని వేళ్ళు, అర్థము శాఖలు, కామము ఫలము. ఆ వృక్షమును మూల సహితముగా రక్షించిన యెడలనే రాజు ఫలమును పొందగలుగును. పరశురామా! స్త్రీలు కామమునకు వశవర్తినులై యుందురు. వారి కొరకై రత్నములను సంగ్రహించవలెను. విషయ సుఖములు కోరు రాజు స్త్రీలను సేవించవచ్చును గాని అతిగా చేయగూడదు. ఆహార, నిద్రా, మైథునములు మూడింటి యందును అతిగా ప్రవర్తింపరాదు. అట్లు చేసినచో రోగములు ఉత్పన్నములు అగును. తనపై అనురాగముగల స్త్రీలను మాత్రమే తన మంచము మీదకి రానియ్యవలెను. దురాచారవంతురాలు తన భర్తను గూర్చి సంభాషణమును గూడ రుచింపనిదియు, ఆతని శత్రువులతో కలియునదియు, అతి గర్వవంతురాలును, ముద్దు పెట్టుకొన్నపుడు ముఖమును తుడిచి వేయునదియు లేదా కడుగుకొనునదియు, భర్త ఇచ్చిన వస్తువులపై ఆదరము చూపనిదియు, భర్త కంటె ముందుగనే నిద్రించి ఆతడు లేచిన తరువాత లేచునదియు, స్పృశించగా శరీరమును కంపింప చేయునదియు, ప్రతి అవయవము నందును అవరోధము కల్పించునదియు, భర్త పలుకు ప్రియవాక్యములను సరిగా వినక పరాఙ్ముఖురాలుగా ఉండునదియు, ఎదుటకు వచ్చి, ఏదైన వస్తువు ఇచ్చినపుడు దానిని చూడనిదియు, తన జఘనమును పూర్తిగా ఆచ్ఛాదించుటకును, భర్త స్పృశించుటకు వీలుకాకుండునట్లు చేయుటకును ప్రయత్నించు నదియు, భర్తను చూడగానే ముఖము ముడుచుకొనునదియు, ఆతని మిత్రుల విషయమున వైముఖ్యము చూపునదియు, ఆతడే స్త్రీలను ప్రేమించునో వారి విషయమున ఔదాసీన్యము చూపు నదియు, శృంగారించుకొను సమయమునందు కూడ శృంగారించుకొననిదియు అగు స్త్రీ విరక్తురాలని అర్థము. అట్టి స్త్రీని పరిత్యజించి అనురక్తురాలిని సేవించవలెను. అనురాగవతియైన స్త్రీ భర్తను చూడగనే సంతోషముతో వికసితముఖి యగును. మరొకవైపు ముఖమున్నను నేత్రాంతములతో ఆతనిని చూచు చుండును. భర్త తనను చూచుచున్నప్పుడు తన చంచల దృష్టిని కొంచెము మరొకవైపు త్రిప్పు కొనును, కాని పూర్తిగా త్రిప్పుకొనదు. అప్పుడప్పుడు తన గుప్తాంగములను కూడ చూపుచుండును. తన శరీరములో ఆ సుందరమైన అంశమేదైన ఉన్నచో దానిని ప్రయత్న పూర్వకముగ కప్పికొనును. భర్తను చూచుచు చంటిపిల్లవాని ఆలింగనము చేసికొని ముద్దు పెట్టుకొనును. సంభాషణలో పాల్గొనుచు సత్యమునే పలుకును. భర్త స్పర్శ కలుగగనే ఆమె అవయవములపై రోమాంచము, స్వేదము కలుగుచుండును. అతి సులభములైన వస్తువులను మాత్రమే అడుగును. ఆతడెంత చిన్న వస్తువునిచ్చినను చాల సంతసించును. ఆతని పేరు వినగనే ఆనందపరవశురాలై చాల ఆదరించును. భర్తకు తన వ్రేళ్ళ ఆనవాలు పడిన పండ్లు పంపుచుండును. ఆతనినుండి వచ్చిన వస్తువు ఆదరముతో గ్రహించి దానిని వక్షఃస్థలము నందు ఉంచుకొనును. తన ఆలింగనముచే భర్త శరీరమునందు అమృతలేపము చేయుచున్నట్లుండును. భర్త నిద్రించిన పిమ్మట నిద్రించును. ఆతనికంటె ముందుగనే మేల్కొనును. ఆతని ఊరువులను స్పృశించి నిద్ర నుండి మేల్కొల్పును.

