అగ్ని మహా పురాణము

Table of Contents

శివ పూజా విధి

మహేశ్వరుడు చెప్పెను: స్కందా! ఇపుడు శివపూజా విధానమును చెప్పుచున్నాను. ఆచమనము చేసి ప్రణవ జపము చేయుచు సూర్యునకు అర్ఘ్యము ఈయవలెను. పిమ్మట పూజామండప ద్వారమును ‘ఫట్’ అను మంత్రము ఉచ్చరించుచు ఉదకముతో తడిపి, ప్రారంభమున ‘హాం’ బీజముతో నంది మొదలగు ద్వారపాలకులను పూజింపవలెను. ద్వారముపై ఉదుంబర వృక్షము స్థాపించి, లేదా భావన చేసి, దాని పై భాగముపై గణపతి, సరస్వతి, లక్ష్మీదేవులను పూజించవలెను. దక్షిణ భాగమున నందిని, గంగను, వామ భాగమున మహాకాలుని, యమునను పూజింపవలెను. పిమ్మట దివ్యదృష్టి ప్రసరింపచేసి దివ్య విఘ్నములను తొలగించుకొనవలెను. వాటిని ఉద్దేశించి పుష్పములు విసరి, “ఆకాశ చారి విఘ్నములు అన్నియు తొలగిపోయినవి” అని భావన చేయవలెను. కుడిమడమతో మూడు పర్యాయములు భూమిపైకొట్టవలెను. అట్లు చేయుటచే భూతలముపై ఉన్న సర్వ విఘ్నములు తొలగినట్లు భావన చేయవలెను. పిమ్మట యజ్ఞమండపము యొక్క కడప దాటవలెను. ఎడమకొమ్మ పట్టుకొని లోపల ప్రవేశించి, ఉదుంబర వృక్షమున అస్త్రన్యాసము చేసి, మండప మధ్యమున పీఠాధార భూమిపై “ఓం హాం వాస్త్వధిపతయే బ్రహ్మణే నమః” అను మంత్రముతో వాస్తు దేవతా పూజ చేయవలెను.

నిరీక్ష ణాస్త్రములచే శుద్ధము చేయబడిన గడ్డుకములను చేతిలో గ్రహించి, భావన ద్వారా శివాజ్ఞగైకొని, సాధకుడు మౌనముగా గంగానదీ తటమునకు వెళ్లి, అచట తన శరీరమును పవిత్రము చేసికొని గాయత్రి మంత్రజపము చేయుచు వస్త్రముతో వడగట్టిన జలముతో జలాశయము నందు ఆ గడ్డుకములను నింపవలెను. లేదా హృదయ బీజమును (నమః) ఉచ్చరించుచు నింపవలెను. పూజకై కావలసిన గంధ, అక్షత, పుష్పాది సకల ద్రవ్యములను దగ్గర ఉంచుకొని, భూతశుద్ధి మొదలగు కర్మలు చేయవలెను. ఉత్తరాబి, ముఖుడై, ఆరాధ్య దేవతకు కుడి ప్రక్క శరీరాంగములపై మాతృకాన్యాసము చేసి, సంహారముద్రతో అర్ఘ్యము కొరకై ఉదకము గ్రహించి మంత్రోచ్చారణ పూర్వకముగ శిరస్సుకు తగల్చి, దానిని దేవతకు సమర్పించుటకై దగ్గర ఉంచుకొనవలెను. పిమ్మట భోగ్యములగు కర్మల భోగమునకై కూర్మముద్రను ప్రదర్శించి ద్వాదశదళ హృదయ కమలమున తన ఆత్మను ధ్యానించవలెను.

