అగ్ని మహా పురాణము
శ్రీహరి వంశ వర్ణనము
అగ్ని పలికెను. హరివంశమును చెప్పెదను. విష్ణునాభికమలము నుండి బ్రహ్మ పుట్టెను. బ్రహ్మకు అత్రి, ఆతనికి సోముడు, ఆతనికి పురూరవుడు, ఆతనికి ఆయువు, ఆతనికి నహుషుడు, ఆతనికి యయాతి పుట్టిరి. ఆతని నుండి దేవయాని యదువు, తుర్వసుడు అను కుమారులను, వృషపర్వుని కుమార్తెయైన శర్మిష్ఠ ద్రుహ్యు అనుపూరులు అనెడు కుమారులను కనిరి. యదువు కులమునందు యాదవులు పుట్టిరి. వాసుదేవుడు వారిలో ఉత్తముడు.
భూ భారమును తొలగించుటకై పూర్వజన్మలో హిరణ్యకశిపుని ఆరుగురు పుత్రులు దేవకి యందు వసుదేవుని వలన, విష్ణు ప్రేరితయైన యోగమాయ ప్రభావముచే పుట్టిరి. బలరాముడు దేవకికి సప్తమగర్భముగా ఆయెను. ఆతడు రోహిణి యందు సంక్రమింప చేయబడి రోహిణేయుడాయెను. పిమ్మట చతుర్భుజుడైన హరి శ్రావణ కృష్ణ పక్ష అష్టమి యందు అర్ధరాత్రమున జనించెను.
రెండు బాహువులుగల బాలుడుగా మారిన ఆ చతుర్భుజుని దేవకీ వసుదేవులు స్తుతించిరి. వసుదేవుడు కంసునికి భయపడి ఆ పిల్లవానిని తీసికొని వెళ్లి యశోద పక్కలో పరుండబెట్టి యశోద కుమార్తెను తీసికొని వచ్చి దేవకి పక్కలో పరుండ బెట్టెను. కంసుడు పిల్ల ఏడ్చిన ధ్వనివిని ఆ శిశువును శిలపై వేసి కొట్టెను.
దేవకి వారించినను “నీ అష్టమ గర్భము నాకు మృత్యు హేతువు” అని పలుకుచు అట్లు చేసెను. ఆకాశవాణిని విని ఆతడు దేవకి వివాహ సమయమున చెప్పిన ప్రకారము తనకు ఇచ్చిన శిశువులను అందరిని పూర్వము చంపివేసెను. క్రిందికి విసరివేయబడిన ఆ బాలిక ఆకాశముపైకి ఎగిరి కంసునితో ఇట్లు పలికెను. కంసా! నన్ను విసరివేసి ఏమి ప్రయోజనము? దేవతలకు సర్వస్వము వంటివాడు ఒకడు భూభారమును తొలగించుటకై పుట్టినాడు. అతడు నిన్ను చంపివేయగలడు.
అని పలికి ఆమె అంతర్ధానము చెందినది. ఆమె పూర్వము శుంభాది రాక్షసులను సంహరించి దేవేంద్రునిచే “ఆర్యా! దుర్గా, వేదగర్భా, అంబికా, భద్రకాళీ, భద్రా, క్షేమ్యా క్షేమకరీ, నైకబాహుః అను పేర్లు గలవు” అని స్తుతింపబడినది. ఈ నామములను త్రిసంధ్యలందును చదువువాడు సమస్త కామములను పొందును.
కంసుడు ఆ బాలుని చంపుటకై పూతన మొదలగు వారిని పంపెను. కంసుని నుండి భయపడిన వాడువలె వసుదేవునిచే యశోదాపతియైన నందునికి రక్షణార్థమై ఈయబడిన రామకృష్ణులు గోకులమునందు గోవులతోడను, గోపాలకులతోడను కలిసి సంచరించిరి. జగత్తునకు పాలకులైన వారు గోపాలులైరి. విసుగుచెందిన యశోదచేత రోటికి కట్టబడిన కృష్ణుడు జంటగా పెరిగిన రెండు అర్జున వృక్షముల మధ్యకు వెళ్ళగా అవి భగ్నమైనవి.
