అగ్ని మహా పురాణము

Table of Contents

మంత్ర మాహాత్మ్య కథనము

అగ్నిదేవుడు చెప్పెను:

ఇపుడు నాడీచక్రమును గూర్చి చెప్పెదను. దీనిని తెలుసుకొనుటచే శ్రీమహావిష్ణు జ్ఞానము కలుగును. నాభిక్రింద మూలాధార చక్రముండును. దాని నుంచి అంకురమువలె నాడులు బయల్వెడలును. నాభి మధ్యయందు డెబ్బది రెండువేల నాడులున్నవి. చక్రాకారమున నున్న ఈ నాడులు శరీరమునకు క్రింద, పైన, ప్రక్కల అంతటను వ్యాపించి యున్నవి. వీటిలో-ఇడా, పింగళా, సుషుమ్నా, గాంధారీ, హస్తిజిహ్వా, వృథా, యశా, అలంబుషా, కుహూ, శంఖినీ అను పది నాడులు ప్రధానమైనవి. ఇవి ప్రాణవాయు ప్రసారము చేయు పది ప్రధాననాడులు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయములు అనునవి పది ప్రాణ వాయువులు. వీటిలో ప్రాణ వాయువు అన్నింటికి అధిపతి. రిక్ష (శూన్య) త్వమును పూర్తిచేయుటకై ఈ ప్రాణము ఇతర ప్రాణ వాయువులను ప్రేరేపించును; సకల ప్రాణుల హృదయ ప్రాంతమునందుండి అపాన వాయువు ద్వారా జరుగు మలమూత్ర త్యాగముచే ఏర్పడు రిక్తత్వమును నిత్యము పూడ్చును. జీవుని ఆశ్రయించి ఉన్న ఈ ప్రాణము శ్వాస, ఉచ్ఛ్వాస, కాసాదుల ద్వారా ప్రయాణము (గమనా గమనములు) చేయునుగాన ‘ప్రాణ’మని చెప్పబడుచున్నది. అపాన వాయువు ఆహారమును, మూత్ర-శుక్లాదులను క్రిందికి తీసికొనిపోవును. ఇట్లు అపాన యనము (తొలగించుట) చేయుటచే ‘అపాన’మైనది. తిన్న ఆహారమును, త్రాగిన జలాదులను, వాసనచూసిన పదార్థములను రక్త, పిత్త, కఫ   వాతములను సమాన రూపమున సర్వాంగములందు ప్రసరింపచేయునది ‘సమానము’. ఉదానము ముఖమును, అధరములను స్పందింపజేయును; నేత్రముల ఎరుపును అధికము చేయును; మర్మ స్థానములను ఉద్విగ్నము చేయును; అందుచే దీనికి ‘ఉదానము’ అని పేరు. వ్యాసము అంగములను పీడించును. వ్యాధి ప్రకోపము కలిగించును. కంఠమును అవరుద్ధము చేయును. వ్యాపన శీల మగుటచే ఇది ‘వ్యాసము’. నాగవాయువు శ్రేణుపు, వాంతి మొదలగునవి చేయును. కూర్మ వాయువు కంటిరెప్పలు మూయుట తెరచుట చేయును. కృకరము భక్షణము నందును, దేవదత్తము ఆవులింతలందును ఉండును. ధనంజయమునకు స్థానము ఘోషము. ఇది మృత శరీరమును కూడ విడువదు. ఈ పదింటితో జీవుడు ప్రయాణము చేయును. అందుచే దశ ప్రాణ భేదముచే నాడీ చక్రమునకు గూడ పది భేదములు ఏర్పడుచున్నవి.

సూర్యగతిచే ఏర్పడు సంక్రాంతి, విషువ, దిన, రాత్రి ఆయన, అభిమాస, ఋణ, ఊనరాత్ర, ధనములను పది దశలు శరీరములో కూడ ఏర్పడును. ఈ శరీరమునందు ఎక్కిళ్లు ఊన రాత్రము. ఆవులింత అధిమాసము. దగ్గు ఋణము. నిశ్వాసము ధనము. శరీరములో ఉన్న వామనాడి ఉత్తరాయణము. దక్షిణనాడి దక్షిణాయనము. ఆ రెండింటి మధ్య నాసికారంధ్ర ద్వయమునుండి బయల్వెడలు శ్వాసవాయువు విషువము. ఈ విషువ వాయువు తన స్థానమునుండి చరించి రెండవ స్థానమునకు పోవుట సంక్రాంతి. ద్విజశ్రేష్ఠ్రా! శరీర మధ్యభాగమునందు సుషుమ్న, వామ భాగమున ఇడ, దక్షిణ భాగమున పింగళ ఉన్నవి. ఊర్ధ్వగతిగలది ప్రాణము దినము; అధోగతిగలది రాత్రి, ఒక్క ప్రాణవాయువే దశవాయు రూపమున విభక్తమైనది. దేహములోపల ప్రాణవాయువు ఆయామము చెందుట ‘చంద్రగ్రహణము’ అది దేహము పై భాగము వరకు వ్యాపించినచో సూర్య గ్రహణము.