పిమ్మట శరీరమునందు రంధ్రమును (శూన్యమును) భావించి, క్రమముగ పంచభూత శోధనము చేయవలెను. ముందుగ పాదముల అంగుష్ఠములను పై నుండియు, లోపలి నుండియు ఛిద్రమయముగ భావన చేయవలెను. పిదప కుండలినీ శక్తిని మూలాధారమునుండి లేపి, హృదయ కమలముతో చేర్చి, “హృదయ రంధ్రమునందున్న, అగ్ని తుల్యతేజఃశాలియగు ‘హూం’ బీజమునందు కుండలినీ శక్తి విరాజిల్లుచున్నది” అని భావన చేయవలెను. కుంభక ప్రాణాయామముచేసి, రేచకముచేసిన పిమ్మట, ‘హుం ఫట్’ అని ఉచ్చరించుచు క్రమముగ ఉత్తరోత్తర చక్రములను భేదనము చేయుచు, కుండలిని హృదయ, కంఠ, తాలు, భ్రూమధ్య, బ్రహ్మ రంధ్రములకు చేర్చి అచట స్థాపించవలెను. ఈ గ్రంథులను భేదించి, కుండలినితో, హృదయ కమలము నుండి బ్రహ్మ రంధ్రము నుండి వచ్చిన ‘హూం’ బీజరూపజీవుని అచటనే బ్రహ్మ రంధ్రమునందు లేదా సహస్రారము నందు స్థాపించవలెను. హృదయమునందున్న ‘హూం’ బీజముతో సంపుటీకరించిన జీవునిలో, పూరక ప్రాణాయామము ద్వారా చైతన్యము జాగృతము చేయబడును. శిఖకు పైన ‘హూం’ న్యాసముచేసి శుద్ధ బిందు రూప జీవుని భావించ వలెను. పిమ్మట కుంభకము చేసి ఏకమాత్ర చైతన్య రూపుడగు జీవుని శివునితో కలిపివేయవలెను.

ఈ విధముగ శివునిలో లీనుడైన సాధకుడు సబీజరేచక ప్రాణాయామముతో శరీరమునందలి భూతముల శోధనము చేయవలెను. శరీరమునందు పాదములనుండి బిందువు వరకునున్న అన్ని తత్త్వములను విలోమక్రమమున చింతన చేయవలెను. బిందు రూపజీవుని బింద్వంతము నందు లీనముచేసి పృథ్వీ వాయువులను ఒకదానిని మరొక దానిలో లీనము చేయవలెను. అగ్ని, జలములను కూడ ఒక దానిలో ఒకటి విలీనము చేయవలెను. ఈ విధముగ పరస్పర విరోధముగల రెండు భూతములను ఒకదానిలో ఒకటి లీనము చేయవలెను. ఆకాశమునకు దేనితోడను విరోధము లేదు. ఈ భూతశుద్ధికి సంబంధించిన విశేష వివరణము వినుము. భూమండల స్వరూపము చతుష్కోణ ఆకారము. దానిరంగు సువర్ణమువలె పచ్చగాఉండును. అది కఠినముగ నుండుటయే గాక వజ్ర చిహ్నముతోను, ‘హాం’ అను తన బీజముతోను కూడుకొని యున్నది. దీనిలో ‘నివృత్తి’ అను కళ ఉన్నది. (శరీరమున పాదములు మొదలు మోకాళ్ల వరకును భూ మండలమున్నది). ఈవిధమున పాదములు మొదలు శిరస్సువరకు శరీరమునందు పంచ మహాభూతముల భావన చేయవలెను. ఈ విధముగ పంచగుణయుక్తములగు వాయు, భూమండలముల చింతన చేయవలెను.

జల స్వరూపము అర్ధ చంద్రాకారము. అది ద్రవ స్వరూపము. చంద్ర మండలమయము. దాని వర్ణము ఉజ్జ్వలము. అది రెండు కమలములచే చిహ్నితము. ‘హ్రీం’ బీజముతో కూడినది. “ప్రతిష్ఠా” అను కళగలది. వామదేవ, తత్పురుష మంత్రములతో సంయుక్తమగు జలతత్త్వము నాలుగు గుణములతో కూడినది. దానిని ఈ విధముగ (మోకాళ్లు మొదలు పాదాలవరకు) చింతనము చేయుచు వహ్ని స్వరూపము నందు లీనముచేసి శోధన చేయవలెను. అగ్ని మండలము త్రికోణాకారము. రంగు ఎరుపు. (అది నాభినుండి హృదయము వరకును ఉండును). అది స్వస్తిక చిహ్న యుక్తము. దాని యందు ‘హూం’ బీజము అంకితమై యుండును. అది విద్యాకళా స్వరూపమైనది. దాని మంత్రము అఘోరమంత్రము. ఇది మూడు గుణములతో కూడిన జలభూతము. ఈ విధముగ భావించి అగ్ని తత్త్వమును శోధించవలెను. వాయుమండలము షట్కోణాకారము (హృదయము మొదలు కనుబొమ్మల వరకును ఉండునది). అది ఆరు బిందువులచే చిహ్నితమైనది. రంగు నలుపు. ‘హైం’ బీజము తోడను, సద్యోజాత మంత్రముతోడను యుక్తమైయున్న అది కాంతి కళా స్వరూపమైనది. దానిలో రెండు గుణములు ఉన్నవి. అది పృథ్వీభూతము. ఈ విధముగ భావనచేసి వాయుతత్త్వమును శోధింపవలెను.

