అగ్ని మహా పురాణము

Table of Contents

మాస వ్రతములు

అగ్ని దేవుడు పలికెను:                                                         

నేను ఇపుడు భుక్తి ముక్తి ప్రదములగు మాస వ్రతములను గూర్చి చెప్పెదను. ఆషాఢాది మాస చతుష్టయమునందు అభ్యంగస్నానము చేయరాదు. దీనివలన ఉత్తమ బుద్ధిమంతుడగును. వైశాఖమున పుష్పములను లవణమును త్యజించి గోదానము చేయువాడు రాజ్యమును పొందును. ఒకమాసము ఉపవాస ముండి గోదానము చేయువాడు ఈ భీమ వ్రత ప్రభావముచే విష్ణు సాయుజ్యము పొందును. ఆషాఢాది మాస చతుష్టయము నందు నియమపూర్వకముగా ప్రాతః స్నానము చేయువాడు విష్ణులోకము చేరును. మాఘ తృతీయయందు లేదా చైత్ర తృతీయయందు గుడ (బెల్లము) ధేనుదానము చేయుటకు గుడ వ్రతమని పేరు. ఈ మహావ్రత మాచరించువాడు శివ స్వరూపుడగును. మార్గ శీర్షాది మాసములందు నక్త వ్రతము ఆచరించువాడు విష్ణు లోకమునకు అర్హుడగును. ఏక భుక్త వ్రతము ఆచరించువాడు ఆ విధముగనే వేరుగా ద్వాదశీ వ్రతపాలనము కూడ చేయవలెను. ఫలవ్రతము చేయువాడు చాతుర్మాస్యమున ఫలములు పరిత్యజించి వాటిని దానము చేయవలెను. శ్రావణము మొదలు మాస చతుష్టయము నందు వ్రతముల నాచరించుటచే సర్వమును పొందును, చాతుర్మాస్య వ్రతము ఈవిధముగ ఆచరించవలెను-ఆషాఢ శుక్లైకాదశినాడు ఉపవాసము ఉండవలెను. ఆషాఢమున వచ్చు కర్కట సంక్రాంతి యందు శ్రీమహావిష్ణువును పూజించవలెను. ‘దేవా! నేను నీ ఎదుట ఈ వ్రతము అవలంబించినాను. కేశవా! నీ అనుగ్రహముచే ఇది నిర్విఘ్నముగ సిద్ధించుగాక. దేవాధి దేవా! జనార్దనా! ఈ వ్రతము ప్రారంభించిన తరువాత ఇదిపూర్తి కాకుండగనే నేను మరణించినచో, నీ కృపచే ఇది పరిపూర్ణమగుగాక!’ అని ప్రార్థించవలెను.

వ్రత మాచరించు ద్విజుడు మాంసాదులను, తైలమును వర్జించి శ్రీమహావిష్ణువును పూజించవలెను. రోజు విడచి రోజు ఉపవాసముండుచు త్రిరాత్రవ్రతము ఆచరించువాడు విష్ణులోకము పొందును. చాంద్రాయణము చేయువాడు విష్ణులోకమును చేరును. మౌన వ్రతము పాటించువాడు మోక్షమునకు అధికారి యగును. ప్రాజాపత్య వ్రతమాచరించువాడు స్వర్గము పొందును. సక్తువులను, యవలను తినుచు క్షీరాదులు సేవించుచు లేదా పంచగవ్యములను, జలములను గ్రహించుచు కృచ్ఛ్ర వ్రతము చేయువాడు స్వర్గము చేరును. శాక, మూల, ఫలాహారము మాత్రము భుజించుచు కృచ్ఛ్ర వ్రతము చేయువాడు వైకుంఠము చేరును. మాంస-రసములను పరిత్యజించి యవలు మాత్రము భుజించువాడు శ్రీమహావిష్ణు సాన్నిధ్యము పొందును. ఇపుడు కౌముద వ్రతమును గూర్చి చెప్పెదను. ఆశ్వయుజ శుక్ల ఏకాదశినాడు ఉపవాసముండి, ద్వాదశినాడు శ్రీమహావిష్ణువు అవయవములకు చందనాదులు పూసి, ఉత్పలాదులతో పూజించవలెను. పిదప తైలదీపము సమర్పించి ఘృతపక్వాన్నము నైవేద్యము చేయవలెను. శ్రీమహావిష్ణువునకు మాలతీ పుష్పములు కూడా సమర్పించవలెను. ‘ఓం నమో వాసుదేవాయ’ అను మంత్రము ఉచ్చరించుచు వ్రతసమాప్తి చేయవలెను. ఈ విధముగ కౌముద వ్రతము చేయువాడు ధర్మార్థ కామమోక్షములను స్వాధీనము చేసికొనును. మాసోపవాస వ్రతము చేయువాడు శ్రీమహావిష్ణువును పూజించి సర్వమును పొందగలడు. (198)