అగ్ని మహా పురాణము

Table of Contents

ఘాత చక్రాదివర్ణన

పరమేశ్వరుడు చెప్పెను:

పూర్వాది దిక్కులందు ప్రదక్షిణ క్రమమున అకారాది స్వరములు వ్రాయవలెను. దానియందు శుక్లపక్ష ప్రతిపత్తు పూర్ణిమ, త్రయోదశి, చతుర్దశి, శుక్లపక్షాష్టమి మాత్రము, సప్తమి, కృష్ణపక్షప్రతిపత్తు మొదలు త్రయోదశి వరకు (అష్టమి విడచి) పండ్రెండు తిథుల న్యాసము చేయవలెను. ఈ చైత్ర చక్రమునందు పూర్వాది దిశలో స్పర్శ వర్ణములను వ్రాయుటచే జయ పరాజయములను గూర్చియు లాభమును గూర్చియు నిర్ణయించ వచ్చును. విషమదిక్కు, విషమస్వరము, విషమ వర్ణము అయినచో శుభమగును. అది సమములైనచో అశుభమగును. యుద్ధారంభ సమయమునందు సేనాపతి మొదట ఎవరి పేరుపెట్టి పిలుచునో అతని పేరు దీర్ఘాక్షరముతో ప్రారంభమైనచో ఘోర సంగ్రామము నందు గూడ వానికి (సేనాపతికి) విజయము కలుగును. పేరు హ్రస్వాక్షరముతో ప్రారంభమైనచో తప్పక మృత్యువు కలుగును. ఉదాహరణమునకు ఒకని పేరు ఆదిత్యుడు మరి యొకని పేరు గురుడు. వీటిలో మొదటి పేరు మొదటి అక్షరము ‘ఆ’ దీర్ఘము, రెండవ పేరు మొదటి అక్షరము హ్రస్వము. అందుచేత అద్యక్షరము దీర్ఘాక్షరముగాగల పేరుగల వానిని పిలిచినచో మృత్యువు కలుగును. నక్షత్ర పిండమును బట్టి పరచక్రమును గూర్చి చెప్పెదను. మొదట ఒక మనుష్యుని ఆకారము తయారుచేయవలెను. దానిపై నక్షత్రముల న్యాసము చేయవలెను సూర్య నక్షత్రము మొదలుగా నామ నక్షత్రము వరకు లెక్కపెట్టవలెను. మొదటి మూడింటిని శిరస్సుపైనను, ఒకటి ముఖముపైనను, రెండు నేత్రములందును, నాలుగు చేతులపైనను, రెండు చెవులపైనను, ఐదు హృదయముపైనను, ఆరు పాదములపైనను వ్రాయవలెను. నామ నక్షత్రమును స్పష్టముగ చక్ర మధ్యమున వ్రాయవలెను. ఇట్లు వ్రాసిన పిమ్మట నేత్ర, శీరో, దక్షిణహస్త పాద, హృదయ, కంఠ వామహస్త గుహ్యాంగములందు ఎచట శని, కుజ, రవి, రాహు నక్షత్రములుండునో ఆ అవయవములపై యుద్ధమునందు దెబ్బ తగులును.