ఆకాశము వ్యోమాకారము! నాద బిందుమయము, గోలాకారము, బిందుశక్తి విభూషితము, శుద్ధ స్ఫటిక నిర్మలము. (శరీరమున భ్రూమధ్యము మొదలు బ్రహ్మ రంధ్రము వరకు ఆకాశ స్థానము). అది “హౌం ఫట్” అను బీజముతో కూడినది. శాంత్యతీత కళామయము. ఒక్క గుణము కలది. పరమవిశుద్ధము. ఈ విధముగ చింతనముచేసి ఆకాశ తత్త్వమును శోధన చేయవలెను. పిమ్మట అమృత వర్షిమూల మంత్రముచే సర్వమును పరిపుష్టము చేయవలెను. పిమ్మట ఆధారశక్తిని, కూర్మమును అనంతుని పూజించవలెను. పిమ్మట పీఠము యొక్క ఆగ్నేయ పాదము (కోడు) నందు ధర్మమును, నైరృతి పాదమున జ్ఞానమును, వాయవ్యమున వైరాగ్యమును, ఈశాన్య పాదమున ఐశ్వర్యమును పూజించవలెను. పిమ్మట పీఠమునకు పూర్వాది దిశలందు క్రమముగ అధర్మ, అజ్ఞాన, అవైరాగ్య, అనైశ్వర్యములను పూజించవలెను. పీఠమధ్య భాగమున కమలమును పూజించవలెను. ఈ విధముగ మనస్సులోనే పీఠముపై ఉన్న కమలఆసనమును ధ్యానించి దానిపై సచ్చిదానందఘనుడగు శివుని ఆవాహనము చేయవలెను. ఆ శివమూర్తి యందు శివస్వరూపాత్మను చూచి, ఆసనమును, పాదుకా ద్వయమును, తొమ్మిది పీఠ శక్తులను ధ్యానించవలెను. శక్తిమంత్రము చివర “వౌషట్” చేర్చి, దానిని ఉచ్చరించుచు పైనచెప్పిన ఆత్మమూర్తిని దివ్యామృతములో ముంచి, సకలీకరణము చేయవలెను. హృదయము మొదలు హస్తముల వరకును ఉన్న అవయవములందును, కనిష్ఠిక మొదలు వ్రేళ్లయందును హృదయ మంత్ర (నమః) న్యాసమునకు సకలీకరణమని పేరు.

‘హుంఫట్’ అను మంత్రముచే ప్రాకారమును భావనచేసి, ఆత్మ రక్ష ఏర్పరచు కొనవలెను. దీని బైట, వెలుపల, క్రింద, మీద, భావన ద్వారా శక్తి జాలమును విస్తరింపచేయవలెను. పిమ్మట మహాముద్రా ప్రదర్శనముచేసి, పూరక ప్రాణాయామముతో హృదయ కమలమునందున్న శివుని ధ్యానించి, ఆనందామృతమయ మకరందముతో (నిండిన) భావమయ పుష్పములతో శివునకు పాదముల నుండి శిరస్సు వరకును అంగపూజ చేయవలెను. శివ మంత్రములతో నాభికుండము నందున్న శివ స్వరూపాగ్నిని తృప్తుని చేయవలెను. ఆ శివానలమే లలాటమున బిందు రూపములో ఉన్నది; దాని విగ్రహము మంగళమయము (అని) భావన చేయవలెను. స్వర్ణ పాత్రముగాని, రజత పాత్రముగాని, తామ్రపాత్రముగాని అర్ఘ్యము నిమిత్తమై గ్రహించి దానిని అస్త్రబీజము (ఫట్) ఉచ్చరించుచు కడగవలెను. బిందు రూప శివుని నుండి అమృతము ఆవిర్భవించుచున్నట్లు భావనచేసి హృదయమంత్రము (నమః) ఉచ్చరించుచు, దానితో కలిసిన జలాక్షతాదులతో ఆ పాత్రను నింపవలెను. దానికి షడంగ పూజచేసి, దేవతా మూలమంత్రముచే అభిమంత్రించవలెను. అస్త్రమంత్రము (ఫట్)చే దాని రక్షచేసి, కవచబీజ (హుమ్)ముచే దానిని కప్పవలెను. ఈ విధముగ అష్టాంగార్ఘ్యము ఏర్పరచి, ధేనుముద్రచే దానికి అమృతీకరణము చేసి, ఆ జలమును అన్ని వైపులను చల్లవలెను. తన శిరస్సుపై కూడ చల్లుకొనవలెను. పూజా సామగ్రి మీద కూడ అస్త్రబీజమును ఉచ్చరించుచు చల్లవలెను. హృదయ బీజముతో అభిమంత్రించి, ‘హుమ్’ బీజకముచే (లేదా మత్స్య ముద్రచే) దానిని ఆచ్ఛాదించవలెను.