బృందావనమందున్న శ్రీకృష్ణుడు స్తన్యమును గ్రోలుచు పాదములను విసరి శకటాసురుని తల క్రిందు చేసెను. తను చంపుటకై ఉద్యమించిన పూతనను స్తన్యమును త్రాగి చంపివేసెను. కాలియుని జయించి ఆతనిని యమునా హ్రదము నుండి వెడలగొట్టి సముద్రము నందు నివసించునట్లు చేసెను. స్తుతింపబడు ఆతడు గార్దభ రూపమున నున్న ధేనుకాసురుని బలముచే చంపి తాలవనమును క్షేమకరమైన దానినిగా చేసెను. వృషభ రూపమున నున్న అరిష్ఠాసురుని చంపి హయ రూపములో ఉన్న కేశిని సంహరించెను. శక్రోత్సవమును మాన్పి పర్వతపూజ చేయించెను. పర్వతమును ఎత్తి దేవేంద్రుడు కురిపించిన వర్షమును నివారించెను. దేవేంద్రుడు శ్రీకృష్ణునికి నమస్కరించి తన కుమారుడైన అర్జునుని సమర్పించెను. కృష్ణుడు సంతసించి ఇంద్రోత్సవము చేయించెను.
కంసుడు పంపిన అక్రూరుడు స్తుతింపగా శ్రీకృష్ణుడు రథమును ఎక్కి మథురకు వెళ్ళెను. అతడు ఆ విధముగా వెళ్ళిపోవునపుడు అతనితో క్రీడించిన, అనురక్తలైన గోపికలు ఆతనిని చూచుచు నిలబడిపోయిరి. వస్త్రములను మధురలో అడుగగా, ఇవ్వని రజకుని చంపి వస్త్రములను గ్రహించెను. రామునితో కలిసి పుష్పమాలలు ధరించి మాలాకారునకు వరమిచ్చెను. అంగరాగమును ఇచ్చిన కుబ్జకు గూను పోవునట్లు చేసెను. రాజద్వారము నందున్న మదించిన కువలయాపీడమను గజమును సంహరించెను. రంగస్థలమును ప్రవేశించి, ఆసనములపై కూర్చున్న కంసాదులు చూచుచుండగా చాణూరమల్లునితో మల్లయుద్ధము చేసెను. బలరాముడు ముష్టికుడను మల్లునితో తలపడెను. వారిరువురు ఆ చాణూర ముష్టికులను మల్లులను, ఇతరులను చంపిరి.
శ్రీకృష్ణుడు మథురాపతియైన కంసునిచంపి ఆతని తండ్రిని రాజుగా చేసెను. కంసుని భార్యలైన అస్తి-ప్రాప్తి అను జరాసంధుని కుమార్తెలు, ప్రేరేపింపగా జరాసంధుడు మథురానగరమును ముట్టడించెను. యాదవులు సైన్యములతో అతనితో యుద్ధము చేసిరి. అతని నుంచి శ్రీకృష్ణుడు తప్పించుకొనెను.
అటు పిమ్మట రామకృష్ణులు మథురను విడచి గోమంతమునకు వచ్చిరి. యుద్ధమున జరాసంధుని జయించి, పౌండ్రక వాసుదేవుని కూడ జయించి, శ్రీకృష్ణుడు ద్వారకా నగరమును నిర్మించి అందు యాదవులతో నివసించెను. జనార్దనుడు, భూమి పుత్రుడైన నరకాసురుని చంపి, అతనిచే బంధింపబడిన దేవగంధర్వ యక్ష కన్యలను వివాహమాడెను. ఈ విధముగ ఆతడు కూడ పదహారు వేల మంది స్త్రీలను, రుక్మిణి మొదలగు ఎనమండు గురిని వివాహమాడెను.
నరకాసుర సంహారియైన ఆ హరి సత్యభామా సహితుడై గరుడారూఢుడై స్వర్గ లోకమునకు వెళ్ళి అచట ఇంద్రుని జయించి, మణిశైలమును, రెండు రత్నములను, పారిజాత వృక్షమును తీసికొని వచ్చి సత్యభామా గృహమున ఉంచెను.
సాందీపని నుండి శస్త్రాస్త్రములను అభ్యసించి, మరణించిన ఆతని కుమారుని మరల తీసికొని వచ్చి ఇచ్చెను. పంచజనుడను దైత్యుని సంహరించి యమునిచే పూజింపబడెను. కాలయవనుని సంహరించి ముచుకుందునిచే పూజింపబడెను. దేవకీవసుదేవులను, భక్తులను, విప్రులను పూజించెను.