తూర్పు నుండి పశ్చిమమునకు పదమూడు రేఖలు గీసి ఉత్తరమునుండి దక్షిణమునకు ఆరు అడ్డగీతలు గీయవలెను. దానిపై అ నుండి ‘హ’ వరకు అక్షరములు వ్రాసి, 10, 9, 7, 12, 4, 11, 15, 24, 18, 4, 27, 24 అంకెలను కూడ వేయవలెను. అంకెలు అకా రాధ్యక్షముల పైన ఉండునట్లు వ్రాయవలెను. శత్రునామము నందలి స్వర-వ్యంజనములకు ఎదురుగా అంకెలు కూడి పిండము (మొత్తము) చేయవలెను. దానిని ఏడుచే భాగించగా మిగిలిన ఒకటి మొదలగు దానిని బట్టి సూర్యాది గ్రహముల భాగలను తెలిసికొనవలెను. శేషము 1 సూర్యుడు; 2 చంద్రుడు; 3 కుజుడు; 5 గురుడు; 6 శుక్రుడు; 7 శని-వీరి భాగములగును రవి, శని, కుజ భాగములు వచ్చినచో జయము కలుగును. శుభగ్రహ భాగమైనచో సంధి కుదురును, తూర్పునుండి పశ్చిమమువరకు పండ్రెండు రేఖలు గీయవలెను. ఆరు రేఖలు ఉత్తర దక్షిణముగ వ్రాయవలెను. దీనిపై కోష్ఠమున 14, 27, 12, 15, 6, 4, 3, 17, 8, 8 అంకెలు వ్రాసి కోష్ఠములందు ‘అ’ కారాది స్వరములు మొదలు ‘హ’వరకునుండు అక్షరములు వ్రాయవలెను. పిదప పేరులోని అక్షరముల ద్వారా ఏర్పడిన మొత్తమును ఎనిమిదిచే భాగించి, ఏకాది శేషమును బట్టి వాయస, మండల, రాసభ, వృషభ, కుంజర, సింహ, ఖర, ధూమ్రములు అను భాగ నామములు అగును. వీటిలో వాయసముకంటె మండలము, దానికంటె రాసభము-ఈ విధముగ పూర్వముకంటె ఉత్తరోత్తరము బలీయము. (131)

సేవాచక్రము

పరమేశ్వరుడు పలికెను:

ఇపుడు సేవాచక్రమును గూర్చి చెప్పెదను. దీనివలన సేవకునకు సేవ్యుని వలన కలుగు లాభనష్టములు తెలియును. తండ్రి, తల్లి, సోదరులు, స్త్రీ పురుషులు-వీరి విషయమున దీనిని బాగుగా పరిశీలించవలెను. ఎవ్వడైనను పైన చెప్పిన వారి నుండి లాభము పొందగల్గునా లేదా అను విషయమును సేవాచక్రము ద్వారా తెలిసికొనవచ్చును. తూర్పు నుండి పడమటకు ఆరు రేఖలను, ఉత్తరమునుండి దక్షిణమునకు ఆరు అడ్డు రేఖలను గీయవలెను. ఇట్లుగీయగా ముప్పది యైదు గళ్ళ సేవాచక్రము ఏర్పడును. దానిపై కోష్ఠములందు ఐదు స్వరములను వ్రాసి పిదప స్పర్శ వర్ణములను వ్రాయవలెను. వీటిలో ఙ, ఞ, ణ లను విడచివేయవలెను. క్రింది కోష్ఠములలో (క నుండి హ వరకు) వరుసగ సిద్ధ, సాధ్య, సుసిద్ధ, శత్రు, మృత్యువులు వ్రాయవలెను. ఈ విధముగ వ్రాయగా సేవా చక్రము సర్వాంగ సంపన్నమగును. ఈ చక్రము నందలి ‘శత్రు’ ‘మృత్యు’ అను కోష్టములలో నున్న స్వర-వ్యంజములను అన్ని కార్యములందు పరిత్యజించవలెను. కాని సిద్ధ, సాధ్య, సుసిద్ధ, శత్రు, మృత్యు-అను కోష్ఠములందు ఏదైన ఒక కోష్ఠమునందు సేవ్య-సేవ కుల నామముల ప్రథమాక్షరములు వచ్చినచో అది సర్వథా శుభము. దీనిలో ద్వితీయ కోష్టము పోషకము; తృతీయము ధనదాయకము, నాల్గవది ఆత్మనాశకము; ఐదవది మృత్యుప్రదము. మిత్ర-భృత్య బాంధవాదుల విషయమున పరిశీలించునపుడు (వారి పేర్లున్న) స్థానములు సిద్ధ, సాధ్య, సుసిద్ధములైనచో ఉత్తమ ఫలదాయకములు. అన్ని కర్మలందును అరి-మృత్యువులను విడువవలెను. ఆ, ఇ, ఉ, ఏ, ఓ లను అకారాంతమును వలె భావింతురు. ఇప్పుడు వర్గాష్టక సంస్కృతములగు అంశకములను గూర్చి చెప్పెదను, ‘అ’ వర్గమునకు (అ, ఇ, ఉ, ఏ, ఓ) అధిపతులు దేవతలు. ‘క’ వర్గుకు దైత్యులు, ‘చ’ వర్గుకు పన్నగులు, ‘ట’ వర్గుకు గంధర్వులు, ‘త’ వర్గుకు ఋషులు, ‘ప’ వర్గుకు రాక్షసులు, ‘య’ వర్గుకు (యరల వ) పిశాచములు, ‘శ’ వర్గుకు (శ ష స హ) మనుష్యులు అధిపతులు. వీరిలో దేవతలకంటె దైత్యులు, వారికంటె పన్నగులు, వారికంటె గంధర్వులు, వారికంటె రాక్షసులు, వారికంటె పిశాచములు, పిశాచముల కంటె మనుష్యులు అధిక బలవంతులు. బలవంతుడు దుర్భలుని విడువవలెను. సేవ్య సేవకుల నామాద్యక్షరములు ఒకే వర్గమునకు చెందినచో ఉత్తమము.

