అగ్ని మహా పురాణము

Table of Contents

రాముడు బోధించిన రాజనీతి - 1

అగ్ని దేవుడు పలికెను: వశిష్టా! ఇంతవరకు, పుష్కరుడు బోధించిన రాజనీతిని చెప్పితిని. ఇపుడు లక్ష్మణునకు రాముడు చెప్పిన విజయప్రదమగు రాజనీతిని వినుము. శ్రీరాముడు చెప్పెను. లక్ష్మణా! న్యాయముగా ధనమును ఆర్జించుట, సంపాదించినదానిని వ్యాపారాదుల ద్వారా వృద్ధి పొందించుకొనుట, దానిని స్వజనుల నుండియు, పరుల నుండియు రక్షించుకొనుట, సత్పాత్రములందు వినియోగించుట ఇవి రాజు చేయవలసిన నాలుగుపనులు. నయమునకు మూలము వినయము. అది శాస్త్రనిశ్చయముచే కలుగును. వినయమనగా ఇంద్రియజయము. వినయము కలవాడే శాస్త్రములను పొందగల్గును. శాస్త్ర జ్ఞానము, ఎనిమిది గుణములుగల బుద్ధి, ధృతి, దక్షత, ప్రగల్భత్వము, ధారణశక్తి, ఉత్సాహము, ప్రవచనశక్తి, దృఢత్వము, ప్రభుశక్తి, శుచిత్వము, మైత్రి, త్యాగము, సత్యము, కృతజ్ఞత, కులీనత్వము, శీలము, దమము-ఇవి సంపత్తికి హేతువులగు గుణములు, విషయములనెడు మహారణ్యములో నిర్భయముగ పరుగెత్తుచున్న ఇంద్రియ గజములను జ్ఞానాంకుశముతో వశమునందు ఉంచుకొనవలెను. రాజు, కామ, క్రోధ, లోభ, మోహ, హర్ష, మద, మాత్సర్య మానములను అరిషడ్వర్గమును పూర్తిగా పరిత్యజించినచో సుఖవంతుడగును.

రాజు, వినయ గుణ సంపన్నుడై, ఆన్వీక్షకి, వేదత్రయము, వార్త (కృషి వాణిజ్య పశుపాలనాదికము), దండనీతి అను నాలుగు విద్యలను గూర్చి విద్వాంసుల వద్దను, వాటి ప్రయోగమునందు నేర్పుకలవారి వద్దను కూర్చుండి చింతనము చేయవలెను. ఆన్వీక్షకి వలన ఆత్మజ్ఞానము, వస్తుయథార్థ స్వరూప జ్ఞానము కలుగును. ధర్మాధర్మ జ్ఞానము వేదత్రయాధీనము. అర్థ-అనర్థములు వార్తా ప్రయోగాధీనములు. న్యాయ-అన్యాయములు దండనీతి యొక్క సముచిత ప్రయోగముపై ఆధారపడియున్నవి. ఏ ప్రాణులకును కష్టము కలిగించకుండుట, మధురముగా మాటలాడుట, సత్యము పలుకుట, బైటను అంతరంగమునందును పవిత్రముగ నుండుట, శౌచారపాలనము, దీనులపై దయ, ఓర్పు-ఇవి అన్ని వర్ణములవారికిని, ఆశ్రమముల వారికిని వర్తించు సాధారణ ధర్మములు. రాజు ప్రజలను అనుగ్రహించుచు, సదాచార తత్పరుడై ఉండవలెను. మధురమైన వాక్కు దీనుల పెదయ, దేశకాలానుసారము సత్పాత్ర దానము, దీనులను శరణా గతులను రక్షించుట, సత్పురుష సహవాసము-ఇది సత్పురుషుల ఆచారము. ఈ ఆచారము ప్రజాసంగ్రహోపాయము. ఇది లోక ప్రశంసా పాత్రముగాన శ్రేష్ఠము. భవిష్యత్తులోగూడ అభ్యుదయ హేతువుగాన హితకరము. ఈ శరీరము రోగములతోను, మానసిక చింతలతోను నిండియున్నది. నేడో, రేపో దీని వినాశము నిశ్చితము. ఇట్టి పరిస్థితులలో ఇట్టి శరీరము కొరకై ఏ రాజు అధర్మాచరణము చేయును?

రాజు తాను సుఖించుచు దీనులను పీడించకూడదు. ఏలనన పీడితులైన దీనజనులు దుఃఖము వలన కలిగిన క్రోధముచే క్రూరుడైన రాజును నశింపజేయుదురు. కల్యాణమును కోరు రాజు పూజ్యుల విషయమున ఏ విధమున అంజలి ఘటించి ఆదరము చూపునో దుష్టుల విషయమున అంతకంటె కూడ అధికమగు ఆదరము చూపవలెను. మంచి స్నేహితుల విషయమునను, దుష్టులగు శత్రువుల విషయమున గూడ ప్రియవచనములే పలుక వలెను. ప్రియవాది ‘దేవత’; కటువాది ‘పశువు’. రాజు బైటను లోపలను విశుద్ధుడై, ఆస్తికత్వముతో అంతఃకరణమును పవిత్రము చేసికొని సర్వదా దేవతలను పూజించవలెను.

గురువులను దేవతలను వలె పూజించవలెను. మిత్రులను తనతో సమానులని భావించుచు బాగుగ సత్కరించవలెను. తన ఐశ్వర్యమును రక్షించుకొనుటకును, వృద్ధిపొందించుకొనుటకును, రాజు ప్రతిదినము ప్రణామము చేయుచు పెద్దలను అనుకూలులనుగా చేసికొనవలెను. సాంగవేదాధ్యయనము చేసిన వారు ప్రవర్తించు విధముగ ప్రవర్తించుచు విద్యా వృద్ధులగు సత్పురుషులను సుముఖులను చేసికొనవలెను. సుకృత కర్మలచే దేవతాను కూల్యము సంపాదించవలెను. సద్భావముచే మిత్రులను, ఆదరముచే బంధువులను, ప్రేమచే స్త్రీలను, దానముచే భృత్యులను అనుకూలులుగ చేసికొనవలెను. ఇతరులను అనుకూలతా ప్రదర్శనము ద్వారా సుముఖులను చేసికొనవలెను.

ఇతరుల పనులు నిందింప కుండుట, తన వర్ణాశ్రమ ధర్మములను నిరంతరము పాలించుట, దీనులయెడ దయ, లోక వ్యవహారములు అన్నింటి యందును, అందరితోడను, మధురముగా మాటలాడుట, ప్రాణములు ఇచ్చియైనను తన ప్రియమిత్రులకు ఉపకారము చేయుటకై సిద్ధముగా ఉండుట ఇంటికి వచ్చిన మిత్రులను, ఇతర సజ్జనులను కౌగలించుకొనుట, అవసరమైనచోయథాశక్తిగ వారికి ధనమిచ్చుట, ఇతరుల కటుప్రవర్తనను, కోరవచనములను సహించుట, తనకు అభివృద్ధి కలిగినపుడు వికారరహితుడుగ నుండుట, ఇతరులకు అభ్యుదయము కలిగినపుడు ఈర్ష్య లేకుండుట, ఇతరులకు బాధ కలిగించుమాట పలుకకుండుట, మౌనముగా నుండుట, బంధువులతో సంబంధము అవిచ్ఛిన్నముగ ఉంచుకొనుట, సజ్జనులతో ఋజు ప్రవర్తనము, వారి సమ్మతి ప్రకారము కార్యము చేయుట-ఇవి మహాత్ముల ఆచారము. (238)