అగ్ని మహా పురాణము

Table of Contents

స్నాన తర్పణాది విధి

పరమేశ్వరుడు చెప్పెను: స్కందా! ఇప్పుడు నిత్యనైమిత్తికాది స్నానమును గూర్చియు, సంధ్యను గూర్చియు, ప్రతిష్టా సహితపూజను గూర్చియు చెప్పెదను, కత్తితో (లేదా ‘ఫట్’ అను అస్త్రమంత్రముతో) ఎనిమిది అంగుళముల లోతు నుండి మట్టి త్రవ్వి, దానిని పూర్తిగా పైకి తీసికొని వచ్చి, ఆ మంత్రముతోడనే పూజించి, స్వాహా’ మంత్రముతో ఆ మృత్తికను తటముపై ఉంచి, అస్త్ర మంత్రముచే శోధింపవలెను. ‘వషట్’ మంత్రముచే దానినుండి తృణాదికమును తొలగించి హుమ్’అనుమంత్రముచే దానిని మూడు భాగములు చేయవలెను. మొదటి భాగపు మట్టిని జలసహితమైన దానిని నాభినుండి పాదములవరకు అవయవములకు పూయవలెను. దానిని కడిగివేసి, అస్త్రమంత్రముచే అభిమంత్రితమగు రెండవ భాగమునందలి, కాంతిగల మట్టితో మిగిలిన శరీరము నంతయు పూసి, రెండు చేతులతో చెవులు, ముక్కు మొదలగు ఇంద్రియరంధ్రములను మూసికొని, ఊపిరి బిగపట్టి, మనస్సులో కాలాగ్ని తుల్యమగు తేజోమయ అస్త్రమును ధ్యానించుచు నీటిలో మునకలు వేసి స్నానము చేయవలెను. దీనికి మలస్నానమని పేరు. ఈ స్నానముచేసిన పిదప నీటినుండి బైటకువచ్చి, సంధ్య చేసిన పిమ్మట విధిస్నానము చేయవలెను. హృదయ మంత్రముచే (నమః) అంకుశ ముద్రతో సరస్వత్యాది తీర్థములలో ఏదో ఒక తీర్థమును ఆకర్షించి, సంహారముద్రతో, దానిని తన సమీపమున ఉన్న జలాశయములో స్థాపింపవలెను. పిమ్మట మూడవ భాగము మట్టి తీసికొని నాభివరకు జలములో మునిగి, ఉత్తరాభి ముఖుడై, ఎడమచేతిలో దానిని మూడు భాగములు చేయవలెను. దక్షిణ భాగమునందున్న మట్టిని అంగన్యాస మంత్రములచే ఒక మారు అభిమంత్రించి, తూర్పున ఉన్న మట్టిని “అస్త్రాయ ఫట్” అని ఏడు పర్యాయములు జపించి అభిమంత్రించి, ఉత్తరభాగము మట్టిని “ఓం నమః శివాయ” అనుమంత్రము పది పర్యాయములు జపించి అభిమంత్రించవలెను. పిమ్మట ఈ మృత్తికల నుండి కొంచెము కొంచెము గ్రహించి “అస్త్రాయ హుం ఫట్” అనుచు అన్ని దిక్కులందును చిమ్మవలెను. పిమ్మట “ఓం నమః శివాయ” అను శివ మంత్రమును, “ఓం సోమాయ స్వాహా” అను సోమ మంత్రమును జపించుచు, నీటిలో తన భుజములు త్రిప్పి, దానిని శివతీర్థ స్వరూపము చేయవలెను; అంగన్యాస మంత్రములను జపించుచు దానిని శిరస్సు నుండి పాదములవరకు, మొత్తము శరీరముపై పూసికొనవలెను.

