అగ్ని మహా పురాణము
రాజ్యాభిషేక విధానము
అగ్నిదేవుడు చెప్పెను:
వసిష్ఠా! పూర్వము పరశురాముడు ప్రశ్నింపగా పుష్కరుడు చెప్పిన రాజధర్మములను చెప్పెదను, పుష్కరుడు పలికెను: రామా! నేను సకల రాజు ధర్మముల నుండి గ్రహించిన రాజు యొక్క ధర్మములను చెప్పెదను. రాజు దండమును ఉచితరీతిని ఉపయోగించుచు శత్రువులను నశింపచేసి, ప్రజలను రక్షించవలెను. ‘మీరందరును ధర్మమార్గమును అనుసరించి ఉండుడు. నేను మిమ్ములను రక్షించెదను’ అని ప్రజలకు చెప్పి తనమాట నిలుపుకొనవలెను. రాజు సంవత్సర ఫలమును చెప్పు ఒక్క జ్యోతిః శాస్త్రవేత్తయగు బ్రాహ్మణుని, పురోహితుని వరణము చేయవలెను. సకల రాజకీయ శాస్త్ర నిపుణులు, ఆత్మజ్ఞానవంతులు అగు మంత్రులను నియమించి సకలగుణ సంపన్నురాలగు దేవిని పట్టమహిషినిగా చేయవలెను. రాజ్య భారము వహించిన రాజు ఒక సంవత్సరము గడచిన పిమ్మట అభిషేక సంభారములన్నియు సంపాదించి ఉత్సవ పూర్వకముగా రాజ్యాభిషేకము పొందవలెను. రాజ్యము చేయుచున్న రాజు మరణించిన వెంటనే, వారసుడు ముహూర్తాది చింతేమియు చేయక రాజ్యభారము వెంటనే వహించవలెను. రాజు జ్యోతిషిక పురోహితాదుల ద్వారా తిలసర్షపాది సామగ్రిని ఉపయోగించుచు స్నానముచేసి భద్రాసనము అలంకరించి రాజ్యము నందుండుచు, తన విజయమును ఘోషించవలెను. అభయ ఘోషణచేసి రాజ్యములో నున్న ఖైదీలను అందరిని బంధ విముక్తులను చేయవలెను. పురోహితునిచే అభిషేకము పొందుటకు పూర్వము, ఇంద్రాది దేవతా శాంతి చేయించవలెను. అభిషేక దివసమున ఉపవాసముచేసి వేదికపై స్థాపించబడిన అగ్నియందు మంత్రపాతపూర్వకముగ హోమములు చేయవలెను. విష్ణు, ఇంద్ర, సవితృ, విశ్వదేవ, సోమ దేవతా ఋక్కులను, స్వస్త్యయన-శాంతి ఆయుష్య-అభయదములగు మంత్రములను పఠించవలెను. అగ్నికి దక్షిణమున అపరాజితాదేవిని, అనేక భద్రములుగల సువర్ణ కలశను స్థాపించి చందన పుష్పాదులతో పూజించవలెను. అగ్నిశిఖ కుడివైపు తిరుగుచు, తప్తసువర్ణ కాంతితో రథ-మేఘ ధ్వనులతో సమానమగు ధ్వనిని కలిగించుచు, ధూమ రహితమై ఉన్నచో, అగ్నిదేవుడు అనుకూలుడై హవిస్సును గ్రహించినచో, హోమాగ్ని నుండి ఉత్తమ గంధము బయల్వెడలినచో, మంటలు స్వస్తిక ఆకారమున పై కెగసినచో, అగ్ని స్వచ్ఛమై ఎత్తుగా లేచినచో, నిప్పు నెరసులు లేవకున్నచో అది శుభప్రదము.