బలభద్రునకు రేవతియందు నిశఠుడు, ఉల్ముకుడు అను ఇరువురు కుమారులు కలిగిరి. కృష్ణునకు జాంబవతి యందు సాంబుడు పుట్టెను. ఇతర భార్యలయందు ఇంకను కొందరు పుత్రులు పుట్టిరి. రుక్మిణి యందు ప్రద్యుమ్నుడు పుట్టెను. ఆరవ దినమున ఆ శిశువును శంబరుడు బలాత్కారముగా అపహరించి సముద్రములో పారవేయగా ఒక మత్స్యము పట్టుకొని మ్రింగెను. ఆ మత్స్యమును ఒక జాలరి పట్టుకొనెను. దానిని శంబరునకు ఇచ్చెను. శంబరుడు మాయావతికి ఇచ్చెను. మాయావతి మత్స్య గర్భములో నున్న తన పతిని చూచి ఆదరముతో పెంచెను. అతనితో ఇట్లనెను. “నేను నీ భార్యనైన రతిని. నీవు నా పతివైన మన్మథుడవు. శివుడు నీకు శరీరము లేకుండునట్లుచేసెను. నన్ను శంబరుడు హరించెను. నేను అతని భార్యను కాదు. నీవు మాయలు తెలిసిన వాడవుగాన ఈ శంబరుని సంహరించుము.
ఆ మాట విని ప్రద్యుమ్నుడు శంబరుని చంపి భార్యయైన మాయావతితో కూడ కృష్ణుని వద్దకు వెళ్ళగా రుక్మిణీ కృష్ణులు సంతసించిరి.
ప్రద్యుమ్నునకు ఉషాపతియు, ఉదార బుద్ధియగు అనిరుద్ధుడు పుట్టెను, శివ భక్తుడైన బలి పుత్రుడైన బాణుడుండెను. అతని కుమార్తె ఉష. ఆతని నగరము శోణితపురము. ఆతడు తపస్సుచే పరమ శివుని మెప్పించి శివునికి పుత్రుడు వంటివాడాయెను. సంతసించిన శివుడు ‘ఓ బాణా! నీ మయూరధ్వజము ఎప్పుడు పడిపోవునో అప్పుడు నీకు యుద్ధము ప్రాప్తించగలదు’ అని పలికెను.
గౌరి శివునితో క్రీడించుచుండగా చూచి ఉష భర్తను గూర్చి అభిలాష కలదాయెను. గౌరి ఆమెతో ఇట్లు అనెను. వైశాఖమాస ద్వాదశీ దివసమున నీకు స్వప్నము నందు కనబడు పురుషుడు నీకు భర్త కాగలడు”. గౌరి మాటలువిని సంతసించిన ఉష గృహమునందు నిద్రించి ఆతనిని చూచెను. ఆతడు తనతో సంగము చేసినట్లు తెలిసికొని, చిత్రపటముపై అతని మూర్తిని చిత్రించి దాని సహాయముతో సఖియైన చిత్రలేఖ ద్వారా కృష్ణుని పౌత్రుడైన అనిరుద్ధుని ద్వారక నుండి తెప్పించు కొనెను. ఆ చిత్రలేఖ బాణాసురుని మంత్రియైన కుంభాండుని పుత్రిక. అనిరుద్ధుడు ఉషతో కూడ రమించెను.
రక్షకులు వెళ్లి బాణుని ధ్వజము పడిపోయినట్లు అతనికి తెలిపిరి. అనిరుద్ధునకు బాణునితో దారుణమైన యుద్ధము జరిగెను. కృష్ణుడు నారదుని నుండి ఈ విషయము తెలియగా, గరుడారూఢుడై, ప్రద్యుమ్న బలరామ సమేతుడై వచ్చి శత్రువులను, మహేశ్వర జ్వరమును కూడ జయించెను.
పిమ్మట హరిశంకరుల మధ్య బాణములతో యుద్ధము జరిగెను. తార్క్ష్యుడు మొదలగు వారు నంది, వినాయక, స్కందాదులను జయించిరి.
విష్ణువు ప్రయోగించిన జృంభణాస్త్రముచే శంకరుడు ఆవులించుచు నిద్రపోయెను. అపుడు బాణుని బాహుసహస్రము ఛేదింపబడెను. రుద్రుడు బాణునకు అభయము ఇమ్మని విష్ణువును కోరెను.
విష్ణువు బాణుని రెండు బాహువులతో జీవింపచేసి, “నీవు ఈ బాణునకు అభయ మిచ్చి నావు గావున నేనును ఇచ్చుచున్నాను. మన ఇరువురికిని భేదము లేదు. భేదమును చూచు వాడు నరకమున పడును” అని శివునితో అనెను. విష్ణువు శివాదులచే పూజింపబడి, ఉషా అనిరుద్ధాదులతో కూడి ద్వారకకు వెళ్లి ఉగ్రసేనాది యాదవులతో కలిసి సుఖముగా ఉండెను. (12)
