అగ్ని మహా పురాణము

Table of Contents

వృక్షాయుర్వేద కథనము

ధన్వంతరి పలికెను:

ఇపుడు వృక్షాయుర్వేదమును చెప్పెదను. ఇంటికి ఉత్తరమున ప్లక్షము, తూర్పున వటము, దక్షిణమున ఆమ్రము, పశ్చిమమున అశ్వత్థ వృక్షము మంగళకరములు. ఇంటికి దక్షిణమున మొలచిన ముండ్ల చెట్లు కూడ మంచివి. ఇంటికి దగ్గరగ ఉద్యానవనమును నిర్మించుకొనవలెను. లేదా అన్నివైపుల అందమైన పుష్పిత తిల వృక్షములు పెంచవలెను. బ్రాహ్మణుని చంద్రుని పూజించి వృక్షములు నాటవలెను. చెట్లు నాటుటకు ఉత్తరాన నక్షత్రములు మూడును స్వాతి, హస్త, రోహిణి, శ్రవణ, మూల ప్రశస్త నక్షత్రములు ఉద్యానములో పుష్కరిణి నిర్మించి దానిలోనికి నదీప్రవాహము వచ్చునట్లు ఏర్పరచవలెను. జలాశయ ఆరంభమునకు హస్త, మఖ, అనురాధా, పుష్య, జ్యేష్టా నక్షత్రములు మూడు ఉత్తరా నక్షత్రములు మంచివి. వరుణుని, విష్ణువును, పర్జన్యుని (మేఘుని) పూజించి ఈ పని ప్రారంభించవలెను. అరిష్ట, అశోక, పున్నాగ, శిరీష, ప్రియంగు, కదళీ, జంబు, వకుళ, దాడిమ వృక్షములను నాటి గ్రీష్మ ఋతువునందు దినమునకు ఒక పర్యాయము వర్ష ఋతువు నందు రాత్రియందును భూమి ఎండిపోయినచో నీళ్లు పోయవలెను. చెట్టుకును చెట్టుకును నడుమ ఇరువది హస్తముల అంతరము ఉత్తమము. పదునారు హస్తముల అంతరము మధ్యమము. పండ్రెండు హస్తముల అంతరము అధమము. పండ్రెండు హస్తముల అంతరముగల చెట్లను తీసి వేరొకచోట పాతవలెను. దగ్గర దగ్గరగా వున్న చెట్లు ఫలముల నివ్వవు. ముందుగ వాటిని తగు విధముగా ఖండించి శోధనము చేయవలయును. విడంగ, ఘృత, పంకములు కలిపిన శీతలజలము వాటికి పోయ వలెను. వృక్షముల పండ్లు నశించునపుడు కుళుత్థ, మాష, ముద్గయవ, తిలలు కలిపిన ఘృత మిశ్రమములో శీతల జలమును పోసినచో అవి సర్వదా ఫల పుష్పములను ఇచ్చును. మేకల గొఱ్ఱెల ఎరువు, యవ చూర్ణము తిలలు వీటిని తడిపి ఏడు దినములు ఒకచోట ఉంచి పిదప దీనిని వృక్షములకు వేసినచో ఫలపుష్పవృద్ధి కలుగును. మత్స్యములున్న నీరు పోసినచో వృక్షములు వృద్ధి చెందును. విడంగ తండులములతో మత్స్య మాంసమును కలిపి వేసినచో అది అన్ని వృక్షము లకును దోహదము అగును. వాటి రోగములను తొలగించును. (282)