అమృత (ధేను) ముద్ర ప్రదర్శించి, తన ఆసనముపై పుష్పము ఉంచి, లలాటముపై తిలకము ధరించి, మూల మంత్రముతో దేవతకు పుష్పము అర్పించవలెను. సాధకుడు, స్నాన, దేవతాపూజా, హోమ, భోజన, యజ్ఞా అనుష్ఠాన, యోగ, సాధన, ఆవశ్యక జప సమయములందు, స్థిరబుద్ధియై మౌనముగా ఉండవలెను, నాదపర్యంతము ప్రణవోచ్చారణము చేయుచు మంత్రశోధనము చేయవలెను. ఉత్తమసంస్కారముక్తుడై దేవపూజా ప్రారంభము చేయవలెను. మూలగాయత్రిచేత గాని, రుద్ర గాయత్రిచేత గాని అర్ఘ్య పూజనము చేసి ఆ సామాన్యార్ఘ్యమును దేవతకు సమర్పింవలెను. బ్రహ్మపంచకము (పంచగవ్యములు, కుశోదకముతో చేసిన బ్రహ్మకూర్చము) సిద్ధముచేసికొని, శివలింగము నుండి పుష్ప నిర్మాల్యమును తీసివేసి, ఈశాన్యము నందు “చండాయనమః” అని చెప్పుచు చండునకు సమర్పించవలెను. బ్రహ్మపంచకముతో పిండికా శివలింగములకు స్నానము చేయించి, ‘ఫట్’ అని ఉచ్చరించుచు, మరల ఉదకముతో స్నానము చేయించవలెను. “నమో నమః” అని ఉచ్చరించుచు అర్ఘ్య పాత్ర గతజలముతో ఆ శివలింగమునకు అభిషేకము చేయవలెను. ఇది లింగశోధన విధానము.