పిమ్మట అంగన్యాస మంత్రములను నాల్గింటిని చదువుచు కుడినుండి ప్రారంభించి ఎడమ వైపు వరకు హృదయము, శిరస్సు, శిఖ, రెండు భుజములు స్పృశించి, చెవులు, ముక్కు మొదలగు రంధ్రములు మూసికొని, సమ్ముకరణ ముద్రతో శివ, విష్ణు, గంగలను స్మరించుచు, నీటిలో మునగవలెను. షడంగన్యాస మంత్రములను ఉచ్చరించుచు (ఓం హృదయాయ నమః, శిరసే స్వాహా, శిఖాయై వషట్, కవచాయ హుమ్, నేత్ర త్రయాయ వౌషట్, అస్త్రాయ ఫట్) నీటిలో నిలచి, రెండు చేతులును కలిపి కుంభముద్రతో స్నానము చేయవలెను. స్నానానంతరము నీటినుండి బైటకు వచ్చి సంహారిణీ ముద్రతో తీర్థమును ఉపసంహరించవలెను. పిమ్మట యథావిధిగా పరిశుద్ధము, సంహితామంత్రములచే అభిమంత్రితము, నివృత్త్యాదులచే శోధితమగు భస్మముచే స్నానము చేయవలెను. “ఓం అస్త్రాయ హుం ఫట్” అను మంత్రము ఉచ్చరించుచు శిరస్సునుండి పాదములవరకు భస్మముతో మలస్నానముచేసి పిదప, యథావిధిగ శుద్ధస్నానము చేయవలెను. ఈశాన, తత్పురుష, అఘోర, గుహ్యక (లేదా వామదేవ) సద్యోజాత మంత్రములతో క్రమముగ శిరస్సు, ముఖము, హృదయము, గుహ్యాంగము, శరీరమునందలి ఇతరావయవములు వీటిపై ఉంచవలెను. మూడు సంధ్యలందును, అర్ధరాత్రమునందును, వర్షాకాలమునకు పూర్వము, అనంతరము, నిద్రానంతరము, భోజనానంతరము, జలపానానంతరము ఇతరమైన ఆవశ్యక కార్యములు చేసిన పిమ్మట ఆగ్నేయస్నానము చేయవలెను. స్త్రీని, నపుంసకుని, శూద్రుని, పిల్లిని, శవమును, ఎలుకను స్పృశించినపుడు ఆగ్నేయస్నానము విధింపబడినది, చుళుకము నిండ పవిత్ర జలము పోసికొని త్రాగవలెను. ఇదియే ఆగ్నేయ స్నానము. సూర్య కిరణములు కనబడుచున్నపుడు ఆకాశము నుండి వర్షము కురియుచున్నచో, పూర్వాభిముఖుడై రెండు భుజములు పైకెత్తి ఈశాన మంత్రము ఉచ్చరించుచు, ఏడు అడుగులు నడిచి, ఆ వర్షాజలమునందు స్నానము చేయవలెను. ఇది “మాహేంద్రస్నానము”, గో సముదాయము మధ్యనిలిచి, గోవులడెక్కలచే పైకి ఎగుర గొట్టబడిన ధూళిలో ఇష్టదేవతా మూలమంత్రము జపించుచు, లేదా కవచ మంత్రము (హుం) జపించుచు చేయు స్నానము “పావన స్నానము” సద్యోజాతాది మంత్రములను ఉచ్చరించు జలముతో చేయు స్నానము “మంత్రస్నానము”. ఈ స్నానము వరుణదేవతా మంత్రములను, అగ్నిదేవతా మంత్రములను ఉచ్చరించుచుగూడ చేయవచ్చును. మనస్సులో మూలమంత్రము ఉచ్చరించుచు ప్రాణాయామము చేయుట “మానసిక స్నానము”. ఈ స్నానము సర్వకర్మల యందును విధింపబడినది. విష్ణు దేవతాదులకు సంబంధించిన కార్యములలో ఆయా దేవతల మంత్రములతో ఈ స్నానము చేయవలెను.