రాజునకు అగ్నికి మధ్యనుండి పిల్లికాని, మృగముకాని, పక్షికాని వెళ్లకూడదు. రాజు మొదట పర్వత శిఖర మృత్తికతో శిరస్సును శుద్ధి చేసుకొనవలెను. పుట్ట మట్టితో చెవులను, విష్ణ్వాలయ పరాగముతో ముఖమును, ఇంద్ర దేవాలయ మృత్తు(మట్టి)తో కంఠమును, రాజగృహము వాకిలి యందలి మట్టితో హృదయమును, ఏనుగు దంతములతో త్రవ్విన మట్టితో కుడి చేతిని, ఎద్దు కొమ్ముతో త్రవ్విన మట్టితో ఎడమ భుజమును, సరస్సునందలి మృత్తికతో వీపును, నదీద్వయ సంగమ మృత్తికతో ఉదరమును, నది రెండు తటముల మృత్తికతో పార్శ్వములను, వేశ్వాద్వార మృత్తికతో కటిభాగమును, యజ్ఞశాలా మృత్తికతో తొడలను, గోశాలా మృత్తికతో మోకాళ్లను, అశ్వశాలా మృత్తికతో కళ్లను, రథచక్ర మృత్తికతో పాదములను శుద్ధము చేసికొనవలెను. పిదప పంచగవ్యముతో శిరస్సును శుద్ధి చేసికొన వలెను. పిదప నలుగురు అమాత్యులు భద్రాసనముపై కూర్చున్న రాజునకు కలశోదకముతో అభిషేకము చేయవలెను. బ్రాహ్మణుడైన సచివుడు, తూర్పునుండి ఘృతపూర్ణ సువర్ణ కలశముతో అభిషేకము ఆరంభింపవలెను. క్షత్రియ సచివుడు దక్షిణమున నిలచి క్షీరపూర్ణమగు రజతకలశతోను, వైశ్యామాత్యుడు పశ్చిమమున నిలిచి దధిపూర్ణ తామ్రకలశతోను, శూద్రామాత్యుడు ఉత్తరమున ఉండి జలపూర్ణ మృత్పాత్రతోను రాజాభిషేకము చేయవలెను. పిదప ఋగ్వేదులలో శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు తేనెతోను, సామవేదియైన విప్రుడు కుశజలముతోను అభిషేకము చేయవలెను. పిదప పురోహితులు అనేకచ్ఛిద్ర యుక్తమగు సువర్ణ కలశము వద్దకు వెళ్ళి, సదస్యులమధ్య యథాశాస్త్రముగ అగ్ని రక్షాకార్యము నిర్వర్తించి అభిషేక మంత్రములు పఠించుచు అభిషేకము చేయవలెను. ఆ సమయమున బ్రాహ్మణులు వేదమంత్రములను పఠించవలెను. పిదప పురోహితుడు వేదిని సమీపించి సువర్ణమయ మగు శతచ్ఛిద్ర కలశముతో అభిషేకము ప్రారంభింపవలెను. ‘యా ఓషధీః’ ఇత్యాది మంత్రమును చదువుచు ఓషధులతోను, ‘అధోత్యుక్త్వాః’ ఇత్యాది మంత్రము చదువుచు గంధములతోను, ‘పుష్పవతీః’ ఇత్యాది మంత్రము చదువుచు పుష్పములతోను, ‘బ్రహ్మణః’ ఇత్యాది మంత్రము చదువుచు బీజములతోను, ‘ఆశుః-శశానః’ ఇత్యాది మంత్రము చదు వుచు రత్నములతోను, ‘యేదేవాః’ ఇత్యాది మంత్రమును చదువుచు కుశయుక్త జలముతోను అభిషేకము చేయవలెను. యజుర్వేదియగు బ్రాహ్మణుడును, అథర్వవేదియగు బ్రాహ్మణు డును ‘గన్ధద్వారామ్’ ఇత్యాది మంత్రముతో శిరస్సుపైనను, కంఠము నందును గోరోచనముతో తిలకముంచవలెను.
కొందరు గీతవాద్యాది ధ్వనులు బయల్వెడలుచుండగా చామరవ్యజనములు గ్రహించి, సరౌషధియుక్త కలశముతో రాజు ఎదుట నిలబడవలెను. రాజు ముందుగా ఆ కలశమును, పిదప అద్దమును, ఘృతాది మాంగళిక వస్తువులను చూడవలెను. పిదప విష్ణు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలను, గ్రహములను పూజించి వ్యాఘ్ర చర్మయుక్తాసనముపై కూర్చుండవలెను. ఆ సమయమున పురోహితుడు మధుపర్కాదులు ఇచ్చి రాజు శిరస్సుపై కిరీటము ఉంచవలెను. పంచ చర్మాసనములపై కూర్చుండి రాజు మకుట ధారణము చేయవలెను. ధ్రువాద్యౌః’ ఇత్యాది మంత్రముతో ఆ ఆసనముపై కూర్చుండవలెను. ఆ సమయమున వృష, వృషదంశ, వృక, వ్యాఘ్ర, సింహ చర్మాసనములు ఉపయోగింపబడును. అభిషేకా నంతరము ప్రతీహార, అమాత్య, సచివాదులను చూపుచు ప్రజలకు పరిచయము చేయవలెను. పిదప రాజు, గోవు, మేక, గొఱ్ఱె, గృహము మొదలగు వాటిని దానముచేసి జ్యోతిషశాస్త్ర పండితులైన పురోహితులను పూజించవలెను. భూమి, గోవులు, అన్నము మొదలగునవి ఇచ్చి ఇతర బ్రాహ్మణులను కూడ పూజించవలెను. అగ్ని ప్రదక్షిణము చేసి గురువును పూజించవలెను. పిదప వృషభ పీఠమును స్పృశించి, సవత్సయగు గోవును పూజించి, అభిమంత్రితమగు అశ్వమును ఎక్కవలెను. దానినుంచి దిగి గజమును పూజించి, దానిని అధిరోహించి, సేనాసహితుడై ప్రదక్షిణ క్రమమున మార్గముపై కొంచెము దూరము వెళ్లవలెను. పిదప దానాదులచే అందరిని సత్కరించి, వీడ్కోలిచ్చి రాజధానిలో ప్రవేశించవలెను. (218)