మైత్రీ విభాగమునకు సంబంధించిన తారా చక్రమును గూర్చి వినుము. మొదట నామ ప్రథమాక్షరమును బట్టి నక్షత్రము తెలిసికొని తొమ్మిది తారలను మూడు పర్యాయములు ఆవృత్తి చేయగా ఇరువదియేడు నక్షత్రముల తారలు తెలియును. ఈ విధముగ తన నామ నక్షత్రమునకు సంబంధించిన తారను తెలుసుకొనవలెను. జన్మ, సంపత్, విపత్, క్షేమ, ప్రత్యరి, సాధన, వధ, మైత్ర, అతిమైత్రములని తొమ్మిది తారలు. వీటిలో జన్మ తార అశుభము. సంపత్తార అత్యుత్తమము. విపత్తార నిష్ఫలము. క్షేమతార అన్ని కార్యములందును గ్రాహ్యము. ప్రత్యరితారచే ధననాశము కలుగును. సాధకతారచే రాజ్యలాభము కలుగును. వధతార కార్య వినాశనము. మైత్ర తార మైత్రీకారకము. అతి మైత్రము హితకారకము.

ప్రియురాలా! నామాక్షరము నందలి స్వరముల సంఖ్యను కూడి ఇరువదిచే భాగించి, శేషముచే ఫలము తెలియవలెను. (అనగా స్వల్ప శేషము కలవాడు అధిక శేషము కలవాని నుండి లాభము పొందును) సేవ్య సేవకుల నామాక్షరములలో ఎవనికి అధిక స్వరములుండునో అతడు ధని; అల్ప స్వరములు కలవాడు ఋణి, ధనస్వరములు మైత్రికిని, ఋణస్వరములు దాసత్వమునకును మంచివి. ఈ విధముగ లాభనష్టముల జ్ఞానమునకై సేవాచక్రము చెప్పబడినది. మేష, మిథున రాశులవారి మధ్య ప్రీతి, మిథున-సింహముల వారి మధ్య మైత్రి, తుల-సింహ రాశులవారి మధ్య మహామైత్రి ఉండును. కాని ధనుఃకుంభ రాశులవారి మధ్య మైత్రిఉండదు. అందుచే వీరు పరస్పర సేవ చేయరాదు. మీన-వృషభ; వృషభ-కర్కట; కర్కట-కుంభ, మకర-వృశ్చిక, మీన-మకరముల వారి మధ్య మైత్రియు, మిథున-కుంభ, తులా-మేషములవారి మధ్య మహమైత్రి ఉండును. వృషభ-వృశ్చికములవారి మధ్య పరస్పరము వైరము ఉండును. మిథున-ధనుస్; కర్కట-మకర; మకర-కుంభ; కన్యా-మీన రాశులవారి మధ్య ప్రీతి ఉండును. (132)