సాధకుడు ఎంత శక్యమగునో అంతవాయువు లోనికి తీసికొనవలెను. ఇది దేహమును నింపు ‘పూరక’ ప్రాణాయామము. శ్వాస బైటికి పోకుండునట్లు శ్వాస నిశ్వాసలు ఆపివేసి పూర్ణకుంభమువలె ఉన్నచో అది ‘కుంభక’ ప్రాణాయామము, పిదప మంత్రవేత్త పైకి ఒకే నాసా రంధ్రముచే వాయువును విడచినచో అది ‘రేచక’ ప్రాణాయామము. శ్వాసోచ్ఛ్వాస క్రియచే శరీరములో నున్న శివరూప బ్రహ్మయొక్క ఉచ్చారణము (సోహంహంసః అను విధమున) జరుగును, గాన తత్త్వవేత్తలు దీనిని జపమందురు. ఈ విధముగ తత్త్వవేత్త ఒక దినమునందు శ్వాస ప్రశ్వాసల ద్వారా 21,600 పర్యాయములు మంత్రజపము చేయును. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సంబంధించిన ‘అజపా గాయత్రి’. ఈ అజపాజపము చేయువానికి పునర్జన్మ లేదు. చంద్రాగ్ని సూర్యయుక్త మూలాధార స్థితయగు కుండలినీ శక్తి హృదయ ప్రదేశమునందు అంకురాకారమున ఉండును. సాత్త్విక పురుషశ్రేష్ఠుడగు యోగి సృష్టి క్రమమును అవలంబించి, సృష్టి న్యాసముచేసి, బ్రహ్మరంధ్రమునందు ఉన్న శివునినుండి కుండలినీ ముఖమునందు అమృతము ప్రవహించునట్లు భావన చేయవలెను. శివునకు సకలము నిష్కలము అని రెండు రూపములున్నవి. సాకారుడగు శివుడు సకలుడు, నిరాకారుడు నిష్కలుడు. వారు ‘హంస హంస’ అని జపము చేయుదురు. హంస అనగా సదాశివుడు, తిలలలో తైలము, పుష్పములలో సుగంధము ఉన్న విధమున జీవాత్మకు లోపలను వెలుపలను సదాశివుడు నివసించును. బ్రహ్మ హృదయమునందును, విష్ణువు కంఠమునందును, తాలు మధ్య భాగమున రుద్రుడు, లలాటమున మహేశ్వరుడు, ప్రాణాగ్రమునందు సదాశివుడును ఉందురు. వీటి అన్నింటికిని అంతమునందు పరాత్పరబ్రహ్మ ఉండును. సకల పరమాత్మ బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ రూపమున నుండును. నిర్గుణుడు, నిష్కలుడు అగు పరమాత్మ ‘నిష్కలుడు’.

అనాహత నాదమును ప్రాసాదమువరకు లేవదీసి నిరంతర జపముచేయు యోగి ఆరు మాసములలోనే సిద్ధిని పొందును; సంశయములేదు. గమనాగమన జ్ఞానముచే సమస్త పాపములును నశించి అణిమాది సిద్ధులు, గుణములు, ఐశ్వర్యము ఆరు మాసము లలో లభించును. స్టూలము, సూక్ష్మము పరము అను మూడు విధములగు ప్రాసాదమును వర్ణించితిని. ప్రాసాదమును హ్రస్వము, దీర్ఘము, ప్లుతము అను మూడు రూపములలో గుర్తించవలెను. హ్రస్వము పాపములను దహించి వేయును. దీర్ఘము మోక్షప్రదము. ప్లుతము తృప్తిప్రదము. దీని శిరస్సుపై బిందువు (అనుస్వారము) ఉండును. మారణకర్మల యందు హ్రస్వ ప్రాసాద మంత్రమునకు ఆద్యంతములందు ‘ఫట్’ చేర్చి జపముచేసిన మంచిది. ఆద్యంతములందు ‘నమః’ చేర్చి జపము చేసినచో అది ఆకర్షణ సాధకము. మహాదేవుని దక్షిణామూర్తి సంబంధిత మంత్రమును నిలబడి నాలుగు లక్షలు జపించి జపాంతమున పదివేల ఆజ్యహోమములు చేసినచో మంత్రసిద్ధి కలుగును. పిదప దానితో వశీకరణోచ్చాటనాదులు చేయవచ్చును. పైనను, క్రిందను, మధ్యయందును శూన్యమైన త్రిశూన్య నిరామయ మంత్రము తెలిసికొనిన ద్విజుడు తప్పక ముక్తి పొందును. ఐదు మంత్రముల కలయికచే చాల పెద్దది, ముప్పది యేడు కలలతో కూడినది అయిన ప్రాసాద మంత్రము ఎరుగనివాడు ఆచార్యుడు కాజాలడు. ఓం కారము, గాయత్రి, రుద్రాది మంత్రములును తెలిసినవాడే గురువు. (214)