అగ్ని మహా పురాణము

Table of Contents

వారాణసీ మాహాత్మ్యము

వారాణసి అత్యుత్తమమైన తీర్థము. శ్రీహరి నామస్మరణ చేయుచు అచట నివసించు వారు భుక్తి ముక్తులను పొందుదురు. పరమేశ్వరుడు పార్వతితో వారాణసీ మాహాత్మ్యమును ఈవిధముగ వర్ణించి చెప్పెను. పార్వతీ! నేను ఈ క్షేత్రమును ఎన్నడును విడువను. కావుననే దీనికి అవిముక్తమని పేరు వచ్చినది. ఈ అవిముక్త క్షేత్రమునందు చేయు జపతప హోమములు అక్షయఫలమును ఇచ్చును. రాయితో రెండు కాళ్లు విరుగ గొట్టుకొనియైనను కాశీని విడువకుండ పడియుండవలెను. హరిశ్చంద్ర, ఆఘాతకేశ్వర, జప్యేశ్వర, శ్రీపర్వత, మహాలయ, భృగు, చండేశ్వర, కేదార తీర్థములను ఎనిమిదియు ఈ అవిముక్త క్షేత్రమున పరమగోపనీయములగు తీర్థములు. నా అవిముక్త క్షేత్రము గోపనీయములలో కెల్ల గోపనీయము. అది రెండు యోజనముల పొడవు, అర్ధయోజనము వెడల్పు ఉన్నది. వరణా అసీ అను నదులమధ్య ‘వారాణసి’ ఉన్నది. ఇచట జరుగు స్నాన, జప, హోమ, మృత్యు, దేవ పూజన, శ్రాద్ధ, దాన, నివాసాదుల వలన భుక్తి ముక్తులు రెండును లభించును. (112)