కార్తికేయా! విభిన్న మంత్రములతో సంధ్యావిధినిగూర్చి చెప్పెదను. బాగుగా చూచి జలమును, మంత్ర పాఠ పూర్వకముగ బ్రహ్మతీర్థము ద్వారా పర్యాయములు గ్రహించవలెను. ఆచమన సమయమున ఆత్మతత్త్వ, విద్యాతత్త్వ, శివతత్త్వములకు ‘నమః’ సహిత ‘స్వాహా’ శబ్దమును చేర్చి మంత్రము చదువవలెను. అనగా ఇచ్చట ఆత్మాతత్త్వాయ నమః స్వాహా, ఓం విద్యాతత్త్వాయనమః స్వాహా, ఓం శివతత్త్వాయనమః స్వాహా” అను మంత్రములతో ఆచమనము చేయవలెను. పిదప ముఖము, నాసిక, నేత్రములు, కర్ణములు స్పృశించవలెను. ప్రాణాయామముచేసి, సఫలీకరణ క్రియను సంపన్నముచేసి స్థిరముగ కూర్చుండవలెను. పిమ్మట మంత్రసాధకుడు శివసంహితను మనస్సులోనే ఆవృత్తిచేసి, ఆచమనము, అంగన్యాసములుచేసి, ప్రాతఃకాలమునందు బ్రాహ్మీ సంధ్యను ఈ విధముగ ధ్యానించవలెను. ప్రాతఃకాలమున సంధ్యాదేవి బ్రాహ్మీరూపమున ప్రత్యక్షమగును. హంసారూఢయై కమలాసనముపై కూర్చుండి యుండును. శరీరకాంతి ఎర్రగా ఉండును. ఆమెకు నాలుగు ముఖములు, నాలుగుచేతులు ఉండును. కుడి చేతులలో కమలము, స్పటికాక్ష మాల, ఎడమచేతులలో దండకమండలములు ప్రకాశించుచుండును. మధ్యాహ్న కాలమున సంధ్యను వైష్ణవీ శక్తి రూపమున ధ్యానించవలెను. ఆమె గరుత్మంతుని వీపు మీద పరచిన కమలాసనముపై కూర్చుండును. శరీరకాంతి తెల్లగా నుండును. వామహస్తముచే శంఖ చక్రములను, దక్షిణ హస్తములచే గదా, అభయముద్రలను ధరించియుండును. సాయంకాలమున సంధ్యను రుద్రశక్తి రూపమున ధ్యానింపవలెను. త్రినేత్రయై శిరస్సుపై అర్ధచంద్ర ముకుటముతో విరాజిల్లుచున్న ఆమె వృషభ పీఠముపై కమలాసనమున కూర్చుండి ఉండును. కుడిచేతులలో త్రిశూల, రుద్రాక్ష మాలలతోను, ఎడమ చేతులలో అభయ ముద్రా, శక్తులతోను ప్రకాశించుచుండును. ఈ సంధ్యలు కర్మ సాక్షులు. సాధకుడు ఈ శక్తుల కాంతులు తనను అనుసరించియున్నట్లు భావన చేయవలెను. ఇవికాక మరొక సంధ్య నాల్గవది కూడ ఉన్నది. అది కేవలము జ్ఞానికి మాత్రమే. అర్ధరాత్రి ప్రారంభమున, దాని బోధాత్మక సాక్షాత్కారము కలుగును. ఈ మూడు సంధ్యలును క్రమముగ, హృదయ, బిందు, బ్రహ్మ రంధ్రములలో నుండును. నాల్గవ సంధ్యకు రూపముండదు. ఆ సంధ్య పరమ శివునిలో ప్రకాశించుచుండును. ఈమె శివునికంటె అతీతమగుటచే ‘పరాసంధ్య’ అని పేరు. తర్జనీ మూలము పితృతీర్థము. కనిష్ఠికా మూలము ప్రజాపతి తీర్థము. అంగుష్ఠ మూలము బ్రహ్మతీర్థము. హస్తాగ్రభాగము దేవతా తీర్థము. కుడి అరచేయి అగ్ని తీర్థము. ఎడమ అరచెయ్యి సోమతీర్థము. అంగుళుల అన్ని పర్వములును, సంధులును ఋషితీర్థము. సంధ్య అనంతరము, శివమంత్రములచే జలాశయమును శివ స్వరూపము చేసి, “ఆపోహిష్ఠా” ఇత్యాది సంహితా మంత్రములతో, ఆ జలముతో మార్జనము చేసికొనవలెను. (ఎడమ చేతిలో తీర్థజలము పోసికొని కుడిచేతితో మంత్రపఠన పూర్వకముగ శిరస్సుపై ఆనీరు చల్లుకొనుటకు మార్జనమని పేరు).

