అగ్ని మహా పురాణము

Table of Contents

నక్షత్రచక్రము

పరమేశ్వరుడు పలికెను:

దేవీ! ఇపుడు నక్షత్రముల త్రినాడీచక్రమును గూర్చి చెప్పెదను. ఇది యాత్రాదులలో ఫలదాయకము. అశ్వన్యాది నక్షత్రములలో మూడు నాడులచే భూషితమగు చక్రమును గీయవలెను. మొదట అశ్వినీ, ఆర్ద్రా, పునర్వసువులను, పిదప ఉత్తరఫల్గునీ, హస్త, జ్యేష్ఠా, మూల, శతభిషక్, పూర్వాభాద్రలను వ్రాయవలెను. ఇది ప్రథమనాడి, రెండవ నాడి యందు భరణీ, మృగశీర్ష, పుష్య, పూర్వఫల్గునీ, చిత్రా, అనూరాధా, పూర్వాషాఢా, ధనిష్ఠ-ఉత్తరాభాద్రలును, మూడవ నాడియందు కృత్తికా-రోహిణీ-ఆశ్లేషా-మఘా-స్వాతీ-విశాఖా-ఉత్తరాషాఢా-శ్రవణ, రేవతులు నుండును. ఈ మూడు నాడులందున్న నక్షత్రములతో సంబంధించిన గ్రహముల ద్వారా శుభాశుభఫలములు తెలిసికొనవలెను. ఈ త్రినాడీ చక్రమునకు ఫణీశ్వర చక్రమని పేరు. ఈ చక్రమునందలి నక్షత్రములందు సూర్య, కుజ, శని, రాహువులున్నచో అది అశుభము, ఇతర గ్రహములున్నచో ఆ నక్షత్రము శుభ ప్రదము. దేశ, గ్రామ, భ్రాతృ, భార్యాదులు తమ తమ నామముల అద్యక్షరముల ననుసరించి ఒకే నాడీ చక్రమునందు ఉన్నచో అది శుభకరము. ఇచట నక్షత్రములనగా అశ్విని మొదలు రేవతి వరకును ఉన్న ఇరువది ఏడు నక్షత్రములని గ్రహించవలెను. (136)