ఆత్మ, ద్రవ్య, మంత్రలింగ శుద్ధులు చేసిన పిమ్మట సకల దేవతలను పూజించవలెను. వాయువ్యమునందు, “ఓం హాం గణపతయే నమః” అని ఉచ్చరించుచు గణపతిని పూజించవలెను. ఈశాన్యమునందు “ఓం హాం గురుభ్యోన్నమః” అని చెప్పుచు గురు, పరమ గురు, పరాత్పర గురు, పరమేష్ఠి గురువులను, గురుపరంపరను పూజించవలెను. కూర్మ రూపమగు శిలపై ఉన్న అంకుర తుల్యమగు ఆధారశక్తిని పూజించి, బ్రహ్మశిలపై కూర్చున్న శివుని ఆసనమైన అనంతదేవుని “ఓం హాం అనన్తాయ నమః” అను మంత్రముతో పూజింపవలెను. శివుని సింహాసనముగా ఉన్న మంచమునకు నాలుగు కోళ్ళు ఉండును. వాటి ఆకారము సింహ ఆకారమున విచిత్రముగానుండును. ఈ సింహములు మండలాకారమున నిలచి ఎదుట ఉన్న దానిని పృష్ఠభాగమును చూచుచుండును. ఇవి సత్య, త్రేతా, ద్వాపర, కలియుగములకు ప్రతీకములు. పిమ్మట శివుని ఆసనపాదుకలను పూజించవలెను. పిమ్మట ఆగ్నేయాది విదిశలలో నున్న ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్యములను పూజింపవలెను. వీటి రంగులు వరుసగ కర్పూర, కుంకుమ, సువర్ణ, కజ్జలము (కాటుక)లతో సమానముగ నుండును. వీటి నాలుగుకాళ్లకును పూజ చేసి ఆసనముపై నున్న అష్టదళ కమలము నందలి క్రింది దళములను, పై దళములను, మొత్తము కమలమును పూజించి, “ఓం హాం కర్షికాయై నమః” అను మంత్రముతో కర్ణికా మధ్య భాగమును పూజించవలెను. ఆ కమలము యొక్క ఎనిమిది పూర్వాది దళములందును, మధ్య భాగము నందును తొమ్మండుగురు శక్తులను పూజించవలెను. ఆ శక్తులు హస్తములలో చామరములు ధరించియుందురు. వరద, అభయ ముద్రలు కూడ ఉండును. వామా, జ్యేష్ఠా, రౌద్రీ, కాళీ, కలవికారిణీ, బలవికారిణీ, బలప్రమథనీ, సర్వభూతదమనీ, మనోన్మనీ అను ఎనమండుగురు శక్తులను అష్టదలముల పైనను, మనోన్మనియను శక్తిని కమల కేసరములందును “హాం వామాయై నమః ఇత్యాది మంత్రములు ఉచ్చరించుచు పూజించవలెను. పిమ్మట పృథివ్యాద్యష్టమూర్తులను, విశుద్ధ విద్యా దేహమును భావించుచు పూజ చేయవలెను. శుద్ధ విద్యను, తత్త్వవ్యాపక ఆసనమున పూజించవలెను. ఆ సింహాసనముపై కర్పూరమువలె తెల్లగా ఉన్నవాడును, సర్వవ్యాపియు, ఐదు ముఖములు గలవాడును అగు మహాదేవుని ప్రతిష్ఠ చేయవలెను. ఆయనకు పది భుజములుండును. శిరస్సున అర్ధచంద్రుడు ఉండును. కుడి చేతులలో శక్తి, ఋష్టి, శూల, ఖట్వాంగ, వరద ముద్రలుండును. ఎడమ చేతులలో డమరు, బీజపూర, సర్ప, అక్షసూత్ర, నీలకమలములను ధరించి యుండును.