పిమ్మట అఘమర్షణము చేయవలెను. కుడిచేతిలో బోధరూప శివమయమగు ఉదకము పోసికొని, ముక్కు దగ్గరకు తీసికొనిపోయి, (వామ) ఇడానాడి ద్వారా శ్వాస పీల్చి లోపల నిలిపి, లోపలి నుండి నల్లని పాపపురుషుని (దక్షిణ) పింగళానాడి ద్వారా బైటకు తీసికొని వచ్చి ఆ జలమునందు స్థాపించవలెను. ఆ పాప పురుషునితో కూడిన జలమును, ఒక వజ్రమయ శిలను భావనచేసి, దానిపై పడవేసి చంపవలెను. దీనితో అఘమర్షణము సంపన్నమగును. పిమ్మట కుశ, పుష్ప, అక్షతలతో కూడిన జలముతో అర్ఘ్యాంజలి పట్టి దానిని “ఓం నమః శివాయ స్వాహా’ అను మంత్రముతో శివునకు సమర్పించి యథాశక్తిగ గాయత్రీ మంత్రము జపింపవలెను.

ఇపుడు తర్పణ విధిని చెప్పెదను. దేవతలకు వారి నామ మంత్రములను ఉచ్చరించుచు, దేవతీర్థము ద్వారా తర్పణము చేయవలెను. “ఓం హూం శివాయ స్వాహా” అని చెప్పి శివునకు తర్పణము ఈయవలెను. ఇతర దేవతలకు కూడ ఈ విధముగనే వారివారి పేర్లకు “స్వాహా” చేర్చి తర్పణములు ఈయవలెను. “ఓం హాం హృదయాయ నమః, ఓం హీం శిరసే స్వాహా, ఓం హూం శిఖాయై వషట్; ఓం హైం కవచాయ హుం; ఓం హౌం నేత్ర త్రయాయ వౌషట్; ఓం హం అస్త్రాయ ఫట్” అను వాక్యములు ఉచ్చరించుచు క్రమముగ హృదయ, శిరః, శిఖా, కవచ, నేత్ర, అస్త్రన్యాసములు చేయవలెను. ఎనిమిది దేవగణములకు వారి పేర్ల చివర నమః అను పదము చేర్చి తర్పణము చేయవలెను. “ఓంహాం ఆదిత్యేభ్యో నమః, ఓం హాం వసుభ్యో నమః, ఓంహాం రుద్రేభ్యో నమః, ఓం హాం విశ్వేభ్యో దేవేభ్యో నమః, ఓం హాం మరుద్భ్యో నమః, ఓం హాం భృగుభ్యో నమః, ఓం హాం అంగిరోభ్యో నమః”-ఈ విధముగ చేయవలెను. పిమ్మట యజ్ఞోపవీతమును కంఠమునందు మాలవలె ధరించి (ఉపవీతి) ఋషితర్పణము చేయవలెను. “ఓం హాం అత్రయే నమః, ఓం హాం వసిష్ఠాయ నమః, ఓం హాం పులస్తయే నమః, ఓం హాం క్రతవే నమః, ఓం హాం భరద్వాజాయ నమః, ఓం హాం విశ్వామిత్రాయ నమః, ఓం హాం ప్రచేతసే నమః, ఓం హాం మరీచయే నమః” అను మంత్రములు పఠించుచు అత్ర్యాది ఋషులకు ఋషి తీర్థముద్వారా తర్పణములు చేయవలెను. పిమ్మట ఈ క్రింది వాక్యములు చదువుచు, సనకాది మునులకు (రెండేసి అంజలులు ఇచ్చుచు) తర్పణము చేయవలెను- “ఓం షాం