అగ్ని మహా పురాణము

Table of Contents

నర్మదాది మాహాత్మ్యము

ఇపుడు నర్మదాది మాహాత్మ్యమును చెప్పెదను.నర్మద శ్రేష్ఠమైన తీర్థము. గంగా జలము స్పర్శచే వెంటనే పవిత్రింపచేయును. కాని నర్మదదర్శన మాత్రము చేతనే పవిత్రింప చేయును. నర్మదా తీర్థము నూరు యోజనముల పొడవు, రెండు యోజనముల వెడల్పు ఉన్నది. అమర కంటతక పర్వతము నలువైపుల నర్మదానదికి సంబంధించిన అరువది కోట్ల అరువది వేల తీర్థములున్నవి. కావేరీ సంగమ తీర్థము చాల పవిత్రమైనది. ఇపుడు శ్రీపర్వత మాహాత్మ్యమును చెప్పెదను. ఒకమారు గౌరి శ్రీదేవి రూపము ధరించి గొప్ప తపస్సుచేసెను. దానిచే ప్రసన్నుడైన శ్రీహరి ఆమెకు వరములిచ్చుచు ఇట్లు చెప్పెను. ‘దేవీ! నీకు ఆధ్యాత్మ జ్ఞానము లభించును. ఈ పర్వతము శ్రీపర్వతమను పేర విఖ్యాతి నొందును. దీని నలువైపుల నాలుగు వేల యోజనముల ప్రదేశము చాల పవిత్రమగును.’ ఇచట చేసిన దాన, తపో, జప, శ్రాద్ధములు అక్షయఫలములగును. ఇచట మరణించు వారికి శివలోక ప్రాప్తి కలుగును. ఈ పర్వతముపై శివుడు సర్వదా పార్వతితో క్రీడించు చుండును. హిరణ్యకశిపుడు ఇచటనే తపస్సుచేసి చాలబలవంతుడయ్యెను. మునులు గూడ ఇచట తపస్సుచేసి సిద్ధి పొందిరి. (113)