అగ్ని మహా పురాణము

Table of Contents

వృక్షాది ప్రతిష్ఠా విధానము

శ్రీ భగవంతుడు చెప్పెను: ఇపుడు భోగమోక్షముల నిచ్చు వృక్ష ప్రతిష్ఠనుగూర్చి చెప్పెదను. వృక్షములకు సర్వౌషది జలములు పూసి, సుగంధ చూర్ణము చల్లి, మాలలచే అలంకరించి వస్త్రములు చుట్టబెట్టవలెను. అన్ని వృక్షములకు బంగారు సూదులతో కర్ణ వేధనముచేసి, సువర్ణమయ శలాకతో అంజన ముంచవలెను. వేదికపై ఏడు ఫలములుంచి, ఒక్కొక్క వృక్షమునకు అధివాసనముచేసి, కుంభము సమర్పించవలెను. పిదప ఇంద్రాది దిక్పాలకులను ఉద్దేశించి బలిప్రదానము చేయవలెను. వృక్షాధివాసన సమయమున, ఋగ్వేద మంత్రములతోగాని, యజుర్వేద మంత్రములతోగాని, సామవేద మంత్రములతో గాని, వరుణ దేవతాక మంత్రములతో గాని, మత్తభైరవ మంత్రములతో గాని హోమము చేయవలెను. శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు వృక్ష వేదికపైనున్న కలశములతో వృక్షముల కును, యజమానునకును స్నానము చేయించవలెను. యజమానుడు అలంకరించుకొని బ్రాహ్మణులకు గో, భూ, భూషణ, వస్త్రాదులు దక్షిణగా ఇచ్చి నాలుగు దివసములు క్షీర యుక్త భోజనము పెట్టవలెను. తిల, ఘృత, పలాశ సమిధలతో హోమము చేయించవలెను. అచార్యునకు రెట్టింపు దక్షిణ ఇవ్వవలెను. మండపాది నిర్మాణము వెనుకచెప్పిన విధముననే చేయవలెను. వృక్ష, ఉద్యానముల ప్రతిష్ఠ చేయుటచే పాపములు నశించి పరమసిద్ధి లభించును, ఇప్పుడు సూర్య, శివ, గణపతి, శక్తి, శ్రీహరి పరివారముల ప్రతిష్ఠా విధానమును వినుము. దీనిని మహేశ్వరుడు కుమారస్వామికి చెప్పెను. (70)