అగ్ని మహా పురాణము

Table of Contents

తీర్థమాహాత్మ్యము

అగ్నిదేవుడు పలికెను-

ఇపుడు భుక్తిముక్తి ప్రదమగు తీర్థమాహాత్మ్యమును గూర్చి చెప్పెదను. హస్తములను, పాదములను, మనస్సును సంయమములో నుంచుకొన్నవాడును, విద్యా, తపః కీర్తులు కలవాడును మాత్రమే తీర్థములనుండి పూర్తి ఫలమును పొందగలుగును. ప్రతి గ్రహమును విడచి, నియమిత ఆహారమును భుజించుచు, ఇంద్రియములను స్వాధీనమునందు ఉంచుకొన్నవాడై పాపరహితుడగు తీర్థయాత్రికుడు సకల యజ్ఞఫలమును పొందగలడు. ఎవడు మూడు రాత్రులు ఉపవాసము చేయలేదో, తీర్థయాత్ర చేయలేదో, వాడు దరిద్రుడగును. యజ్ఞమువలన కలుగు ఫలితము తీర్థయాత్రల వలన కలుగును. పుష్కరము శ్రేష్ఠమైన తీర్థము. మూడు సంధ్యలందును అచట సకల దేవతలతో కలసి బ్రహ్మ ఉండును. కోరికలు కలవారు, మునులు, దేవతలును అచట స్నానముచేసి సిద్ధి పొందినవారు. పుష్కరమునందు దేవతలను, పితృదేవతలను పూజించినవాడు అశ్వమేధ యజ్ఞఫలమును పొంది బ్రహ్మలోకమునకు పోవును. కార్తీక పూర్ణిమనాడు అచట అన్నదానముచేసిన వాడు శుద్ధచిత్తుడై బ్రహ్మలోకము చేరును. పుష్కరమునకు వెళ్లుటకు అచట తపస్సు చేయుటకు, అచట దానముచేయుటకు, అవకాశము లభించుటయే చాల కష్టము. అచట నివసించు సౌభాగ్యము లభించుట అతిదుష్కరము. పుష్కరమునందు నివసించువాడును, అచట జప శ్రాద్ధములు చేసిన వాడును, తన వంశము నందు నూరుతరముల వారిని ఉద్ధరించును. జంబూ మార్గము, తండులి కాశ్రమము అను తీర్థములు కూడ అచటనే ఉన్నవి. కణ్వాశ్రమము, కోటి తీర్థము, నర్మద, అర్బుదము కూడ ఉత్తమ తీర్థములు. చర్మణ్వతి, సింధువు, సోమనాధము, ప్రభాసము, సరస్వతీ సముద్ర సంగమము, సాగరము కూడా శ్రేష్ఠమైన తీర్థములు. పిండారక క్షేత్రము, ద్వారక, గోమతి ఇవన్నియు సర్వసిద్ధి ప్రదములగు తీర్థములు. భూమి తీర్థము, బ్రాహ్మతుంగ తీర్థము, పంచనదములు (సత్లజ్ మొదలైన ఐదు నదులు) కూడ ఉత్తమములు. భీమ తీర్థ-గిరీంద్ర తీర్థములు, పాపవినాశని అగు దేవికానది, పవిత్రమైన వినశన తీర్థము, నాగోద్భేదము, అఘాదనము, కుమార కోటి-ఇవన్నియు సకల ఫలప్రదములు. ‘నేను కురుక్షేత్రమునకు వెళ్ళెదను, కురుక్షేత్రములో నివాసము చేసెదను’ అని సర్వదా చెప్పువాడు పరిశుద్ధుడై స్వర్గలోకమును పొందును. అచట విష్ణ్వాది దేవతలు నివసించు చుందురు. అచట నివాసము చేయుటచే మానవుడు విష్ణులోకమును పొందును, కురుక్షేత్రమునందు సమీపముననే సరస్వతీనది ప్రవహించు చుండును. దానిలో స్నానముచేయువాడు బ్రహ్మలోకము పొందును. కురుక్షేత్రము నందలి ధూళికూడ ఉత్తమపదము నిచ్చును. ధర్మతీర్థ-సువర్ణ తీర్థములు, పరమోత్తమమైన గంగా ద్వారము (హరిద్వారము) పవిత్రమైన కనఖలము భద్ర-కర్ణహ్రదము, గంగా సరస్వతీ సంగమము, బ్రహ్మావర్తము ఇవి పాపవినాశకములైన తీర్థములు. భృగుతుంగ-కుబ్జామ్ర-గంగోద్భేదములు గూడ పాప వినాశకములు. వారాణసి సర్వోత్తమమైన తీర్థము. దీనికే శ్రేష్ఠమగు అవిముక్త క్షేత్రమని కూడ పేరు. కపాల మోచన తీర్థము కూడ ఉత్తమమైనది. ప్రయాగ తీర్థములలో రాజు. గోమతీ-గంగా సంగమము కూడ పావన తీర్థము. గంగ ఎక్కడ నున్నను స్వర్గలోకము నిచ్చును. రాజ గృహము పవిత్రతీర్థము, శాలగ్రామ తీర్థము పాపవినాశకము. వటేశ-వామన-కాలికాసంగమ తీర్థములు కూడ ఉత్తమమైనవి. రౌహిత్య తీర్థము, కరతోయానది, శోణభద్రము, ఋషభ తీర్థము కూడ శ్రేష్ఠమైనవి. శ్రీపర్వత, కోలాచల, సహ్యగిరి, మలయగిరి, గోదావరీ, తుంగభద్రలు, వరదాయినియగు కావేరినది, తాపి, పయోష్ణి, రేవ (నర్మద) దండకారణ్యము కూడ ఉత్తమ తీర్థములు. కాలంజర, ముంజవట, శూర్పారక, మందాకినీ, చిత్రకూట, శృంగవే(బే)ర పురములు కూడ శ్రేష్ఠములు. అవంతి కూడ ఉత్తమ తీర్థము. అయోధ్య సకల పాపములను నశింపచేయును. నైమిశారణ్యము పరమపవిత్ర తీర్థము. ఇది భుక్తి ముక్తి ప్రదము. (109)