అగ్ని మహా పురాణము

Table of Contents

మహామారీ విద్య

పరమేశ్వరుడు చెప్పెను:

దేవీ! ఇపుడు నేను శత్రుమర్దనియగు మహామారీవిద్యను గూర్చి చెప్పెదను. ‘ఓం హ్రీం మహామారి........హూం ఫట్ స్వాహా’ అనునది (మూలములో గలమంత్రము) మహామారీ మంత్రము (మూలోక్తములైన) ‘ఓం మమామారి హృదయాయ నమః .......... అస్త్రాయ హుం ఫట్’ అనునవి అంగన్యాసాదులు. సాధకుడు ఈ అంగన్యాసమును తప్పక చేయవలెను. శవముపై కప్పిన వస్త్రము తీసికొనివచ్చి చతురస్రముగా ఖండించవలెను. దాని పొడవు వెడల్పులు మూడేసి హస్తములు ఉండవలెను. ఆ వస్త్రముపై అనేక విధములైన రంగులతో నల్లని దేవీ ఆకారము చిత్రించవలెను. మూడు ముఖములు, నాలుగు భుజములు ఉండవలెను. హస్తములలో ధనస్సు, శూలము, కర్తరి, మంచము కోడు ధరించియుండును. ఆ దేవి ప్రథమ ముఖము పూర్వాదిశాభిముఖమై తన కాంతిచే ప్రకాశింపచేయుచు, దృష్టి పడగనే ఎదుట ఉన్న మనుష్యుని తినివేయునట్లు ఉండవలెను. రెండవ ముఖము దక్షిణ భాగమునందు ఉండవలెను. ఆమె నాలుక ఎఱ్ఱగా, చూచుటకు భయంకరముగా నుండవలెను. వికృతమైన ఆమె ముఖము కోరలతో భయంకరముగా నుండవలెను. నాలుకతో చెక్కిళ్ళు నాకుచుండవలెను. దృష్టి పడగానే ఎదుట నున్న గుఱ్ఱములు మొదలగు వాటిని తినివేయునట్లు ఉండవలెను. దేవి మూడవ ముఖము పశ్చిమాభిముఖమై తెల్లగా ఉండవలెను. దృష్టి పడగానే ఏనుగులు మొదలైన వాటిని తినివేయునట్లు ఉండవలెను. గంధ పుష్పాదులతోను, తేనె నెయ్యి మొదలగు నైవేద్యములతోను దానిని పూజించవలెను, పూర్వోక్త మంత్రమును స్మరించినంత మాత్రముననే నేత్ర శిరోరోగాదులు నశించును. యక్షరాక్షసులు కూడ వశమగుదురు. శత్రువులు నశింతురు. మనుష్యుడు క్రోధముతో వేపచెట్టు పుల్లలు హోమము చేసినచో తన శత్రువులను చంప గలడు; ఇందు సందేహము లేదు. శత్రు సేవాభిముఖుడై ఒక సప్తాహము ఈ సమిధలతో హోమము చేసినచో శత్రు సైన్యము నానావిధ రోగపీడితమై నశించును. ఎవని పేరు పెట్టి వెయ్యి సమిధల హోమము చేయబడునో వాడు బ్రహ్మ రక్షించినను మరణించక తప్పదు. వెయ్యి ధత్తూర సమిధలను, రక్తము, విషము కలిపి మూడు దినములు హోమము చేసినచో శత్రువు సైన్యసమేతముగ నశించును. ఆవాలు, ఉప్పు హోమము చేయగా శత్రు సైన్యమునందు కలవరము పెట్టి శత్రువు పారిపోవును. దానిని గాడిద రక్తముతో కలిపి హోమము చేసినచో శత్రువును పారద్రోలును. పారిపోవలెనని ఆతని మనస్సునందు తీవ్రముగ కోరిక పుట్టును. కాకి రక్తము కలిపి హోమము చేసినచో శత్రువును పెకలించి వేయవచ్చును. సాధకుడు ఆతనిని చంపుటకు సమర్థుడగును. సాధకుని మనస్సులో కలుగు కోరికలు అన్నియు సఫలమగును. సాధకుడు యుద్ధ సమయమున ఇరువురు కన్యలతో గజము నెక్కి, పూర్వోక్త మంత్రముచే అభిమంత్రించి, మహామాయాప్రతిమ ఉన్న వస్త్రమును, యుద్ధరంగమునందు ఎత్తునుండి ఎగురవేసి, శత్రుసేనాభిముఖుడై ఆ పటమును వారికి చూపవలెను. పిదప ఆ కన్యలకు భోజనము పెట్టవలెను. పిదప మరల పిండిని త్రిప్పుచు శత్రుసైన్యము శిలవలె నిశ్చలమై పోయినట్లు భావన చేయవలెను. శత్రుసైన్యమున యుద్ధము చేయు ఉత్సాహము పోయినట్లును, భయముతో పారిపోవుటకు సిద్ధముగా ఉన్నట్లును కూడ భావన చేయవలెను. ఇట్లు చేయుటచే శత్రుసేనా స్థంభనము కలుగును. నేను చెప్పిన ఈ స్తంభన ప్రయోగమును ప్రతివానికిని ఉపదేశించరాదు. ఈమె మూడు లోకములపైనను విజయము నిచ్చు ‘మాయ’. ఈమె ఆకారముచే చిత్రితమైన పటము ‘మాయాపటము’. దుర్గా, భైరవీ, కుబ్జికా, రుద్రదేవ, నృసింహుల మూర్తులనుగూడ ఈ విధముగనే వస్త్రముపై చిత్రించవచ్చును. ఇట్టి పటములచే గూడ స్తంభన ప్రయోగము చేయవచ్చును. (137)