అగ్ని మహా పురాణము

Table of Contents

స్వప్నాధ్యాయము-దుఃస్వప్న నివారణము

పుష్కరుడు పలికెను:

శుభాశుభ స్వప్నములు, అశుభ స్వప్న ఫల నివారణోపాయములు చెప్పెదను. నాభితప్ప ఇతర శరీరాంగములందు తృణములు, వృక్షములు మొలచుట, నెత్తిమీద పెట్టుకొన్న కాంస్య పాత్రలు బ్రద్దలగుట తల గొరిగించుకొనుట, వస్త్రవిహీనుడగుట, మలిన వస్త్రములు ధరించుట, తైలము, బురద పూసికొనుట, పైనుంచి పడుట, వివాహమగుట, గీతములు వినుట, వీణాది వాద్యములు వినుచు మనోవినోదము చేయుట, ఉయ్యాల ఊగుట, పద్మములను, లోహములను సంపాదించుట, సర్పములను చంపుట, ఎఱ్ఱటి పూవులతో నిండిన వృక్షములను చండాలులను చూచుట, సూకరము, కుక్క, గాడిద, ఒంటె-వాటిపై ఎక్కుట, పక్షిమాంసము భుజించుట, తైలము త్రాగుట, కిచడీ తినుట, మాతృగర్భము ప్రవేశించుట, చితిపై ఎక్కుట, ఇంద్ర ధ్వజము విరిగిపడుట, సూర్య చంద్రులు పడిపోవుట, దివ్య, అంతరిక్ష, భూ లోకములందు ఉత్పాతములు కనబడుట, దేవతా, బ్రాహ్మణ, రాజ, గురువులకు కోపము కలుగుట, నాట్యమాడుట, నవ్వుట, గీతములు పాడుట, వివాహము చేయుట, వీణతప్ప మిగిలిన వాద్యములను తానువాయించుట, నదిలో మునిగి క్రిందికి పోవుట, గోమయము, బురద, సిరా కలసిన నీళ్ళలో స్నానము చేయుట, కుమారీకన్యలను ఆలింగనము చేసికొనుట, పురుషులు పరస్పరము మైథునము చేసికొనుట, తన అవయవముల హాని, వమనము, విరేచనము అగుట, దక్షిణదిక్కువైపు వెళ్ళుట, రోగముచే పీడితుడగుట, ఫలముల హాని, ధాతువును బ్రద్దలు కొట్టుట, ఇండ్లను పడద్రోయుట, ఇండ్లలో తుడుచుట, పిశాచ, రాక్షస, వానర, చాండాలాదులతో క్రీడించుట, శత్రువుచే అవమానితుడగుట, శత్రువుల నుండి కష్టములు వచ్చుట, కాషాయ వస్త్రములు ధరించుట, కాషాయవస్త్రములతో ఆడుకొనుట, తైలము త్రాగుట, దానిలో స్నానము చేయుట, ఎఱ్ఱని పూలమాల ధరించుట, ఎఱ్ఱని చందనము ధరించుట, ఇవన్నియు చెడు స్వప్నములు. వీటిని ఇతరులకు చెప్పకుండుట మంచిది. ఇట్టి స్వప్నములు వచ్చినపుడు మరల నిద్రించవలెను. స్వప్న దోషశాంతికై బ్రాహ్మణులను పూజించవలెను. తిలహోమము చేయవలెను. బ్రహ్మ విష్ణు శివులను, సూర్య గణములను పూజించి స్తోత్ర, పురుషసూక్తాదుల పారాయణము చేయవలెను. రాత్రి మొదటి జామునందు చూచిన స్వప్నముల ఫలము ఒక సంవత్సరములో కలుగును. రెండవ జామున చూచిన వాటి ఫలము ఆరు మాసములందును మూడవ జామునందు చూచిన వాటి ఫలము మూడు మాసములందును, నాల్గవ జామునందు చూచిన స్వప్నముల ఫలము పదునైదు దినములందును కలుగును. అరుణోదయ సమయమున చూచిన దాని ఫలము పది రోజులలోనే కలుగును.

ఒకే రాత్రి శుభాశుభ స్వప్నములు రెండును వచ్చినచో తరువాత వచ్చినదాని ఫలమునే చెప్పవలెను. అందుచే శుభస్వప్నము చూచినతరువాత నిద్రించుట మంచిదికాదు. పర్వతము, భవనము, ఏనుగు, గుఱ్ఱము, ఎద్దు ఎక్కినట్లు స్వప్నము వచ్చినచో మంచిది. పరశురామా! భూమి మీదగాని, ఆకాశమునందుగాని తెల్లటి పూవులతో నిండిన వృక్షములు కనబడినను, తన నాభినుండి వృక్షముగాని, తృణముగాని మొలిచినను, తన భుజములు గాని, శిరస్సుగాని అధికముగా ఉన్నట్లు కనబడినను, కేశములు తెల్లబడినను మంచి ఫలములు లభించును. శ్వేత పుష్ప మాలయు, శ్వేత వస్త్రములును ధరించుట, చంద్ర, సూర్య, నక్షత్రములను పట్టుకొనుట, వాటిని తుడుచుట, ఇంద్ర ధ్వజమును ఆలింగనము చేసికొనుట, ధ్వజమునుపైకి ఎత్తుట, భూమిపై పడుతున్న జలధారను తనమీద ఆపుట, శత్రువినాశనమును చూచుట, వాద వివిధములందును, యుద్ధమునందును తాను జయించుట, పాయసము భుజించుట, రక్తము చూచుట, రక్తములో స్నానమాడుట, సుర, మద్యము, లేదా పాలు త్రాగుట, అస్త్ర ప్రహారముతిని నేలపై దొర్లుట, ఆకాశము స్వచ్ఛమగుట, గోవు, గేదె, ఆడ సింహము, ఆడ ఏనుగు, ఆడ గుఱ్ఱము వీటి పొదుగు నుండి పాలు త్రాగుట, ఇవన్నియు మంచి స్వప్నములు. దేవతా, గురు, బ్రాహ్మణుల ప్రసాదము, గోశృంగము నుండిగాని, చంద్రుని నుండిగాని స్రవించు ఉదకముతో అభిషేకము చేసికొనుట-ఈ స్వప్నములు రాజ్యము నిచ్చును. పరశురామా! తాను రాజ్యాభిషిక్తుడగుట, తన శిరస్సు ఖండితమగుట, తాను చచ్చుట, అగ్నిలో పడుట, గృహాదులకు అగ్ని దగ్ధమగునపుడు ఆ అగ్నిలో పడుట, రాజ చిహ్నములు లభించుట, స్వయముగా వీణ వాయించుట, ఈ స్వప్నములు గూడ మంచివి; రాజ్యమును ఇచ్చునవి. స్వప్నము చివర రాజును, ఏనుగును, అశ్వమును, సువర్ణమును, వృషభమును, గోవును చూచినవారి కుటుంబము వృద్ధి చెందును. ఎద్దు, గజము, ప్రాసాదోపరి భాగము, పర్వత శిఖరము, వృక్షము వీటిపైకెక్కుట, ఏడ్చుట, శరీరమునకు నెయ్యి, మలము అంటుకొనుట, ఆగమ్యాస్త్రీ గమనము ఇవి కూడ శుభ స్వప్నములు. (229)