ఆసనముపై ఆసీనుడైయున్న శివుని దివ్యమూర్తి ముప్పది రెండు లక్షణములతో ప్రకాశించు చున్నదని చింతనము చేయుచు, శివ స్మరణము చేయుచు, “ఓం హాం హాం హాం శివమూర్తయే నమః” అను మంత్రము ఉచ్చరించుచు నమస్కారము చేయవలెను. బ్రహ్మాది కారణ త్యాగ పూర్వకమగు మంత్రమును శివునియందు ప్రతిష్ఠితము చేయవలెను. లలాట మధ్య భాగమున చంద్రుడువలె ప్రకాశించుచున్న బిందురూప పరమశివుడు హృదయాదులగు ఆరు అంగములతో సంయుక్తుడై పుష్పాంజలిలోనికి దిగివచ్చినట్లు భావనచేసి ఆయనను పూజింపనున్న మూర్తియందు స్థాపించవలెను. పిమ్మట ఆవాహనీ ముద్రతో “ఓం హాం హౌం శివాయ నమః” అను మంత్రము ఉచ్చరించుచు, మూర్తిపై శివుని ఆవాహనము చేయవలెను. స్థాపనీముద్రచే స్థాపనముచేసి, సన్నిధాపనీ ముద్రతో సన్నిహితుని చేసి, సన్నిరోధనీముద్రతో ఆ మూర్తిపై కదలకుండునట్లు చేయవలెను. పిమ్మట “నిష్ఠురాయై కాలకల్యాయై ఫట్” అను మంత్రము ఉచ్చరించుచు ఖడ్గముద్రతో భయమును చూపుచు విఘ్నములను పారద్రోలవలెను. పిమ్మట లింగముద్రను చూపి నమస్కారము చేయవలెను. ‘నమః’ అని అవగుంఠనము చేయవలెను. ఇష్టదేవతను తన వైపునకు అభి ముఖముగనున్నట్లు చేయుటయే ఆవాహనము. దేవతను అర్చా విగ్రహముపై కూర్చుండబెట్టుట స్థాపనము “ప్రభూ! నేను నీవాడను” అని పలుకుచు భగవంతునితో అతి సన్నిహిత సంబంధము నేర్పరచుకొనుటయే సన్నిధాపనము”. శివపూజకు సంబంధించిన కర్మకాండ అంతయు పూర్తి అగువరకు భగవత్సన్నిధానము ఉండునట్లు చేయుట “నిరోధము”. భక్తులు కాని వారికి శివతత్త్వము తెలియకుండునట్లు చేయుట అవగుంఠనము. పిమ్మట సకలీకరణముచేసి ‘హృదయాయ నమః’ ఇత్యాది మంత్రములతో హృదయాద్యంగములకు అంగులతో ఏకత్వమును స్థాపించుటయే ‘అమృతీకరణము’ చైతన్య శక్తి శంకరుని హృదయము. ఎనిమిది విధములైన ఐశ్వర్యము శిరస్సు, వశిత్వము శిఖ, అభేద్యమగు తేజస్సు కవచము, దుస్సహమైన ప్రతాపమే సమస్త విఘ్నములను నివారించు అస్త్రము. హృదయముతో ప్రారంభించి “నమః, స్వధా, స్వాహా, వౌషట్ అనునవి ఉచ్చరించుచు పాద్యాదులను నివేదించవలెను. ఆరాధ్యదేవత యొక్క చరణారవిందములపై పాద్యమును, ముఖారవిందమున ఆచమనమును, అర్ఘ్య, దూర్వా, పుష్ప, అక్షతాదులను శిరస్సునను ఉంచవలెను. ఈ విధముగ పది సంస్కారములచే పరమేశ్వరుని సంస్కారము చేసి, గంధ పుష్పాది పంచఉపచారములతో యథావిధిగా పూజింపవలెను. మొదట దేవతా విగ్రహమునకు ఉదకముచే అభిషేకముచేసి, రాజికాలవణాదులతో ఉద్వర్తన మార్జనములు చేయవలెను. పిమ్మట అర్ఘ్య జలబిందువులు, పుష్పములు మొదలగు వాటితో అభిషేకము చేసి ఘటములో నున్న ఉదకముతో మెల్లమెల్లగ స్నానము చేయించవలెను.

పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార-వీటిని వరుసగ ఈశాన తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత మంత్రములతో అభిమంత్రించి, వాటితో అనేకమార్లు స్నానము చేయించవలెను. వాటిని కలిపి పంచామృతముచేసి, దానితో భగవంతునకు స్నానము చేయించవలెను. దీనివలన భోగ మోక్షములు లభించును. పైన చెప్పిన క్షీరము మొదలైన వాటిలో జలధూపములు కలిపి, మూలమంత్రముతో శివునకు అభిషేకము చేయవలెను. పిదప యవపిష్టముతో జిడ్డుపోవునట్లు చేసి శీతల జలముతో స్నానము చేయించవలెను. యథాశక్తిగ చందన, కేసరాది యుక్తమగు ఉదకముతో స్నానము చేయించి వస్త్రముతో విగ్రహమును బాగుగా తుడవవలెను. పిదప అర్ఘ్యము సమర్పింపవలెను. దేవతమీద హస్తము త్రిప్పగూడదు. శివలింగము తలపై ఎన్నడును పుష్పము లేకుండ ఉంచగూడదు. పిదప ఇతర ఉపచారములు సమర్పించి చందనాద్యనులేపనము చేయవలెను. శివమంత్రము జపించుచు పుష్పార్పణ చేసి పూజించవలెను. అస్త్ర మంత్రము (ఫట్)తో ధూప పాత్రను ప్రోక్షించి, శివమంత్రముతో ధూపముచే పూజించవలెను. అస్త్రమంత్రముచే పూజింపబడిన ఘంట మ్రోగించుచు గుగ్గులు ధూపము వేయవలెను. “శివాయ నమః” అను మంత్రమును ఉచ్చరించుచు అమృతమధురమగు జలముతో ఆచమనము సమర్పించవలెను. పిమ్మట హారతి ఇచ్చి ఆచమనము చేయించవలెను. నమస్కరించి, దేవత అనుమతి గైకొని భోగాంగముల పూజ చేయవలెను.