పరశురామా! పెరుగు మీగడలో కొంచెము కపిత్థ చూర్ణము కలపగా తయారగు నేతివాసన చాల ఉత్తమమైనది. నెయ్యి, పెరుగు మొదలైనవాటితో యవలు, గోధుమలు మొదలైనవాటి పిండి కలుపగా ఉత్తమములైన ఖాద్య పదార్థములు తయారగును. ఇప్పుడు వివిధ ద్రవ్యముల గంధమును కలిగించు విధానము చెప్పెదను. శౌచము, ఆచమనము, విరేచనము, భావన, పాకము, బోధనము, ధూపనము, వాసనము అని ఎనిమిది విధములగు కర్మలు చెప్పబడినవి. కపిత్థము, బిల్వము, నేరేడు, మామిడి, కరవీరము-వీటి పల్లవములచేత శుద్ధముచేసిన నీటితో ఏ వస్తువులైనను కడిగి, పవిత్రమగునట్లు చేసినచో దానికి ‘శౌచనము’ అని పేరు. ఈ పల్లవములు లభించనిచో నీళ్ళలో కస్తూరి కలిపి వాటితో కడిగినచో శుద్ధియగును. నఖ, కూట, ఘన, జటామాంసీ, స్పృక్క శైలేయజ, జల, కుంకుమ, లాక్షా, చందన, అగరు, నీరద, సరల, దేవదారు, కర్పూర, కాంతా, వాల, కుందురుక, గుగ్గులు, శ్రీనివాస, కరాయలములను ఇరువది యొక్క ద్రవ్యములు ధూప ద్రవ్యములు. ఈ ఇరువది పదార్థములలో ఏవైన రెండు తీసికొని, వాటిలో కరాయలము కలిపి, వాటిలో సగము, తెలకపిండి, మలయచందన చూర్ణము చేర్చి తేనె కలుపవలెను. ఈ విధముగా ఇష్టానుసారము యథాశాస్త్రముగా కలిపిన ద్రవ్యములతో ధూపయోగములు తయారగును. త్వచా, నాడీ, ఫల, తైల, కేసర, గ్రంథిపర్వ, శైలేయ, తగర విష్ణు క్రాంతాబోల, కర్పూర, జటామాంసీ, మురా, కూటకములు స్నానోపయుక్త ద్రవ్యములు వీటిలో ఇష్టము వచ్చిన మూడు ద్రవ్యములు తీసికొని కస్తూరి కలిపి, ఇవన్నియు కలిపిన జలముతో స్నానము చేసినచో కామవృద్ధి కలుగును. త్వచా, మురా, నలదములను సమానమైన పాళ్ళలో తీసికొని, వీటిలో సగము సుగంధబాల కలిపి, వీటితో స్నానము చేసినచో శరీరమునుండి కమల గంధమువంటి గంధము వచ్చును. వీటితో తైలముకూడ పూసికొని స్నానము చేసినచో శరీరము రంగు కుంకుమ వర్ణ సదృశముగ నుండును. పైన చెప్పిన ద్రవ్యములకు సగముపాళ్ళు తగరముకూడ కలిపినచో శరీరము నుండి చమేలి పువ్వు వాసన వంటి వాసన వచ్చును. వాటిలో ద్వ్యామకమను ఓషధికూడ కలిపినచో మౌలసిరి పువ్వు వాసన వచ్చును. నువ్వుల నూనెలో మంజిష్ఠ, తగర, చోల, త్వచా, వ్యాఘ్రనఖ, నఖ, గంధ పత్రములను ఓషధులు కలపగా మంచి సువాసనగల తైలము తయారగును. తిలలను సుందర పుష్పములతో వాసితము చేసి వాటిని ఆడించిచేసిన నూనె ఆ పుష్పములవలె సుగంధము గలది అగును. ఏలకులు, లవంగాలు, కాకోలము, జాజికాయ, కర్పూరము-వీటిలో ఏదైన ఒకటి జాజిపత్రితో కలిపి నమలినచో ముఖము సుగంధ మగును. కర్పూర, కేసర, కాంతా, కస్తూరీ, మేడఫల, కబాబచీనీ, ఏలా, లవంగ, జాయఫల, పూగ, త్వక్పత్ర, త్రుటి, మోథా, లతా, కస్తూరీ, లవంగ కంటక, జాయఫల, జాయపత్ర, కటుక ఫలములను ఒక్కొక్క డబ్బెత్తు చొప్పున కలిపి, చూర్ణముచేసి, దానిలో నాల్గవవంతు వాసితమైన ఖైర సారము కలిపి మామిడి రసముతో అందముగా మాత్రలు చేసి ముఖమునందు ఉంచుకున్నచో ముఖ రోగములు అన్నియు తొలగిపోవును. వెనుకచెప్పిన ఐదుపల్లవముల జలముతో పోక చెక్కను కడిగి, యథాశక్తిగా పైన చెప్పిన మాత్రలకు ఉపయోగించు ద్రవ్యములతో వాసితము చేసినచో అది ముఖమును సుగంధ యుక్తము చేయును. కటకమును దాంతనకమును మూడు దినములు గోమూత్రమునందు తడిపి ఉంచినచో అది పోకచెక్కవలెనే ముఖమును సుగంధితము చేయును. త్వచాఅరణ్య హర్రేలను సమానమైన పాళ్ళలో గ్రహించి, దానిలో సగము కర్పూరము కలిపి నోటిలో ఉంచుకొనినచో తాంబూల గంధము వచ్చును. ఈ విధముగ రాజు తన సుగంధాది గుణములచే స్త్రీలను వశము చేసుకొని సర్వదా వారిని రక్షించవలెను. వారిని ఎన్నడును విశ్వసింప రాదు. ప్రధానపుత్రుని తల్లిని ఎన్నడును విశ్వసింపరాదు. రాత్రి అంతయు స్త్రీ గృహమున నిద్రింప రాదు. ఆమె చూపిన విశ్వాసము కృత్రిమము కావచ్చును. (224)