అగ్ని మహా పురాణము

Table of Contents

అష్టమీ వ్రతములు -II

అగ్ని దేవుడు పలికెను:

చైత్ర కృష్ణ పక్షమున అష్టమీ వ్రతము ఆచరించి ఆ దినమున బ్రహ్మాది దేవతలను, మాతృ గణమును పూజించవలెను. ఒక సంవత్సరముపాటు కృష్ణ పక్షాష్టములందు శ్రీకృష్ణ పూజ చేయువాడు సంతానమును పొందును. ఇప్పుడు కాలాష్టమీ వ్రతము చెప్పెదను. ఈ వ్రతము మార్గశీర్ష కృష్ణాష్టమి నాడు చేయవలెను. రాత్రియైన పిదప వ్రతము చేయువాడు స్నానాదులచే పవిత్రుడై శివుని పూజించి, గోమూత్రముచే వ్రతపారణము చేయవలెను. రాత్రియందు భూమిపై శయనించవలెను. పుష్య మాసము నందు శివుని పూజించి ఘృతాహారమును, మాఘమున మహేశ్వరుని పూజించి దుగ్ధాహారమును తీసికొనవలెను. ఫాల్గుణమునందు మహాదేవుని పూజించి, ఉపవాసముచేసి తిలలు ఆహారముగా గ్రహించవలెను. చైత్రమునందు ‘స్థాణువును’ పూజించి యవలు భుజించవలెను. వైశాఖమున ‘శివుని’ పూజించి కుశ జలముతో పారణచేయవలెను. జ్యేష్ఠమున పశుపతిని పూజించి నదీజలము త్రాగవలెను. ఆషాఢమున ఉగ్రుని పూజించి గోమయమును భక్షించవలెను. శ్రావణమున శర్వుని పూజించి మందారపుష్పములను భుజించవలెను. భాద్రపదమునందు రాత్రి త్ర్యంబకుని పూజించి బిల్వపత్రమును భుజించవలెను. ఆశ్వయుజమున ఈశుని పూజించి బియ్యమును, కార్తికమునందు రుద్రుని పూజించి పెరుగు భుజించవలెను, సంవత్సరాంతమున హోమముచేసి, సర్వతోభద్ర లింగమును నిర్మించి శంకరుని పూజించవలెను. పిదప ఆచార్యునకు గో, వస్త్ర, సువర్ణ దానము చేయవలెను. ఇతరులకు గూడ అదిదానము చేయవలెను. పిదప బ్రాహ్మణులకు భోజనము పెట్టినవాడు భుక్తిముక్తులను పొందును. ప్రతిమాసమునందును, అష్టమీతిథులందు రాత్రిమాత్రమే భోజనము చేసి సంవత్సరాంతము నందు గోదానము చేయవలెను. ఇట్లు చేసినవాడు ఇంద్రపదమును చెందును. దీనికి స్వర్గతివ్రతమని పేరు. శుక్ల పక్షమునందుగాని, కృష్ణపక్షము నందు గాని అష్టమీ బుధవార యోగము కలిగినపుడు వ్రతమాచరించి ఒకమారు భోజనము చేయవలెను. అష్టమీ వ్రతము చేయువానికి గృహ ఐశ్వర్యాదులకు లోపముండదు.

 రెండు వ్రేళ్ళు విడచిన పిడికిలితో ఎనిమిది పిడికిళ్ళ బియ్యముతో అన్నము వండి దీనిని కుశ యుక్తమైన మామిడాకుల దొన్నెలో ఉంచవలెను. కులాంబికా సమేతుడగు బుధుని పూజించి, బుధాష్టమీ వ్రతకథవిని భోజనము చేయవలెను. పిదప బ్రాహ్మణులకు తండుల సహితమగు కర్కటి దానముచేసి, యథాశక్తిగా దక్షిణ ఇవ్వవలెను. (బుధాష్టమీ వ్రతకథ): ధీరుడను ఒక బ్రాహ్మణుడు ఉండెను. అతని భార్య పేరు రంభ; పుత్రుని పేరు కౌశికుడు. అతనికి విజయ అను ఒక పుత్రిక కూడ ఉండెను. అతనికి ధనదము అను ఒక ఎద్దు ఉండెను. కౌశికుడు ఆ ఎద్దును మేపుటకై గోపాలకులతో కలసి వెళ్లెను. కౌశికుడు గంగలో స్నానాది కార్యములు చేసికొనుచుండగా ఒక దొంగ ఆ ఎద్దును అపహరించెను. స్నానముచేసి వచ్చిన కౌశికుడు ఎద్దును కానక దానిని వెదకుటకై సోదరి యగు విజయతో కలిసి బయలుదేరెను. ఇతడు ఒక సరోవరమునందు కొందరు దేవతా స్త్రీలనుజూచి భోజనము పెట్టమని అడిగెను. అపుడు ఆ దేవతా స్త్రీలు ఇట్లు పలికిరి-‘నీవు మాకు అతిథిగా వచ్చినావు; అందుచే వ్రతముచేసి భోజనము చేయుము’. అపుడు కౌశికుడు బుధాష్టమీ వ్రతముచేసి భోజనము చేసెను. వనరక్షకుని వద్దకు వెళ్ళి తన ఎద్దును తీసికొని విజయతో తిరిగి వచ్చెను. అతడు యథాకాలమున విజయకు వివాహము చేసి మరణానంతరము యమలోకమునకు పోయెను. వ్రత ప్రభావముచే కౌశికుడు అయోధ్యకు రాజు ఆయెను. తన తల్లి దండ్రులు నరక యాతనలను అనుభవించుట చూచి, విజయముని శరణుజొచ్చెను. కౌశికుడు వేటకొరకై వనమునకు వెళ్ళినపుడు-’నా తలిదండ్రులు నరకము నుండి విముక్తులు ఎట్లు అగుదురు?’ అని ప్రశ్నించెను. అపుడు యముడు ప్రత్యక్షమై ‘రెండు బుధాష్టమీ వ్రతముల ఫలముచే విముక్తులు అగుదురు’ అని చెప్పగా కౌశికుడు రెండు బుధాష్టమీ వ్రతముల ఫలములను తలిదండ్రులకు ధారపోసెను, వారు స్వర్గమునకు వెళ్ళిరి. విజయకూడ సంతసించి భోగ మోక్షాది సిద్ధికై ఈ వ్రతమును ఆచరించెను. చైత్ర శుక్లాష్టమి పునర్వసు నక్షత్ర యుక్తమైనపుడు ఎనిమిది అశోక పుష్పముల మొగ్గల రసము త్రాగినవాడు ఎన్నడును శోకము పొందడు. చైత్రము నందు వికసించు ఓ అశోకమా! నీవు శంకరునకు చాల ఇష్టమైన దానవు. నేను శోకసంతప్తుడనై నీ కళిక(మొగ్గ)ల రసమును త్రాగుచున్నాను. నీ వలెనే నన్నుకూడ శోకరహితుని చేయుము’ అను అర్థము గల ‘త్వామశోక’ ఇత్యాది మంత్రము చెప్పుచు కళాకారసపానము చేయవలెను. చైత్రాద్యష్టములందు మాతృగణ పూజ చేయువాడు శత్రువులపై విజయమును సాధించును. (184)