ఆగ్నేయమునందు చంద్రుడు ఉజ్జ్వలమైన హృదయమును, ఈశాన్యమునందు సువర్ణ సమాన కాంతిగల శిరస్సును, నైరృతియందు ఎఱ్ఱని రంగుగల శిఖను, వాయవ్యము నందు నల్లని రంగుగల కవచమును పూజింపవలెను. అగ్నివర్ణమగు నేత్రమును, కృష్ణ పింగళ వర్ణమగు అస్త్రమును పూజించి, కమలముపై చతుర్ముఖుడగు బ్రహ్మయు, చతుర్భుజుడగు విష్ణువు, ఇతరదేవతలును ఉన్నట్లు భావనచేసి వారి పూజచేయవలెను. పూర్వాది దిక్కులందు కోరలతో భయంకరములగు వజ్ర తుల్యాస్త్రములు పూజించవలెను. “ఓం హాం హూం శివాయ నమః” అను మంత్రముతో మూల స్థానమునందు పూజ చేయవలెను. “ఓం హాం హృదయాయ నమః” “హీం శిరసే స్వాహా” అను మంత్రములతో హృదయ శిరస్సులను “హూం శిఖాయై వషట్” అను మంత్రముతోశిఖను ‘హైం కవచాయు హుం’ అను మంత్రముతో కవచమును “హః అస్త్రాయ ఫట్” అని అస్త్రమును పూజించవలెను. పిమ్మట పరివార సమేతుడగు ఈశ్వరునకు క్రమముగ పాద్య, ఆచమన, అర్ఘ్య, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేధ్య, ఆచమనీయ, కరోద్వర్తన, తాంబూల, ముఖవాస, దర్పణములను సమర్పించవలెను. పిమ్మట ఆ దేవాధిదేవుని శిరస్సుపై అక్షతలను, పవిత్రకమును ఉంచి, హృదయముచే (నమః) అభిమంత్రితమగు మూల మంత్రమును నూట ఎనిమిది సార్లు జపించవలెను. పిమ్మట కవచము చుట్టినదియు, అస్త్రముచే రక్షితమును అగు అక్షత, కుశలను, పుష్పములను, సమర్పించి ఉద్భవమగు ముద్రతో శివుని, “ఓ ప్రభూ! గుహ్యాతి గుహ్యమును రక్షించుటకై, నేను చేసిన జపమును గ్రహింపుము, దానిచే నీవు ఉండగా, కృపచే నాకు సిద్ధి లభించుగాక” అని ప్రార్థించవలెను.

భోగేచ్ఛగల సాధకుడు పై శ్లోకము పఠించుచు, మూలమంత్రము ఉచ్చరించుచు కుడిచేతిలో అర్ఘ్యోదకము గ్రహించి, దానిని భగవంతుని వరముద్రతో కూడిన హస్తములో విడువవలెను. మరల ఈ విధముగ ప్రార్థించవలెను. “మహాదేవా! కల్యాణ స్వరూపుడవగు నీపాదములను శరణుజొచ్చినాను. నేను చేసిన శుభాశుభ కర్మల నన్నింటిని తొలగింపుము. “హూం క్షః శివుడే దాత. శివుడే భోక్త. శివుడే ఈ సకల ప్రపంచము, సర్వత్ర శివునకు జయమగుగాక. శివుడే నేను” ఈ రెండు శ్లోకములు చదువుచు చేసిన జపమును శివునకు సమర్పింపవలెను. పిమ్మట పూర్వము చేసిన శివమంత్రజపములో దశాంశము మరల జపించవలెను. (హోమపూర్తికి ఇది అవసరము) మరల అర్ఘ్యమిచ్చి భగవంతుని స్తుతించవలెను. పిమ్మట అష్టమూర్తియగు శివునకు ప్రదక్షిణము చేసి సాష్టాంగ ప్రణామము చేయవలెను. నమస్కరించి శివధ్యానముచేసి, క్షేత్రము (పొలము) నందుగాని, అగ్న్యాదులందు గాని శివుని ఉద్దేశించి హోమ-పూజాదులు చేయవలెను. (74)