సనకాయ వషట్; ఓం హాం సనన్దనాయ వషట్; ఓం హాం సనాతనాయ వషట్; ఓం హం సనత్కుమారాయ వషట్; ఓం హాం కపిలాయ వషట్; ఓం హం పఞ్చశిఖాయ వషట్; ఓం హాం ఋభవే వషట్” అను వాక్యములు చదువుచు దగ్గరగా ఉంచిన చేతుల కనిష్ఠకామూల భాగముల నుండి జలాంజలి ఈయవలెను. “ఓంహాం సర్వేభ్యో భూతేభ్యో వషట్” అను మంత్రముచే వషడ్రూప భూతగణములకు తర్పణము చేయవలెను. పిమ్మట యజ్ఞోపవీతమును కుడిభుజముపై ఉండునట్లు వేసికొని ప్రాచీనావీతి రెండుగా మడిచిన కుశమూలాగ్రముల నుండి తిలసహిత జలమును మూడేసి పర్యాయములు దివ్య పితృ దేవతలకు అర్పించి తర్పణము చేయవలెను. “ఓం హాం కవ్యవాహనాయ స్వధా; ఓం హాం అనలాయ స్వధా; ఓం హాం సోమాయ స్వధా; ఓం హాం యమాయ స్వధా; ఓం హాం అర్యమ్ణే స్వధా; ఓంహాం అగ్ని ష్వాత్తేభ్యః స్వధా; ఓం హాం బర్హిషద్భ్యః స్వధా; ఓం హాం ఆజ్యపేభ్యః స్వధా” ఇత్యాది మంత్రములు ఉచ్చరించుచు విశిష్ట దేవతలకు వలెనే దివ్య పితృదేవతలకును తర్పణములు ఈయవలెను.

“ఓం హాం ఈశానాయ ప్రితే స్వధా” అని చెప్పి తండ్రికిని, ఓం హాం పితామహాయ స్వధా” అని చెప్పి పితామహునకును, “ఓంహాం శాస్త్ర ప్రపితా మహాయస్వధా” అని చెప్పి ప్రపితామహునకును తర్పణములు ఈయవలెను. సమస్త ప్రేత పితృదేవతలకును ఈ విధముగనే తర్పణము చేయవలెను. ఎట్లనగా - “ఓం హాం పితృభ్యః స్వధా; ఓం హాం పితామహేభ్యః స్వధా; ఓం హాం ప్రపితామహేభ్యః స్వధా; ఓం హాం వృద్ధ ప్రపితా మహేభ్యః స్వధా; ఓం హాం మాతృభ్యః స్వధా; ఓం హాం మాతామహేభ్యః స్వధా; ఓం హాం ప్రమాతా మహేభ్యః స్వధా; ఓం హాం వృద్ధమాతా మహేభ్యః స్వధా; ఓం హాం సర్వేభ్యః పితృభ్యః స్వధా; ఓం హాం సర్వేభ్యః జ్ఞాతిభ్యః స్వధా, ఓం హాం సర్వాచార్యేభ్య: స్వధా; ఓం హాం దిగ్భ్యః స్వధా; ఓం హాం దిక్పతిభ్యః స్వధా; ఓం హాం సిద్ధేభ్యః స్వధా; ఓం హాం మాతృభ్యః స్వధా; ఓం హాం గ్రహేభ్యః స్వధా; ఓం హాం రక్షోభ్యః స్వధా” - ఈ వాక్యములను ఉచ్చరించుచు క్రమముగ పితృ, పితామహ, ప్రపితామహ, వృద్ధ ప్రపితామహ, మాతృ, సర్వజ్ఞాతి, సర్వాచార్య, సర్వదిక్, దిక్పతి, సిద్ధ, మాతృకా, గ్రహ, రాక్షసులకు తర్పణములు ఈయవలెను. (72)